మరో ఐఏఎస్ అధికారి రాజీనామా: ‘ప్రజాస్వామ్య విలువలపై రాజీ పడుతున్నవేళ ఐఏఎస్‌గా కొనసాగలేను’

కన్నన్ గోపినాథన్, శశికాంత్ సెంథిల్
ఫొటో క్యాప్షన్, కన్నన్ గోపినాథన్, శశికాంత్ సెంథిల్

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేస్తూ తమిళనాడుకు చెందిన మరో ఐఏఎస్ అధికారి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాకు డిప్యుటీ కమిషనర్‌గా పనిచేస్తున్న శశికాంత్ సెంథిల్ శుక్రవారం రాజీనామా సమర్పించారు.

కశ్మీర్ విషయంలో తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించలేకపోతున్నానంటూ కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీలో విధులు నిర్వహిస్తున్న యువ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథన్ (33) కూడా గత వారం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన కూడా తమిళనాడుకు చెందిన వారే.

వారం వ్యవధిలో ఇద్దరు తమిళనాడు ఐఏఎస్‌లు రాజీనామాలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

"దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ విలువలపై రాజీపడుతున్న ఈ సమయంలో ప్రభుత్వంలో ఐఏఎస్‌గా కొనసాగడం అనైతికమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని" శశికాంత్ సెంథిల్ తెలిపారు.

ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని.. తాను డిప్యూటీ కమిషనర్‌గా ఉండగా జరిగిన ఘటనలు గానీ, ఇతర వ్యక్తులు గానీ దీనికి కారణం కాదని వివరించారు.

శశికాంత్ సెంథిల్

దక్షిణ కన్నడ ప్రజలు, ప్రజాప్రతినిధులు తనకెంతో సహకరించారని, ఇలా మధ్యలో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నందుకు వారిని క్షమాపణలు కోరుతున్నానని సెంథిల్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

''మన జాతి నిర్మాణంలో మూలాధారమైన అంశాలకు రాబోయే రోజుల్లో పెనుసవాళ్లు ఎదురుకానున్నాయి. ఐఏఎస్‌గా కన్నా, నేను బయట ఉండటమే మేలని అనుకుంటున్నా. అందరి జీవితాలను మెరుగుపరిచేందుకు నా కృషిని కొనసాగిస్తా'' అని సెంథిల్ తెలిపారు.

40 ఏళ్ల సెంథిల్‌ తమిళనాడులోని తిరుచ్చీకి చెందినవారు. 2009లో ఆయన ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.

2017 డిసెంబర్ నుంచి దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)