కొత్తవీధి, గుంటి: గిరిజనులు సాగుచేసే ఈ గ్రామాలు రికార్డుల్లో ఎలా మాయం అయ్యాయి?

కొత్తవీధి, కొండదొర

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం....

అనకాపల్లి జిల్లా, చీడికాడ మండలంలో ఆదివాసీలుండే కొత్తవీధి, గుంటి అనే గ్రామాలు కనిపిస్తాయి. ఇక్కడ 16 కుటుంబాలు కొంత భూమిని సాగు చేస్తూ జీవిస్తున్నాయి. అయితే ఇక్కడ ఆదివాసీ ఆవాసాలున్నాయని కానీ, వ్యవసాయం చేస్తున్నట్లు కానీ ఏ రెవెన్యూ రికార్డుల్లోనూ లేదు.

తరాలుగా సాగులో ఉన్న తమ పేర్లు రెవెన్యూ రికార్డుల్లో చేర్చి, సాగు హక్కు కల్పించాలని కొత్తవీధి, గుంటి గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఇవి ప్రైవేటు వ్యక్తుల భూములని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు.

కొత్తవీధి, కొండదొర

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

అసలేంటి వివాదం?

సర్వే నెంబరు 289లోని కొత్త వీధి, గుంటి గ్రామాలకు వెళ్తే... అక్కడ కొన్ని ఆవాసాలు, కొంత వ్యవసాయ భూమి కనిపిస్తుంది. కానీ రెవెన్యూ రికార్డుల్లో ఈ గ్రామాల్లోని నివాసాల వివరాలు, సాగులో ఉన్న భూమి వివరాలు ఏవీ కూడా పొందుపర్చడం లేదని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు.

తాము 30 ఏళ్లుగా సాగు చేస్తున్నామని, కానీ తమని అధికారులు గుర్తించడం లేదని ఆదివాసీలు అంటున్నారు.

“289 సర్వే నంబరులో భూముల్లో దశాబ్దాలుగా మేం వ్యవసాయం చేస్తున్నాం. అయితే, ఇప్పుడు ఇవి ప్రైవేటు భూములని, మాకు సాగు హక్కు లేదని అంటున్నారు. కనీసం ప్రైవేటు వ్యక్తులని చెప్తున్న వారి నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. మూడు తరాలుగా ఇక్కడే వ్యవసాయం చేస్తూ అరటి తోటలు, జీడితోటలు పెంచుకుంటూ ఆవాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాం. ఇప్పుడు ఇది ప్రైవేటు వ్యక్తుల భూమని, రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయాయని, వెంటనే ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారు”అని కొత్త వీధి నివాసి కొండలరావు బీబీసీతో అన్నారు.

బీబీసీ ఈ గ్రామానికి వెళ్లినప్పుడు, అక్కడ నివాసముంటున్న 9 కుటుంబాలు కనిపించాయి. అలాగే పక్కనే గుంటి గ్రామంలో కొందరు నివాసముంటున్నారు. ఈ రెండు గ్రామాలను రెవెన్యూ రికార్డుల్లో అధికారులు చూపించకపోవడమే వివాదానికి మూలమైంది.

కొత్తవీధి, కొండదొర

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

ఆదివాసీలు ఏం కోరుతున్నారు?

ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యవసాయ పనులు చేసుకోవడం, వాటిపై వచ్చిన ఫలసాయాన్ని కుటుంబ పోషణకు వినియోగించడం, మిగిలితే అమ్ముకోవడం చేస్తూ 30 ఏళ్లుగా ఇక్కడే జీవిస్తున్నామని, అప్పటి నుంచి ఈ సాగులోకి ఎవరు రాలేదని, మేం ఈ కొండల్లో మెట్ట వ్యవసాయం చేస్తూ బతుకుతున్నామని ఆదివాసీలు చెప్తున్నారు.

“అసలు ఈ గ్రామాలు ఉన్నయో, లేదో తెలియని రోజుల్లో ఇక్కడికి ఎవరు రాలేదు. మేం చెమటోర్చి భూమిని సాగులోకి తెచ్చాం. కానీ ఇప్పుడు కోనాం, చీడికాడలకు చెందిన వ్యక్తుల మధ్య భూమి అమ్మకం, కొనుగోలు జరిగిందని మమ్మల్ని వెళ్లిపోమ్మని అంటున్నారు. ఇంత కాలం పట్టించుకోని, వీళ్లకు ఈ భూమిపై హక్కు ఉంటే...మరి సాగులో ఉన్న మాకు కనీసం సాగు హక్కైనా ఉంటుంది కదా. వాళ్ల మధ్య రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు సాగులో ఉన్న మాకు నోటీసులు ఇవ్వాలి కదా” అని కొత్తవీధికి చెందిన వంతల బాబురావు బీబీసీతో చెప్పారు.

సాగులో ఉన్న మాకు తెలియకుండా భూములను ఎవరైనా ఎలా అమ్ముతారు? మరొకరు ఎలా కొంటారు? అధికారులు వీరికి మధ్య ఏం రాజీ కుదిరింది? అని బాబురావు ప్రశ్నించారు.

30 ఏళ్లుగా సాగులో ఉన్న మాకు సాగు హక్కు కల్పించాలని అధికారుల చుట్టూ తిరిగినా తమని పట్టించుకోకుండా, ప్రైవేటు భూమి అంటూ ఇప్పుడు ఖాళీ చేయమనడం ఎంత వరకు న్యాయం అని అడుగుతున్నారు.

కొత్తవీధి, కొండదొర

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

‘మేం కదలం, మా పని మేం చేసుకుంటాం’

కొత్తవీధి, గుంటి గ్రామాల్లోని 289 సర్వే నంబరులో జీడితోటలు, అరటి తోటలు తదితర పంటలకు అనుకూలంగా తయారు చేసుకున్న భూములు కనిపిస్తున్నాయి. ఇక్కడ 37 ఎకరాల 8 సెంట్ల భూమిలో తాము వ్యవసాయం చేస్తున్నట్లు ఆదివాసీలు చెప్తున్నారు.

“మేం ఈ భూముల్లోనే సాగు చేస్తూనే ఉంటాం. మాకు మొక్క, మోడుపై హక్కు కావాలి. ఎమ్మార్వో, ఆర్ఐ, ఆర్డీవో అంతా వచ్చి చూశారు. కానీ ఇప్పటివరకు న్యాయం జరగలేదు. పైగా ఇప్పుడు మేం సాగులో ఉన్న భూముల్లో వంట చెరుకు కొడుతున్న మమ్మల్ని భయపెడుతున్నారు. ఇదంతా గత రెండేళ్లుగానే జరుగుతోంది. గతంలో మా పెద్దలు, ఇప్పుడు మేం ఇక్కడే సాగులో ఉండి, ఈ భూములను బాగు చేశాం. కాబట్టి ఈ మొక్క, మోడుతో పాటు ఇక్క డ సాగు హక్కు మాకు దక్కాలి. ప్రభుత్వం మాకు సహాయం చేయాలని కోరుతున్నాం” అని గుంటి గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మీ బీబీసీతో అన్నారు.

కొత్తవీధి, కొండదొర

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

‘ఆధార్, రేషన్ కార్డు గుర్తింపు కాదా?’

కొత్తవీధి గ్రామంలో ఒక పెంకుటిల్లు, 8 రేకుల ఇళ్లు కనిపించాయి. ఇందులో 7 కుటుంబాలకు రేషన్ కార్డులు, 6 కుటుంబాలకు ఓటరు కార్డులు, మూడు ఇళ్లకు విద్యుత్ సదుపాయం ఉంది. ఇవన్నీ తమకు ఇచ్చారంటే తాము ఈ గ్రామంలో ఉంటున్నామనే కదా అని ఆదివాసీలు ప్రశ్నిస్తున్నారు. వీటి ఆధారంగానే తమని రెవెన్యూ రికార్డుల్లో గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.

“మాకు న్యాయం చేయాలని అధికారులను ఎన్నోసార్లు కలిశాం. కొన్ని సార్లు అధికారులు వస్తే మా కోసమే అనుకున్నాం. కానీ అది ప్రైవేటు వ్యక్తులకు భూములను అప్పగించేందుకు అని గ్రహించలేకపోయాం. అయితే ఇక్కడికి వచ్చిన అధికారులు తమ రిపోర్టుల్లో గ్రామలున్నాయని, వ్యవసాయం ఉందని, ఆదివాసీలున్నారనే విషయాన్ని రాయడం లేదు. దాంతో రెవెన్యూ రికార్డుల్లో మాకు గుర్తింపు లేదు. ఇది అధికారులు కావాలనే చేస్తున్నారు” అని కొత్తవీధికి చెందిన కోన చినదేవుడు బీబీసీతో చెప్పారు.

అధికారులు గ్రామాలకు వచ్చి ఇక్కడున్న యధాతథ స్థితిపై రిపోర్టు ఇవ్వడం లేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై తమ గ్రామాలకి సెప్టెంబరు, 2022లో వచ్చిన చీడికాడ తహశీల్దార్, ఆర్డీవో కూడా వచ్చారు. కానీ వారి నివేదికలో కొత్తవీధి, గుంట గ్రామాల్లో కుటుంబాలు నివాసముంటున్నాయనే విషయాన్ని తహశీల్దార్ నుంచి జాయింట్ కలెక్టర్‌కి, ఆర్డీవోనుంచి కలెక్టర్‌కు వెళ్లిన రిపోర్టుల్లో ప్రస్తావించలేదని వారు చెబుతున్నారు.

కొత్తవీధి, కొండదొర

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

‘అధికారుల చుట్టూ ఆదివాసీలు తిరుగుతున్నారు’

30 ఏళ్లుగా సాగులో ఉన్న భూమిపై తమకు సాగు హక్కు మాత్రమే కోరుతున్నామని ఆదివాసీలు అంటున్నారు. గత రెండేళ్ల నుంచి తమని ఇక్కడ నుంచి ఖాళీ చేయించాలని చూస్తున్నారని తెలిపారు. అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా.. పట్టించుకోలేదని చెప్పారు.

“2020 జూన్ 9న ఒక రెవెన్యూ అధికారి తన సర్వే సిబ్బందితో కొత్త వీధి గ్రామానికి వచ్చారు. అప్పుడు గిరిజన సంఘాలతో కలిసి ఆదివాసీలు... సర్వే, భూమి రికార్డుల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు కొందరు ప్రైవేటు వ్యక్తులతో వచ్చిన డిప్యూటీ తాహశీల్దార్‌పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే 2021 నవంబర్ నెలలో ఆదివాసీలు తమ గ్రామాలను పరిశీలించి రికార్డులో నమోదు చేయమని చీడికాడ తాహశీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చారు. 2022 జూన్ 13న తహశీల్దార్ 37 ఎకరాల 8 సెంట్ల భూమిని గిరిజనేతల పేరున బదిలీ చేశారు” అని ఆదివాసీల తరపున పోరాటం చేస్తున్న అఖిల భారత వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం, జాతీయ కార్యదర్శి పీఎస్ అజయ్ కుమార్ బీబీసీతో చెప్పారు.

కొత్తవీధి, కొండదొర

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

‘రికార్డుల్లో ఎందుకు నమోదు చేయడం లేదు.?’

గత ఏడాది అంటే 2022 సెప్టెంబర్ 13న నర్సీపట్నం ఆర్డీవో, కొత్తగా విధులలో చేరిన చీడికాడ తహశీల్దార్ బీఏ రాణి కూడా కొత్తవీధి, గుంటి గ్రామాలను సందర్శించారు. ఆదివాసీల ఆవాసాలను చూశారు. మూడు దశాబ్దాలుగా సాగు చేసిన తోటలను పరిశీలించారు. నవంబర్‌లో ఆర్డీవో జిల్లా కలెక్టరుకు నివేదిక పంపారు.

“సర్వే నంబర్ 289లో ఆదివాసీ ఆవాసాలతో కూడిన గ్రామం ఉందని గాని, తాను స్వయంగా వెళ్లి ఆ గ్రామాన్ని చూశానని గాని, ఆ భూమిలో ఆదివాసీల సాగులో ఉన్నారని కానీ అందులో పేర్కొనలేదు. అలాగే చట్ట ప్రకారం సాగులో ఉన్న ఆదివాసీలకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని కానీ, తన నివేదికలో ప్రస్తావించలేదు. 37 ఎకరాల భూమిలో 7 ఎకరాలు ప్రభుత్వానికి చెందిన సీలింగ్ మిగులు భూమిని కూడా పట్టా భూమిగా మార్చి రికార్డు చేశారని మాత్రం రాశారు. ఎందరు అధికారులు ఈ గ్రామల్ని సందర్శించినా...ఆదివాసీల సాగులోనే 37 ఎకరాల భూమి ఉందని కాగితం మీద పెట్టడానికి సిద్ధంగా లేరు. ఎందుకని?” అని అజయ్ కుమార్ ప్రశ్నించారు.

కొత్తవీధి, కొండదొర

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

లేని హక్కుని కావాలంటున్నారు: తహశీల్దార్ బీఏ రాణి

కొత్తవీధి, గుంటి గ్రామాల్లో నివాసాలు, వ్యవసాయం విషయాన్ని తమ రిపోర్టులో ఎందుకు పొందుపర్చలేదని చీడికాడ ఎమ్మార్వో బీఏ రాణి వద్ద బీబీసీ ప్రస్తావించింది. దానిపై ఆమె బీబీసీతో మాట్లాడారు.

“అది జిరాయితీ భూమి. అక్కడున్న గిరిజనులు ఎక్కడ నుంచి వచ్చారు? ఆ భూమి వాళ్లకి ఎలా వచ్చింది? అది నాన్ షెడ్యూల్ ఏరియా, అక్కడ 1/70 చట్టం వర్తించదు. నా ముందున్న తహశీల్దార్లు, నేను కూడా ఆ భూముల విషయంలో పరిశీలన చేశాం, రిపోర్టులూ రాశాం. వాళ్లది కాని భూమిలో సాగు చేస్తూ...తమకి హక్కుకావాలంటున్నారు. వాళ్లలో కొందరికి ఐదు ఎకరాల చొప్పున్న ఆర్వోఎఫ్ఆర్ (RECOGNITION OF FOREST RIGHTS ACT, 2006) ల్యాండ్స్ ఉన్నాయి. అవి కాకుండా జిరాయితీ భూములను సాగు చేస్తూ తమదే అంటున్నారు. ఈ విషయాలన్నిటిపై కలెక్టర్ కార్యాలయానికి నివేదిక పంపాను. దీనిపై ఇంతకు మించి నేనేమి మాట్లాడను” అని చీడికాడ తహశీల్దార్ బీఏ రాణి బీబీసీతో చెప్పారు.

కొత్తవీధి, కొండదొర

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

‘ఏటా రూ. 40 నుంచి రూ. 50 వేల సంపాదన’

వ్యవసాయం చేస్తూ ఏడాదికి సుమారుగా రూ. 40 నుంచి 50 వేల వరకు సంపాదిస్తున్న తాము సాగులో ఉన్నామా లేదా అనేది పరిశీలన చేయాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రైవేటు వ్యక్తుల మధ్య భూమి రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి కాబట్టి ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారు లేదంటే కాగితాలు, పత్రాలు చూపమంటున్నారు, అయితే తమ వద్ద ఎటువంటి పత్రాలు లేవని గుంటి గ్రామానికి చెందిన కొండలరావు బీబీసీతో అన్నారు.

“ఆర్డీవో వచ్చి మేం సాగులోకి తెచ్చిన తోటలను పరిశీలించారు. 289 సర్వే నంబరులో ఎలా ఉన్నారు? ఇది ప్రైవేటు ల్యాండ్ కదా అని మమ్మల్ని ప్రశ్నించారు, మీకెమైనా ఆధారాలున్నాయా అని అడిగారు. మాకు సాగు చేసుకోవడం తప్ప, మా తండ్రికి, కానీ తాతకి కానీ ఏమి తెలియదు. వాళ్లు చదువుకోలేదు. మేం చదువుకున్న అది కూడా కొంత వరకే. దీంతో పత్రాలు, కాగితాల కోసం ఎప్పుడు ఆలోచించలేదు. కానీ ఇప్పుడు మమ్మల్ని ఖాళీ చేస్తారా లేదా అని బెదిరిస్తున్నారు” అని కొండలరావు చెప్పారు.

వీడియో క్యాప్షన్, గుణదల: మేరీ మాతకు భక్తులు తలనీలాలు అర్పించే చర్చి ఇది

‘గుర్తింపు ఇవ్వకుండా ప్రైవేటు వ్యక్తులకు సహకరిస్తున్నారు’

విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భూమి రేట్లు బాగా పెరిగాయి. దానికి తోడు అనకాపల్లి ఇటీవల జిల్లాగా మారడంతో ఇక్కడ ఒక్కప్పటి శివారు ప్రాంతాలు కూడా జిల్లా హెడ్ క్వార్టరుకు సమీప ప్రాంతాలుగా మారాయి. అక్కడ భూముల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. ఆదివాసీల సాగులో ఉన్న కొత్తవీధి, గుంటి గ్రామాలులతో పాటు చుట్టు పక్కల నాన్ షెడ్యూల్ ఏరియాలపై కూడా రియల్టర్లు దృష్టి పెట్టారు.

కొండ భూముల్నిఆదివాసీలు కష్టపడి సాగులోకి తెస్తే.. రిజిస్టర్‌లో సాగుదారుల పేర్లు ఎందుకు నమోదు చేయలేదని, అధికారులు గిరిజనేతరులతో కుమ్మక్కై ఆ భూములను అప్పగించేస్తున్నారని పీఎస్ అజయ్ కుమార్ విమర్శిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, షబ్నమ్: అండర్ 19 మహిళల ప్రపంచకప్ టోర్నీలో తెలుగమ్మాయి ప్రతిభ

“రెవెన్యూ చట్టం ప్రకారం రికార్డుల్లో ఎవరి పేరైనా మార్చే సందర్భంలో ఆ భూమిలో ఉన్న వారికి నోటీసులు ఇవ్వాలి. వారి అభ్యంతరాలు తెలుసుకోవాలని చట్టం చెబుతోంది. కానీ ఎలాంటి నోటీసు ఇవ్వకుండా రికార్డు మార్చేశారు. పైగా ఆదివాసీలు సాగులో ఉంటే... ఎవరు సాగులో లేనట్లు రాశారు. సీలింగ్ భూములను కలిపి కూడా రిజిస్ట్రేషన్ చేశారు. ఇలా జరిగినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి” అని పీఎస్ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)