బెలూన్లు, డ్రోన్లు, శాటిలైట్లు... పరాయి దేశాల మీద గూఢచర్యం కోసం వీటిని ఎలా వాడతారు?

స్పై బెలూన్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పెట్రా జివిక్
    • హోదా, బీబీసీ న్యూస్

అమెరికాలోని మోంటానాలో రోజులపాటు ప్రజలను ఆందోళనకు గురిచేసిన తెల్లని స్పై బెలూన్‌ను కూల్చివేసిన తర్వాత అలాంటి మరో మూడు పరికరాలను కూల్చివేశారు.

అయితే, వాటి గురించి బయట అందుబాటులోనున్న సమాచారం చాలా తక్కువ. అసలు అవి ఏమై ఉంటాయని మీడియాలో చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తాజాగా అమెరికా-కెనడా సరిహద్దుల్లోని మిషిగన్‌లోని లేక్ హ్యూరాన్ సమీపంలో కూల్చివేసిన పరికరాన్ని ‘‘ఆక్టోగోనల్ స్ట్రక్చర్’’గా అమెరికా రక్షణ రంగ అధికారులు వివరించారు.

‘‘గ్యాస్‌తో ముందుకు వెళ్లే బెలూన్’’ లేదా ‘‘ఒక ప్రొపల్షన్ వ్యవస్థతో నడిచే’’ ఆ పరికరం 6100 మీటర్ల ఎత్తులో వెళ్తున్నప్పుడు తాము గుర్తించినట్లు ఒక అధికారి తెలిపారు.

‘‘అది ఏమిటో ఇప్పుడే మేం చెప్పలేం’’అని అమెరికా నార్తర్న్ కమాండ్ కమాండర్ జనరల్ గ్లెన్ వ్యారెక్ చెప్పారు. అయితే, దాని నుంచి ఎలాంటి ముప్పూలేదని ఆయన స్పష్టంచేశారు.

‘‘గత రెండు వారాలుగా చోటుచేసుకుంటున్నవన్నీ చాలా వింతగా అనిపిస్తున్నాయి’’అని మోంటానాకు చెందిన డెమొక్రటిక్ సెనేటర్ జాన్ టెస్టెర్ బీబీసీతో వ్యాఖ్యానించారు.

స్పై బెలూన్లు

ఫొటో సోర్స్, Reuters

అసలు అమెరికా వేటిని కూల్చివేసింది?

అమెరికా, కెనడా సరిహద్దుల్లో కూల్చివేసిన పరికరాల అవశేషాలను సేకరించేందుకు ఇంకా అధికారులు ప్రయత్నిస్తున్నారు. వీటిని విశ్లేషించిన తర్వాతే అసలు అవేమిటో స్పష్టత వచ్చే అవకాశముంది.

‘‘ఈ పరికరాలు ఏదైనా డేటాను సేకరించాయా? ఆ డేటాను మళ్లీ మనం తీసుకోవడానికి వీలు పడుతుందా?’’లాంటి అంశాలపై ఇప్పుడు దర్యాప్తు చేపట్టే అవకాశముందని బ్రాడ్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం ప్రొఫెసర్ క్రిస్టోఫ్ బ్లథ్ చెప్పారు.

గత శుక్రవారం అలస్కాలో, శనివారం వాయువ్య కెనడాలోని యూకోన్‌లో రెండు పరికరాలను అమెరికా అధికారులు కూల్చివేశారు. అయితే, ఆదివారం మిషిగన్‌లో కూల్చివేసిన పరికరాన్ని నిఘా కోసం ఉపయోగించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.

‘‘ఇవి ఒక్కోటి ఒక్కోలా కనిపిస్తున్నాయి. మొదటి బెలూన్‌తో పోలిస్తే ఇవి చాలా చిన్నవి. ఆ అవశేషాలను పరిశీలిస్తేనేగానీ అవేంటో చెప్పలేం’’అని వైట్‌హౌస్ నేషనల్ సెక్యూరిటీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

ఆయన చెబుతున్న ఆ బెలూన్ చైనా గూఢచర్య బెలూన్. ఇది అలస్కాలో జనవరి 28న మొదట కనిపించింది. అయితే, దక్షిణ కరోలినా తీరంలో ఫిబ్రవరి 4న దాన్ని ఎఫ్-22 యుద్ధ విమానం కూల్చివేసింది.

ఆ బెలూన్ చైనా నుంచి వచ్చిందని, సున్నితమైన సమాచారాన్ని అది సేకరిస్తోందని అధికారులు వెల్లడించారు.

స్పై బెలూన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఆ బెలూన్లు ఎందుకు ఉపయోగిస్తారు?

‘‘ఇలాంటివి ముందు కూడా జరిగాయి. ట్రంప్ హయాంలోనూ మూడు బెలూన్లు కనిపించాయి. అయితే, వాటిని అమెరికా గగనతలం దాటిన తర్వాతే గుర్తించారు’’అని రాయల్ యునైటెడ్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్‌లో విశ్లేషకురాలు జూలియానా సూయెస్ చెప్పారు.

మూడు బస్సుల పరిమాణంలోనుండే ఆ బెలూన్ బరువు టన్ను కంటే ఎక్కువే ఉంటుందని, దానిపై కొన్ని యాంటెన్నాలు, సోలార్ ప్యానెల్స్ ఉన్నాయని పెంటగాన్ వెల్లడించింది.

‘‘బెలూన్లను గూఢచర్యం కోసం ఉపయోగించడం చాలా అరుదు. ఎందుకంటే ఇవి చాలా నెమ్మదిగా కదులుతాయి. వీటిని పాతబడిన టెక్నాలజీగా ప్రజలు భావిస్తున్నారు’’అని ప్రొఫెసర్ బ్లథ్ వివరించారు. అయితే, 18వ శతాబ్దం నుంచి ఇలాంటి బెలూన్లను ఉపయోగిస్తున్నారు.

‘‘ఫ్రెంచ్ విప్లవం నాటి నుంచి ఇలాంటి బెలూన్లను ఉపయోగిస్తున్నారు’’అని సూయెస్ వివరించారు. ‘‘నేడు మనకు ఆకాశంలో కనిపిస్తున్న వాటితో పోలిస్తే, తొలి తరం నాటివి చాలా ప్రాథమికంగా ఉండేవి’’అని ఆమె చెప్పారు.

‘‘నేడు వాటిని హైడ్రోజన్‌కు బదులుగా హీలియంతో నింపుతున్నారు. ఇవి పగటిపూట వ్యాకోచించి పైకి వెళ్తాయి. రాత్రిపూట కిందకు వస్తాయి. లోపల హీలియం ఉండేవరకు అవి ఎగురుతూనే ఉంటాయి’’అని ఆమె తెలిపారు.

గూఢచర్య చేసేందుకు వాడే బెలూన్లలో రాడార్‌ లేదా కమ్యూనికేషన్ పరికరాలు లేదా కెమెరాలు ఉంటాయి.

‘‘ఇటీవల కాలంలో బెలూన్‌లు కాస్త వెనుకబడ్డాయి. ఎందుకంటే నేడు శాటిలైట్ టెక్నాలజీ మనకు అందుబాటులోకి వచ్చింది. ఇది చాలా అధునాతమైనది. నేలపై నుండే చిన్నచిన్న వస్తువులను కూడా ఈ టెక్నాలజీతో ఫొటోలు తీయొచ్చు’’అని ప్రొఫెసర్ బ్లథ్ చెప్పారు.

అయితే, ఈ కాలంలోనూ అలాంటి బెలూన్లను ఎందుకు ఉపయోగిస్తున్నారు?

‘‘పైనుంచి మనకు వస్తువులు ఎలా కనిపిస్తున్నాయనేది ఆ వస్తువుకు, పైనుండే పరికరానికి మధ్య దూరంపై ఆధారపడి ఉంటుంది. బెలూన్లతో పోల్చినప్పుడు ఉపగ్రహాలు చాలా పైన ఉంటాయి. మనం ఎంత దగ్గర నుంచి చూస్తే అంత మెరుగ్గా ఉంటుంది’’అని బ్లథ్ తెలిపారు.

స్పై బెలూన్లు

ఫొటో సోర్స్, Getty Images

గూఢచర్యానికి ఇంకా ఏం ఉపయోగిస్తుంటారు?

అమెరికా రక్షణ శాఖ సమాచారం ప్రకారం చైనాకు 300 ఉపగ్రహాలతో అంతరిక్షంలో పటిష్ఠమైన నిఘా వ్యవస్థ ఉంది. ఉపగ్రహాల నెట్‌వర్క్‌లో అమెరికా తర్వాత స్థానం చైనాదే.

అయితే, ఉపగ్రహాలతో పోల్చినప్పుడు బెలూన్లు మెరుగ్గా పనిచేస్తాయని సూయెస్ చెప్పారు.

‘‘వీటి ధర తక్కువ. చాలా వేగంగానే వీటిని అవసరమైన పనులకు ఉపయోగించుకోవచ్చు. ఉపగ్రహాలు నిర్దేశిత మార్గాల్లో మాత్రమే ముందుకు వెళ్తాయి. కానీ, బెలూన్లు అలా కాదు. మనం కావాలంటే ఒకే ప్రాంతంపై మళ్లీమళ్లీ పంపొచ్చు. ఎక్కువ సమయం సర్వే చేపట్టొచ్చు’’అని సూయెస్ వివరించారు.

అయితే, కొన్నిసార్లు ఉపగ్రహాలను కూడా ఇలానే కూల్చివేసిన సందర్భాలు ఉన్నాయి.

‘‘అయితే, అవి వారి సొంత ఉపగ్రహాలై ఉంటాయి. చైనా ఇలానే తమ సొంత ఉపగ్రహాలను కూల్చివేసింది. రష్యా కూడా. అయితే, వేరే దేశాల ఉపగ్రహాలను ఎవరూ కూల్చివేయలేదు’’అని సూయెస్ తెలిపారు.

మరోవైపు నిఘా కోసం ఇటీవల కాలంలో డ్రోన్లను కూడా ఉపయోగించడం ఎక్కువైందని సూయెస్ అన్నారు. అయితే, వీటిని ఎక్కువగా తమ భూభాగంలో నిఘా కోసమే ఉపయోగిస్తుంటారని తెలిపారు.

స్పై బెలూన్లు

ఫొటో సోర్స్, Reuters

ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఇలాంటి మరికొన్ని నిఘా పరికరాలను కూడా ఉపయోగించారు.

‘‘అప్పట్లో అమెరికా ఫైర్ ప్లేన్‌లను ఉపయోగించేది. వీటిలో చాలా వాటిని సోవియట్ యూనియన్ కూల్చివేసేది’’అని బ్లథ్ వివరించారు.

‘‘గూఢచర్య విమానాలను పంపించడాన్ని తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడంగా పరిగణించేవారు. అయితే, భూ పరిశీలనా ఉపగ్రహాలను మాత్రం రెండు వైపులా ఉపయోగించేవారు’’అని ఆయన తెలిపారు.

‘‘కొన్నింటిని ఉపయోగించకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉండేవి. విదేశీ బెలూన్లను మాత్రం అమెరికా ఎప్పుడూ అనుమతించేదికాదు’’అని ఆయన వివరించారు. అయితే, ఇప్పటికీ చాలా దేశాలు గూఢచర్య విమానాలను ఉపయోగిస్తున్నాయి.

‘‘అమెరికా కూడా చాలా గూఢచర్య విమానాలను ఉపయోగిస్తుంది. ఇవి ఇతర దేశాల సరిహద్దుల్లోకి వెళ్తాయి. అయితే, ఒక్కోసారి వీటిని కూల్చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఒక అమెరికా నిఘా విమానాన్ని చైనా ఇలానే కూల్చివేసింది. ఈ ఘటన బుష్ హయాంలో జరిగింది’’అని బ్లథ్ గుర్తుచేసుకున్నారు.

వీడియో క్యాప్షన్, చైనా అణచివేత చట్టాల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న హాంగ్ కాంగ్ ప్రజలు

పరిణామాలు ఎలా ఉంటాయి?

మొత్తంగా వారాల్లోనే నాలుగు పరికరాలను నేలకూల్చడంతో అమెరికా సైనిక విభాగం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

మొదటి బెలూన్ వల్ల బీజింగ్‌కు వెళ్లాల్సిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్ పర్యటన రద్దయింది. అయితే, ఆ బెలూన్‌ను గూఢచర్యానికి ఉపయోగించారనే వాదనను చైనా ఖండిస్తూ వచ్చింది. అది కేవలం వాతావరణాన్ని పరిశీలించే బెలూన్ అని చైనా పేర్కొంది.

మరోవైపు అమెరికా బెలూన్లు కూడా గత ఏడాది సమయంలో పది కంటే ఎక్కువసార్లే తమ గగనతలంలోకి వచ్చినట్లు చైనా విదేశాంగ శాఖ వివరించింది.

అయితే, కూల్చివేసిన మూడు పరికరాలను దేనికోసం ఉపయోగించారనే అంశంపై ప్రస్తుతం అమెరికా అధికారులు దృష్టిసారిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, చైనా- తైవాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల భారత్- తైవాన్ వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయా.?

‘‘అవి చాలా తక్కువ ఎత్తులో కనిపించాయి. విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తాయనే ఉద్దేశంతో వాటిని కూల్చేవేశాం’’అని ఒక అధికారి చెప్పారు.

అయితే, బెలూన్ కూల్చివేతతో కొత్త నిబంధనలు, ఆంక్షలు విధించే అవకాశముందని బ్లథ్ వివరించారు.

‘‘ఒకవేళ నిజంగా ఇవి వాతావరణవాన్ని పరిశీలించే బెలూన్‌లు అయితే, ముందే సమాచారం ఇచ్చేలా రెండు దేశాలూ అంగీకారానికి రావచ్చు’’అని ఆయన అన్నారు.

సాధారణ ప్రజలు ఇలాంటివి పెద్దగా పట్టించుకోరని సూయెస్ అన్నారు. ‘‘అసలు ఎన్ని ఉపగ్రహాలున్నాయి? ఎన్ని తమ ఫొటోలు తీసుకుంటున్నాయి? ఎంత సమాచారం సేకరిస్తున్నాయి? లాంటివి వివాదం వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు చూస్తారు. ఆ తర్వాత మరిచిపోతారు’’అని ఆమె వివరించారు.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)