ఒమేగల్‌: లైంగిక వేధింపులకు పాల్పడే వారిని పరిచయం చేసే డేటింగ్ సైట్లపై కేసులు వేయొచ్చా?

ఒమేగల్‌
    • రచయిత, జోయ్ టైడీ
    • హోదా, సైబర్ కరస్పాండెంట్

హెచ్చరిక: ఈ కథనంలో అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.

ప్రముఖ వీడియో చాట్ వెబ్‌సైట్‌ ఒమేగల్‌లో 11 ఏళ్ల వయసున్నప్పుడు అలిస్‌కు పిల్లలను లైంగికంగా వేధించే ఓ దుండగుడితో అనుకోకుండా పరిచయం ఏర్పడింది. ఆమెను అతడు ఒక ‘‘డిజిటల్ సెక్స్ స్లేవ్’’గా మార్చేశాడు. దాదాపు పదేళ్ల తర్వాత నేడు ఒమేగల్‌ వెబ్‌సైట్‌పై అలిస్ కేసు వేశారు. ఇతర సోషల్ మీడియా వేదికలపైనా చర్యలు తీసుకునేందుకు ఈ కేసు బాటలు పరుస్తోంది.

తను చిన్నప్పుడు ఎలాంటి వేధింపులు ఎదుర్కొందో ప్రతి చిన్న విషయం కూడా అలిస్‌కు గుర్తుంది.

తనకు పంపించే వీడియోల్లో తాను ఎలా ఉండాలో అలిస్‌కు అతడు స్పష్టమైన సందేశాలు పంపించేవాడు. ఆఖరికి జడ ఎలా వేసుకోవాలో కూడా చెప్పేవాడు. పోనీ టెయిల్‌ను తలకు ఎడమవైపు వేయాలని సూచించేవాడు.

‘‘అప్పుడు నా వయసు 11 ఏళ్లు. అయితే, నేను వీలైనంత చిన్నగా కనిపించాలని అతడు సూచించేవాడు’’అని ఆమె చెప్పారు.

ఇప్పటికీ తన జుట్టు అనుకోకుండా ఎడమవైపుకు వస్తే అలిస్ ఆందోళనకు గురవుతున్నారు.

ప్రస్తుతం ఆమె వయసు 21 ఏళ్లు. రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే, గత అనుభవాలు జీవితాంతం తనను వెంటాడతాయని ఆమె చెబుతున్నారు.

ఒమేగల్‌

మొదటిసారి అలిస్ ఒమేగల్ వెబ్‌సైట్‌ గురించి తెలుసుకునే సమయానికి అది ఇంటర్నెట్‌లో దావానలంలా వ్యాపిస్తోంది.

‘‘నేను, నా స్నేహితులు కలిసి ఒక పార్టీలో మొదటిసారి దాన్ని ఓపెన్ చేశాం. మా స్కూల్‌లో అందరికీ దాని గురించి తెలుసు. అయితే, దానితో ఎలాంటి ముప్పులు ఉంటాయో ఎవరికీ అవగాహన లేదు’’అని ఆమె చెప్పారు.

నేడు నెలకు 7.3 కోట్ల మంది ఒమేగల్‌ సైట్‌ను ఉపయోగిస్తున్నట్లు డేటా చెబుతోంది. ముఖ్యంగా భారత్, అమెరికా, బ్రిటన్, మెక్సికో, ఆస్ట్రేలియాలలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. టీనేజర్లు గుర్తుతెలియని వ్యక్తులతో మాట్లాడేందుకు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ వీడియో చాట్‌ల తర్వాత ఏమైనా జరగొచ్చు.

ఆ తర్వాతి రోజు ఒంటరిగా ఉన్నప్పుడు మళ్లీ అలిస్ ఒమేగల్ సైట్‌ను ఓపెన్ చేశారు. అప్పుడే కెనడాకు చెందిన ర్యాన్ ఫోర్డిస్‌తో పరిచయం ఏర్పడింది. అతను పిల్లలను లైంగికంగా వేధించేవాడు.

అప్పటికీ ఆమె శరీరంలో చోటుచేసుకుంటున్న మార్పుల విషయంలో అలిస్‌కు చాలా సందేహాలు ఉండేవి. అయితే, ఆమెకు మొదట్లో ఫోర్డిస్ చాలా మంచి మాటలు చెప్పేవాడు. మొదటి వీడియో చాట్‌లోనే పర్సనల్ కాంటాక్ట్ వివరాలను ఆమె నుంచి అతడు తెలుసుకోగలిగాడు.

‘‘నన్ను అతడు ఏమార్చేవాడు. దీంతో పిల్లలు చేయకూడని పనులను నేను చేసేదాన్ని’’అని అలిస్ వివరించారు.

కానిస్టేబుల్ పామ్ క్లాసెన్
ఫొటో క్యాప్షన్, కానిస్టేబుల్ పామ్ క్లాసెన్

ఒకసారి అసభ్యకర ఫోటోలు పంపించేలా అలిస్‌పై ఫోర్డిస్ ఒత్తిడి చేశాడు. ఇలాంటి అభ్యంతరక ఫోటోలు ఎలా షేర్ చేయాలో తనకు తెలుసని, దీనిలో తప్పేమీ లేదని ఆమెను అతడు ఒప్పించేవాడు. అయితే, ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఎవరికీ చెప్పుకోలేకపోయేవారు.

‘‘అతడి బెదిరింపులు, హెచ్చరికల నడుమే నా బాల్యం గడిచింది. ప్రతిరోజూ అతడు చెప్పినట్లు చేయాల్సి వచ్చేది’’అని ఆమె చెప్పారు.

ఇలా దాదాపు మూడేళ్లు గడిచాయి. ఆ తర్వాత అతడికి ఆసక్తి తగ్గడంతో ఆమెతో మాట్లాడటం కూడా తగ్గించేశాడు.

అలిస్ ఈ విషయాలను ఎవరికీ చెప్పకూడదని భావించారు. అయితే, కొందరు పిల్లల అశ్లీల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నట్లు కెనడియన్ పోలీసులు గుర్తించారు.

విన్‌పెగ్‌కు దాదాపు 200 కి.మీ. దూరంలో ఒక చిన్న నగరం బ్రాండన్‌లో ఫోర్డిస్ ఇంటి నుంచి ఆ మెటీరియల్ షేర్ అవుతున్నట్లుగా కానిస్టేబుల్ పామ్ క్లాసెన్ గుర్తించారు. వెంటనే ఆమె సెర్చ్ వారెంట్ సంపాదించారు.

2018 జనవరి 12న పామ్ వచ్చినప్పుడు ఫోర్డిస్ ఇంట్లో లేరు. అయితే, అతడి కంప్యూటర్‌ను పరిశీలించే అవకాశం పామ్‌కు దక్కింది. అప్పుడే పిల్లల అశ్లీల ఇమేజ్‌లు, వీడియోలు బయటపడ్డాయి. ఫోర్డిస్ ఇంటికి వచ్చిన వెంటనే అతడిని అరెస్టు చేశారు.

‘‘అతడు ఆశ్చర్యానికి గురయ్యాడు. అతడి భార్య కూడా ఏదో పొరబడ్డామని అనుకున్నారు’’అని పామ్ చెప్పారు.

ఫోర్డిస్ కంప్యూటర్‌లో ఏడు ఫోల్డర్‌లు ఉన్నాయి. వీటిలో ఒక్కోటి ఒక్కో అమ్మాయి పేరుతో ఉంది. మొత్తంగా అలిస్ 11 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్నప్పుడు తీసిన 220 ఇమేజ్‌లు, వీడియోలు వారికి కనిపించాయి. కొన్ని వీడియోల్లో హస్తప్రయోగం చేసుకునేలా ఆమెను అతడు బలవంతం చేసినట్లు కూడా కనిపిస్తోంది.

తన స్కూల్ యూనిఫాం ఆధారంగా అలిస్‌ను పామ్ గుర్తించారు. ఆ తర్వాత ఫోర్డిస్‌కు డిసెంబరు 2021లో ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించారు.

ఇద్దరు పిల్లల తండ్రి అయిన ఫోర్డిస్ వయసు 30లలో ఉంటుంది. ఒమేగల్‌తో మరికొంత మంది పిల్లలను కూడా అతడు వలలో వేసుకున్నాడు.

అటార్నీ కేరీ గోల్డ్‌బర్గ్
ఫొటో క్యాప్షన్, అటార్నీ కేరీ గోల్డ్‌బర్గ్

ఒమేగల్‌పై కేసు

ఫోర్డిస్ జైలుకు వెళ్లిన తర్వాత, ప్రస్తుతం ఒమేగల్‌పై అలిస్ కేసు పెట్టారు. టెక్ సైట్‌పై ప్రొడక్ట్ లయబిలిటీ లాసూట్ పేరుతో కోర్టులో కేసు వేయడం ఇదేమీ తొలిసారి కాదు.

ఇదివరకు ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌లపైనా ఇలాంటి కేసులు వేశారు. కానీ, ‘‘ఏఎం వర్సెస్ ఒమేగల్’’గా పిలుస్తున్న తాజా కేసుతో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశముంది.

‘‘అమెరికాలో కమ్యూనికేషన్స్ డీసెన్సీ యాక్ట్‌లోని సెక్షన్ 230 ప్రకారం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌పై కేసు వేయడం చాలా కష్టం. కానీ, ఎలాగైనా అలిస్‌కు న్యాయం జరగాలని మేం భావించాం’’అని అలిస్ అటార్నీ కేరీ గోల్డ్‌బర్గ్ వివరించారు.

ఒమేగల్ వల్ల చాలా మంది పిల్లలు ఇలా వేధింపులకు గురయ్యే అవకాశముందని, అసలు వయసు వెరిఫికేషన్, హెచ్చరికలు లాంటివేమీ కనిపించడంలేదని ఆమె చెప్పారు.

ఈ కేసుతో ఒమేగల్ డిజైన్‌ మారడంతోపాటు అలిస్‌కు పరిహారం కూడా వస్తుందని ఆమె వివరించారు.

ఒమేగల్‌

ఈ కేసుతో డేటింగ్ సైట్లలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశముందని న్యాయ కోవిదులు అభిప్రాయపడుతున్నారు.

‘‘ఈ కేసులో బాధితురాలికి న్యాయం జరిగితే, మరికొంత మంది బాధితులు ఇలాంటి కేసులతో ముందుకు వచ్చే అవకాశముంది’’అని ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటాపై కేసు వేసేందుకు ప్రయత్నిస్తున్న డాక్టర్ లీజా లోవ్‌దాల్ అన్నారు. బ్రిటన్‌లో అన్‌ఫెయిర్ కాంపిటీషన్‌పై మెటాపై ఆయన కేసు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ కేసులతో వెబ్‌సైట్లలో వచ్చే మార్పులు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ కనిపించే అవకాశముంది.

మరోవైపు బ్రిటన్‌లో ఆన్‌లైన్ సేఫ్టీ బిల్లుకు ఆమోదం లభిస్తే, అక్కడ కూడా ఒమేగల్‌పై కేసులు వచ్చే అవకాశముంది. పిల్లలపై వేధింపులకు పాల్పడకుండా చర్యలు తీసుకోకపోతే భారీ జరిమానాలు విధిస్తామని ఈ బిల్లులో ఉంది.

లీఫ్ బ్రూక్స్

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, లీఫ్ బ్రూక్స్

ఒమేగల్ సృష్టికర్త ఏమంటున్నారు?

మరోవైపు తాజా కేసులో అలిస్‌కు జరిగిన దానికి ఒమేగల్‌ను బాధ్యత వహించమనడం సరికాదని ఆ సంస్థ తరఫున ప్రతినిధులు కోర్టులో వాదిస్తున్నారు. పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారిని అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలను కూడా ఖండిస్తున్నారు.

అయితే, గత రెండేళ్లలోనే దాదాపు 50కిపైగా పిల్లలపై లైంగిక వేధింపుల కేసులు ఒమేగల్‌పై నమోదయ్యాయి. అమెరికాలో 20తోపాటు బ్రిటన్, ఆస్ట్రేలియా, స్పెయిన్, కొలంబియా, సైప్రస్‌లలో ఇవి నమోదయ్యాయి.

వెబ్‌సైట్ సృష్టికర్త లీఫ్ బ్రూక్స్.. అలిస్ కేసుపై మాట్లాడేందుకు సుముఖత వ్యక్తంచేయలేదు.

మరోవైపు ఆయనతో మాట్లాడేందుకు ద ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్ కూడా ప్రయత్నించింది. కానీ, స్పందన లేదు. ప్రతి వారం తమకు ఒమేగల్‌లోని పిల్లల లైంగిక వేధింపుల సమాచారం తొలగించాలని 20కిపైగా అభ్యర్థనలు వస్తుంటాయని ఫౌండేషన్ తెలిపింది.

అయితే, ఒమేగల్‌ను ఉపయోగించేవారే దానిలో లైంగిక వేధింపులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని బ్రూక్స్ ఒక ప్రటకన విడుదల చేశారు. పిల్లల విషయంలో తాము మరింత అప్రమత్తంగా ఉంటామని వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ మోడరేటర్లతో ఎప్పటికప్పుడు కంటెంట్‌ను పరిశీలిస్తుంటామని, అధికారులకు కూడా సహకరిస్తున్నామని తెలిపారు.

అయితే, ఒమేగల్ ఐపీ అడ్రస్‌లు ఇవ్వడంతో కొంతమంది లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై అధికారులు చర్యలు తీసుకున్న మాట వాస్తవమే.

మరోవైపు అలిస్ కేసు నడుమ, సైట్‌లోకి అడుగుపెట్టేవారు 18 ఏళ్లకు పైబడిన వారిమని ధ్రువీకరించేలా ఒక అప్షన్‌ను కూడా ఒమేగల్ తీసుకొచ్చింది.

అయితే, ఇది సరిపోదని అలిస్ అంటున్నారు. పూర్తిగా సంస్థను మూసేయాలని ఆమె కోరుతున్నారు.

(నోట్: అలిస్ పేరు మార్చాం)

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)