భార్యను చంపి పదేళ్ల పాటు తప్పించుకుని తిరిగాడు, కానీ ఆ ఒక్క సెంటిమెంట్ పట్టించింది

ఫొటో సోర్స్, BHARGAV PARIKH
- రచయిత, భార్గవ పరీఖ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పది సంవత్సరాల కిందట భార్యను చంపారు భీమ్ సింగ్ పాటిల్. ఇంత కాలం పట్టుబడకుండా తిరిగారు.
కానీ ఆయనకున్న ఒక్క సెంటిమెంటు నేడు భీమ్ సింగ్ పాటిల్‌ను పోలీసులకు పట్టించింది.
''మొబైల్ ఫోన్ వాడినా బస్సో, ట్రైనో ఎక్కినా ఎక్కడో ఒక దగ్గర పోలీసులకు పట్టుబడతానని తెలుసు. అందుకే నా భార్యను చంపిన తర్వాత, నదియాద్‌కి రిక్షాలో వెళ్లాను. అక్కడి నుంచి అనేక వాహనాల ద్వారా మధ్యప్రదేశ్‌కి చేరుకున్నాను.
ఏదైనా పనికి వెళితే నన్ను ఎవరో ఒకరు గుర్తుపట్టి పోలీసులకు చెబుతారని భయపడ్డాను. నా దగ్గర డబ్బులు కూడా ఎక్కువ లేవు. ఒక హోటల్‌లో చేరి గిన్నెలు కడిగే వాడిని. అక్కడే నిద్రపోయే వాడిని. ఇలా పదేళ్లు చేశా. కానీ, చివరికి పోలీసులకు దొరికిపోయా'' అని నిందితుడు భీమ్ సింగ్ పాటిల్ తెలిపారు.
అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ముందు తన నేరాన్ని ఒప్పుకున్న భీమ్ సింగ్ పాటిల్ గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు పోలీసు అధికారి సాయంతో బీబీసీ ప్రతినిధి అతనితో మాట్లాడారు.
భీమ్ సింగ్ మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ధాల్కి గ్రామానికి చెందిన వాడు. అక్కడ వ్యవసాయ పనులు లేకపోవడంతో, కూలి పనులు చేసుకునేందుకు అహ్మదాబాద్ వచ్చాడు.
అహ్మదాబాద్ వచ్చి కొత్త జీవితం ప్రారంభిద్దామనుకున్న భీమ్ సింగ్ ఎందుకు భార్యను చంపాడు? అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నాడు? పదేళ్ల పాటు ఎక్కడ తలదాచుకున్నాడు? చివరికి పోలీసులు అతనెలా పట్టుకున్నారు? వంటి విషయాలను బీబీసీ ప్రతినిధి తెలుసుకున్నారు.

ఫొటో సోర్స్, BHARGAV PARIKH
భార్య మీద అనుమానం
''నేను అహ్మదాబాద్ వచ్చి, ఒక ఫ్యాక్టరీలో పనిచేయడం ప్రారంభించాను. ఆ తర్వాత ఒక చిన్న టీ దుకాణం పెట్టుకున్నాను'' అని భీమ్ సింగ్ బీబీసీతో చెప్పాడు.
''మా పిల్లలకి పెళ్లిళ్లు అయ్యాయి. వారు వేరుగా కాపురం పెట్టారు. నా భార్య వయసు 45 ఏళ్లు. నేను ఇంటికి వచ్చినప్పుడు ఒక్కోసారి నా భార్య ఇంట్లో ఉండేది కాదు. రోజంతా ఫోన్‌లో మెసేజ్‌లు చేస్తూ ఉండేది. కొత్త కొత్త బట్టలు వేసుకునేది. సినిమాలకు వెళ్లేది'' అని భీమ్ సింగ్ చెప్పాడు.
భార్య ఆ ప్రవర్తనతో భీమ్ సింగ్‌కి అనుమానం వచ్చింది. చుట్టుపక్కల వారు కూడా తనకు పలు రకాలుగా చెప్పారు.
వీటన్నింటి గురించి ఆమెను అడిగినప్పుడు, తను చాలా నిర్లక్ష్యపూర్వకంగా సమాధానం చెప్పినట్టు భీమ్ సింగ్ తెలిపాడు.
‘అలా నా భార్యను చంపాను’
హత్యకు ముందు జరిగిన సంఘటనలను గుర్తుకు చేసుకున్న భీమ్ సింగ్, ''ఆ సమాధానం తర్వాత మేమిద్దరం చాలా గొడవ పడ్డాం. ఇక ఇదంతా ఆపేయాలని కోరాను. లేదంటే ఎవరో ఒకరం ప్రాణాలు వీడాల్సి వస్తుందని హెచ్చరించాను'' అని చెప్పాడు.
''ఆ తర్వాత చాలా సార్లు గొడవపడ్డాం. ఆ రోజు నాకింకా గుర్తుంది. అది శనివారం. ఒకరి నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. నా భార్య రిక్షా ఎక్కి ఎక్కడికో వెళ్తుందని చెప్పారు. నేను వెంటనే ఇంటికి వచ్చాను. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. నా భార్య ఇంటికి వచ్చే వరకు నేను వేచి చూశాను. ఆ తర్వాత ఇద్దరి మధ్య చాలా వాగ్వాదం జరిగింది. నాకు చాలా కోపం వచ్చింది. ఓ కర్రతో నేను ఆమె తలపై కొట్టాను. తలంతా రక్తంతో తడిచిపోయింది. నేను ఆ రక్తాన్ని తుడిచేశాను'' అని భీమ్ సింగ్ చెప్పాడు.
హత్య జరిగిన తర్వాత విషయాలను గుర్తుకు చేసుకుంటూ, తాను హత్య చేసినట్టు అర్థమై, వెంటనే అక్కడి నుంచి పారిపోయినట్టు తెలిపాడు.
తాను తొలుత తన ఫోన్‌ను పగలగొట్టి, సిమ్ కార్డును ధ్వంసం చేసినట్టు చెప్పాడు. ఆ తర్వాత రిక్షా ఎక్కి, పోలీసులు పట్టుకోకముందే తాను నదియాద్ చేరుకున్నట్టు చెప్పాడు. ఆ తర్వాత పలు వాహనాల్లో ఇండోర్ చేరుకున్నట్టు గుర్తుకు చేసుకున్నాడు.
ఈ నేరం చేసిన తర్వాత కూడా భీమ్ సింగ్ పోలీసుల నుంచి తనను తాను కాపాడుకునేందుకు వివిధ రకాల పన్నాగాలు పన్నినట్టు తెలిపాడు.
''ఇండోర్‌లో హోటల్‌లో గిన్నెలు కడిగాను. దీని వెనుకాల కూడా ఒక కారణం ఉంది. ఒకవేళ నేను వెయిటర్‌గా పనిచేస్తే, నేను టేబుల్‌పై ఫుడ్ సర్వ్ చేయడానికి వెళ్లినప్పుడు ఎవరో ఒకరు గుర్తుపట్టి పోలీసులకు చెబుతారని అనుకునేవాడిని. అందుకే నేను కిచెన్‌లోనే ఉండేవాణ్ని. గిన్నెలు కడిగే వాణ్ని'' అని చెప్పాడు.
ఇలా పదేళ్ల పాటు గడిపిన తర్వాత, ఎంత కాలం ఇలా ఇండోర్‌లో ఉండాలి? అని అనుకున్నట్లు చెప్పాడు. ఈ ఆలోచన భీమ్ సింగ్‌కి వచ్చిన తర్వాత, తన మిగతా జీవితం సొంతూరుకి దగ్గర్లో గడపాలనుకున్నాడు. వెంటనే జల్గావ్ వెళ్లాడు. అక్కడ కూడా ఒక హోటల్‌లో గిన్నెలు కడిగేవాడినని భీమ్ సింగ్ చెప్పాడు. రోజంతా అక్కడే ఉండేవాడినని చెప్పాడు.

ఫొటో సోర్స్, BHARGAV PARIKH
నిందితుడిని పోలీసులెలా పట్టుకున్నారు?
ఐదేళ్లకు పైబడి, స్థానిక పోలీసులు చేధించలేని కేసులను క్రైమ్ బ్రాంచ్‌కి ఇవ్వాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ కేసును కూడా క్రైమ్ బ్రాంచ్‌కి ఇచ్చింది.
పదేళ్లుగా పరిష్కారం కానీ ఈ కేసు బాధ్యతను అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ కె.ఎస్ సిసోడియాకు ఇచ్చారు.
''ఈ కేసు మా వద్దకు వచ్చాక, మా సొంత ఇంటెలిజెన్స్‌ను వాడాలని నిర్ణయించాం. కానీ, ఇది గడ్డివాములో సూదిని వెతికినట్టు అయింది. భీమ్ సింగ్ పిల్లలు అతని వద్ద ఉండటం లేదు. మా విచారణను మరొక కోణంలో చేపట్టాలని నిర్ణయించాం. అమరాయివాడి ప్రాంతం నుంచి మా విచారణ ప్రారంభించాం. హోటల్‌లో లేదా టీ స్టాల్‌లో పనిచేస్తూ ఉండొచ్చని అక్కడివాళ్లు అన్నారు. అతనికి మరో పని రాదని కూడా చెప్పారు' అని కె..ఎస్.సిసోడియా బీబీసీకి తెలిపారు.
ఆ తర్వాత జల్గావ్ చుట్టుపక్కల వెతికినట్టు చెప్పారు. భీమ్ సింగ్ దూరపు బంధువును క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కలిశారు. జల్గావ్ దగ్గర ప్రాంతంలో అతనిని చూసినట్టు ఆయన తెలిపారు.
జల్గావ్ జాతీయ రహదారిపై కొన్ని హోటళ్లు మాత్రమే ఉన్నాయి. అక్కడి నుంచి తాము వెతకడం ప్రారంభించినట్టు సిసోడియా తెలిపారు.
''హోటల్ యజమానికి గుర్తింపు సమాచారం ఇవ్వకుండా ఒక 68 ఏళ్ల ముసలి వ్యక్తి అక్కడ పనిచేస్తున్నట్టు మేము గుర్తించాం. భీమ్ సింగ్ చాలా తెలివైన వాడు. హోటల్‌ను విడిచిపెట్టి వెళ్లలేదు. పోలీసులు పట్టుకుంటారనే భయంతో ఫోన్‌ను, ప్రజారవాణా మార్గాలను అసలు వాడలేదు. హోటల్ సీసీటీవీ కెమెరాల్లో కనిపించకుండా ఉండేందుకు ఎప్పుడూ తాను గిన్నెలను కడుగుతూనే ఉండేవాడు. పదేళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఒకే స్థలంలో నివసించిన భీమ్ సింగ్, అతను చనిపోతే ఎవరూ అంత్యక్రియలు చేయరేమోననే భయంతో జల్గావ్ వచ్చి స్థిరపడాలనుకున్నాడు. అతని గ్రామానికి దగ్గర్లో ఉండటం ప్రారంభించాడు. అతని ఐడెంటిటీ పేపర్‌ను, అడ్రస్‌ను జేబులో పెట్టుకుని హోటల్‌లో పనిచేస్తుండేవాడు'' అని సిసోడియా చెప్పారు.
జల్గావ్ దగ్గర్లో నివసించాలనుకునే నిర్ణయం, అడ్రస్ జేబులో పెట్టుకోవడమే భీమ్ సింగ్ పట్టుబడేలా చేసిందని సిసోడియా తెలిపారు. చివరికి అతన్ని అరెస్ట్ చేసి, పోలీసు కస్టడీకి అప్పజెప్పినట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండి:
- జీవీఎంసీ: ‘రూ.100 కోట్ల ఆస్తులు ఉన్న కార్పొరేటర్లకు రూ.15 వేలు గిఫ్ట్ కూపన్ ఎందుకు ఇచ్చారు?’
- పుతిన్ ప్రొటోకాల్ పక్కనపెట్టి అజిత్ డోభాల్‌తో భేటీ కావడంపై పాకిస్తాన్లో ఎందుకు చర్చ జరుగుతోంది?
- అదానీ వివాదం, బీబీసీ డాక్యుమెంటరీ, 2024 ఎన్నికలపై అమిత్ షా ఏమన్నారు?
- వీర్యంలో శుక్రకణాలు ఈతకొట్టకుండా ఆపే ఈ టాబ్లెట్ ప్రత్యేకత ఏంటి ?
- కొత్తవీధి, గుంటి: గిరిజనులు సాగుచేసే ఈ గ్రామాలు రికార్డుల్లో ఎలా మాయం అయ్యాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










