కర్నాటక: బీజేపీ నాయకుడి హత్య.. అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, UMESH MARPALLY
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
కర్నాటకలో బీజేపీ యువ మోర్చా నాయకుడు ప్రవీణ్ నేత్తారు హత్య అనంతరం నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి.
ప్రవీణ్ అంత్యక్రియలకు బుధవారం వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నవీన్ కుమార్ కతీల్‌పై కొందరు నిరసనకారులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు.
ప్రవీణ్ మృతదేహాన్ని చూసేందుకు ఆలస్యంగా వచ్చినందుకు నవీన్‌పై బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. మంగళవారం రాత్రే ఆయన ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు.
మంగళవారం సాయంత్రం కొందరు బైక్‌లపై వచ్చి ప్రవీణ్‌ను పదునైన ఆయుధాలతో పొడిచారు.
‘‘ఇప్పటివరకు ఈ కేసులో ఒక్కరినీ అరెస్టు చేయలేదు. అసలు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మేం బీజేపీ కార్యకర్తలం. మా సొంత నాయకులు కూడా సమయానికి రాలేదు. మా నాయకులకు వ్యతిరేకంగానే మేం నిరసనలు చేపట్టడం దురదృష్టకరం’’అని నిరసనలు చేపడుతున్న ఒక కార్యకర్త ఒక మీడియా ఛానెల్‌తో చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
‘‘ఎన్ఐఏతో దర్యాప్తు చేపట్టాలి’’
ప్రవీణ్ హత్యపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)తో విచారణ చేపట్టించాలని కేంద్ర మంత్రి శోభ కరందలాజే డిమాండ్ వ్యాఖ్యానించారు.
32ఏళ్ల ప్రవీణ్ సొంతఊరు కర్నాటకలోని బెల్లారె. దక్షిణ కన్నడలోని మంగళవారం సాయంత్రం ఆయనపై దాడి జరిగింది.

ఫొటో సోర్స్, UMESH MARPALLY
ప్రవీణ్ హత్య తర్వాత.. కేరళ తరహాలోనే వరుసగా ఆరెస్సెస్-సీపీఎం కార్యకర్తల హత్యలు జరుగుతాయని ఆందోళనలు వ్యక్తం అయ్యాయి.
బెల్లారెలో గతవారం 19ఏళ్ల నిర్మాణ రంగ కూలీ మసూద్ హత్యకు ప్రతీకారంగానే ప్రస్తుతం ప్రవీణ్‌ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందిన మసూద్ బెల్లారెలో తన తాతయ్య ఇంటికి వచ్చారు. అయితే, స్థానికులతో ఆయనకు వాగ్వాదం జరిగింది. అనంతరం ఎనిమిది మంది ఆయనపై దాడి చేశారు.
‘‘మసూద్ హత్య కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపడుతున్నాం. ఇప్పటివరకు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నాం’’అని కర్నాటక ఏడీజీపీ అలోక్ కుమార్ చెప్పారు.
మరోవైపు ప్రవీణ్ హత్యపై దిల్లీలో విలేకరులతో కేంద్ర మంత్రి శోభ కరందలాజే మాట్లాడారు.
‘‘ఆ ప్రాంతం కర్నాటక-కేరళ సరిహద్దులకు సమీపంలోనే ఉంటుంది. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)తో విచారణ చేపట్టించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరతాను. ప్రవీణ్ చాలా చురుగ్గా ఉంటారు. ఆయనకు ఎలాంటి నేర చరిత్రా లేదు’’అని ఆమె అన్నారు.
ఈ కేసుపై కర్నాటక డీజీపీతోపాటు కేరళ అధికారులతోనూ మాట్లాడానని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై చెప్పారు.
కర్నాటకలోని సులియా తాలూకా ప్రాంతానికి కాసర్‌గోడ్ జిల్లాతో సరిహద్దులు ఉంటాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలోనే హత్య జరిగింది.
‘‘ఈ కేసు దర్యాప్తులో కేరళ పోలీసులు మాకు పూర్తిగా సహకరిస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనలను మేం పరిశీలిస్తున్నాం’’అని బసవరాజు చెప్పారు.
ప్రవీణ్ హత్య అనంతరం పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. స్థానిక పోలీస్ స్టేషన్‌ను పెద్దయెత్తున నిరసనకారులు చుట్టుముట్టారు.
మరోవైపు ప్రవీణ్ అంత్యక్రియలకు కూడా చాలా మంది హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు.
ప్రవీణ్ అంత్యక్రియలకు వచ్చిన రాష్ట్ర మంత్రి సునీల్ కుమార్ వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. దీనిలోనే బీజేపీ అధ్యక్షుడు నవీన్ కుమార్ కూడా ఉన్నారు.
‘‘పార్టీ కార్యకర్తల ప్రవర్తనను మనం అర్థం చేసుకోవచ్చు. ముందురోజు రాత్రే నాయకులు ఇక్కడకు రావాల్సి ఉంది. హిందూ యువకులు ప్రాణాలు అర్పిస్తుంటే.. నాయకులు రాకపోతే కష్టంగా అనిపిస్తుంది’’అని పార్టీకి చెందిన ఒక కార్యకర్త వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- ‘‘భార్య నెలకు ఒక పిజ్జా మాత్రమే తినాలి. భర్త భార్యతో మాత్రమే మిడ్నైట్ పార్టీలకు వెళ్లాలి’’- ఓ పెళ్లిలో వధూవరుల మధ్య అగ్రిమెంట్
- వర్షాలు, వరదలు కాదు...ఈ దోమ మహా ప్రమాదకరం
- గోదావరి వరదలు: ఏటిగట్లకు 12 చోట్ల పొంచి ఉన్న ప్రమాదం.. భయాందోళనల్లో కోనసీమ గ్రామాలు
- శ్రీలంక: సేంద్రీయ వ్యవసాయ విధానమే ఈ సంక్షోభానికి కారణమా?
- కోనోకార్పస్: భారత్, పాకిస్తాన్ దేశాలు ఈ మొక్కను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














