బంగ్లాదేశ్‌లో తెలుగు వారి ఇళ్లు కూల్చివేత... అసలు వారు అక్కడకు ఎలా వెళ్లారు... ఎందుకు వెళ్లారు

కార్తీ దీరమ్మ

ఫొటో సోర్స్, SHYADUL ISLAM/BBC BANGLA

ఫొటో క్యాప్షన్, వందల ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి తమ పూర్వీకులు ఇక్కడికి తరలి వచ్చారని చెబుతున్న వృద్ధురాలు కార్తి దీరమ్మ
    • రచయిత, సైదుల్ ఇస్లాం
    • హోదా, బీబీసీ న్యూస్ బంగ్లా, ఢాకా

బంగ్లాదేశ్ తెలుగు వారు ప్రస్తుతం వార్తల్లోకి వచ్చారు.

ఆ దేశ రాజధానిలో పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తున్నారు తెలుగు వారు. వీరంతా నివసించే కాలనీ ఖాళీ చేయమంటూ ప్రభుత్వం ఆదేశించడంతో, వందలాది తెలుగు కుటుంబాలు ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితిలో పడ్డాయి.

హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్, మానవ హక్కుల సంస్కృతి ఫౌండేషన్, హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యతా పరిషత్‌లకు చెందిన పలు సంస్థలు ఢాకా దక్షిణ నగర పాలక సంస్థ(డీఎస్‌సీసీ) జారీ చేసిన ఈ ఆదేశాలపై తీవ్ర ఆందోళన చేస్తున్నాయి.

తెలుగు మాట్లాడే కుటుంబాలు ఈ కాలనీలో 30 ఏళ్లకు పైగా నివసిస్తున్నాయి. కానీ, ఇప్పుడు నగర పాలక సంస్థ ఉద్యోగుల కోసం ఇక్కడ నివాస సదుపాయాలతోపాటు వర్క్‌షాపులను నిర్వహించే భవనాలను నిర్మించాలని డీఎస్‌సీసీ భావిస్తోంది.

బలవంతంగా తెలుగు వారిని అక్కడి నుంచి తరలిస్తున్నామని వస్తున్న ఆరోపణలను కొట్టిపారేసింది డీఎస్‌సీసీ. తెలుగు వారి కోసం మరొక చోట నివాస ప్రాంతాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు.

తెలుగు మాట్లాడే పారిశుద్ధ్య కార్మికుల కాలనీలోని కుటుంబం

ఫొటో సోర్స్, SHYADUL ISLAM/BBC BANGLA

ఫొటో క్యాప్షన్, తెలుగు మాట్లాడే పారిశుద్ధ్య కార్మికుల కాలనీలోని కుటుంబం

ఏం జరిగింది?

కొద్ది రోజుల కిందట ఢాకాలోని జత్రబరి దాల్పూర్‌లో తెలుగు మాట్లాడే పారిశుద్ధ్య కార్మికుల కాలనీ నెంబర్ 14కి పోలీసులు వచ్చారు. ఫిబ్రవరి 12 లోపు ఆ కాలనీ ఖాళీ చేయాలని వారిని ఆదేశించారు. ఆ కాలనీకి పక్కనే ఉండే దాల్పూర్ బస్తీని కూడా ఖాళీ చేయాలని అంతకు ముందే ఆదేశాలు జారీ చేశారు.

''మా పక్కనున్న ఇతర ప్రాంతాలను ఖాళీ చేయాలని చెప్పినప్పుడు, మా కాలనీ పేరు వినిపించలేదు. కానీ, గత ఎనిమిది రోజులుగా, మమ్మల్ని కూడా ఖాళీ చేయాలని వారు చెబుతున్నారు'' అని తెలుగు కాలనీలో నివసించే యారంశెట్టి వెంకటేశ్ బీబీసీ బెంగాలీకి చెప్పారు.

''1990 నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్లాలి? వెళ్లడానికి కనీసం మాకంటూ ఒక స్థలం లేదు. కొత్త ఇళ్లు కట్టుకోవడానికి కనీసం మా దగ్గర డబ్బులు కూడా లేవు'' అని ఆవేదన వ్యక్తం చేశారు.

సౌత్ సిటీ కార్పొరేషన్‌ పరిధిలోని ఈ ప్రాంతాన్ని చాలా మంది దాల్పూర్ బస్తీ లేదా డీసీసీ స్టాఫ్ క్వార్టర్స్ ఏరియా అని పిలుస్తుంటారు. చాలా కాలంగా ఇక్కడ భారీ విస్తీర్ణంలో ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. అక్కడ కొందరు ఇళ్లు నిర్మించుకున్నారు. అవి అక్రమ నిర్మాణాలు అంటూ సిటీ కార్పొరేషన్ ఇప్పుడు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుంటోంది.

బుధవారం అక్కడికి వెళ్లినప్పుడు, తెలుగు పారిశుద్ధ్య కార్మికులు నివసించే ప్రాంతంలోని అన్ని భవనాలను కూల్చేశారు. ఒక్క మసీదు మత్రమే మిగిలి ఉంది. నగర పాలక సంస్థకు చెందిన కార్మికులు కూల్చిన భవనాల ఇటుకలను అక్కడి నుంచి తొలగిస్తున్నారు.

ఢాకాలోని దాల్పూర్‌లో తెలుగు స్వీపర్ కాలనీలో 120 కుటుంబాలు నివాసం

ఫొటో సోర్స్, SHYADUL ISLAM/BBC BANGLA

ఫొటో క్యాప్షన్, ఢాకాలోని దాల్పూర్‌లో తెలుగు స్వీపర్ కాలనీలో 120 కుటుంబాలు నివాసం

‘స్థిర నివాసం కల్పిస్తామనే భరోసాతో...’

ఇక్కడ స్థిర నివాసం కల్పిస్తామనే భరోసాతో వందల ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి తమ పూర్వీకులను ఇక్కడికి తీసుకొచ్చారని వృద్ధురాలు కర్తీ దీరమ్మ చెప్పారు. నాటి నుంచి తామంతా పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నట్లు తెలిపారు.

బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధం సమయంలో పాకిస్తాన్ దళాలు తమను తీవ్రంగా వేధించినట్టు తెలుగు వారు చెబుతున్నారు. పాకిస్తాన్ దళాల బుల్లెట్ల దెబ్బకు అక్కడ నివాసి ముక్త్యాల రమణ తీవ్రంగా గాయపడ్డారు కూడా.

బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడిచినప్పటికీ, ఇంకా తమకి శాశ్వత నివాసం లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రాంతంలో నివసించేందుకు 1990లో తమకు అనుమతి ఇచ్చారని ఆ కాలనీ వాసులు చెప్పారు. ప్రస్తుతం 130 కుటుంబాలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నాయి. ఇక్కడ ఆలయం, రెండు చర్చిలు, ఒక స్కూల్ ఉన్నాయి. ఈ కాలనీలో ఉండే చాలా మంది తెలుగు వారు... ఇళ్లలో, ఇతర ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు.

ప్రభుత్వం లేదా నగర పాలక సంస్థ వేరే చోట తమకు నివాస సదుపాయాలు కల్పిస్తే అక్కడికి వెళ్లడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని ఆ కాలనీ వాసులు చెప్తున్నారు. కానీ అలా ఎవరూ తమకు భరోసా ఇవ్వడం లేదని అంటున్నారు.

నగర పాలక సంస్థ అధికారులు, పోలీసుల హెచ్చరికలతో ఈ కాలనీలో ఉన్న 130 కుటుంబాలకు చెందిన వందల మంది ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

బుధవారం బీబీసీ వెళ్లినప్పుడు, ఆ ప్రాంతంలోని చాలా మంది ఇళ్లను కూల్చి వేస్తారనే భయంతో సామాన్లను సర్దుకుంటూ కనిపించారు. వేదనతో వారు అక్కడి నుంచి బయటికి కదులుతున్నారు.

ఢాకాలోని దాల్పూర్‌లో తెలుగు పారిశుద్ధ్య కార్మికుల కాలనీ

ఫొటో సోర్స్, SHYADUL ISLAM/BBC BANGLA

ఫొటో క్యాప్షన్, ఢాకాలోని దాల్పూర్‌లో తెలుగు పారిశుద్ధ్య కార్మికుల కాలనీ

మానవహక్కుల సంస్థల ఆందోళన

బంగ్లాదేశ్ తెలుగు వారికి మానవహక్కుల సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి.

‘ఢాకా దక్షిణ మేయర్ కార్యాలయానికి వారిని పిలిపించి, ఆ కాలనీని విడిచి వెళ్లాలని గట్టిగా హెచ్చరించారు. జత్రబరి పోలీసు స్టేషన్‌లో కూడా బెదిరించారు. ఇలా పిలిచి ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశించడంతో తెలుగు కమ్యూనిటీ నేతలు తీవ్ర ఆందోళన పడుతున్నారు’ అని మానవ హక్కుల సంస్కృతి ఫౌండేషన్‌కి చెందిన న్యాయవాది సుల్తానా కమల్ అన్నారు.

దాల్పూర్‌లోని తెలుగు కాలనీ వాసులకు ఎలాంటి పునరావాస ప్రాంతాన్ని ఏర్పాటు చేయకుండా అక్రమంగా, బలవంతంగా వారిని ఖాళీ చేయించడాన్ని ఆపివేయాలని ఆ సంస్థ డిమాండ్ చేస్తోంది.

''ప్రత్యామ్నాయ నివాసాన్ని ఏర్పాటు చేయకుండా తెలుగు మాట్లాడే పారిశుద్ధ్య కార్మికులను ఖాళీ చేయించడం అక్రమం, అప్రజాస్వామికం. అది మతిస్థిమితం లేని నిర్ణయం'' అంటూ ఆ ఫౌండేషన్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పాకిస్తాన్ దళాల చేతిలో గాయాలు పాలైన ముత్యాల రమణ

ఫొటో సోర్స్, SHYADUL ISLAM/BBC BANGLA

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పాకిస్తాన్ దళాల చేతిలో గాయాలు పాలైన ముత్యాల రమణ

అధికారులు ఏమంటున్నారు?

ఖాళీ చేయించిన ఆ ప్రాంతాన్ని ఢాకా దక్షిణ నగర పాలక సంస్థ తన ఆధీనంలోకి తీసుకుని, నగర పాలక సంస్థ ఉద్యోగుల కోసం ఇళ్లను, కారు వర్క్‌షాపులను ఏర్పాటు చేయాలని చూస్తోంది.

కాలనీ నుంచి ఖాళీ చేయమని చెప్పిన తెలుగు కమ్యూనిటీ ప్రజల కోసం దగ్గర్లోనే క్వార్టర్లను కేటాయించారు.

ఫిబ్రవరి 9న ఈ కుటుంబాలకు ఫ్లాట్ల తాళాలను అందజేసే కార్యక్రమంలో ఢాకా దక్షిణ నగర పాలక సంస్థ మేయర్ బారిస్టర్ ఫజ్లే నూర్ తపస్ పాల్గొన్నారు. తాను మేయర్‌గా ఉన్నంత కాలం నగర పాలక సంస్థ పరిసరాల్లో ఎలాంటి ఆక్రమణలను సహించేది లేదని తపస్ హెచ్చరించారు.

''మా భూమిని చాలా మంది ఆక్రమిస్తున్నారు. మా భూమిని ఆక్రమించుకుని పలు అక్రమ కార్యకలాపాలు చేపడుతూ లబ్ది పొందుతున్నారు. నేను ఇక్కడ ఉన్నంత వరకి దీన్ని సహించేది లేదు. మా క్లీనర్లు, మా ఉద్యోగులు ఇక్కడే ఉంటారు. దీన్ని సంరక్షించడం మా బాధ్యత'' అని చెప్పారు.

''తెలుగు మాట్లాడే వారిని ఇక్కడి నుంచి బలవంతంగా ఖాళీ చేయించడం లేదు. నగర పాలక సంస్థలో పనిచేసే వారికి ఇక్కడ ఫ్లాట్లను ఇచ్చాం. మిగిలిన వారిని కూడా బలవంతంగా ఖాళీ చేయించడం లేదు. వారి కోసం ప్రస్తుతం షెడ్లను ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత వసతిని కల్పిస్తాం. త్వరలోనే ఇది పూర్తవుతుంది'' అని ఢాకా దక్షిణ నగర పాలక సంస్థ చీఫ్ ప్రాపర్టీ ఆఫీసర్ మహమ్మద్ రస్సెల్ సబ్రిన్ బీబీసీ బంగ్లాకి చెప్పారు.

పోలీసులు ఎవర్ని బెదిరించడం లేదని జత్రబరి పోలీసు స్టేషన్ ఓసీ మోఫిజుల్ ఆలం అన్నారు. తెలుగు కమ్యూనిటీ సమస్యను మేయరే స్వయంగా చూస్తున్నారని చెప్పారు. అయితే, శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, అలాంటివి మాత్రమే చేయొద్దని వారికి చెప్పినట్టు తెలిపారు.

తెలుగు ప్రజలు

ఫొటో సోర్స్, SHYADUL ISLAM/BBC BANGLA

బంగ్లాదేశ్‌లో తెలుగువారు ఎలా?

19వ శతాబ్దం మధ్యలో భారత్‌లోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల ప్రజలను అనేక రకాల పనుల కోసం బ్రిటిష్ వారు బంగ్లాదేశ్‌కు తీసుకొచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

నాడు సిలెటేలోని టీ తోటలతోపాటు ఢాకా ఇతర పురపాలక నగరాల్లో పారిశుద్ధ్య కార్మికులుగా తెలుగు వారు పనిచేసేవారు. ఆ పనులు చేయడానికి స్థానిక బెంగాళీలు దొరకక పోవడంతో తెలుగు వారిని అక్కడకు తీసుకెళ్లారు.

ఆ రోజుల్లో దక్షిణ భారత్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వజూపిన ఆ పనులను నాటి తెలుగు ప్రజలు చేసేందుకు ముందుకొచ్చారు.

''బ్రిటిషర్లు, 19 శతాబ్దం చివరిలో అస్సాంలో టీ తోటల పెంపకాన్ని ప్రారంభించారు. అప్పుడు స్థానికంగా కార్మికులు దొరకడం కష్టంగా ఉండేది. దాంతో అస్సాం ప్రభుత్వం సాయంతో భారత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది కార్మికులను టీ తోటల్లో పని చేసేందుకు తీసుకొచ్చారు.

బిహార్, ఒడిశా, మద్రాస్(చెన్నై), నాగ్‌పూర్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి హిందుస్తానీ టీ వర్కర్లను అస్సాంకి తీసుకొచ్చారు. వారికి నివాసం, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

ఆ సమయంలో అస్సాం ప్రభుత్వం ప్రత్యేకంగా ఇమ్మిగ్రేషన్ ఆఫ్ లేబర్ యాక్ట్‌ను కూడా అమలు చేసింది. ఇలా లక్షలాది మంది హిందుస్తానీలు అస్సాంలో నివసించడం ప్రారంభించారు'' అని తన 'బెంగళూరు మూవ్‌మెంట్, బెంగాళీ కాంటెక్ట్స్ ఇన్ అస్సాం 1947-1961' అనే పుస్తకంలో సుకుమార్ బిశ్వాస్ రాశారు.

ఢాకాలోని దాల్పూర్ బస్తీ

ఫొటో సోర్స్, SHYADUL ISLAM/BBC BANGLA

టీ తోటల చూసుకునేందుకు తూర్పు బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల నుంచి కూడా నిపుణులైన ఉద్యోగులను నియమించుకున్నారు. రైల్వే లైన్ ఏర్పాటు చేశాక... ఢాకా, త్రిపుర, మైమెన్‌సింగ్, నోవాఖలి వంటి ప్రాంతాల బెంగాళీలు కూడా ఈ టీ తోటల్లో పనిచేయడం ప్రారంభించారు.

కానీ, 150 ఏళ్లు అవుతున్నప్పటికీ ఇంకా వీరు స్థానిక కమ్యూనిటీకి దూరంగానే బతకాల్సి వస్తోంది.

తెలుగు ప్రజలు పెళ్లి వంటి అనేక కార్యక్రమాలను తమలో తాము చేసుకోవాల్సిందే తప్ప, స్థానిక కమ్యూనిటీతో కలిసేందుకు వీలు ఉండటం లేదు.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)