గౌతమ్ అదానీపై ఆరోపణలు చేసిన 'హిండెన్‌బర్గ్' నాథన్ ఆండర్సన్ హీరోనా, విలనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వినీత్ ఖరే
- హోదా, బీబీసీ ప్రతినిధి, దిల్లీ
హిండెన్‌బర్గ్ వంటి షార్ట్ సెల్లింగ్ కంపెనీలు తమ పరిశోధనలతో డబ్బులు నష్టపోకుండా పెట్టుబడిదారులను కాపాడతాయా? లేదా స్టాక్ మార్కెట్‌ను దెబ్బతీయడం ద్వారా తమ జేబులను నింపుకుంటాయా?
హిండెన్‌బర్గ్ వంటి సంస్థలు చట్టబద్ధంగా పనిచేస్తున్న అమెరికాలో కొన్నాళ్లుగా ఈ చర్చ నడుస్తోంది. ఇలాంటి కంపెనీలను ఇష్టపడేవారు ఉన్నారు. అలాగే వీటిని ద్వేషించే వారికీ కొదువ లేదు.
హిండెన్‌బర్గ్ ఒక సంచలనాత్మక శీర్షికతో తన నివేదికను విడుదల చేసింది. 'కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద మోసం' అనే శీర్షికతో నివేదికను బయటపెట్టింది. ఈ నివేదిక అబద్ధం అని అదానీ గ్రూప్ పేర్కొంది.
''వేగంగా పైకి ఎదుగుతున్న భారత్‌ను కిందికి లాగే ప్రయత్నం'' అని కొందరు హిండెన్‌బర్గ్ నివేదికను విమర్శిస్తున్నారు.
సాధారణంగా షేర్ల ధరలు పెరిగినప్పుడు డబ్బులు వస్తాయి. కానీ, షార్ట్ సెల్లింగ్‌లో ధరలు పడిపోయినప్పుడు డబ్బులు సంపాదిస్తారు. పలానా షేర్ పడిపోతుందని అంచనా వేస్తూ పందేలు కాస్తారు.
వాస్తవానికి, హిండెన్‌బర్గ్ వంటి యాక్టివిస్ట్ షార్ట్ సెల్లర్ సంస్థలు, కొన్ని కంపెనీల షేర్ ధర పతనం అవుతుందని ఊహించి పందెం వేస్తారు. ఆ తర్వాత వాటి గురించి నివేదికలను ప్రచురించడం ద్వారా వారిని లక్ష్యంగా చేసుకుంటారు.
షేర్ల ధర, వాస్తవ విలువ కంటే చాలా ఎక్కువ ఉందని భావించిన కంపెనీలను లేదా ఒక కంపెనీ తమ వాటాదారులను మోసం చేస్తుందని తమ దృష్టిలోకి వచ్చిన కంపెనీలను ఈ షార్ట్ సెల్లింగ్ సంస్థలు లక్ష్యంగా చేసుకుంటాయి.

ఫొటో సోర్స్, FANATIC STUDIO
యాక్టివిస్ట్ షార్ట్ సెల్లర్లు ఏం చేస్తాయి?
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థను 2017లో నేట్ అండర్సన్ స్థాపించారు.
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ స్కార్పియాన్ క్యాపిటల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ కీర్ కైలాన్ దీని గురించి మాట్లాడారు.
హిండెన్‌బర్గ్ ఒక ప్రసిద్ధ సంస్థ అని, వారి పరిశోధనలను విశ్వసనీయమైనవిగా పరిగణిస్తారని ఆయన అన్నారు.
ఈ నివేదికల ఆధారంగా అమెరికాలో అవినీతికి పాల్పడిన సంస్థలపై చర్యలు తీసుకున్నారని చెప్పారు.
హిండెన్‌బర్గ్ వంటి సంస్థల నివేదికలు విడుదల చేయడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయని న్యూయార్క్‌లో షార్ట్ సెల్లింగ్‌పై వార్తలు ప్రచురించే ఎడ్విన్ డోర్సే అన్నారు.
ఇందులో మొదటిది తప్పులను వెలికితీసి లాభాలను ఆర్జించడం... రెండోది న్యాయం, జవాబుదారీతనాన్ని నిర్ధారించడం.
''యాక్టివిస్ట్ షార్ట్ సెల్లింగ్ సంస్థల నివేదికలు ఒక రకంగా పరిశోధనాత్మక జర్నలిజం లాంటివి. కానీ, వాటికి లాభాలు వచ్చే పద్ధతి భిన్నంగా ఉంటుంది. నెట్, హిండెన్‌బర్గ్ వంటి సంస్థలను నేను అత్యున్నత సంస్థలుగా భావిస్తాను'' అని ఆయన వివరించారు.
చాలామంది పెట్టుబడిదారులు, యాక్టివిస్ట్ షార్ట్ సెల్లింగ్ సంస్థలను ఇష్టపడరు. ఎందుకంటే షేర్ల ధరలు తగ్గితే వారి పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
చాలా కంపెనీలు కూడా ఈ సంస్థలను ఇష్టపడవు అని చెప్పడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. 2021లో ఎలాన్ మస్క్, షార్ట్ సెల్లింగ్‌ను ఒక స్కామ్ అని పిలిచారు.

ఫొటో సోర్స్, Getty Images
తాజాగా అదానీ కేసును భారతదేశపు ''ఎన్రాన్ మూమెంట్''గా అభివర్ణించారు స్కార్పియాన్ క్యాపిటల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ కీర్ కైలాన్.
''అదానీ, ఎన్రాన్ కంపెనీలు రెండూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు కావడం, వాటికి బలమైన రాజకీయ సంబంధాలు ఉండటం చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది'' అని ఆయన అన్నారు.
భారీ ఆర్థిక నష్టాలను దాచిపెట్టిన ఎన్రాన్ సంస్థ 2001లో దివాలా తీసింది. ఆ సమయంలో ఎన్రాన్ సంస్థ చీఫ్ కెన్ లె, కంపెనీ ఇతర అధికారులతో అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్‌కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
అయితే ఎన్రాన్ సంస్థలా అదానీ గ్రూప్ ఆర్థిక పరిస్థితి లేదు. కానీ, కెన్ లే తరహాలోనే అదానీ కూడా భారత ప్రభుత్వానికి సన్నిహితంగా మెలిగాడనే ఆరోపణలు ఉన్నాయి.
''బలమైన, పటిష్టమైన కంపెనీలేవీ షార్ట్ సెల్లర్ సంస్థల నివేదికలను పట్టించుకోవు. గూగుల్, ఫేస్‌బుక్ లేదా మైక్రోసాఫ్ట్ గురించి ఇలాంటి నివేదికలు రాస్తే వాటిని చూసి ప్రజలు నవ్వుతారు. వారి స్టాక్స్ కూడా ప్రభావితం కావు'' అని కైలాన్ వివరించారు.
హిండెన్‌బర్గ్ చీఫ్ నాథన్ (నేట్) అండర్సన్ గురించి ఆయన మాట్లాడుతూ, ''అతని వద్ద అద్భుతమైన ఆధారాలు ఉన్నాయి. అతని పరిశోధనకు విశ్వసనీయత ఉంది'' అని అన్నారు.
అమెరికాలో కొలంబియా లా స్కూల్ ప్రొఫెసర్ జోషువా మిట్స్, షార్ట్ సెల్లింగ్ సంస్థలను విమర్శిస్తూ 'షార్ట్ అండ్ డిజార్ట్' అనే పేరుతో పేపర్‌ను ప్రచురించారు. దీనికి చాలా పేరు వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
హిండెన్‌బర్గ్ వెలువరించిన ప్రముఖ నివేదికలు
అదానీపై హిండెన్‌బర్గ్ నివేదికను విడుదల చేసిన సమయంపై, ఆ సంస్థ ఆర్జించిన లాభాలపై చాలా ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. దీనిపై మేం నేట్ అండర్సన్‌ను సంప్రదించాం, కానీ ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
హిండెన్‌బర్గ్ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం, ఇప్పటివరకు అదానీ నివేదికతో సహా 19 నివేదికలను వారు విడుదల చేశారు. అందులో అత్యంత ప్రముఖమైనది 2020 సెప్టెంబర్‌లో విడుదలైన నివేదిక. అమెరికా ఎలక్ట్రిక్ ఆటో కంపెనీ 'నికోలా' గుట్టును ఈ నివేదిక బయటపెట్టింది. 2015లో నికోలా కంపెనీ ఏర్పాటైంది.
నికోలా కంపెనీ మార్కెట్ విలువ 30 బిలియన్ డాలర్లు. జీరో కార్బన్ ఆశలను ఆ సంస్థ రేకెత్తించింది. 2018 జనవరిలో ఆ కంపెనీ ఒక వీడియోను విడుదల చేసింది. బ్యాటరీతో నడిచే 'నికోలా వన్ సెమీ ట్రక్' హైవేపై వేగంగా దూసుకుపోతున్నట్లు ఆ వీడియోను చిత్రీకరించింది.
నిజానికి ఆ సెమీ ట్రక్కును కొండపైకి లాక్కొని తీసుకెళ్లి, ఆ తర్వాత కొండ వాలుపై ఆ వీడియోను చిత్రించారని హిండెన్‌బర్గ్ నివేదికలో ఆరోపించింది.
ఆ ఆరోపణలను నికోలా ఖండించింది. కానీ, ఆ తర్వాత కంపెనీ చీఫ్ ట్రెవర్ మిల్టన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. హిండెన్‌బర్గ్ నివేదిక విడుదల అయిన వెంటనే ఆ కంపెనీ షేర్లు దాదాపు 24 శాతం పడిపోయాయి. నికోలా కంపెనీపై 120 మిలియన్ డాలర్ల జరిమానా విధించారు.
2021లో మిల్టన్‌పై మోపిన ఆరోపణలు కూడా రుజువు అయ్యాయి.

ఫొటో సోర్స్, ANI
అదానీని ఎందుకు ఎంచుకున్నారు?
న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అశ్వత్ దామోదరన్ ఒక బ్లాగ్‌లో ఈ నివేదిక గురించి తన అభిప్రాయాన్ని రాశారు.
ఈ నివేదిక వచ్చినప్పుడు తాను ఆశ్చర్యపోయానని అందులో పేర్కొన్నారు. ''సాధారణంగా హిండెన్‌బర్గ్ సంస్థ గతంలో చాలా చిన్న కంపెనీలను లేదా ఎక్కువ సమాచారం అందుబాటులో లేని కంపెనీలను లక్ష్యంగా చేసుకుంది. కానీ, అదానీ గ్రూపు ఒక పెద్ద భారతీయ కంపెనీ'' అని ఆయన అందులో రాశారు.
అమెరికా, చైనా కంపెనీలపై గతంలో హిండెన్‌బర్గ్ నివేదికలు వెలువరించింది. అలాంటప్పుడు తన 19వ నివేదిక కోసం అదానీ గ్రూపును ఎందుకు ఎంచుకుంది? అనే ప్రశ్న రావడం సహజం.
అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ ఎందుకు దృష్టి సారించిందో తనకు సరిగా తెలియదని న్యూయార్క్‌లో షార్ట్ సెల్లింగ్‌పై వార్తలను ప్రచురించే ఎడ్విన్ డోర్సే అన్నారు.
''షార్ట్ సెల్లర్లకు, పలానా కంపెనీల లొసుగులను వివరిస్తూ ఎక్కడినుంచో అనామక ఈమెయిల్‌లు వస్తుంటాయి. అలా వారు కంపెనీలపై దృష్టి సారిస్తారు'' అని ఆయన వివరించారు.
ఒక కంపెనీ స్టాక్స్ ఒక్కసారిగా విపరీతంగా పెరిగినప్పుడు షార్ట్ సెల్లర్ల దృష్టి వాటిపై నిలుస్తుందని ఆయన చెప్పారు.
2022 ఏప్రిల్‌లో ఒక మీడియా నివేదిక ప్రకారం, కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ రెండేళ్లలో అదానీ షేర్లు 18 నుంచి 20 రెట్లు పెరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో షార్ట్ సెల్లర్లపై నిఘా
అదానీ గ్రూప్ ప్రతీసారి తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ వస్తోంది.
కొలంబియా లా స్కూల్ ప్రొఫెసర్ జోషువా మిట్స్ మాట్లాడుతూ, అమెరికాలో షార్ట్ సెల్లర్లపై రెగ్యులేటరీ సంస్థల నిఘా ఎక్కువైందని అన్నారు. అందుకే ఆ సంస్థలు వేరే మార్కెట్ల వైపు దృష్టి సారించాయని ఆయన అభిప్రాయపడ్డారు.
''అమెరికా రెగ్యులేటర్ సంస్థల కంటే అయిదు లేదా పదేళ్లు వెనుకబడిన రెగ్యులేటర్లు ఉన్న మార్కెట్ల పట్ల, స్థానిక రెగ్యులేటర్లు చురుగ్గా లేని మార్కెట్ల పట్ల షార్ట్ సెల్లర్లు ఆసక్తి కనబరుస్తారు. గత దశాబ్ద కాలంగా షార్ట్ సెలర్లు ప్రపంచవ్యాప్తం అవుతున్నారు'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో షార్ట్ సెల్లింగ్ సంస్థల పరిస్థితి
భారత్‌లో కూడా షార్ట్ సెల్లింగ్ ఉందని, కానీ పెద్ద స్థాయిలో లేదని అశోక విశ్వవిద్యాలయ విజిటింగ్ ప్రొఫెసర్ గుర్బచన్ సింగ్ అన్నారు.
, షార్ట్ సెల్లింగ్‌లో జరిగే మోసాల గురించి సెబీ షార్ట్ పేపర్ వివరిస్తుందని ఆయన చెప్పారు. వీటి పట్ల భారత్ ఎందుకు కఠినంగా వ్యవహరిస్తుందో... 1998, 2011లో వీటిపై భారత్ ఎందుకు నిషేధం విధించిందో కూడా ఆ పేపర్‌లో ఉందటుందని ఆయన తెలిపారు.
హిండెన్‌బర్గ్ రాసినటువంటి నివేదికలు, భారత్‌లో రాయడం పెద్ద సవాలు అని నిపుణులు అంటున్నారు. సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ నితిన్ మంగళ్ దీని గురించి మాట్లాడుతూ, ''విమర్శలను స్వీకరించడం మనకు చాలా కష్టమైన పని. మనం విమర్శలను సానుకూలంగా తీసుకోలేం. నా పరిశోధనలను ప్రజలు చాలా విమర్శిస్తారు. కానీ, నేను పట్టించుకోను'' అని అన్నారు.
చట్టపరమైన కారణాల వల్ల భారత్‌లో ఇటువంటి పరిశోధనా సంస్థలు లేవని ఆయన చెప్పారు.
''భారత్‌లో కంపెనీలు అటువంటి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. క్రిమినల్ కేసులు పెట్టవచ్చు. అమెరికాలో ఇలాంటి ప్రక్రియలు చాలా భిన్నంగా ఉంటాయి'' అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:
- నందమూరి తారకరత్న: ఒకే రోజు 9 సినిమాలకు సంతకం చేసిన హీరో కెరీర్ ఆ తర్వాత ఎలా సాగింది?
- ఛత్రపతి శివాజీ ‘గ్రేట్ ఎస్కేప్’ - ఔరంగజేబ్ బంధించినపుడు 'ఆగ్రా జైలు' నుంచి శివాజీ ఎలా తప్పించుకున్నారు?
- అదానీ వివాదం, బీబీసీ డాక్యుమెంటరీ, 2024 ఎన్నికలపై అమిత్ షా ఏమన్నారు?
- కొత్తవీధి, గుంటి: గిరిజనులు సాగుచేసే ఈ గ్రామాలు రికార్డుల్లో ఎలా మాయం అయ్యాయి?
- మూడు రాజధానుల ముచ్చట ముగిసిందా? విశాఖపట్నం ఒక్కటే రాజధాని అని ఎందుకు చెప్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













