పురుషుల సంతాన నిరోధక మాత్రలు ఎలా పని చేస్తాయి... సెక్స్‌కు ఎన్ని గంటల ముందు వేసుకోవాలి?

శుక్రకణాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మిషెల్ రాబర్ట్స్
    • హోదా, డిజిటల్ హెల్త్ ఎడిటర్

వీర్యంలో శుక్రకణాలు ఈత కొట్టకుండా ఆపగలిగే కణమార్గాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. హార్మోన్లతో సంబంధంలేకుండా పురుషుల సంతానోత్పత్తి నిరోధక మాత్రల తయారుచేయడంలో ఇది కీలక అడుగు అవుతుందని చెప్తున్నారు.

దీనికి సంబంధించి ఎలుకపై జరిపిన ప్రయోగాలలో శుక్రకణాలు అండాన్ని చేరుకోకుండా కొన్ని గంటల పాటు ఆపడంలో శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు. మరింతగా దీనిపై ప్రయోగాలు చేయనున్నారు శాస్త్రవేత్తలు.

మనుషులపై ప్రయోగాలు చేయడానికి ముందు కుందేళ్లపైనా ఈ పరీక్షలు చేపడతారు.

మనుషులపై ప్రయోగాలు చేసేటప్పుడు.. ప్రయోగదశలో ఉన్న ఈ పురుష సంతాన నిరోధక మాత్రలను సెక్స్‌కు కొన్ని గంటల ముందు వేసుకున్నాక దాని ప్రభావం ఎన్ని గంటల వరకు ఉంటుందో చూస్తారు.

శుక్రకణాలు

ఫొటో సోర్స్, Getty Images

మహిళలు వేసుకునే గర్భనిరోధక మాత్రలలో హార్మోన్లు ఉంటాయి. కానీ, ఈ పురుష గర్భనిరోధక మాత్రలలో హార్మోన్లు ఉండవు.

హార్మోన్ రహిత మాత్రలు కావడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండబోవని.. హార్మోన్లు లేకపోవడం వల్ల పురుషుల్లోని టెస్టోస్టెరాన్‌పై ప్రభావం పడడం, టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవడంలాంటివి జరగవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

శుక్రకణాలకు సంకేతాలు అందడంలో తోడ్పడే ప్రోటీన్ అయిన సాల్యుబుల్ అడినలిల్ సైక్లేస్(ఎస్ఏసీ)ను లక్ష్యంగా చేసుకుని ఈ మందు పనిచేస్తుంది.

ఈ మాత్ర వేసుకుంటే ఎస్ఏసీ నుంచి సంకేతాలు అందకుండా బ్లాక్ చేస్తుంది.

సంతాన నిరోధక మాత్రలు (ప్రతీకాత్మక చిత్రం)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సంతాన నిరోధక మాత్రలు (ప్రతీకాత్మక చిత్రం)

అంతకుముందు యూఎస్ నేషనల్ హెల్త్ ఇనిస్టిట్యూట్ ఎలుకలపై చేసిన అధ్యయనంలో ‘టీడీఐ 11861’ అనే ఈ మందును ఎలుకలపై ప్రయోగించారు.

ఈ మాత్ర వేసుకున్న తరువాత సెక్స్‌కు ముందు కానీ, సెక్స్ సమయంలో కానీ, సెక్స్ తరువాత కానీ వీర్య కణాల కదలికలు ఆగిపోయాయి.

ఈ మాత్ర ప్రభావం సుమారు 3 గంటల పాటు ఉంది. దీని ప్రభావం పూర్తిగా తొలగడానికి 24 గంటలు పట్టినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ మాత్ర వేసుకుంటే వీర్య కణాల కదలిక పూర్తిగా ఆగిపోదని, మాత్ర ప్రభావం ఉన్నంత వరకే కదలిక ఆగుతుందని, తరువాత మామూలైపోతుందని, దీన్ని సులభంగా వాడుకోవచ్చని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న సైంటిస్ట్ డాక్టర్ మెలానీ చెప్పారు.

ఇది మనుషుల్లోనూ ఇలాంటి ఫలితాలే ఇస్తే అప్పుడు పురుషులు దీన్ని ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకోవచ్చని చెప్పారు. సంతానోత్పత్తికి సంబంధించి నిర్ణయాలు ఎప్పటికప్పుడు తీసుకోవచ్చన్నారు.

కండోమ్

ఫొటో సోర్స్, Getty Images

లైంగికంగా సంక్రమించే వ్యాధుల నుంచి రక్షణ ఇవ్వదు

ఇది కేవలం సంతాన నిరోధక మాత్ర మాత్రమే అని, ఇది వేసుకోవడం వల్ల లైంగికంగా సంక్రమించే వ్యాధుల నుంచి రక్షణ ఉండదని చెప్పారు మెలానీ.

లైంగికంగా సంక్రమించే వ్యాధుల నుంచి రక్షణ కావాలంటే కండోమ్ వాడడమే సరైన మార్గమని చెప్పారు.

కాగా మరికొందరు పరిశోధకులు వీర్యం ఉపరితలంపై ఉండే మరో ప్రోటీన్‌ను నిరోధించడం ద్వారా సంతానోత్పత్తి నిరోధక మాత్రలను తయారుచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)