క్యాన్సర్ పేషెంట్ తనకు తెలియని భాషలో అనర్గళంగా మాట్లాడారు... ఇదెలా సాధ్యం?

ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలో ఒక వ్యక్తికి ప్రోస్టేట్ క్యాన్సర్ సోకింది. ఆ వ్యక్తి "అనర్గళంగా ఐరిష్ యాస" మాట్లాడేవారని, ఆయన ఎప్పుడూ ఐర్లండ్ వెళ్లలేదని, అంతకుముందు ఆయనకు ఆ యాస తెలీదని పరిశోధకులు అంటున్నారు.

నార్త్ కరోలినాకు చెందిన 50 ఏళ్ల ఆ వ్యక్తి, ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్ (ఎఫ్ఏఎస్)తో బాధపడుతున్నారని బ్రిటిష్ మెడికల్ జర్నల్ తెలిపింది.

అయితే, ఆయన కుటుంబంలోని వారెవరూ ఐర్లండ్‌లో లేరు. కానీ "బ్రాగ్" అని పిల్చే ఐరిష్ యాసలోనే ఆయన మాట్లాడేవారు. ఈ అరుదైన వ్యాధి మరణించేవరకు ఆయనను అంటిపెట్టుకునే ఉంది.

ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి అనేక కేసులు నమోదయ్యాయి.

ఈ కేసును నార్త్ కరోలినాలోని డ్యూక్ యూనివర్సిటీ, సౌత్ కరోలినాలోని కరోలినా యూరాలజిక్ రీసెర్చ్ సెంటర్ సంయుక్తంగా అధ్యయనం చేశాయి. ఈ పరిశోధనా పత్రం బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైంది.

"మాకు తెలిసినంత వరకు, ప్రోస్టేట్ క్యాన్సర్ సోకిన వ్యక్తికి ఈ వ్యాధి సోకడం ఇదే మొదటిసారి. ప్రాణాంతక వ్యాధులదో బాధపడుతున్నవారిలో ఇది మూడవ కేసు" అని పరిశోధకులు తెలిపారు.

అయితే, ఆయన పేరు, నేషనాలిటీ మొదలైన వ్యక్తిగత వివరాలను రిపోర్ట్‌లో పొందుపరచలేదు.

ఆయన 20లలో ఇంగ్లండ్‌లో నివసించారని, కొందరు స్నేహితులు, దూరపు బంధువులు ఐర్లండ్‌లో ఉండేవారని మాత్రం తెలిపారు. అయితే, అంతకుముందెప్పుడూ ఆయన ఐరిష్ యాసలో మాట్లాడలేదు.

వీడియో క్యాప్షన్, క్యాన్సర్‌ కన్నా చుట్టూ ఉన్న మనుషులే ఆమెను ఎక్కువగా బాధించారు

"ఆయన ఆ యాసను నియంత్రించలేకపోయారు. అన్నివేళలా అదే యాస వచ్చేది" అని పరిశోధకులు తెలిపారు.

ఆయనకు క్యాన్సర్ చికిత్స ప్రారంభించిన 20 నెలల తరువాత ఈ వ్యాధి లక్షణాలు కనిపించడం ప్రారంభమైందని చెప్పారు.

ఆయనకు క్యాన్సర్ బాగా ముదరడంతో మరణానికి చేరువయ్యారు. చివరి నిమిషం వరకు ఆయనకు ఐరిష్ యాస ఉంది.

"ఆయనకు మెదడుకు సంబంధించిన పరీక్షలు జరిపారు. అందులో ఎలాంటి అసాధారణ అంశాలు కనబడలేదు. కీమోథెరపీ అందిస్తున్నప్పటికీ, ఆయనకు న్యూరోఎండోక్రిన్ ప్రోస్టేట్ క్యాన్సర్ ముదురుతూ వచ్చింది. ఫలితంగా, మల్టిఫోకల్ బ్రెయిన్ మెటాస్టేసెస్, మరణానికి దారితీసే పారానియోప్లాస్టిక్ పక్షవాతం వచ్చి మరణానికి దారితీశాయి" అని రిపోర్ట్‌లో తెలిపారు.

పారానియోప్లాస్టిక్ న్యూరోలాజికల్ డిజార్డర్ (పీఎన్6డీ) అనే కండిషన్ కారణంగా యాసలో మార్పు వచ్చిందని పరిశోధకులు భావిస్తున్నారు.

క్యాన్సర్ కారణంగా రోగనిరోధక వ్యవస్థ మెదడులోని కొన్ని భాగాలపై, కండరాలు, నరాలు, వెన్నెముకపై ప్రతికూల ప్రభావం చూపించినప్పుడు పీఎండీ వస్తుంది.

ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న కొందరు వ్యక్తులు.. తాము మాట్లాడినప్పుడల్లా, "ఇంట్లో ఎవరో కొత్త వ్యక్తి ఉన్నట్టు" అనిపిస్తుందని బీబీసీతో చెప్పారు.

2006లో బ్రిటన్‌కు చెందిన లిండా వాకర్ అనే మహిళకు గుండెపోటు వచ్చింది. అప్పుడు ఆమెకు మాతృ యాస జియోర్డీ ఉచ్చారణ పోయి, జమైకన్ యాస వచ్చేసింది.

1941లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఒక నార్వే యువతి బాంబు శకలం తగిలి తగిలి గాయపడ్డారు. ఆ తరువాత ఆమెకు జర్మన్ యాస వచ్చేసింది. ఎఫ్ఏఎస్ తొలి కేసుల్లో ఇదీ ఒకటి.

ఆమె యాస చూసి, నాజీల గూఢచారిగా భావించిన స్థానికులు ఆమెను దూరం పెట్టారు.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)