లుపస్: సింగర్ సెలీనా గోమెజ్‌కు నయం కాని ఆటో ఇమ్యూన్ వ్యాధి... ఏమిటీ వ్యాధి? లక్షణాలు ఎలా ఉంటాయి? ఎంత ప్రమాదకరం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జాక్ గ్రే, బోనీ మెక్‌లారెన్
- హోదా, బీబీసీ న్యూస్‌బీట్ కరెస్పాండెంట్
ప్రముఖ సింగర్ సెలీనా గోమెజ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. లుపస్ అనే వ్యాధి తగ్గడానికి మందులు వాడిన తర్వాత తన శరీరంలో వచ్చిన మార్పుల గురించి సెలీనా వెల్లడించారు. దీని గురించి ఎలాంటి అరమరికలు లేకుండా బహిరంగంగా మాట్లాడినందుకు ప్రజలు ఆమెను ప్రశంసిస్తున్నారు.
సెలీనా గోమెజ్ వయస్సు 30 ఏళ్లు. తనకు లుపస్ వ్యాధి నిర్ధారణ అయినప్పుడే ఆమె ఈ వ్యాధి గురించి బహిరంగంగా ప్రకటించారు. ఈ వ్యాధి నివారణకు మందులు వాడటంతో ఆమె శరీరంలో అనేక మార్పులు కనిపించాయి. ప్రజలు ఆమెలో కనిపిస్తోన్న మార్పుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు.
దీని తర్వాత ఆమె, లుపస్ వ్యాధి గురించి, దాని వల్ల తన శరీరంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడారు.
లుపస్ వ్యాధి తగ్గడం కోసం వాడిన మందుల కారణంగా తన శరీరంలో బాగా నీరు వచ్చిందని టిక్ టాక్ లైవ్ సందర్భంగా గోమెజ్ తెలిపారు. నీరు పేరుకుపోవడంతో శరీరంలో వాపు వచ్చిందని వెల్లడించారు.
''ఇప్పుడు నేను మరింత ఆరోగ్యంగా ఉంటా. నా పట్ల మరింత శ్రద్ధ వహిస్తా. నేను మందులు తీసుకోవడం చాలా ముఖ్యం. ఆ మందులు నాకు ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నా'' అని సెలీనా అన్నారు.
సెలీనా గోమెజ్ ఎదుర్కొంటున్న లుపస్ వ్యాధి అంటే ఏంటి?
లుపస్ అనేది నయం కాని ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఈ వ్యాధి కారణంగా శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ అసాధారణ చురుకుదనంతో స్పందిస్తూ, శరీరంలోని సాధారణ కణజాలాలపై దాడి చేయడం ప్రారంభిస్తుంది. అయితే, లుపస్ వ్యాధి లక్షణాలను మందులతో నియంత్రించవచ్చు.
లుపస్ వ్యాధి కారణంగా కిడ్నీ మార్పిడి చేయించుకోవాల్సి వచ్చిందని 2017లో సెలీనా చెప్పారు.

ఫొటో సోర్స్, KATE APPLEBY
లుపస్, బాడీ షేమింగ్
30 ఏళ్ల వయస్సు ఉన్న కేట్ ఆపిల్‌బాయ్, క్రిస్ క్లార్క్ కూడా లుపస్ వ్యాధితో పోరాడుతున్నారు. ఈ వ్యాధి గురించి సెలీనా గోమెజ్ బహిరంగంగా మాట్లాడటం తమకు ఎంతో ధైర్యాన్ని కలిగించిందని వారు బీబీసీ న్యూస్‌బీట్‌తో చెప్పారు.
''ఈ వ్యాధి కారణంగా శరీరంలో సంభవించిన మార్పుల తర్వాత సెలీనా గోమెజ్ ఎటువంటి బాడీ షేమింగ్‌ను ఎదుర్కున్నారో నేను అర్థం చేసుకోగలను'' అని కేట్ అన్నారు.
ఈ వ్యాధి గురించి బహిరంగంగా మాట్లాడినందుకు క్రిస్ కూడా గోమెజ్‌ను ప్రశంసించారు .
''లుపస్ వ్యాధి గురించి సెలీనా తరహాలో బహిరంగంగా మాట్లాడే వ్యక్తులకు నేను పూర్తిగా మద్దతు ఇస్తాను'' అని క్రిస్ అన్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో కేట్‌కు 40 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాను కూడా బాడీ షేమింగ్‌కు గురయ్యానని కేట్ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో సెలీనా ధైర్యాన్ని ఎంత పొగిడినా తక్కువే అని అన్నారు.
''ఇంతకుముందు నేను సన్నగా ఉండేదాన్ని. ఇప్పుడు బాగా లావు అయ్యాను. శరీరం కాస్త వాచినట్లుగా అయింది.
నాకు ఒక పబ్లిక్ ప్రొఫైల్ ఉంది. ప్రజలంతా నన్ను చాలా త్వరగా జడ్జ్ చేస్తారు. నేను కనిపించే తీరుపై కామెంట్లు చేస్తుంటారు. నేను నా అనారోగ్యంతో ఎలా పోరాడుతున్నానని కూడా కొందరు అడుగుతుంటారు. ఇది చాలా మంచి విషయం'' అని కేట్ అన్నారు.

ఫొటో సోర్స్, CHRIS CALRKE
పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువ
బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం, పురుషుల కంటే మహిళలే ఎక్కువగా లుపస్ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది.
మందుల కారణంగా తన ఆకలి వేళలు మారిపోయాయని క్రిస్ చెప్పారు.
''నాకు కాస్త పొట్ట వచ్చింది. బీర్ తాగడం వల్ల వచ్చిన పొట్ట కాదు ఇది. నేను మందులు వాడుతున్నా. అవి స్టెరాయిడ్స్. మజిల్ పెంచడం కోసం నేను స్టెరాయిడ్స్ వాడుతున్నానని ఎవరైనా అనుకోవచ్చు. కానీ, ఇవి కండలు పెంచడానికి తీసుకునే స్టెరాయిడ్స్ కాదు.
ఈ మందుల వల్ల బాగా ఆకలి వేస్తుంది. బాగా తింటాం. ఇలాంటి ఆకలిని నియంత్రించడం మీ చేతుల్లో ఉండదు'' అని క్రిస్ వివరించారు.

ఫొటో సోర్స్, Science Photo Library

లుపస్ అంటే ఏంటి?
- ఎన్‌హెచ్‌ఎస్ ప్రకారం, లుపస్ అనేది ఒక సంక్లిష్టమైన వ్యాధి. శరీరంలోని వివిధ బాగాలపై ప్రభావం చూపించే ఈ వ్యాధి గురించి చాలా తక్కువ అవగాహన ఉంది.
- దీని లక్షణాలు చాలా స్వల్ప స్థాయి నుంచి ప్రాణాంతకంగా మారే వరకు ఉంటాయి.
- లుపస్‌లో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ఒక రకం, మీ చర్మంపై మాత్రమే ప్రభావం చూపుతుంది.
- ఇందులో తీవ్రమైన పరిస్థితిని లుపస్ ఎరితెమాటోసస్ (ఎస్‌ఎల్‌ఈ)గా పిలుస్తారు. ఈ స్థితిలో చర్మంతో పాటు కీళ్లు, అంతర్గత అవయవాలు కూడా ప్రభావితం అవుతాయి.
- చాలా మందికి లుపస్ ఉండే అవకాశం ఉంది. దాని లక్షణాలు తీవ్రమైనప్పుడు మాత్రమే ప్రజలకు, తమకు ఈ వ్యాధి సోకినట్లు తెలుస్తుంది.
- విపరీతమైన అలసటతో పాటు ముఖం, మణికట్టు, చేతులపై దద్దుర్లు, కీళ్ల నొప్పులు, శరీరంలో వాపు ఈ వ్యాధి లక్షణాలు.
- లుపస్ వ్యాధి స్వల్ప స్థాయి లక్షణాలు కూడా సమస్యాత్మకంగా మారతాయి.
- లుపస్ లక్షణాలు కొన్నిసార్లు ఇతర వ్యాధుల లక్షణాలతో సరిపోలి ఉంటాయి. అందుకే ఈ వ్యాధిని త్వరగా గుర్తించడం కష్టం.

ఫొటో సోర్స్, Getty Images
లుపస్ వ్యాధి గురించి సెలీనా అవగాహన కల్పిస్తున్నారని క్రిస్ అన్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న ప్రజలకు సెలీనా చూపించిన తెగువ ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని క్రిస్ వ్యాఖ్యానించారు.
లుపస్ వ్యాధి నిర్ధారణ అయిన సమయంలో తనకు ఈ వ్యాధి గురించి అసలేమీ తెలియదని క్రిస్ చెప్పారు.
సెలీనా చేస్తున్న పనితో చాలా మంది ప్రాణాలు నిలబడతాయని కేట్ అన్నారు.
''లుపస్ ఉన్నట్లు తెలుసుకున్నప్పుడు నా మానసిక స్థితి సరిగా లేదు. ఆ సమయంలో సెలీనా తరహాలో ఎవరైనా దీని గురించి మాట్లాడి ఉండే నా పరిస్థితి వేరేలా ఉండేది'' అని కేట్ గుర్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:
- రష్యా నుంచి చౌకగా వస్తున్న ముడి చమురు భారత్‌ను ఎందుకు కలవరపెడుతోంది?
- లాటరీలో 40 లక్షలు... ఒకే వ్యక్తికి వరసగా రెండుసార్లు బంపర్ ప్రైజ్
- వినరో భాగ్యము విష్ణుకథ రివ్యూ : పేరులో ఉన్న భాగ్యము సినిమాలో ఉందా లేదా?
- బీబీసీ ఇండియా: ‘మమ్మల్ని నేరుగా అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్తాం’
- రాజస్థాన్‌లో ముస్లిం యువకుల కిడ్నాప్, హరియాణాలో అన్నదమ్ములను కారుతో పాటు తగులబెట్టారు... అసలేం జరిగింది?













