ఆంధ్రప్రదేశ్: ‘రూ.100 కోట్ల ఆస్తులు ఉన్న జీవీఎంసీ కార్పొరేటర్లకు రూ.15 వేలు గిఫ్ట్ కూపన్ ఎందుకు ఇచ్చారు?’

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఏటా ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తుంది.
ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల ముందు జీవీఎంసీ కార్పొరేటర్లందరికి రూ.15 వేల విలువ చేసే ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేందుకు ఒక గిఫ్ట్ కూపన్ ఇచ్చారు.
వాటిని తిరస్కరిస్తున్నట్లు జీవీఎంసీ 22, 78 వార్డుల కార్పొరేటర్లు మూర్తి యాదవ్, గంగారావులు పత్రికా ప్రకటన విడుదల చేశారు.
దీంతో గిప్ట్ కూపన్ల విషయం బయటకు వచ్చింది. ప్రజల పన్నుల సొమ్ముతో కార్పొరేటర్లకు నజరానాలు పంచడం చర్చనీయాంశమైంది.

ఇంతకు ముందు ఏ గిప్టులు ఇచ్చారు?
గిప్టు కూపన్ల వ్యవహారంపై చర్చ నడుస్తుండటంతో...అసలు ఏటా కార్పొరేటర్లకు ఏం బహుమతులు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇచ్చిన రూ.15 వేల గిప్ట్ కూపనుతో పాటు గతంలో తనకు ఇచ్చిన వాటిని తిరస్కరించానంటూ గంగారావు బీబీసీకి తెలిపారు. గంగారావు సీపీఎం పార్టీలో పని చేస్తూ జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఉన్నారు.
"జీవీఎంసీ బడ్జెట్ సమావేశాలు సందర్భంగా కార్పొరేషన్ ఇచ్చిన బహుమతులను వ్యతిరేకిస్తున్నాను. ప్రతి కార్పొరేటరుకు రూ.15 వేల విలువైన ఒక గిప్ట్ కూపన్ ఇచ్చి, దానితో కార్పొరేటర్లను లోబర్చుకుని, అవినీతిమయం చేస్తున్నారు. అందుకోసమే వారిచ్చిన గిప్ట్‌ను తిరస్కరిస్తూ మేయర్‌కు పంపించేశాను.
ఈ బడ్జెట్ సందర్భంగానే కాదు, గత బడ్జెట్ సందర్భంగానూ పెద్ద బ్రీఫ్‌కేస్ ఇచ్చారు. అప్పుడు దానిని కూడా మేయరు గారికి తిరిగి ఇచ్చేసి, ప్రజల సొమ్మును ఇలా ఖర్చు చేసే సంస్కృతిని విడనాడాలని చెప్పాను. అయినా ఈ ఏడాది మళ్లీ పంపించారు.
ప్రజల సొమ్ముతో నడిచే జీవీఎంసీ. ప్రజల సంక్షేమానికి ఉపయోగపడాలి. అలాగే కార్పొరేటర్ల అధ్యయన యాత్రలంటూ దిల్లీ, సిమ్లాతో పాటు ఐదు మహానగరాలు వెళ్లి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు. ఆ అధ్యయన తరగతులకు నేను వెళ్లలేదు, అలాంటి యాత్రలు చేయడాన్ని నేను బహిష్కరిస్తూ లేఖ కూడా రాశాను" అని గంగారావు తెలిపారు.
తాను కూడా గతంలో ఇచ్చిన సూట్ కేసు, ఇప్పుడు ఇచ్చిన కూపను తిరిగి జీవీఎంసీకే అప్పగిస్తూ, అకౌంట్స్ అధికారి నుంచి రశీదు సైతం పొందానని జనసేన పార్టీ నుంచి 22వ వార్డు కార్పొరేటరుగా ఎన్నికైన పీతల మూర్తి యాదవ్ అన్నారు. బడ్జెట్‌కు ముందు గిప్టులు ఇవ్వడం కంటే ఆ సొమ్మును ప్రజావసరాలకు ఉపయోగిస్తే మంచిది కదా అని బీబీసీతో చెప్పారు.

'కార్పొరేటర్లకు గిఫ్టులు, ప్రజలకు పన్నులు'
జీవీఎంసీ ప్రజల నుంచి వివిధ రకాల పన్నులను వసూలు చేస్తూ...ఏటా వాటిని పెంచుతూ ఉంది కూడా, వాటిని తగ్గించమని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తూనే ఉంటారు.
కానీ వాటిపై దృష్టి పెట్టని జీవీఎంసీ అధికారులు, పాలకవర్గం...కార్పొరేటర్లకు గిప్టులు ఇవ్వడంతోపాటు, యాత్రలు ఏటా ఏర్పాట్లు చేయడం విడ్డూరంగా ఉందని కార్పొరేటర్ గంగారావు అన్నారు. గంగారావు 30 ఏళ్ల క్రితం ఎస్ఎఫ్ఐలో విద్యార్థి నాయకుడిగా మొదలై...ప్రస్తుతం సీపీఎం పార్టీలో పని చేస్తూ...స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో ఉన్న 78 వార్డు నుంచి కార్పొరేటరుగా ఎన్నికైయ్యారు.
"ఆస్తి పన్ను, చెత్తపన్ను, యూజర్ చార్జీలు ఇలా నగరంలో ప్రతి దాని మీద పన్నులు, రుసుం పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్న జీవీఎంసీ...ఎవరి సొమ్మును ఎవరికి దానం చేస్తోంది? బడ్జెట్ సమావేశాలప్పుడు ప్రతి ఏటా ఈ బడ్జెట్ బహుమతులు ఎందుకు ఇస్తున్నారు? మమ్మల్ని కౌన్సిల్‌లో నోరు మొదపకుండా, ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ఉండమనా?" అని ఆయన ప్రశ్నించారు.
"ప్రజల సొమ్మును అధికారులు, కార్పొరేటర్లు విలాసాలకు, వినోదాలకు ఖర్చు చేయడం ఏంటి? ఇదేం పరిపాలన? ఇదేం సుపరిపాలన? ఇది సరైనది కాదు. కార్పొరేటర్లు బిక్షగాళ్లు కాదు. జీవీఎంసీకి ప్రాతినిధ్యం వహించే 98 కార్పొరేటర్లలో రూ.500 కోట్లు ఉన్నవారు ఉన్నారు. రూ.1,000 కోట్లు ఉన్నవారు ఉన్నారు. ఇక రూ.100 కోట్ల ఆస్తిపరులైతే అత్యధికమంది ఉన్నారు. ఇటువంటి వాళ్లకి గిఫ్ట్ కూపన్లు ఇస్తూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం సరైనది కాదు. ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా వైసీపీ ప్రభుత్వం ఒక చట్టం తేవాలని కోరుతున్నాను" అని గంగరావు అన్నారు.

ఇది సంప్రదాయంగా వస్తోంది: మేయర్
ఏటా బడ్జెట్ సమావేశాల ముందు కార్పొరేటర్లకు గిప్టులు ఇవ్వుడం తాను ప్రారంభించినది కాదని, ఇది గతం నుంచి ఆనవాయితీగా వస్తుందంటూ ప్రస్తుత మేయరు గొలగాని హరి వెంకటకుమారి చెప్పుకొచ్చారు. మాజీ మేయర్లు కూడా ఇలాగే గిప్టులు ఇచ్చేవారని ఆమె బీబీసీతో అన్నారు.
"ఇది మేం వచ్చిన తర్వాత తీసుకుని వచ్చింది కాదు. ఇది ఆనవాయితీగా వస్తోంది. ఒక సంప్రదాయంగా వస్తున్న దానిని నేను అనుసరించానంతే. దీని మీద కౌన్సిల్‌లో చర్చించే నిర్ణయం తీసుకున్నాం. చర్చ తర్వాతే బడ్జెట్ సమావేశాల ముందు అంటే ఫిబ్రవరి 10న అందరికి అందచేశాం. వీటిని ఒకరిద్దరు తిరిగి ఇచ్చేశామని విన్నాను. బడ్జెట్ సమావేశాల ముందు బహుమతులు ఇవ్వడం ఎప్పటి నుంచో ఉంది" అని హరి వెంకటకుమారి చెప్పారు.
'కెమెరాలు, సూట్ కేసులు, కూపన్లు....'
జీవీఎంసీలో ప్రతి బడ్జెట్ కు బహుమతులు ఇవ్వడం చూస్తూనే ఉన్నానని జీవీఎంసీ వార్తలను గత 15 ఏళ్లుగా రాస్తున్న సీనియర్ జర్నలిస్టు ఒకరు బీబీసీతో చెప్పారు.
గత పదిహేనేళ్లలో ఖరీదైన బ్యాగులు, కెమెరాలు, ఖరీదైన ఫోటో ఫ్రేములు, సూట్ కేసులు, ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కునేందుకు గిప్ట్ కూపన్లు ఇలా ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు. ఇది కేవలం కార్పొరేటర్లకే కాదు, అధికారులకు కూడా అందుతాయి.
"జీవీఎంసీలో ఉన్న 98 కార్పొరేటర్లతో పాటు మరి కొందరికి ఇచ్చేందుకు మొత్తం 200 గిఫ్ట్ కూపన్లను ఇచ్చేందుకు గత కౌన్సిల్ సమావేశంలో ఆమోదం లభించింది. దానికి నేను హాజరయ్యాను. ఇదొక సంప్రదాయంగా ఇస్తూన్నరే తప్ప...తప్పనిసరి కాదు. కానీ ఏటా తప్పనిసరిగా ఇవ్వడం మాత్రం చూస్తూనే ఉన్నాను. జీవీఎంసీ అధికారులకు, కార్పొరేటర్లకు, మీడియాకు కూడా ఇచ్చే బహుమతులన్నింటికి జీవీఎంసీ సొమ్మే అంటే ప్రజల సొమ్మే ఖర్చు అవుతుంది. ఇది జీవీఎంసీ ఖాతాల్లో కూడా చూపిస్తారు" అని సీనియర్ జర్నలిస్ట్ బీబీసీతో చెప్పుకొచ్చారు.

"అసెంబ్లీలో కూడా బహుమతులు ఇస్తారు'
విశాఖ 1979లో కార్పొరేషన్ అయ్యింది. 50 వార్డులతో మొదలైన విశాఖ కార్పొరేషన్ ప్రస్థానం 8 జోన్లు, 98 వార్డులకు చేరింది. ప్రస్తుతం 23 లక్షలకు పైగా ఉన్న జనాభాలో 18 లక్షలకుపైగా ఓటర్లున్నారు.
జిల్లాల విభజన తర్వాత జీవీఎంసీ పరిధి అంతా విశాఖ జిల్లాగా మారింది. గ్రామీణ ప్రాంతమంటూ ఈ జిల్లాకు లేదు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా కార్పొరేటర్లకు గిప్టులు ఇవ్వడం 30 ఏళ్లుగా చూస్తున్నానని మాజీ మేయర్ రాజాన రమణి బీబీసీతో అన్నారు. ఈమె 2000 నుంచి 2005 వరకు విశాఖ మేయరుగా పని చేశారు.
"నేను 1985-1990 మధ్యకాలంలో విశాఖ ఎమ్మెల్యేగా కూడా పని చేశాను. ఆ తర్వాత 2000లో జీవీఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మేయర్ అయ్యాను. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా బడ్జెట్ సమావేశాల సమయంలో బహుమతులు ఇచ్చేవారు. అయితే సాధారణంగా చిన్న సూట్ కేసులు ఇచ్చేవారు. అది కూడా ఆ బడ్జెట్ పేపర్లు పెట్టుకోవడానికి అనుకుంటా.
నేను మేయర్ అయ్యాక జీవీఎంసీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కార్పొరేటర్లకు బహుమతులు ఇచ్చేవాళ్లం. కాకపోతే ఇప్పటిలా ఖరీదైనవి కాకుండా, దేవుడి ఫోటోలు, దేవుడి బొమ్మలు, చిన్న సూట్ కేసు వంటివి మాత్రమే ఇచ్చేవాళ్లం. అయితే ఇప్పుడు గ్రేటర్ కార్పొరేషన్ అయ్యింది కదా, ఆ స్థాయికి తగ్గట్టుగా బహుమతులు ఇస్తన్నారేమో మరి" అని మాజీ మేయర్ రాజాన రమణి బీబీసీతో అన్నారు.
నగరానికి వీఐపీలు, వీవీఐపీలు వచ్చినా కూడా వారికి ఆతిథ్యం ఇవ్వడం, దేవుడు బొమ్మలు, విగ్రహాలు బహుమతులుగా అందించేవాళ్లం అని రాజాన రమణి చెప్పారు.
'బడ్జెట్ సమావేశాలు వాయిదా'
జీవీఎంసీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 15న ప్రారంభం అవుతాయని ప్రకటించారు. కానీ ఈ సమావేశాలు వాయిదా పడ్డాయి. ఉత్తరాంధ్రలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో బడ్జెట్ సమావేశాలు వాయిదా వేసినట్లు జీవీఎంసీ కార్యదర్శి పి. నల్లనయ్య చెప్పారు.

ఇవి కూడా చదవండి:
- నిక్కీ యాదవ్ మర్డర్: గర్ల్‌ఫ్రెండ్‌ను చంపి ఫ్రిజ్‌లో పెట్టి, మరుసటి రోజే ఇంకో అమ్మాయిని పెళ్లాడిన యువకుడి కేసులో పోలీసులు ఏం చెప్పారు?
- అదానీ వివాదం, బీబీసీ డాక్యుమెంటరీ, 2024 ఎన్నికలపై అమిత్ షా ఏమన్నారు?
- కొత్తవీధి, గుంటి: గిరిజనులు సాగుచేసే ఈ గ్రామాలు రికార్డుల్లో ఎలా మాయం అయ్యాయి?
- ఎయిరిండియా: రికార్డు సంఖ్యలో విమానాల కొనుగోలుతో అంతర్జాతీయ సంస్థలకు సవాల్ విసరబోతోందా?
- మూడు రాజధానుల ముచ్చట ముగిసిందా? విశాఖపట్నం ఒక్కటే రాజధాని అని ఎందుకు చెప్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












