పుతిన్ ప్రొటోకాల్ పక్కనపెట్టి అజిత్ డోభాల్‌తో భేటీ కావడంపై పాకిస్తాన్‌లో ఎందుకు చర్చ జరుగుతోంది?

ఫొటో సోర్స్, getty
భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్ ఈ నెల 7 నుంచి మూడు రోజులపాటు రష్యా రాజధాని మాస్కోలో పర్యటించారు. అఫ్గానిస్తాన్ అంశంపై ఫిబ్రవరి 8న నిర్వహించిన సదస్సులో పాల్గొనేందుకు ఆయన మాస్కో వెళ్లారు.
ఈ సమావేశంలో ఇరాన్, కజక్‌స్తాన్, చైనా, తజకిస్తాన్, తుర్క్‌మనిస్తాన్, రష్యా, ఉజ్బెకిస్తాన్ దేశాల జాతీయ భద్రత సలహాదారులూ పాల్గొన్నారు.
అఫ్గానిస్తాన్‌ల భద్రపరమైన అంశాలు, మానవత సవాళ్లపై ఈ సమావేశంలో చర్చించారు.
ప్రోటోకాల్ పక్కనపెట్టి డోభాల్‌ను కలిసిన పుతిన్
ఈ పర్యటనలో డోభాల్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తోనూ భేటీ అయ్యారు. పుతిన్ తన ప్రోటోకాల్ పక్కనపెట్టి మరీ ఈ సమావేశంలో వివిధ దేశాల భద్రత సలహాదారులను కలుసుకున్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇతర దేశాలకు చెందిన కేబినెట్ మంత్రులు, జాతీయ భద్రత సలహాదారుల స్థాయివారిని కలవడం చాలా అరుదు.డోభాల్ అమెరికా, బ్రిటన్‌లు వెళ్లివచ్చిన తరువాత రష్యా వెళ్లగా అక్కడ పుతిన్ ఆయన్ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
యుక్రెయిన్ విషయంలో అమెరికా, బ్రిటన్‌లు రష్యాకు వ్యతిరేకంగా నిర్ణయాలు ప్రకటిస్తున్నాయి. కానీ, భారత్ మాత్రం ఈ యుక్రెయిన్-రష్యా యుద్ధంలో ఎవరి పక్షం వహించకుండా చర్చలతో యుద్ధానికి ముగింపు పలకాలని రెండు పక్షాలకూ సూచిస్తోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ ఏడాది జీ20 సదస్సు, షాంఘై కోపరేటివ్ ఆర్గనైజేషన్ సదస్సుల నిర్వహణకు భారత్ సిద్ధమవుతోంది. జీ 20 సమావేశాలలో పాశ్చాత్య దేశాలు, రష్యా మధ్య చర్చలకు అవకాశం కల్పించేందుకు భారత్ యత్నిస్తోంది.
అయితే, భారత్ దౌత్యపరంగా అనేక సంక్లిష్టతల నడుమ ఉంది ఇప్పుడు. ఓవైపు రష్యాతో మైత్రి కొనసాగిస్తోంది. చైనాతో సరహద్దు ఉద్రిక్తతలున్నాయి. అదే సమయంలో చైనాతో తన స్నేహం అవధులు దాటి ముందుకెళ్తోందని రష్యా అంటోంది.
మరోవైపు అమెరికాతో భారత్ మైత్రి కొనసాగుతోంది.. అదేసమయంలో చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మరోవైపు అమెరికా, రష్యాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.
పశ్చిమ దేశాలతో భారత్ స్నేహం, ఇండో పసిఫిక్ దేశాలకు ఉద్దేశించిన క్వాడ్ గ్రూప్‌లో భారత్ ఉండడంపై రష్యా ఇప్పటికే తన అసహనాన్ని వ్యక్తంచేసింది. కానీ చైనా, రష్యాల మధ్య బలపడుతున్న బంధంపై భారత్ ఏనాడూ మాట్లాడలేదు.. అలాగే అమెరికాతో భారత్ మైత్రి బలపడుుతుండడంపైనా రష్యా ఎన్నడూ మాట్లాడలేదు.

ఫొటో సోర్స్, @HCI_London
లండన్‌లో రిషి సునక్ తో డోభాల్ భేటీ
కాగా అజిత్ డోభాల్ ఫిబ్రవరి 4న బ్రిటన్ భద్రత సలహాదారు టిమ్ బారోను లండన్‌లో కలిశారు. ఈ సమావేశంలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కూడా ఉన్నారు. అంతకుముందు ఫిబ్రవరి 2న డోభాల్ అమెరికాలో ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి ఆంథోనీ బ్లింకెన్‌తో భేటీ అయ్యారు.
ఈ భేటీ తరువాత బ్లింకెన్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి భారత్‌తో కలిసి అమెరికా పనిచేస్తుందని చెప్పారు.
రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం చేయడానికి డోభాల్‌తో సమావేశం ఎంతో ఉపకరించిందని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌లో చర్చ
తాజాగా పుతిన్‌తో అజిత్ డోభాల్ భేటీ కావడంపై పాకిస్తాన్‌లో చర్చ జరుగుతోంది. అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్‌ల పాలన ఏర్పడడంతో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలిందని, పాకిస్తాన్ కూడా అఫ్గానిస్తాన్‌లో పట్టు కోల్పోతోందని చెబుతున్నారు.
తాజా పరిణామాలపై పాకిస్తానీ అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ ఎన్.తరార్ ట్విటర్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
‘అజిత్ డోభాల్ అంతర్జాతీయంగా అనేక దేశాలు తిరుగుతున్నారు. అమెరికా నుంచి సైనిక సాంకేతికత అందుకుంటున్నారు. బ్రిటన్‌లో ఉగ్రవాదంపై మాట్లాడారు. అఫ్గానిస్తాన్ అంశంపై రష్యాలో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. కానీ పాకిస్తాన్‌కు జాతీయ భద్రత సలహాదారే లేరు ఇప్పుడు. అఫ్గానిస్తాన్ సమావేశానికి వెళ్లేందుకు కూడా పాకిస్తాన్ నిరాకరించింది. పాకిస్తాన్ భవిష్యత్తు ఇదేనా?’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
కాగా అజిత్ డోభాల్ బ్రిటన్‌లో ఉన్నప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా బ్రిటన్‌లోనే ఉన్నారు. అంతేకాదు.. డాలరుతో పోల్చినప్పుడు అఫ్గానిస్తాన్ కరెన్సీ విలువ 89.84గా ఉంది. డాలరుతో పాకిస్తాన్ రూపాయి విలువ 271.24గా ఉంది. పాకిస్తాన్ ఆర్థిక మంత్రులు తాలిబాన్ ఇనిస్టిట్యూట్ నుంచి ఎకనమిక్స్ నేర్చుకోవాలి అంటూ ట్వీట్ చేశారు తరార్.
భారత్‌లో పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ తాజా పరిణామాలపై స్పందిస్తూ పాకిస్తాన్‌లో పీఎంఎల్(ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఉందని.. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో ప్రస్తుతం పాక్ విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నారని.. ఆయన జాతీయ సలహాదారు ఉండాలని కోరుకోకపోవడంతో ఆ స్థానం ఖాళీగా ఉందన్నారు.

ఫొటో సోర్స్, Reuters
‘అఫ్గానిస్తాన్‌లో ఇండియా పట్టు ఏమాత్రం తగ్గలేదు’
మరోవైపు పాకిస్తాన్ జర్నలిస్ట్ అలియా షా మాట్లాడుతూ... తాలిబాన్ పాలకులు వచ్చినప్పటికీ అఫ్గానిస్తాన్‌లో భారత్ పట్టు ఏమాత్రం తగ్గలేదని చెప్పారు.
అమెరికాలోని డెలావర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ముఖ్తార్ ఖాన్ దీనిపై స్పందిస్తూ ‘అమెరికా, బ్రిటన్, రష్యా మూడూ అణుశక్తి ఉన్న దేశాలు. ఈ మూడు ఐరాస భద్రత మండలిలో శాశ్వత సభ్య దేశాలు. ఇప్పుడు డోభాల్ ఈ మూడు దేశాలలో పర్యటించడం పెద్ద విషయం’ అన్నారు.
‘భారత దేశ దౌత్యం మూడు రకాలుగా ఉంది. మోదీ నేరుగా దౌత్యం చేస్తారు. ఆ తరువాత స్థాయిలో విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ దౌత్యం నెరుపుతారు. ఇక మూడో స్థాయిలో అజిత్ డోభాల్ దౌత్యం చేస్తారు. ఈ ఏడాది మే నెలలో మోదీ అమెరికాలో పర్యటించనున్నారు’ అని విశ్లేషించారు ముఖ్తార్ ఖాన్.
జైశంకర్, డోభాల్‌లపై మోదీకి పూర్తిస్థాయి విశ్వాసం ఉందని.. 2014 నుంచి డోభాల్ భద్రత సలహాదారుగా కొనసాగుతున్నారని ముఖ్తార్ చెప్పారు.
డోభాల్‌ను అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి బ్లింకెన్ వైట్‌హౌస్‌లో కలిశారని.. డోభాల్ కంటే ముందే బిలావల్ భుట్టో అమెరికా వచ్చినప్పటికీ ఆయన్ను బ్లింకెన్ కలుసుకోలేదని ముఖ్తార్ అన్నారు.
మరోవైపు రష్యా, యుక్రెయిన్ యుద్ధంలో భారత్ తీరుపై యుక్రెయిన్ అసంతృప్తిగా ఉన్నప్పటికీ యుక్రెయిన్‌కు మద్దతిస్తున్న అమెరికా మాత్రం భారత్‌పై ఎలాంటి ఆంక్షలు విధించలేదు.
బ్రిటన్ భద్రత సలహాదారులో డోభాల్ భేటీ అయినప్పుడు ఆ భేటీకి బ్రిటన్ ప్రధాని రావడం కూడా ప్రాధాన్యంగా గుర్తించాల్సిందేనని.. పుతిన్ తన ప్రోటోకాల్ పక్కన పెట్టి డోభాల్‌ను కలవడం చెప్పుకోదగ్గ విషయమని ముఖ్తార్ ఖాన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘అమెరికా, భారత్‌ల అజెండా ఒకటే’
అమెరికా అనుసరిస్తున్న గ్లోబల్ అజెండాకు, భారత్ అజెండాకు మధ్య వ్యత్యాసం తగ్గుతోందని.. రష్యాతో భారత్ బహిరంగంగానే సంబంధాలు నెరుపుతున్నా అమెరికా ఏమీ కంగారుపడడం లేదని ముఖ్తార్ అన్నారు.
అఫ్గానిస్తాన్‌లో భారత్ పెట్టుబడులు ఆగడం లేదని, అఫ్గానిస్తాన్‌కు భారత్ నుంచి మానవతా సహాయం అందుతోందని.. ప్రస్తుతం అఫ్గానిస్తాన్ వల్ల భారత్‌కు ఎలాంటి ముప్పు లేదని.. కానీ, పాకిస్తాన్‌కే ముప్పు ఉందని.. షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల జాతీయ భద్రత సలహాదారులంతా మాస్కో సమావేశానికి వెళ్లినా పాకిస్తాన్ మాత్రం ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయిందని ముఖ్తార్ అన్నారు.
అఫ్గానిస్తాన్ కేంద్రంగా ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని.. ఒకప్పుడు అఫ్గానిస్తాన్ భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించుకోరాదని భారత్ కోరేదని.. కానీ, ఇప్పుడు పాకిస్తాన్ అలా కోరాల్సి వస్తోందని పాకిస్తాన్‌కు చెందిన అంతర్జాతీయ రాజకీయాల విశ్లేషకుడు కమర్ చీమా అంటున్నారు.

ఇవి కూడా చదవండి:
- మోదీ కన్నా మన్మోహన్ సింగ్ ఎక్కువగా పనిచేశారు: అసెంబ్లీలో కేసీఆర్ ఫైర్
- ముద్దు పెట్టుకోవాలనే ఆలోచన మనిషికి ఎప్పటి నుంచి మొదలైంది?
- భూకంపాల నుంచి హైదరాబాద్ ఎంత వరకూ సురక్షితం?
- తుర్కియే, సిరియా భూకంపం: ఈ పిల్లల పేర్లేమిటో, వారి తల్లిదండ్రులెవరో తెలీదు..ఏం చేయాలి?
- బెలూన్: ఆకాశంలో 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు ఎగిరితే ఏమవుతుంది? ఇలాంటి బెలూన్ల తయారీకి ఎంత ఖర్చవుతుంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













