యుక్రెయిన్ యుద్ధం వల్ల తిరిగొచ్చిన మెడిసిన్ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరడం లేదు?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టి దాదాపు ఏడాది అవుతోంది. భారత్ నుంచి యుక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చేసేందుకు వెళ్లిన విద్యార్థుల్లో చాలా మంది గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో తిరిగి వచ్చారు.
‘‘ఆపరేషన్ గంగ’’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలలో విద్యార్థులను ఇక్కడికి తీసుకువచ్చింది. దాదాపు 18 వేల మంది విద్యార్థులను యుక్రెయిన్ నుంచి తీసుకువచ్చామని గత ఏడాది పార్లమెంటులో కేంద్రం ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.
యుక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చేసేందుకు వెళ్లిన విద్యార్థుల జాబితాలో కేరళ మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రం నుంచి 3,600 మంది విద్యార్థులు యుక్రెయిన్‌కు వెళ్లారు.
ఏడాదైనా అక్కడ పరిస్థితులు సద్దుమణగలేదు. దీంతో విద్యార్థులు తిరిగి యుక్రెయిన్‌కు వెళ్లలేదు. ఆ యుద్ధం ఎప్పటికి ఆగుతుందో తెలియక విద్యార్థులు అయోమయంలో ఉన్నారు.
కనీసం భారత్‌లోని మెడికల్ కాలేజీల్లోనైనా వారికి సర్దుబాటు చేస్తారని అనుకున్నా, అదీ నెరవేరలేదు.

కేసీఆర్ ఇచ్చిన హామీ ఏంటి..?
తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1,600 మంది యుక్రెయిన్ నుంచి తిరిగి వచ్చినట్లు ప్రభుత్వాలు గత మార్చిలో అంచనా వేశాయి.
ఇందులో తెలంగాణ నుంచి 740 మంది విద్యార్థులు అక్కడికి వెళ్లినట్లుగా అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
``తెలంగాణ ప్రభుత్వం తరఫున భారత ప్రభుత్వానికి లేఖ రాస్తామని ప్రకటిస్తున్నా. వాళ్ల చదువుకు ఎంత ఖర్చు అయినా భరించి ఇక్కడ చదివిస్తాం. వాళ్లు డిస్‌కంటిన్యూ కాకుండా, వాళ్ల భవిష్యత్తు దెబ్బతినకుండా లేఖ రాయమని ఇక్కడే (అసెంబ్లీ) ఉన్న చీఫ్ సెక్రటరీ, ఆరోగ్య శాఖ మంత్రికి చెబుతున్నా`` అని అప్పుడు కేసీఆర్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, @DRSJAISHANKAR
కేసీఆర్ హామీ ఏమైంది..?
యుక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులకు భారత్‌లోని మెడికల్ కళాశాలల్లో సీట్లు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ 2022 మార్చి 30న ప్రధాని మోదీకి లేఖ రాశారు.
``విద్యార్థులు వైద్య విద్య కొనసాగించేందుకు సహకరించండి. తెలంగాణ విద్యార్థులకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది``అని లేఖలో పేర్కొన్నారు.
‘‘విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చు ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ రాసిన లేఖకు సమాధానం లేనప్పుడు ఏం చేయగలం..?’’ అని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పలు సందర్భాలలో మీడియాతో వ్యాఖ్యానించారు.
మెడికల్ సీట్లను కేటాయించే అధికారం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

ఫొటో సోర్స్, Ani
యుక్రెయిన్ ఎందుకు వెళ్లారంటే..
భారతదేశంలో ఎంబీబీఎస్ విద్య ఎంతో ఖర్చుతో కూడుకున్నదని వైద్య విద్యార్థులు చెబుతున్నారు.
ఇక్కడ ఎంబీబీఎస్ చేయడానికి సుమారు రూ.కోటి, ఆపైనే ఖర్చు పెట్టాలని గాంధీ ఆసుపత్రిలో పనిచేసే జూనియర్ వైద్యుడు ఒకరు బీబీసీకి చెప్పారు.
``ఎంబీబీఎస్ చదవడమే కాదు, చదవడానికి పెట్టే ఖర్చు కూడా ఎక్కువే. ఐదేళ్ల కోర్సుకు ఏకంగా రూ. కోటి ఖర్చు అవుతుంది. మధ్య తరగతి తల్లిదండ్రులు పిల్లల చదువుకు అంత మేర ఎక్కడ ఖర్చు పెట్టగలరు..? అందుకే యుక్రెయిన్, ఉజ్బెకిస్థాన్, జార్జియా, రష్యా వంటి దేశాలకు వెళుతుంటారు`` అని ఆయన చెప్పారు.
ఉక్రెయిన్ విషయానికే వస్తే, అక్కడ ఎంబీబీఎస్ ఐదేళ్ల ఎనిమిది నెలలు కోర్సు.
``చదువు, ఉండటానికి మొత్తం కలిపి ఖర్చులు ఏడాదికి ఐదారు లక్షలలోనే అయిపోతుంది. అందుకే అక్కడికి పంపించాం`` అని హైదరాబాద్‌లోని బాచుపల్లికి చెందిన వైద్య విద్యార్థిని తల్లి అమలేశ్వరి చెప్పారు.
``మా అమ్మాయి ఎంబీబీఎస్ సెకండియర్ చేస్తోంది. గత ఏడాది మార్చిలోనే తిరిగి వచ్చింది. అప్పటి నుంచీ ఇంట్లోనే ఉంటోంది. భారత్‌లోని కళాశాలల్లో సీటు ఇస్తారునుకుంటే.. వీలవ్వదని చెప్పారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఉజ్బెకిస్థాన్‌కు పంపించారు. కానీ, అక్కడికి వెళ్లాక కనీసం సరిపడా టాయిలెట్‌లు లేవని చెబుతున్నారు. మా బంధువుల అబ్బాయి ఒకరు అక్కడికి వెళ్లారు. అందుకే పాపను అక్కడి యూనివర్శిటీలకు పంపాలంటే భయంగా ఉంది`` అని బీబీసీతో అమలేశ్వరి తమ ఆవేదన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, NMC
ఎన్ఎంసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్షియేట్ (ఎఫ్ఎంజీఎల్) రెగ్యులేషన్స్ 2021ను 2021 నవంబరు 18 నుంచి జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) అమల్లోకి తీసుకువచ్చింది.
ఈ రెగ్యులేషన్స్ ప్రకారం ఎవరైనా ఎంబీబీఎస్ చేసేందుకు ఒక విదేశీ యూనివర్సిటీలో చేరితే, కోర్సు, ఇంటర్న్‌షిప్ అక్కడే పూర్తి చేయాలి. ట్రాన్స్‌ఫర్‌కు వీలు పడదు.
2021 నవంబరు 18 తర్వాత చేరిన విద్యార్థులకు ఈ నిబంధన వర్తిస్తుందని ఎన్ఎంసీ 2022 ఫిబ్రవరిలో తన వెబ్‌సైట్ ద్వారా స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఏదైనా వెసులుబాటు ఉందా..?
ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎన్ఎంసీ వెసులుబాటు కల్పించినట్లు 2022 సెప్టెంబరు 7న ది హిందూ ప్రచురించిన కథనంలో పేర్కొంది.
దీని ప్రకారం అకడమిక్ మొబిలిటీకి ఎన్ఎంసీ అవకాశామిచ్చింది.
అలాంటి వారు పేరెంట్ యూనివర్శిటీ (అంటే ఉక్రెయిన్ యూనివర్శిటీ) నుంచే మెడికల్ గ్రాడ్యుయేట్ పట్టా తీసుకోవాలి.
``యుక్రెయిన్‌లో చదువుతున్న మెడికల్ విద్యార్థులకు అకడమిక్ మొబిలిటీకి ఎలాంటి అభ్యంతరం లేదు. 2002 స్క్రీనింగ్ టెస్ట్ రెగ్యులేషన్స్ ప్రకారం వారు నడుచుకోవాలి`` అని 2022 సెప్టెంబర్‌లో జారీ చేసిన పబ్లిక్ నోటీసులో ఎన్ఎంసీ పేర్కొన్నట్లు ది హిందూ పత్రిక తెలిపింది.
ఆన్‌లైన్‌లో క్లాసులు వినేందుకు యుక్రెయిన్ విద్యార్థులకు ఎన్ఎంసీ అవకాశం కల్పించింది.
ప్రాక్టికల్స్ మాత్రం కచ్చితంగా యూనివర్సిటీకి వెళ్లి చేయాల్సిందేనని ఎన్ఎంసీ తన నిబంధనల్లో స్పష్టం చేసింది.
తాజాగా ఎన్ఎంసి నియమించిన కమిటీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్చి 15లోగా నివేదిక ఇవ్వనుందని ఆల్ కేరళ ఉక్రెయిన్ మెడికల్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి సిల్వి సునీల్ చెప్పినట్లు ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ నెల 16న తన వార్తా కథనంలో పేర్కొంది

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్‌లో చదివితే డిగ్రీ చెల్లుతుందా..?
యుక్రెయిన్‌లో చదివితే ఎంబీబీఎస్ డిగ్రీ ఎన్ఎంసీ విధించిన కొన్ని షరతులకు లోబడి చెల్లుబాటు అవుతుంది.
విద్యార్థులు భారత్‌కు తిరిగి వచ్చాక అర్హత పరీక్ష రాయాలి.
ఎన్ఎంసీ 2021లో తీసుకువచ్చిన నిబంధనల ప్రకారం ఈ టెస్టు క్వాలిఫై అయితేనే భారత్‌లో ప్రాక్టీసు చేసేందుకు వీలవుతుంది.

ఫొటో సోర్స్, @KTRTRS
భారత్‌లో సర్దుబాటుకు వీలుందా..?
ఫిబ్రవరి 8న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం ప్రకారం.. భారత్ లో 654 మెడికల్ కళాశాలలున్నాయి. వీటిలో 99,763 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
భారత్‌లోని మెడికల్ కాలేజీలల్లో సీట్లివ్వాలని కొందరు యుక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
ఆ వైద్య విద్యార్థులకు భారత్‌లోని మెడికల్ కళాశాలల్లో సర్దుబాటు కుదరదని కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది.
పరిమితి సంఖ్యలో సీట్లు ఉండటం, అవి కౌన్సిలింగ్ లోనే భర్తీ కావడంతో సాధ్యపడదని నిపుణులు చెబుతున్నారు.
``యుక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులను భారత్‌లోని మెడికల్ కళాశాలల్లో సర్దుబాటు చేయలేం. భారత వైద్య మండలి చట్టం 1956, జాతీయ వైద్య కమిషన్ చట్టం 2019 ప్రకారం దీనికి వీలుపడదు. దీనివల్ల భారత్‌లోని వైద్య విద్య ప్రమాణాలను దెబ్బతినే అవకాశం ఉంది`` అని కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సుప్రీంకోర్టుకు అందించిన అఫిడవిట్లో పేర్కొన్నట్లు ది ఎకనామిక్స్ టైమ్స్ 2022 సెప్టెంబరు 16న ప్రచురించిన కథనంలో పేర్కొంది.
``యుక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థుల సర్దుబాటు ఎన్ఎంసీ చేతిలోనూ లేదు. భారతదేశంలో మెడికల్ అడ్మిషన్లు అనేవి మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్ చేసి చేస్తుంటారు. కానీ, విదేశాలకు వెళ్లేవారు నీట్ వంటి పరీక్షలలో క్వాలిఫై అయినా సరిపోతుంది. మెరిట్ ఆధారంగా నింపిన సీట్లలో కేవలం క్వాలిఫై అయిన విద్యార్థులకు ఇచ్చేందుకు ఎన్ఎంసీ ఒప్పుకోవడం లేదని భావించవచ్చు`` అని హైదరాబాద్‌కు చెందిన అపెక్స్ కన్సల్టెన్సీ నిర్వాహకులు హెచ్.ఎం.ప్రసాద్ బీబీసీతో అభిప్రాయపడ్డారు.
ఇతర దేశాలకు వెళ్లే వీలుందా..
యుక్రెయిన్‌లో సంక్షోభ పరిస్థితుల కారణంగా ఇంకా యూనివర్శిటీలు తెరుచుకోలేదని విద్యార్థులు చెబుతున్నారు.
‘‘ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నా, వాటితో ప్రయోజనం తక్కువగా ఉంటోంది. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ప్రాక్టికల్స్ తప్పకుండా యూనివర్శిటీకే వెళ్లి చేయాలి. అందుకే చాలా మంది విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు’’ అని హైదరాబాద్ పటాన్ చెరుకు చెందిన వైద్య విద్యార్థి ప్రతీక్ బీబీసీతో చెప్పారు.
‘‘ప్రస్తుతం యుక్రెయిన్‌లో యూనివర్శిటీలు తెరుచుకోలేదు. ట్రాన్స్ స్ర్కిప్టులు ఇచ్చే పరిస్థితి లేదు. అవి లేకపోతే విద్యార్థి ఏ సెమిస్టర్ పూర్తి చేశాడో తెలియదు. అయినప్పటికీ ఉజ్బెకిస్థాన్, కజికిస్థాన్ వంటి దేశాలల్లోని యూనివర్శిటీలు తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వాలనే నిబంధనతో చేర్చుకుంటున్నాయి’’ అని హెచ్.ఎం.ప్రసాద్ వివరించారు.
కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లలో కొన్ని రోజులు ఆన్‌లైన్ తరగతులు వినేందుకు అవకాశం కల్పించాయి. తర్వాత అవి కూడా ముందుకు సాగలేదు.
ఈ పరిస్థితులలో విద్యార్థుల భవిష్యత్తుపై గందరగోళం ఏర్పడింది.
ముందుకు వస్తున్న ఇతర దేశాలు
యుక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన భారతీయ విద్యార్థులకు మెడికల్ సీట్లు ఇచ్చేందుకు కొన్ని దేశాలు ముందుకు వస్తున్నాయి.
ఇప్పటికే మూడు వేల మంది విద్యార్థులు జార్జియా, ఉజ్బెకిస్థాన్, కజికిస్థాన్ వంటి దేశాలకు వెళ్లినట్లు కన్సల్టెన్సీలు చెబుతున్నాయి.
‘‘తమ దేశంలో మెడికల్ కళాశాలల్లో యుక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన 200 మంది భారతీయ విద్యార్థులకు సీట్లు కేటాయించాం. వీరిలో 1000 మంది బుఖారా స్టేట్ మెడికల్ ఇనిస్టిట్యూట్ లో చేరగా, మరో 500 మంది వివిధ ఇనిస్టిట్యూట్లలో చేరారు’’ అని ఇటీవల హైదరాబాద్‌లో తాష్కెంట్ మెడికల్ అకాడమీ ప్రారంభం సందర్భంగా ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య అఖ మాజీ మంత్రి షడ్మనోవ్ అలిషర్ ఖయుమోవిచ్ మీడియాకు వివరించారు.
భారత్‌లోని వైద్య కళాశాలల్లో చేరే అవకాశం లేకపోవడంతో ఇతర దేశాలకు విద్యార్థులు వెళుతున్నారని కన్సల్టెన్సీలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్: ఫార్ములా ఈ రేస్ ప్రత్యేకత ఏమిటి... తెలంగాణకు అవకాశం ఎలా వచ్చింది
- భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలి?
- అప్పర్ భద్ర: ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమకు నీళ్లు అందవా... ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకత ఎందుకు
- రాణి రూపమతి: భర్తను ఓడించిన శత్రువును పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి విషం తాగిన రాణి
- చాట్‌జీపీటీ: డిగ్రీ కూడా పాసవని సామ్ ఆల్ట్మాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో సంచలనాలు సృష్టిస్తున్నారు.. ఇంతకీ ఎవరీయన?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














