మహిళల ఐపీఎల్: మహిళా క్రికెటర్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్.. దేశంలో మరొక ‘విప్లవం’ అవుతుందా?

హర్మన్ ప్రీత్ కౌర్‌ స్మృతి మంధాన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహిళల టీ20 ఛాలెంజ్ సందర్భంగా హర్మన్ ప్రీత్ కౌర్‌, స్మృతి మంధాన

మహిళల ప్రీమియర్ లీగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. మార్చి 4 నుంచి మార్చి 26 వరకు ముంబైలో మహిళల ప్రీమియర్ లీగ్ జరుగుతుందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు.

క్రిక్‌బజ్ వెబ్‌సైట్ ప్రకారం, మహిళల ప్రీమియర్ లీగ్‌లో మొదటి మ్యాచ్ ముంబై, అహ్మదాబాద్ జట్ల మధ్య జరిగే అవకాశం ఉంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

భారత్‌లో పురుషుల ఐపీఎల్ ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందింది. కొత్తగా ఆరంభం కానున్న మహిళల ప్రీమియర్ లీగ్‌పై కూడా ఫ్రాంచైజీలు ఆసక్తిని కనబరుస్తున్నాయి.

పాక్షికంగా 2018 నుంచి, బీసీసీఐ 'మహిళల ట్20 ఛాలెంజ్'ని నిర్వహిస్తోంది. ఇందులో 'ఐపీఎల్ సూపర్‌నోవా', 'ఐపీఎల్ ట్రైల్‌బ్లేజర్స్', 'ఐపీఎల్ వెలాసిటీ' జట్లు పాల్గొన్నాయి.

డబ్ల్యూపీఎల్‌లో కొత్త జట్లు..

డబ్ల్యూపీఎల్‌లో ఐదు వేర్వేరు ఫ్రాంచైజీలు మొత్తం రూ. 4,669 కోట్లకు బిడ్ చేశాయి. అదానీ స్పోర్ట్స్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్ అత్యంత ఖరీదైన అహ్మదాబాద్‌ జట్టును రూ. 1,289 కోట్లకు కొనుగోలు చేసింది.

ఇండియావిన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై జట్టును రూ. 912.99 కోట్లకు, రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు జట్టును రూ. 901 కోట్లకు కొనుగోలు చేశాయి.

జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ దిల్లీ జట్టును రూ. 810 కోట్లకు, కాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లఖ్‌నవు జట్టును రూ. 757 కోట్లకు కొనుగోలు చేశాయి.

మహిళల ప్రీమియర్ లీగ్

ఫొటో సోర్స్, MUMBAI INDIANS@TWITTER

క్రీడాకారిణల వేలం..

ఫిబ్రవరి 13న పై జట్లకు క్రీడాకారిణల వేలం జరిగింది. ఒక్కో ఫ్రాంచైజీ ఆటగాళ్ల వేలం కోసం అధికంగా 12 కోట్ల మొత్తాన్ని వెచ్చించేందుకు అనుమతినిచ్చారు. ఈ మొత్తంతో 15 నుంచి 18 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఆరుగురు విదేశీ ఆటగాళ్లు ఉండవచ్చు.

వేలం ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ డబ్ల్యూపీఎల్ లోగోను ఆవిష్కరించారు.

భారత వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన పేరుతో వేలం ప్రక్రియ మొదలైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ స్మృతి మంధానను రూ. 3.4 కోట్లకు ఆమెను కొనుగోలు చేసింది. తొలుత ముంబై ఇండియన్స్ రూ.50 లక్షలకు ఆమె కోసం బిడ్డింగ్‌ను మొదలుపెట్టింది. వెంటనే ఆర్‌సీబీ పోటీకి దిగింది. చివరకు ఆర్సీబీ ఆమెను సొంతం చేసుకుంది.

తరువాత, హర్మన్ ప్రీత్ కౌర్‌ను ముంబై ఇండియన్స్ జట్టు రూ. 1.8 కోట్లకు కొనుగోలు చేసింది.

భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ మంచి ధర పలికింది. మార్క్యూ ప్లేయర్ల జాబితాలో రూ. 50 లక్షల బేస్‌ ప్రైజ్‌తో వచ్చిన దీప్తి శర్మను రూ. 2.6 కోట్లకు యూపీ వారియర్స్ దక్కించుకుంది.

భారత బౌలర్ రేణుక సింగ్ కోసం ఆర్‌సీబీ, దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చివరకు రూ. 1.5 కోట్లకు రేణుక సింగ్‌ను ఆర్‌సీబీ జట్టు దక్కించుకుంది.

భారత యువ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌ను దిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ. 2.2 కోట్లకు కొనుగోలు చేసింది.

భారత హిట్టింగ్ బ్యాటర్ షెఫాలీ వర్మను దిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మొత్తం వేలం వివరాలు ఇవీ..

దిల్లీ ఫ్రాంచైజీ

  • జెమీమా రోడ్రిగ్స్ (భారత్, బ్యాటర్): రూ. 2.2 కోట్లు
  • షెఫాలీ వర్మ (భారత్, బ్యాటర్): రూ. 2.0 కోట్లు
  • మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా, బ్యాటర్): రూ. 1.1 కోట్లు
  • రాధా యాదవ్ (భారత్, ఆల్‌రౌండర్): రూ. 40 లక్షలు

గుజరాత్ జెయింట్స్

  • ఆష్లే గార్డ్‌నర్ (ఆస్ట్రేలియా, ఆల్‌రౌండర్) రూ. 3.2 కోట్లు
  • బేత్ మూనీ (ఆస్ట్రేలియా, వికెట్ కీపర్) రూ. 2.0 కోట్లు
  • అనాబెల్ సుదర్లాండ్ (ఆస్ట్రేలియా, ఆల్‌రౌండర్): రూ. 70 లక్షలు
  • డియోండ్ర డాటిన్ (వెస్టిండీస్, ఆల్‌రౌండర్): రూ. 60 లక్షలు
  • సోఫియా డంక్లే (ఇంగ్లండ్, బ్యాటర్) రూ. 60 లక్షలు
  • హర్లీన్ డియోల్ (భారత్, ఆల్‌రౌండర్): రూ. 40 లక్షలు

ముంబై ఇండియన్స్

  • నటాలియా స్కివర్ (ఇంగ్లండ్, ఆల్‌రౌండర్) రూ. 3.2 కోట్లు
  • పూజ వస్త్రకర్ (భారత్, ఆల్‌రౌండర్): రూ. 1.9 కోట్లు
  • హర్మన్ ప్రీత్ కౌర్ (భారత్, ఆల్‌రౌండర్) రూ. 1.8 కోట్లు
  • యస్తిక భాటియా (భారత్, వికెట్ కీపర్): రూ. 1.5 కోట్లు
  • అమెలియా కెర్ (న్యూజీలాండ్, ఆల్‌రౌండర్) రూ. 1.0 కోట్లు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

  • స్మృతి మంధాన (భారత్, బ్యాటర్) రూ. 3.4 కోట్లు
  • రిచా ఘోష్ (భారత్, వికెట్‌కీపర్): రూ. 1.9 కోట్లు
  • ఎలిస్సా పెర్రీ (ఆస్ట్రేలియా, ఆల్‌రౌండర్) రూ. 1.7 కోట్లు
  • రేణుక సింగ్ (భారత్, బౌలర్) రూ. 1.5 కోట్లు
  • సోఫీ డివైన్ (న్యూజీలాండ్, ఆల్‌రౌండర్) రూ. 50 లక్షలు

యూపీ వారియర్స్

  • దీప్తి శర్మ (భారత్, ఆల్‌రౌండర్) రూ. 2.6 కోట్లు
  • సోఫీ ఎకెల్‌స్టోన్ (ఇంగ్లండ్, ఆల్‌రౌండర్) రూ. 1.8 కోట్లు
  • తహ్లియా మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా, ఆల్‌రౌండర్) రూ. 1.4కోట్లు
  • షబ్నిమ్ ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా, బౌలర్) రూ. 1.0 కోట్లు
  • అలిస్సా హేలీ (ఆస్ట్రేలియా, వికెట్ కీపర్): రూ. 70 లక్షలు
  • అంజలి శర్వాణి (భారత్, బౌలర్): రూ. 55 లక్షలు
  • రాజేశ్వరీ గైక్వాడ్ (భారత్, బౌలర్): రూ. 40 లక్షలు

డబ్ల్యూపీఎల్ మీడియా హక్కులను ఈ ఏడాది జనవరిలో వయాకాం 18కి విక్రయించారు.

వయాకామ్ 18 వచ్చే అయిదేళ్లకు మహిళల ప్రీమియర్ లీగ్ మీడియా హక్కులను రూ. 951 కోట్లకు కొనుగోలు చేసింది.

మహిళల ప్రీమియర్ లీగ్

ఫొటో సోర్స్, Getty Images

మహిళల ఐపీఎల్‌ పగ్గాలు ఎవరి చేతిలో ఉంటాయి?

మహిళల ప్రీమియర్ లీగ్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) నిర్వహిస్తుంది. దాని యాజమాన్య హక్కులు కూడా బోర్డుకే సొంతం.

తొలి ఐదేళ్లలో మ్యాచ్‌ల ద్వారా వచ్చే లాభాల్లో 80 శాతం ఫ్రాంచైజీ యజమానులకు ఇస్తుంది. తదుపరి ఐదు సీజన్లలో 60 శాతం లాభం మాత్రమే ఇస్తుంది.

సీజన్ 11 నుంచి సీజన్ 15 వరకు వచ్చే లాభాల్లో 50 శాతం ఫ్రాంఛైజీలకు అందిస్తుంది.

ఇది కాకుండా, ఫ్రాంఛైజీలు సరుకులు విక్రయించడం, టిక్కెట్ల అమ్మకాలు, ప్రకటనల ద్వారా కూడా కొంత లాభం పొందవచ్చు.

డబ్ల్యూపీల్ ఎందుకు ప్రత్యేకం?

1976 నుంచి భారతదేశంలో మహిళల క్రికెట్ జరుగుతోంది. ఆ సంవత్సరం భారత మహిళల జట్టు తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది. 1978లో ఈ జట్టు ప్రపంచ కప్ ఆడింది. ఈ అంతర్జాతీయ టోర్నమెంటుకు భారత్ ఆతిధ్యమిచ్చింది.

2007లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటికీ, మహిళా క్రికెటర్లను ఈ లీగ్‌లో చేర్చలేదు.

భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వుమెన్స్ ప్రీమియర్ లీగ్ గురించి రాసిన్ ట్వీట్ చూస్తే ఇది ఎందుకంత ప్రాముఖ్యమో అర్థమవుతుంది.

"డబ్ల్యూపీల్ భారతదేశంలో మహిళల క్రికెట్‌ను మలుపు తిప్పే ఘటన మాత్రమే కాదు. ఇదొక విప్లవం" అన్నారామె.

మహిళల ప్రీమియర్ లీగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫ్రాంఛైజీలు ఏమంటున్నాయి?

అహ్మదాబాద్ ఫ్రాంచైజీ అదానీ స్పోర్ట్స్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్ హెడ్ సత్యం త్రివేది డబ్ల్యూపీఎల్ గురించి మాట్లాడుతూ, "ఇది చాలా మంచి ప్రారంభం. మేం దీని కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. ఈ లీగ్ విదేశీ మహిళా క్రికెటర్లకు కూడా ప్రోత్సాహకంగా ఉంటుంది" అన్నారు.

దిల్లీ ఐపీఎల్ జట్టు సహ యజమాని, చైర్మన్ పార్థ్ జిందాల్ డబ్ల్యూపీఎల్‌లో కూడా దిల్లీ జట్టును దక్కించుకున్నారు.

"డబ్ల్యూపీల్ మహిళా క్రికెటర్ల నైపుణ్యాలను వెలికితీసే మంచి వేదిక అవుతుందనడంలో సందేహం లేదు" అని పార్థ్ అన్నారు.

లక్నో ఫ్రాంచైజీ కాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ "డబ్ల్యూపీల్ ప్రారంభం చారిత్రాత్మకమని" అభివర్ణించింది. "మహిళా క్రికెటర్ల అభ్యున్నతికి ముందడుగు" అని అభిప్రాయపడింది.

డబ్ల్యూపీఎల్ ద్వారా యువ మహిళా క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ లీగ్ ద్వారా కొత్త క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుందని, పురుషుల క్రికెట్‌తో సమానంగా మహిళల క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఫ్రాంచైజీలు అంటున్నాయి.

మహిళల ప్రీమియర్ లీగ్

ఫొటో సోర్స్, ANI

ఎంత సమానత్వం, ఎంత అసమానత?

15 ఏళ్ల క్రితం 2008లో ఐపీఎల్ కోసం ఎనిమిది జట్లకు వేలంపాట జరిగింది.

సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక ప్రకారం, ప్రపంచంలో అత్యధికంగా వీక్షించే క్రికెట్ లీగ్ ఐపీఎల్.

ఐపీఎల్ తరువాత, ఇప్పుడు మహిళల ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్‌గా అవతరించింది.

పురుష ఆటగాళ్లతో సమానంగా మహిళా ఆటగాళ్లను ముందుకు తీసుకురావడంలో ఈ లీగ్ కీలకమైన పాత్ర పోషించగలదు.

2022లో మహిళా క్రికెటర్లకు పురుష క్రికెట్ ప్లేయర్‌లతో సమానంగా ఫీజులు చెల్లిస్తామని చెప్పారు.

అయితే, గ్రేడ్ ఏ పురుష క్రీడాకారులు, మహిళా క్రీడాకారుల కాంట్రాక్టులు చాలా వివక్షాపూరితంగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఏటా గ్రేడ్‌ ఏ పురుష ఆటగాళ్లకు రూ. 7 కోట్ల కాంట్రాక్ట్‌ ఇస్తుండగా, మహిళా ఆటగాళ్లకు రూ. 50 లక్షలకే కాంట్రాక్ట్‌ ఇస్తున్నారు.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)