భారత జాతీయ క్రికెట్ జట్టు: మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లలో సెమీ ఫైనల్‌కి చేరేదెవరు?

ఫొటో సోర్స్, Getty Images
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో శనివారం నాడు ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 11 పరుగుల తేడాతో ఓడిపోయింది.
టోర్నీలో గ్రూప్-2 విభాగంలో ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు.. తొలి రెండు మ్యాచ్‌లలో వరుసగా పాకిస్తాన్, వెస్ట్ ఇండీస్‌ల మీద గెలిచింది. అయితే మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో పోరాడి ఓడిపోయింది.
ఈ ఓటమితో భారత జట్టు సెమీ ఫైనల్స్ చేరుకునే అవకాశాలు మూసుకుపోలేదు. కానీ టోర్నీలో మిగతా భాగం మీద ఈ ఓటమి గణనీయమైన ప్రభావం చూపుతుంది.
హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లండ్ మీద గెలిచినట్లయితే.. గ్రూప్-2 విభాగంలో పూర్తి పట్టు సాధించి, సెమీ ఫైనల్‌లోకి ఒక అడుగు పెట్టేసి ఉండేది.
కానీ.. ఇంగ్లండ్ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించటంలో భారత జట్టు విఫలమైంది. దీంతో భారత జట్టు సెమీ ఫైనల్ అవకాశం వారి చేతుల్లో లేకుండా పోయింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రదర్శన, ర్యాంక్ ప్రాతిపదికన భారత జట్టు సెమీ ఫైనల్‌కు వెళ్లే అవకాశం ఇంకా ఉండొచ్చు. కానీ అది ఖాయం కాదు.
ప్రస్తుతం గ్రూప్-2లో ఇంగ్లండ్ జట్టు మూడు విజయాలతో, ఆరు పాయింట్లతో అగ్ర స్థానంలో ఉంది. భారత జట్టు మూడు మ్యాచ్‌లలో రెండు విజయాలు, నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
ఇప్పటివరకూ రెండు మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్ ఒక గెలుపు, 2 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. మూడు మ్యాచ్‌లు ఆడిన వెస్ట్ ఇండీస్ ఒక గెలుపుతో 2 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.
ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఓడిపోయిన ఐర్లండ్ జట్టు అట్టడుగున నిలిచింది.
ఈ పరిస్థితుల్లో భారత జట్టు సెమీ ఫైనల్ అవకాశాలు.. ఆదివారం పాకిస్తాన్, వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య జరగబోయే గ్రూప్ మ్యాచ్ మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టును వెస్ట్ ఇండీస్ ఓడించినట్లయితే..
ఆదివారం నాడు పాక్, వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య మ్యాచ్‌ను భారత జట్టు నిశితంగా పరిశీలిస్తుంది. ఆ రెండు జట్లూ భారత జట్టు కన్నా 2 పాయింట్లు వెనుకబడి ఉన్నాయి.
ప్రస్తుతం వెస్ట్ ఇండీస్ ఒక మ్యాచ్, పాకిస్తాన్ రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
పాకిస్తాన్‌కు మిగిలి ఉన్న మ్యాచ్‌లు, నెట్ రన్ రేట్‌లో ఆ జట్టు పైచేయిలో ఉండటం.. భారత జట్టు అవకాశాలకు గండికొట్టే పరిస్థితి ఉంది.
ఆదివారం జరిగే మ్యాచ్‌లో వెస్ట్ ఇండీస్ గెలిచినట్లయితే.. అది భారత జట్టుకు చాలా తోడ్పడుతుంది. అప్పుడు వెస్ట్ ఇండీస్, భారత జట్లు చెరో 4 పాయింట్లతో సమ ఉజ్జీలుగా ఉంటాయి. అయితే నెట్ రన్ రేట్‌లో భారత్ కన్నా చాలా వెనుకబడి ఉన్న వెస్ట్ ఇండీస్.. ఆ తేడాను పూరించి, భారత జట్టును అధిగమించే అవకాశం చాలా తక్కువ.
అలాగే పాకిస్తాన్ తన చివరి మ్యాచ్‌ను ఇంగ్లండ్‌తో ఆడే ముందు.. ఆ జట్టు 2 పాయింట్ల దగ్గరే ఆగుతుంది.
అలా జరిగితే, సెమీ ఫైనల్ చేరాలంటే.. ఇంగ్లండ్‌తో తన చివరి మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిచి తీరటంతో పాటు, భారత్, ఐర్లండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో భారత్ ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు పాక్, భారత్ జట్లు చెరో 4 పాయింట్లతో పోటీలో ఉంటాయి. మెరుగైన నెట్ రన్ రేట్ ప్రాతిపదికన పాకిస్తాన్.. సెమీ ఫైనల్‌లో చోటు సంపాదించుకుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఒకవేళ వెస్ట్ ఇండీస్‌ను పాకిస్తాన్ ఓడించినట్లయితే..
ఇప్పటికే 2 పాయింట్లు ఖాతాలో ఉన్న పాకిస్తాన్ కనుక వెస్ట్ ఇండీస్ మీద గెలిచినట్లయితే.. పాక్ జట్టుకు 4 పాయింట్లు వస్తాయి. మెరుగైన నెట్ రన్ రేట్ ప్రాతిపదికన భారత్‌ను అధిగమించి గ్రూప్‌లో రెండో స్థానానికి చేరుతుంది. అప్పటికి పాక్ జట్టు ఇంకా ఇంగ్లండ్‌తో మ్యాచ్ మిగిలి ఉంటుంది.
ఈ పరిస్థితుల్లో భారత జట్టు తన సెమీ ఫైనల్ అశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఐర్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో గెలవాల్సి ఉంటుంది. భారత జట్టు ఐర్లండ్ మీద గెలిచినా కానీ.. పాకిస్తాన్ తన చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ మీద గెలిచినట్లయితే.. భారత సెమీ ఫైనల్ ఆశలు గల్లంతవుతాయి.
ఒకవేళ ఐర్లండ్‌తో మ్యాచ్‌లో భారత జట్టు గనుక ఓడిపోయినట్లయితే.. ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్‌ను భారీ తేడాతో ఓడించినప్పుడు మాత్రమే.. నెట్ రన్ రేట్ భారత్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
గ్రూప్‌లో టాప్-2 లో భారత్ నిలువగలదా?
భారత జట్టు గ్రూప్‌లో అగ్రస్థాయిలో నిలిచి, సెమీ ఫైనల్ చేరుకునే అవకాశాలు ఇంకా ఉన్నాయి. కానీ నెట్ రన్ రేట్ దీనికి అడ్డుపడుతోంది.
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఓటమి కారణంగా.. భారత జట్టు ఇప్పుడు ఐర్లండ్ మీద భారీ పరుగుల తేడాతో గెలవటంతో పాటు.. ఇంగ్లండ్ కూడా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారీ తేడాతో ఓడిపోవటం జరగాలి. ఈ రెండూ జరిగినపుడు మాత్రమే నెట్ రన్ రేటు భారత జట్టుకు అనుకూలంగా మారుతుంది.
గ్రూప్‌లో అగ్రస్థానంలోని ఒకటి, రెండు స్థానాల్లో ఎక్కడ నిలిచినా భారత జట్టు సెమీ ఫైనల్‌కు వెళుతుంది. భారత జట్టు గ్రూప్‌లో రెండో స్థానంలో నిలవటం పెద్ద సమస్య కాకపోవచ్చు. అయితే.. ఈ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచే జట్టు సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంటుంది.
ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం ఉన్న ఫామ్‌ను చూస్తే.. ఫైనల్‌కు ముందు ఆ జట్టుతో తలపడటానికి మిగతా జట్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పటికే వరుసగా రెండు సార్లు టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా హ్యాట్రిక్ టైటిల్ మీద కన్నేసింది. ఈ ఫార్మాట్‌లో ప్రస్తుతం ఆ జట్టు అగ్రస్థాయి ర్యాంక్‌లో ఉంది.
2020లో టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న తర్వాత ఆస్ట్రేలియా.. ఇప్పటివరకూ 22 టీ20 మ్యాచ్‌లు గెలిచింది. కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఓడిపోయింది. అది కూడా న్యూజీలాండ్ చేతిలో.
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లతో భారత జట్టు రికార్డు కూడా ఏమంత గొప్పగా లేదు. గత ఏడాది ఆగస్టులో కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్‌లో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. కేవలం రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత డిసెంబర్‌లో సొంత గడ్డపై ఆసీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు 4-1 తేడాతో పరాజయం పాలైంది.
భారత జట్టు సోమవారం నాడు టీ20 ప్రపంచ కప్ గ్రూప్ విభాగంలో తన చివరి మ్యాచ్‌ను ఐర్లండ్‌తో ఆడుతుంది.

ఇవి కూడా చదవండి:
- భార్యను చంపి పదేళ్ల పాటు తప్పించుకుని తిరిగాడు, కానీ ఆ ఒక్క సెంటిమెంట్ పట్టించింది
- ఛత్రపతి శివాజీ ‘గ్రేట్ ఎస్కేప్’ - ఔరంగజేబ్ బంధించినపుడు 'ఆగ్రా జైలు' నుంచి శివాజీ ఎలా తప్పించుకున్నారు?
- ఆంధ్రప్రదేశ్: ఈ గురుకుల పాఠశాల బాలికలు ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు? సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి?
- నందమూరి తారకరత్న: ఒకే రోజు 9 సినిమాలకు సంతకం చేసిన హీరో కెరీర్ ఆ తర్వాత ఎలా సాగింది?
- పాంగొలిన్: ప్రపంచంలో అత్యధికంగా వేటకు బలయ్యే జంతువు ఇది.. దీని పొలుసులకు ఎందుకంత డిమాండ్?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









