సౌమ్య తివారీ: బట్టలు ఉతికే కర్రతో క్రికెట్ ప్రాక్టీస్ చేసే దశ నుంచి అండర్-19 జట్టు వైస్ కెప్టెన్ దాకా...

సౌమ్య తివారీ

ఫొటో సోర్స్, TWITTER/ARMAN SHAMDAR

    • రచయిత, కీర్తి
    • హోదా, బీబీసీ కోసం

‘‘ఇంటి దగ్గర బట్టలు ఉతికే లాండ్రీ బ్యాట్‌తో సౌమ్య ప్రాక్టీస్ చేసేది. మొదట అక్క సాక్షితో ఇంట్లోనే ఆమె క్రికెట్ ఆడేది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి గ్రౌండ్‌కు వెళ్లి ఆడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత అక్కే సౌమ్యను అరెరా క్రికెట్ క్లబ్‌కు తీసుకెళ్లింది. నేడు అండర్-19 క్రికెట్‌ జట్టుకు సౌమ్య వైస్ కెప్టెన్ అయ్యింది.’’

స్కూటర్‌పై వెళ్తూ సౌమ్య తండ్రి మనీష్ తివారీ తన కుమార్తె గురించి చాలా విషయాలు వెల్లడించారు.

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు చెందిన ఆల్ రౌండర్ సౌమ్య తివారీ భారత క్రికెట్ మహిళల అండర్-19 జట్టుకు వైస్ కెప్టెన్ అయ్యారు. తన కుమార్తె విషయంలో మనీష్ చాలా గర్వంతో ఉండటం సహజం.

టీమ్ ఇండియా బ్లూ జెర్సీ వేసుకున్న మధ్యప్రదేశ్‌కు చెందిన తొలి మహిళా క్రికెటర్ సౌమ్య. అరెరా క్రికెట్ అకాడమీ నుంచి భారత జట్టు వరకు ఆమె కేవలం ఆరేళ్ల సమయంలోనే చేరుకున్నారు.

కలెక్టర్ ఆఫీసులోని ఎన్నికల విభాగం సూపర్‌వైజర్‌గా సౌమ్య తండ్రి మనీష్ పనిచేస్తున్నారు. ఆయన కూడా క్రికెట్ బాగా ఆడేవారు. అయితే, ఒక రోడ్డు ప్రమాదంలో ఒక కాలుకు దెబ్బ తగిలింది. దీంతో ఫ్రొఫెషనల్ క్రికెట్‌లో ఆడాలనే ఆయన కల కలగానే మిగిలిపోయింది. అయితే, నేడు తన కుమార్తె ఆ కలను నిజం చేస్తోంది.

సౌమ్య తివారీ (ఎడమ ), హర్లీ

ఫొటో సోర్స్, TWITTER/SHAYAN ACHARYA

ఫొటో క్యాప్షన్, సౌమ్య తివారీ (ఎడమ ), హర్లీ

ఎలా మొదలైంది?

‘‘మేం పాత భోపాల్‌లోని షాజహానాబాద్‌లో జీవించేవాళ్లం. అయితే, 2000లో మేం గౌతమ్ నగర్‌కు వచ్చేశాం. నాకు క్రికెట్ ఆడటం, చూడటం అంటే చాలా ఇష్టం. అలానే మా ఇంట్లో అందరికీ క్రికెట్‌పై విపరీతమైన అభిమానం పెరిగింది’’అని మనీష్ వెల్లడించారు.

‘‘ఇంట్లో బట్టలు ఉతికే కర్ర, ప్లాస్టిక్ బాల్స్‌తో సౌమ్య క్రికెట్ ఆడేది. 5 ఏళ్ల వయసులోనే చుట్టుపక్కల పిల్లలు క్రికెట్ ఆడుతుంటే చూసి ప్యాడ్లు, హెల్మెట్లు వేసుకోవడంపై తను కూడా ఆసక్తి చూపించేది. 2016లో వేసవి సెలవుల్లో అక్క ఆమెను ఒక సమ్మర్ క్యాంప్‌కు తీసుకెళ్లింది’’అని ఆయన చెప్పారు.

‘‘ఆ మరుసటిరోజు ఇంటికి వచ్చిన వెంటనే, మాకు క్రికెట్ కిట్ కావాలని తను పట్టుపట్టింది. నేను అలా కాదని చెప్పడానికి ప్రయత్నించాను. కానీ, తను మొండి పట్టుపట్టింది. మేం ఆ కిట్‌తోనే రావాలని సర్ మాకు చెప్పారని తను పదేపదే చెప్పింది. దీంతో మార్కెట్‌లోని అతితక్కువ ధరకు దొరికే ఒక కిట్ కొనిచ్చాను. మేం ఒక ప్యాడ్, కార్క్ బాల్‌తో ఆడేవాళ్లం. కానీ, సౌమ్యకు మాత్రం పూర్తి కిట్ తెచ్చి ఇచ్చాను’’అని ఆయన తెలిపారు.

సౌమ్య ఆల్‌రౌండర్. ఫాస్ట్‌ బౌలింగ్‌తోపాటు స్పిన్ కూడా ఆమె వేయగలదు. ఆమె కెరియర్ ఆరేళ్లలోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంలో ఆమె కోచ్ సురేశ్ చెనానీ ప్రధాన పాత్ర పోషించారు.

‘‘మొదట సౌమ్య అక్క తనను ఇక్కడకు తీసుకొచ్చింది. అప్పుడు సౌమ్యకు నేను కోచింగ్ ఇవ్వనని చెప్పాను’’అని సురేశ్ వివరించారు.

‘‘నేను 2000లో అమ్మాయిలకు కోచించ్ ఇచ్చేవాడిని. అప్పట్లోనే శ్వేత మిశ్ర అనే అమ్మాయికి అండర్-19లో చోటు ఇస్తారని మేం బలంగా నమ్మాం. కానీ, మాకు నిరాశే ఎదురైంది. మరో అమ్మాయి విషయంలోనూ మాకు ఇలానే జరిగింది. దీంతో నేను గుండెను రాయి చేసుకున్నాను’’అని ఆయన చెప్పారు.

‘‘అందుకే మొదట సౌమ్యకు కోచింగ్ ఇవ్వడానికి నేను నిరాకరించాను. తను పట్టుబట్టింది. నేను మీ దగ్గరే కోచింగ్ తీసుకుంటానని భీష్మించుకొని కూర్చుంది. ఆమె మళ్లీమళ్లీ వచ్చేది. దీంతో ఆమెను జూనియర్‌ గ్రూపులో చేర్చుకున్నాను’’అని ఆయన తెలిపారు.

శ్వేత షేర్వాట్‌తో సౌమ్యా తివారీ (కుడి)

ఫొటో సోర్స్, TWITTER/BCCI WOMEN

ఫొటో క్యాప్షన్, శ్వేత షేర్వాట్‌తో సౌమ్యా తివారీ (కుడి)

అబ్బాయిల టోర్నమెంటులో ఫీల్డింగ్

‘‘కొన్ని రోజులకు అండర్-14 అబ్బాయిల అకాడమీ మ్యాచ్ జరిగింది. అయితే, ఆ మ్యాచ్‌లో నేను కూడా ఆడతానని సౌమ్య పట్టుబట్టింది. అప్పుడే చెప్పాను.. అమ్మా ఇది ప్రాక్టీస్ మ్యాచ్ కాదు, టోర్నమెంటు అని. పైగా నీకు ఇక్కడ అంతా కొత్త అని చెప్పాను. అయితే, ఆమెకు కోపం వచ్చింది. ఇంటికి వెళ్లి, ఆ విషయాన్ని వాళ్ల నాన్నకు చెప్పింది’’అని సురేశ్ వివరించారు.

‘‘ఆ వెంటనే వాళ్ల నాన్న నుంచి నాకు ఫోన్ వచ్చింది. కనీసం ఫీల్డింగ్‌లోనైనా ఆమెకు చోటు ఇవ్వాలని ఆయన అన్నారు. దీంతో సరేనని ఒప్పుకున్నాను. ఈ విషయంపై మేం ప్రత్యర్థి జట్టుతో మాట్లాడాం. వారు కూడా సరేనని అన్నారు. ఆ మ్యాచ్‌లో అబ్బాయిల కంటే మెరుగ్గా తను ఫీల్డించ్ చేసింది. అప్పుడే తన విషయంలో మేం చేయాల్సిన కృషి చాలా ఉందని అనిపించింది. దీంతో ఆఫ్-స్పిన్నర్‌గా ఆమెకు కోచించ్ ఇవ్వడం మొదలుపెట్టాం’’అని ఆయన తెలిపారు.

‘‘మొదటగా ఆమె స్కూల్స్ నేషనల్ మ్యాచ్‌కు ఎంపికైంది. దీని కోసం ఆమె ఖండవా వెళ్లింది. అదే సమయంలో అండర్-14 టోర్నమెంటు భోపాల్‌లోని ఎంవీఎం కాలేజీలో జరుగుతోంది. ఆ మ్యాచ్‌లో సౌమ్య మా టీమ్‌లో చేరితే మేం గెలుస్తామని మాకు అనిపించింది. వెంటనే ఆమెకు ముందురోజు ఫోన్ చేశాను. మరుసటి ఉదయం నాలుగు గంటలకు ఆమె భోపాల్‌కు చేరుకుంది. ఆ రోజు మ్యాచ్‌లో తను ఆరు ఓవర్లలో 18 రన్లు ఇచ్చి 6 వికెట్లు తీసింది. భోపాల్‌లో అందరూ ఆమె ప్రదర్శన చూసి ఆశ్చర్యపోయారు. అసలు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? అని అంతా మాట్లాడుకున్నారు. అప్పటికి ఆమె వయసు 11 నుంచి 12 ఏళ్లు మాత్రమే ఉంటాయి’’అని ఆయన వివరించారు.

‘‘ఆ మ్యాచ్ తర్వాత, బ్యాటింగ్‌పై కూడా మేం దృష్టిపెట్టాం. సంవత్సరం తర్వాత అండర్-14 టోర్నమెంటు సెయింట్స్ కాలేజీలో నిర్వహించారు. దీని కోసం మరో ఇద్దరు అమ్మాయిలను కూడా నేను సిద్ధంచేశాను. కానీ, ఆ మ్యాచ్‌లో సౌమ్య వంద రన్లు కొట్టింది. దీంతో ఆమెపై మా నమ్మకం చాలా పెరిగింది’’అని సురేశ్ చెప్పారు.

సౌమ్యా తివారీ

ఫొటో సోర్స్, TWITTER/WOMEN’S CRICZONE

అబ్బాయిల కంటే మెరుగ్గా..

ప్రస్తుతం ఇద్గా హిల్స్ సెయింట్ జోసెఫ్ కాన్వెంట్‌లో 12వ తరగతి చదువుతున్న సౌమ్య తన కోచ్ నమ్మకాన్ని నిలబెట్టూ కుంటూ వస్తోంది కూడా.

‘‘సౌమ్య 14-15 ఏళ్ల వయసున్నప్పుడే ఆమె మధ్య ప్రదేశ్ అండర్-19 జట్టుకు ఎంపికైంది. ఆ తర్వాత అండర్-23 జట్టుకు కూడా. గత రెండేళ్లుగా ఆమె అండర్-19 జట్టుకు ఆడుతోంది. గత ఏడాది జైపుర్‌లో టీమ్ రన్నరప్‌గా మారడానికి ఆమెనే కారణం. చాలెంజర్ ట్రోఫీలో ఆమె తొలి మ్యాచ్‌లోనే ఏకంగా 105 రన్లు కొట్టింది’’అని సురేశ్ చెప్పారు.

‘‘అండర్-19 టీ20 టోర్నమెంటు ఇటీవల జరిగింది. ఆ మ్యాచ్‌లలో సౌమ్య మంచి ప్రదర్శన కనబరిచింది. న్యూజీలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లనూ ఆమె బాగా ఆడింది’’అని ఆయన తెలిపారు.

‘‘ఆరేళ్లలోనే ఆమె భారత జట్టుకు ఆడే వరకు వెళ్లిందంటే తన పట్టుదల ఏమిటో మనం అర్థం చేసుకోవవచ్చు. చాలా కొద్ది మందిలో మాత్రమే ఇలాంటి పట్టుదల కనిపిస్తుంది. తను అబ్బాయిల కంటె మెరుగ్గా ఆడుతుంది. ఏదైనా చెబితే తను వెంటనే నేర్చుకుంటుంది’’అని ఆయన వివరించారు.

సౌమ్యకు విరాట్ కోహ్లీ అంటే చాలా అభిమానం. ఆయనలానే ఆమె కూడా నంబరు 18 జర్సీ వెసుకుంటారు. బ్యాట్‌ను కూడా ఆయనలానే పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది కూడా.

వీడియో క్యాప్షన్, ఉమ్రాన్ మాలిక్: బుల్లెట్‌ లాంటి బంతుల వెనుక రహస్యమిదే

అబ్బాయిల నిరాకరణ

అబ్బాయిలతో సౌమ్య క్రికెట్ ఆడేటప్పుడు చోటుచేసుకున్న ఒక ఆసక్తికర ఘటనను సురేశ్ బీబీసీకి వివరించారు.

‘‘అప్పట్లో అబ్బాయిల ఐకానిక్ కప్ టోర్నమెంట్ జరుగుతోంది. మేం సౌమ్య పేరు ఇచ్చాం. ఆమె మొదట బ్యాటింగ్ చేసింది.. ఆ తర్వాత ఆమె బాల్ పట్టుకొని గ్రౌండ్‌లోకి వెళ్లినప్పుడు.. అమ్మాయిలు బౌలింగ్ వేయకూడదని వారు షరతు పెట్టారు. మొదట పేరు చెప్పినప్పుడు వారు అభ్యంతరాలు లేవనెత్తలేదు. బ్యాటింగ్ చేసినప్పుడు కూడా వారు మాట్లాడలేదు. కానీ, బౌలింగ్ వచ్చేసరికి వద్దన్నారు’’అని ఆయన చెప్పారు.

‘‘మమ్మల్ని అవమానిస్తున్నట్లుగా అనిపించింది. నేను అసలు ఊరుకోలేదు. అప్పుడు సర్ వారిని ఆడనివ్వండి.. నేను వెళ్లి కూర్చుంటా అని సౌమ్య అంది. భోపాల్‌లో చాలా మంది అబ్బాయిలు.. అమ్మాయిలతో కలిసి ఆడేందుకు ముందుకురారు. కానీ, నిజానికి అక్కడ సమస్య అది కాదు. బౌలింగ్‌లో ఆమె ప్రతిభ గురించి అప్పటికే అక్కడ అందరికీ తెలిసింది. అందుకే వారు ఆడబోమని చెప్పారు’’అని ఆయన వివరించారు.

సౌమ్య కెప్టెన్సీలో అండర్-19 ఇంటర్ స్టేట్ టీ-20 టోర్నమెంట్‌లో మధ్య ప్రదేశ్ జట్టు.. 26 రన్ల తేడాతో కర్నాటకపై గెలిచింది.

కెప్టెన్‌గా ఎనిమిది మ్యాచ్‌లలో ఆమె 255 రన్లు కొట్టారు, 15 వికెట్లు తీశారు. ఆ టోర్నమెంటులో అది ఒక రికార్డు.

సౌమ్య కెప్టెన్‌గా చూపించిన ప్రతిభపై ప్రశంసల వర్షం కురిపిస్తూ మరో కథను సురేశ్ వివరించారు.

‘‘గత ఏడాది తహ్‌సీన్ సగీర్ టోర్నమెంటు జరిగింది. అది 40 ఓవర్ల మ్యాచ్‌. ఫైనల్ జరుగుతోంది. సౌమ్య కెప్టెన్సీలో 128 పరుగులకు జట్టు ఆల్ అవుట్ అయ్యింది. మేం మ్యాచ్ ఓడిపోతాం ఏమోనని అనిపించింది. కానీ, సౌమ్య అద్భుతమైన ఫీల్డింగ్ చేసింది’’అని ఆయన తెలిపారు.

‘‘ఆ మ్యాచ్‌లో సౌమ్య మూడు వికెట్లు తీసింది. చివర్లో ఎనిమిది రన్లు కొట్టాలి. మూడు వికెట్లు మిగిలాయి. అప్పుడు శ్రేయ దీక్షిత్‌కు సౌమ్య బాల్ ఇచ్చింది. ఒకే ఓవర్‌లో శ్రేయ మూడు వికెట్లు తీసింది. ఆరు రన్ల తేడాతో మేం మ్యాచ్ గెలిచాం. అసలు అబ్బాయిల కంటే అమ్మాయిలు ఏ మాత్రం తక్కువ కాదని వీరు మరోసారి నిరూపించారు’’అని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, 15 ఏళ్ల వయసులో భారత్ తరఫున ఇంటర్నేషనల్ T20 ఆడిన చిన్న వయస్కురాలు షెఫాలీ

లక్ష్యం అదే..

శ్రీలంక, వెస్ట్ ఇండీస్‌లతో జరిగిన అండర్-19 టీ20 సిరీస్‌లో సౌమ్య స్ట్రైక్ రేట్ 102గా ఉంది. ఇది మంచి స్కోరని విమర్శకులు ప్రశంసిస్తున్నారు.

సౌమ్య ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తోందని ఆమె తండ్రి మనీష్ తివారీ సంతోషం వ్యక్తంచేశారు.

సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా ఆమె ముందుకు వెళ్తోందని ఆయన చెప్పారు. ‘‘మేం వేడుకలు చేసుకుంటున్నాం. కానీ, ఆమెకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం’’అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)