వినరో భాగ్యము విష్ణుకథ రివ్యూ : పేరులో ఉన్న భాగ్యము సినిమాలో ఉందా లేదా?

ఫొటో సోర్స్, AdityaMusic/FB
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
కొత్త దర్శకులు కొత్తగా ఆలోచిస్తున్నారు. లాజిక్కులు కాకుండా మ్యాజిక్కులని ఆశ్రయిస్తున్నారు. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు సరదాగా కాలక్షేపం అవుతుందా లేదా అనే అంశంపైనే దృష్టి పెడుతున్నారు.
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా కొత్త దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తీసిన 'వినరో భాగ్యము విష్ణుకథ'లో కూడా ఇదే ప్రయత్నం జరిగింది.
మరి ఈ ప్రయత్నం ఎంతవరకూ ఫలించింది? కాన్సెప్ట్‌తో మొదలై.. లవ్, కామెడీ మిక్స్ అయి, క్రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఈ డ్రామా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది?
విష్ణు చెప్పిన నైబర్ నెంబర్ కథ
విష్ణు(కిరణ్ అబ్బవరం) తిరుపతి వాసి. కొన్ని కారణాల వలన చిన్నప్పుడే తల్లితండ్రులని కోల్పోతాడు. 'సొంత లాభం కొంత మానుకు, పొరుగు వాడికి తోడుపడవోయి.. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయి'' ఈ మాటల్ని తూచతప్పకుండా పాటించే కుర్రాడు విష్ణు. ఎదుటివాడికి కష్టం వస్తే చాలు సాయంగా ముందుకు వస్తాడు. అలాంటి విష్ణుకు నెంబర్ నైబర్ అనే కాన్సెప్ట్‌తో దర్శన (కశ్మీరా) దగ్గరవుతుంది. దర్శన ఓ యూట్యూబర్. తన యూట్యూబ్ ఛానెల్‌తో పాపులర్ కావాలని విష్ణు, శర్మ (మురళీ శర్మ)లతో కలిసి వీడియోలు చేస్తుంది.
అయితే, అనుకోని పరిస్థితిలో దర్శన ఓ మర్డర్ కేసులో దోషిగా జైలుకి వెళుతుంది. ఆ కేసుని నుంచి దర్శనని విష్ణు ఎలా బయటికి తెస్తాడు ? సరదాగా యూట్యూబ్ వీడియోలో చేసుకునే దర్శన అసలు మర్డర్ కేసులో ఎలా ఇరుక్కుంటుంది ? ఈ కేసులో ఎలాంటి నిజాలు వెలుగు చూస్తాయనేదే మిగతా కథ.

ఫొటో సోర్స్, Aditya Music/FB
అసలు కథ విరామం తర్వాతే...
నైబర్ నెంబర్ అనే కాన్సెప్ట్‌తో ఈ కథను మొదలుపెట్టాడు దర్శకుడు. ఒక ఫోన్ నెంబర్ కు అటు ఇటుగా ఉండే నెంబర్లకు ఫోన్ చేసి వాళ్ళతో స్నేహం ఏర్పడితే ఎలా వుంటుందనే ఆలోచన ఈ కథకు మూలం కావచ్చు. అయితే ఇది జస్ట్ కాన్సెప్ట్ వరకు మాత్రమే. దీనికి రెగ్యులర్ లవ్, కామెడీ యాడ్ చేసి ఒక మర్దర్ మిస్టరీని కూడా జోడించాడు. ఇదంతా ప్రేక్షలను ఎక్కడా బోర్ కొట్టించకుండా ఎంగేజింగా ఉంచే ప్రయత్నం.
ఈ ప్రయత్నం విరామం ఘట్టం వరకూ సాగదీతగానే వుంటుంది. రాజన్ అనే గ్యాంగ్ స్టర్‌ను పట్టుకోవడానికి ఎన్ఐఏ ప్రయత్నించడంతో మొదలయ్యే కథ.. విష్ణు, దర్శన, శర్మ పాత్రల పరిచయంతో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు అలా సాగుతుంటాయి కానీ ఏదీ పెద్దగా ఆసక్తిని కలిగించదు. ఒక సమయం వరకూ అసలు ఇందులో కథ ఎక్కడ వుంది? దేని కోసం పాత్రలు ప్రయాణం చేస్తున్నాయనే స్పష్టతా ఉండదు. అయితే, శర్మ, దర్శనల యూట్యూబ్ వీడియో పాట్లు మాత్రం కాస్త నవ్విస్తాయి.
శర్మను చంపడానికి ఏకాంతం (పమ్మి సాయి) సుపారీ ఇవ్వడం తర్వాత జరిగే ఎటాక్ కథని కొంత థ్రిల్ ని క్రియేట్ చేస్తాయి. ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఎపిసోడ్ ని మాత్రం చాలా ఆసక్తికరంగా తీశారు. ఆ మలుపు బావుంది. అదే సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతోంది. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ లో కథ కాస్త వేగంగా కదులుతుంది. దర్శన కేసులో విష్ణు కొన్ని నిజాలు తెలుసుకోవడం ఆసక్తిని రేపుతోంది. అయితే, ఆ కేసుని చేధించడానికి నైబర్ నెంబర్ కాన్సెప్ట్ ని వాడటం మరీ సిల్లీగా అనిపిస్తుంది.
నిజానికి ఈ కథ ప్రీ క్లైమాక్స్ లోనే అయిపోతుంది. దాన్ని ఇంకా ముందుకు కొనసాగిస్తూ దేశభక్తి కోణాన్నీ ఇందులో చెప్పించారు. అప్పటి వరకూ ఒక కథ వుంటే.. సడన్ పై తెరపైకి మరో కథను తీసుకోచ్చారనే భావన కలుగుతుంది. దేశభక్తి గురించి చెప్పిన డైలాగులు బావున్నా.. ఈ కథని ముగించిన తీరు మితిమీరిన సినిమా స్వేచ్ఛ అనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Geetha Arts/FB
పక్కింటి కుర్రోడిలా కిరణ్ అబ్బవరం
కిరణ్ అబ్బవరంకు ఒక సహజమైన స్టయిల్ వుంది. పక్కింటి కుర్రాడిలా కనిపిస్తుంటాడు. ఇందులో విష్ణు పాత్ర కూడా అలానే వుంటుంది. అయితే, తన ఇమేజ్‌కి మించి చేసిన భారీ యాక్షన్ సీన్లు రెండు ఈ కథకి అవసరం లేదనిపిస్తుంది. చిత్తూరు యాస చక్కగా పలికాడు కానీ దాన్ని కొనసాగించలేదు.
దర్శన పాత్రని క్యూట్ గా తీర్చిదిద్దారు. కథలో కీలకమైన పాత్రే. మురళిశర్మ కు ఫుల్ మార్కులు పడతాయి. ఆ పాత్ర చాలా మిస్టీరియస్ గా తీర్చిదిద్దాడు దర్శకుడు. తన అనుభవంతో ఆ పాత్రకు న్యాయం చేశాడు.
తాతయ్య పాత్రలో కనిపించిన శుభలేఖ సుధాకర్ వాయిస్ ఓవర్ గా అక్కడక్కగా కనిపిస్తుంది. ఏకాంతం పాత్రలో చేసిన పమ్మిసాయి పర్వాలేదనిపించాడు. రాజన్ గా చేసిన శరత్ విష్ణు చెప్పిన కథని వినే పాత్ర.
అయితే మొదట చాలా బిల్డప్ ఇచ్చి చివర్లో ఆ పాత్రని కామెడీ పీస్ చేశారు. ఆమనీ, దేవి ప్రసాద్, ప్రవీణ్, లక్కీ కేజీఎఫ్, ఎల్ బి శ్రీరాం పాత్రలు పరిధిమేర వున్నాయి.
పాటలు గుర్తుండవు కానీ చిత్రీకరణ మాత్రం కూల్ గా చేశారు. తిరుపతిలో చిత్రీకరించిన పాట అందంగా ఉంది. నేపథ్య సంగీతం బావుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా వున్నాయి. 'అమ్మాయిలు ఎప్పుడు తల దించుకూడదు'' అనే మాట సందర్భాని తగ్గట్టు చక్కగా వాడారు. అందులో ఎమోషన్ కూడా వుంది.
ప్రేక్షకులకు బోర్ కొట్టించకూడదనే ఉద్దేశంతో దాదాపు అన్నీ రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఒక కాన్సెప్ట్ ని కూడా జోడించి విష్ణు కథ చెప్పాడు దర్శకుడు. అయితే ఈ కలగాపులగం వంటకం సగం మాత్రమే ఉడికింది.

ఇవి కూడా చదవండి:
- నిక్కీ యాదవ్ మర్డర్: గర్ల్‌ఫ్రెండ్‌ను చంపి ఫ్రిజ్‌లో పెట్టి, మరుసటి రోజే ఇంకో అమ్మాయిని పెళ్లాడిన యువకుడి కేసులో పోలీసులు ఏం చెప్పారు?
- అదానీ వివాదం, బీబీసీ డాక్యుమెంటరీ, 2024 ఎన్నికలపై అమిత్ షా ఏమన్నారు?
- కొత్తవీధి, గుంటి: గిరిజనులు సాగుచేసే ఈ గ్రామాలు రికార్డుల్లో ఎలా మాయం అయ్యాయి?
- ఎయిరిండియా: రికార్డు సంఖ్యలో విమానాల కొనుగోలుతో అంతర్జాతీయ సంస్థలకు సవాల్ విసరబోతోందా?
- మూడు రాజధానుల ముచ్చట ముగిసిందా? విశాఖపట్నం ఒక్కటే రాజధాని అని ఎందుకు చెప్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










