భారత మహిళా క్రికెటర్ల కష్టాలు, పడే పాట్లు వింటే ఆశ్చర్యం, బాధ కలుగుతాయి

ఫొటో సోర్స్, MICHAEL BRADLEY
- రచయిత, శారద ఉగ్ర
- హోదా, సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం
భారత యువ మహిళా క్రికెటర్లు ఇటీవల ఐసీసీ అండర్ 19 టీ20 ప్రపంచ కప్ గెలిచి అంతర్జాతీయ స్థాయిలో దేశ జెండాను రెపరెపలాడించారు.
ఫైనల్స్‌లో బలమైన ఇంగ్లండ్ మహిళల జట్టును ఓడించి కప్పు సొంతం చేసుకున్నారు కాబట్టి భారత్‌కు ఇది పెద్ద విజయమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు, మహిళల ఐపీఎల్ ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. దీనిపై అన్నివైపుల నుంచి కుతూహలం కనబడుతోంది. విస్తృతంగా చర్చ జరుగుతోంది.
మహిళల క్రికెట్ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్), దాని మీడియా హక్కులపై పెట్టుబడులు పెడుతున్నారు.
రానున్న రోజుల్లో దేశంలో పురుషుల క్రికెట్‌కు దీటుగా మహిళల క్రికెట్ ఎదగబోతుందన్న దానికి ఇదే నిదర్శనం. మహిళా క్రికెటర్లు క్రమక్రమంగా ఆటలో తమ చోటును దక్కించుకుంటున్నారు.
దేశంలో మహిళల క్రికెట్ చరిత్ర 1970లలో ప్రారంభమైంది. కానీ దానికి చాలా కాలం ముందే, 1745లో తొలి అధికారిక మ్యాచ్ జరిగింది.
క్రీడా ప్రపంచంలో పురుషుల క్రికెట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. భారతదేశం అందుకు మినహాయింపు కాదు. మనదేశంలో మహిళా క్రికెట్ పట్ల కొంత చిన్నచూపు కూడా ఉంది.
భారత క్రికెట్ ప్రపంచంలో గుర్తింపు కోసం మహిళలు పడ్డ సంఘర్షణలు అన్నీ ఇన్నీ కావు. ఎంతో ప్రతిభావంతమైన మహిళా క్రికెటర్లు ఉన్నప్పటికీ పురుషులకు వచ్చినంత గుర్తింపు వాళ్లకు రాలేదు. మహిళా క్రికెట్‌కు ఆదరణ ఉండేది కాదు.
ఇప్పుడిప్పుడే క్రికెట్‌లో మహిళలు తమ గుర్తింపును సాధించుకుంటున్నారు.
భారతదేశంలో మహిళా క్రికెటర్ల పోరాటాలు వింటే మనసు బరువెక్కుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది.

ఫొటో సోర్స్, ANI
రైల్లో సెకండ్ క్లాస్‌లోనే ప్రయాణం
1970ల చివరి నుంచి 1980ల వరకు, భారత మహిళా జట్టు రైళ్లల్లో సెకండ్ క్లాస్‌లోనే ప్రయాణం చేసేవారు. శాంత రంగస్వామి, డయానా ఎడుల్జీ లాంటి దిగ్గజాలకు కూడా ఇదే పరిస్థితి.
కొన్నిసార్లు రిజర్వేషన్ లేని ప్రయాణాలు కూడా చేయాల్సి వచ్చేది. ఆటగాళ్లు తమ కిట్లతో, రిజర్వేషన్ లేకుండా దూరాలు వెళ్లేవారు.
రెండు మహిళా జట్లకు ఒక పెద్ద పాఠశాలలోని ప్రేయర్ హాల్‌లో నేలపై పరుపులు పరచి బస ఏర్పాటు చేశారంటే అప్పట్లో వాళ్లకు ఎలాంటి సౌకర్యాలు కల్పించేవారో అంచనా వేయవచ్చు.
ఒకానొక సమయంలో మహిళా క్రికెటర్లకు సరైన ఫీజులు కూడా దక్కేవి కావు. ఫీజు ఇవ్వకపోతే వరల్డ్ కప్ ఆడబోమని మహిళలు నిరసించిన రోజులు కూడా ఉన్నాయి.
మహిళా క్రికెట్‌ను పర్యవేక్షించే బాధ్యతను బీసీసీఐ తీసుకున్న తరువాత కూడా పరిస్థితిలో పెద్ద మార్పు ఏమీ రాలేదు.
పురుష ఆటగాళ్లకు స్పాన్సర్‌లు ఇచ్చే దుస్తుల్లో మిగిలిపోయినవి వేసుకుని మహిళలు మైదానంలో ఆడేవాళ్లు.
ఒకసారి భారత క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ ఒకరు భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీతో ఏమన్నారంటే, "నా మాట నెగ్గే పరిస్థితి ఉంటే, అసలు మహిళల క్రికెట్ జరగనివ్వను".
అలాంటి కాలాన్ని కూడా దాటుకుని వచ్చారు మన మహిళా క్రికెటర్లు.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరిగింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ కూడా మహిళల క్రికెట్‌ను ప్రోత్సహిస్తున్నాయి.
పలు సందర్భాలలో భారత మహిళా క్రికెటర్లు మైదానంలో తమ ప్రదర్శనతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.

ఫొటో సోర్స్, ANI
ప్రధాన టోర్నమెంటుల్లో భారత మహిళా జట్టు...
భారత మహిళల జట్టు రెండు ప్రధాన ఐసీసీ ఈవెంట్‌లలో ఫైనల్స్‌కు చేరుకుంది.
2017 మహిళల ప్రపంచకప్, 2020 టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ రెండూ మహిళల క్రికెట్‌లో మైలురాళ్లు. ఈ విజయాలతో మహిళా క్రికెటర్లకు మరింత గుర్తింపు వచ్చింది.
భారత అగ్రశ్రేణి మహిళా క్రీడాకారులకు వుమెన్స్ బిగ్ బాష్ టోర్నమెంట్, ఇంగ్లాండ్‌లోని కేఈఏ సూపర్ లీగ్, వుమెన్స్ హండ్రెడ్‌లో ఆడే అవకాశం వచ్చింది.
పురుషుల ఆధిపత్యం ఉన్న క్రీడలో మహిళలు కొత్త చరిత్ర లిఖిస్తున్నారు.
ఓవర్ ఆర్మ్ డెలివరీ కనిపెట్టింది ఒక మహిళా క్రికెటర్
ప్రస్తుత కాలంలో క్రికెట్‌లో బౌలర్లు ఓవర్ ఆర్మ్ బౌలింగ్ చేస్తున్నారు. కానీ, 1822లో కెంట్‌కి చెందిన జాన్ విల్లీస్ తొలిసారి ఓవర్ ఆర్మ్ బౌలింగ్ చేసినప్పుడు, దాన్ని నో బాల్‌గా తీర్మానించారు.
విల్లీస్ ఓవర్ ఆర్మ్ బౌలింగ్ తన సోదరి నుంచి నేర్చుకున్నాడు.
క్రిస్టినా విల్లీస్ తన సోదరుడికి అండర్ ఆర్మ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు పదే పదే ఆమె చేతికి స్కర్ట్ తగులుకుని ఇబ్బంది పెట్టేది. దాంతో, క్రిస్టీనా ఓవర్ ఆర్మ్ బౌలింగ్ చేయడం ప్రారంభించింది.
అది చూసి జాన్ విల్లీస్ కూడా మ్యాచ్‌లో ఓవర్ ఆర్మ్ బౌలింగ్ చేశాడు. కానీ, దాన్ని నో బాల్‌గా ప్రకటించడంతో అతడు కోపంతో ఆట నుంచి నిష్క్రమించాడు.
చివరికి, 1864లో ఓవర్ ఆర్మ్ బౌలింగ్‌ను క్రికెట్‌లో అంగీకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేసి, 10 వికెట్లు తీసిన తొలి క్రికెటర్ ఎవరు?
ఈ ప్రశ్నకు చాలామంది ఇయాన్ బోథం అని సమాధానం చెబుతారు. అదే సరైన జవాబుగా చలామణి అవుతోంది కూడా.
అయితే ఇది తప్పు. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ బెట్టీ విల్సన్ టెస్టు క్రికెట్‌లో తొలిసారిగా ఈ ఫీట్‌ను సాధించారు.
1948-1958 మధ్య ఆస్ట్రేలియా తరపున ఆడిన విల్సన్‌ను ఉమన్ బ్రాడ్‌మన్ అని కూడా పిలుస్తారు.
1958లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో ఆఫ్ స్పిన్నర్ బెట్టీ విల్సన్ ఒక టెస్ట్‌లో 11 వికెట్లు పడగొట్టింది. సెంచరీ కూడా చేసింది. అదే ఆమెకు చివరి టెస్ట్ సీరీస్.
నిజానికి, ఒక టెస్ట్‌లో రెండు ఇన్నింగ్ కలిపి, ఒక సెంచరీ సహా 10 వికెట్లు తీసిన ఘనత ఇయాన్ బోథం కన్నా 22 ఏళ్ల ముందు ఆస్ట్రేలియా క్రికెటర్ ఎలాన్ డేవిడ్‌సన్ సాధించాడు.
వన్డే క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ చేసింది ఎవరు?
సచిన్ టెండూల్కర్ అభిమానులు గ్వాలియర్‌లో అతడు చేసిన డబుల్ సెంచరీని మర్చిపోలేరు.
కానీ, వన్డే క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీని ఆస్ట్రేలియా వుమన్ ప్లేయర్ బిలిండా క్లార్క్ 1997లోనే సాధించింది.
1997 ప్రపంచకప్‌లో ముంబైలో జరిగిన మ్యాచ్‌లో డెన్మార్క్‌పై డబుల్ సెంచరీ చేసింది బిలిండా క్లార్క్.
ఆ తరువాత 13 ఏళ్లకి సచిన్ టెండూల్కర్ ఈ ఘనత సాధించాడు.

ఫొటో సోర్స్, DENNIS OULDS
ఫస్ట్ వరల్డ్‌కప్ మహిళలదా, పురుషులదా?
నాలుగేళ్లకోసారి వచ్చే వరల్డ్‌కప్ కోసం క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు.
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో భారత్‌లో పురుషుల వరల్డ్‌కప్ జరగనుంది. ఇప్పటికే ఉత్సాహం ప్రారంభమైంది.
కానీ, మొదటి ప్రపంచకప్ పురుషుల క్రికెట్‌లో జరగలేదని ఎంతమందికి తెలుసు?
వరల్డ్‌కప్ మొదట మహిళా క్రికెట్‌లోనే ప్రారంభమైంది.
1973లో తొలిసారిగా ఇంగ్లండ్‌లో మహిళల ప్రపంచకప్ నిర్వహించారు. ఫైనల్స్ లార్డ్స్ మైదానంలో జరిగింది.
ఆ తరువాత 1975లో పురుషుల తొలి వరల్డ్ కప్ ప్రారంభమైంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, లార్డ్స్ మైదానాన్ని నిర్వహించే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) 1999 వరకు మహిళలకు సభ్యత్వం ఇవ్వలేదు.
తొలి ప్రపంచకప్‌లో భారత జట్టు పాల్గొనలేకపోయింది. కానీ 1978లో రెండో ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమిచ్చింది. ఇందులో భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మహిళల జట్లు పాల్గొన్నాయి.
ఆ తరువాత తొమ్మిదేళ్లకు భారత్.. పురుషుల ప్రపంచకప్‌కు ఉమ్మడి ఆతిథ్యం ఇచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
1978లో భారత్‌లో మహిళల ప్రపంచకప్
పట్నా, జంషెడ్‌పూర్, కలకత్తా (ఇప్పుడు కోల్‌కతా) హైదరాబాద్‌లలో మ్యాచ్‌లు జరిగాయి.
విదేశీ మహిళా క్రికెటర్లను చూసేందుకు 25 నుంచి 30 వేల మంది ప్రేక్షకులు గుమికూడేవారు. వాళ్ల ఆటోగ్రాఫ్‌లు అడిగి తీసుకునేవారు.
ఆ తరువాత మళ్లీ భారత్ 1997, 2013లలో ప్రపంచ కప్‌కు ఆతిథ్యమిచ్చింది.
మహిళల క్రికెట్‌లోనే అంతర్జాతీయ టీ20 క్రికెట్ ప్రారంభమైంది. 2004 ఆగస్టులో, ఇంగ్లండ్ మహిళల జట్టు సస్సెక్స్‌లోని హోవ్‌లో న్యూజిలాండ్‌తో మొదటి టీ20 ఇంటర్నేషనల్ ఆడింది.
2003లో ఇంగ్లిష్ క్రికెట్ బోర్డు టీ20 క్రికెట్‌ను ఇంటర్ కౌంటీ క్రికెట్‌గా ప్రారంభించింది.
2005కి ముందు అంతర్జాతీయ మహిళా క్రికెట్ కౌన్సిల్ ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్‌ను నిర్వహించేది. దీన్ని 1958లో స్థాపించారు. 2005లో దీన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో విలీనం చేశారు.
పురుషుల మొదటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ 2005 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగింది.
ఇదే కాదు, 2008లో ఆస్ట్రేలియా క్రికెట్ పింక్ బాల్ ట్రయల్‌ను ప్రారంభించినప్పుడు.. క్వీన్స్‌లాండ్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య పింక్ బాల్‌తో తొలి ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించింది.
ఇప్పుడు పురుషుల టెస్టు మ్యాచ్‌లకు పింక్ బాల్‌ను ఉపయోగిస్తున్నారు.
మహిళా క్రికెట్‌లో ఇలాంటి ఎన్నో చారిత్రక వాస్తవాలు ఉన్నాయి. కానీ, చాలామందికి ఇవి తెలియవు.

ఇవి కూడా చదవండి:
- ట్విటర్ బ్లూటిక్ సేవలు ఇండియాలో మొదలు.. టిక్ కావాలంటే ఎంత ఖర్చయిద్దంటే...
- అకస్మాత్తుగా కుప్పకూలటం, ఐసీయూలో చేరటం పెరుగుతోంది, ఎందుకిలా జరుగుతోంది?
- ఎల్జీబీటీ: గే, ట్రాన్స్‌జెండర్ పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు ఎంత కష్టం, ఎలాంటి సమస్యలుంటాయి?
- రక్తహీనత: మన శరీరంలో రక్తం ఎందుకు తగ్గిపోతుంది, మళ్లీ పెరగాలంటే ఏం చేయాలి?
- హైదరాబాద్: ఫార్ములా ఈ రేస్ ప్రత్యేకత ఏమిటి... తెలంగాణకు అవకాశం ఎలా వచ్చింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













