చాట్‌ జీపీటీ కి పోటీగా వస్తున్న 'గూగుల్ బార్డ్' ప్రత్యేకతలు ఏమిటి?

Google Bard

ఫొటో సోర్స్, Getty Images

చాట్‌జీపీటీ‌ని పలువురు భవిష్యత్ సెర్చ్ ఇంజిన్‌గా అభివర్ణిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారైన ఈ చాట్‌బాట్ మీరు అడిగే ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం ఇవ్వగలదు.

ఇది గూగుల్ ఉనికికి అతిపెద్ద ముప్పు అని జీమెయిల్ పితామహుడు పాల్ బుచిత్ అభిప్రాయపడ్డారు. సెర్చ్ ఇంజిన్ పేజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముగించేస్తుందని పాల్ జోస్యం చెబుతున్నారు. "గూగుల్‌కు ముప్పు కేవలం ఒకటి లేదా రెండేళ్ల దూరంలోనే ఉంది" అని వ్యాఖ్యానించారు పాల్.

అయితే ఈ విపత్తును ఎదుర్కోవడానికి గూగుల్ సిద్ధమవుతోందని పాల్ బుచిత్‌కు తెలియకపోవచ్చు. గూగుల్ తన సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది.

గూగుల్ దీనికి బార్డ్ అని పేరు పెట్టింది. ఈ చాట్‌బాట్‌ను విడుదల చేసే ముందు, దీన్ని ఒక ప్రత్యేక గ్రూపు పరీక్షించనుంది. ఈ మేరకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఒక ప్రకటన చేశారు.

"ఇపుడు మనం పనిచేస్తున్న వాటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ లోతైన టెక్నాలజీ. వైద్యులు తొందరగా వ్యాధులను నిర్ధారించడం నుంచి ప్రజలకు వారి సొంత భాషలో సమాచారాన్ని అందించడం వరకు దీని ద్వారా సాధ్యపడుతోంది. గత రెండేళ్లుగా లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్ (ఎల్ఏఎండీఏ) ద్వారా కొత్త ఆర్టిఫిషియల్ సర్వీస్‌పై పని చేస్తున్నాం. మేం ఈ కొత్త ఏఐ టెక్నాలజీని బార్డ్ అని పిలుస్తున్నాం. ఈ రోజు మేం ఈ దిశలో మరో అడుగు వేశాం. మేం దానిని పబ్లిక్ చేసే ముందు టెస్టులకు పంపిస్తున్నాం. భవిష్యత్తులో అందరికీ అందుబాటులో ఉంటుంది" అని సుందర్ పిచాయ్ తన ప్రకటనలో చెప్పారు.

Chat GPT

ఫొటో సోర్స్, Getty Images

చాట్‌జీపీటీ ఓ చాట్‌ బాట్

చాట్‌బాట్ చాట్ జీపీటీ చాలా కచ్చితమైన కంటెంట్‌ను ఇస్తుంది. మనుషులు రాసినట్లే కనిపిస్తుంది. ఈ కొత్త టూల్ గూగుల్‌కు ముప్పుగా పరిణమించవచ్చనే చర్చ గత కొన్ని రోజులుగా జరుగుతోంది.

రెండేళ్లలో ఈ సాధనం గూగుల్‌ను నాశనం చేయగలదని జీమెయిల్ వ్యవస్థాపకుడు పాల్ టాక్ కొంతకాలం క్రితం చెప్పారు.

మీరు ఇంటర్నెట్‌లో చాట్‌జీపీటీ‌పై సమీక్షలను చదివితే 'ప్రమాదం' అనే పదాన్ని పదే పదే ప్రస్తావించడం మీకు కనిపిస్తుంది. ఈ ప్రోగ్రాం మానవ మేధస్సును వేగంగా కాపీ చేస్తోందని చాలా మంది భావిస్తున్నారు.

ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించే మరో చాట్‌బాట్ మార్కెట్లో ఉంది. దాని వెనుక గూగుల్ వంటి పెద్ద కంపెనీ ఉంది.

గూగుల్ బార్డ్ చాట్‌బాట్ గురించి ఒక ఇంజనీర్ మాట్లాడుతూ ఇది మానవ మెదడులా సున్నితంగా ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదని తెలిపారు.

గూగుల్ తన ప్రస్తుత సెర్చ్ ఇంజిన్‌కు కొత్త ఏఐ టూల్స్‌ను కూడా జోడిస్తోంది. వ్యక్తుల ప్రశ్నలకు ఇంటర్నెట్‌లోని డేటాబేస్‌ల నుంచి నాలెడ్జ్ బేస్ ఉపయోగించి చాట్‌బాట్‌లు సమాధానం ఇస్తాయి.

అయితే చాట్‌బాట్ కొన్నిసార్లు అభ్యంతరకరమైన, తప్పుడు సమాచారాన్ని ఇస్తుందనే వాదనలు కూడా వస్తున్నాయి.

Google

ఫొటో సోర్స్, Getty Images

సెర్చ్ ఇంజిన్‌లో మార్పులకు కారణమేంటి?

తన ఏఐ బార్డ్ 'గూగుల్ లాంగ్వేజ్ మోడల్ ప్రపంచంలోని జ్ఞానాన్ని సృజనాత్మకతతో కలపడం' ద్వారా ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇస్తుందని సుందర్ పిచాయ్ తన ప్రకటనలో తెలిపారు.

తాము బార్డ్‌ని నిర్భయమైన, బాధ్యతాయుతమైన సర్వీస్‌గా మార్చాలనుకుంటున్నామని గూగుల్ చెబుతోంది.

అయితే హానికరమైన లేదా అభ్యంతరకరమైన సమాచారం కట్టడిపై కంపెనీ నోరెత్తలేదు.

మైక్రోసాఫ్ట్ తమ సెర్చ్ ఇంజిన్ బింగ్‌తో పనిచేసే ఏఐ చాట్‌బాట్‌ను కూడా తీసుకువస్తోందని వార్తలు వస్తున్న తరుణంలో గూగుల్ బార్డ్ ప్రకటన వచ్చింది.

చాట్‌జీపీటీ మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు, ప్రసంగాలు, కవితలు, మార్కెటింగ్ కోప్, వార్తా కథనాలు, మీ కోసం వ్యాసాలను కూడా రాయగలదు.

ప్రస్తుతం ఇది ఉచితం, అయితే ఎవరైనా చాట్‌జీపీటీలో ప్రశ్న అడిగినప్పుడల్లా ఆ సంస్థ పేరెంట్ కంపెనీ ఓపెన్‌ఏఐ కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Microsoft

ఫొటో సోర్స్, Getty Images

ఓపెన్‌ఏఐ ఇటీవలే సభ్యత్వాన్ని కూడా ప్రకటించింది.

కానీ చాట్‌బాట్‌ల అంతిమ లక్ష్యం 'ఇంటర్నెట్ సెర్చ్' పూర్తిగా మార్చేయడం.

మీరు సెర్చ్ ఇంజిన్‌లో ఏదైనా వెతికితే మీకు ఇంటర్నెట్ పేజీల రూపంలో మిలియన్ల కొద్దీ సమాధానాలు లభిస్తాయి.

కానీ, చాట్‌బాట్ మీ సెర్చ్‌కు కచ్చితమైన సమాధానం ఇస్తుంది. వెయ్యి పేజీలు ఇచ్చి కావాల్సింది ఎంపిక చేసుకోమనదు.

గూగుల్‌లో యూజర్లు ఇప్పుడు చాలా భిన్నంగా ప్రశ్నలు అడుగుతున్నారని ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ గుర్తుచేస్తున్నారు.

"ఇంతకుముందు పియానోలో ఎన్ని కీలు ఉన్నాయో గూగుల్‌లో సెర్చ్ చేసేవారు. కానీ ఇప్పుడు గిటార్ నేర్చుకోవడం కష్టమా లేదా పియానోనా? ​​అని వెతుకుతున్నారు'' అని సుందర్ తెలిపారు.

ఈ ప్రశ్నకు త్వరిత వాస్తవిక సమాధానం ఇవ్వడం ప్రస్తుతం ఉన్న సెర్చ్ ఇంజిన్‌లో సాధ్యం కాదు.

అయితే, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో చాట్‌బాట్‌లు ప్రభావవంతంగా ఉండే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)