మెడికో ప్రీతి ఆత్మహత్యా యత్నం కేసు: ఎంజీఎం ఆసుపత్రిలో ‘బాసిజం’పై పోలీసులు ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
సీనియర్ విద్యార్థి వేధింపుల కారణంగా ఫిబ్రవరి 22 న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నం చేసిన డాక్టర్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్న ఆమెకు ఎక్మో చికిత్స ను అందిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంమైన ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి డాక్టర్ ఎం.ఎ.సైఫ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ఈ రోజు వరంగల్ పోలీస్ కమీషనర్ రంగనాథ్ ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లారు.
సూపరింటెండెంట్, కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, విద్యార్థులు, ఫ్యాకల్టీతో ఆయన మాట్లాడి వివరాలు సేకరించారు.

ఫొటో సోర్స్, UGC
సీనియర్ వేధింపులు
సీనియర్ సైఫ్ వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
ఆత్మహత్యయత్నానికి ముందు డాక్టర్ ప్రీతి గూగుల్ సెర్చ్ లో ఓ ఇంజక్షన్‌కు సంబంధించి వివరాలు వెతికినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ కేసులో రాజకీయ హస్తం ఉందన్న ఆరోపణలను సీపీ రంగనాథ్ ఖండించారు. డాక్టర్ సైఫ్ సాధారణ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చారని, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్లు రాజకీయ కుటుంబాలతో బంధుత్వం లేదని తమ విచారణలో తెలిసిందని అన్నారు.
‘‘డాక్టర్ సైఫ్, ప్రీతిని పనిగట్టుకుని అవమానించడం, వేధించడంలాంటివి చేసినట్లు కాలేజ్ వాట్సప్ గ్రూపుల్లోని చాట్‌ల ద్వారా అర్థమైంది. ఈ కేసులో లైంగింక వేధింపుల కోణం లేదు. సీనియర్‌గా సైఫ్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. ప్రీతి ప్రశ్నించే మనస్తత్వం సైఫ్‌కు మింగుడుపడలేదు. ఈ కేసులో పోలీసులు ఎక్కడా తాత్సారం,నిర్లక్ష్యం చేయలేదు’’ అని సీపీ రంగనాథ్ మీడియాతో అన్నారు.

ఫొటో సోర్స్, UGC
కీలకంగా మారిన టాక్సికాలజీ రిపోర్ట్:
డాక్టర్ ప్రీతి హానికర ఇంజక్షన్ తీసుకుందన్న వార్తలు ఓవైపు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు అన్న వాదనలు మరోవైపు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం పై వరంగల్ పోలీసులు ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
‘‘ఎంజీఎం డాక్టర్లు ప్రీతికి గుండె, థైరాయిడ్ సంబంధ సమస్యలు ఉన్నాయని అంటున్నారు. కానీ, జరిగిన పరిణామాలను చూస్తుంటే ఇది ఆత్మహత్యాయత్నం అనిపిస్తోంది. సగం వాడిన ఇంజెక్షన్‌ను మా ఇన్వెస్టిగేషన్‌లో బయటపడింది. అయితే, ప్రీతి రక్త నమూనాల టాక్సికాలజీ రిపోర్ట్ వచ్చాక ఈ అంశం పై పూర్తి క్లారిటీ వస్తుంది’’ అని సీపీ రంగనాథ్ తెలిపారు.
అయితే, ప్రీతికి ఇతర ఆరోగ్య సమస్యలున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి, ఆమె త్వరగా కోలుకుంటుందని తాము భావిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ్ మీడియాతో అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
బాసిజం కల్చర్
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ లో జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య ఫ్రెండ్లీ వాతావరణం స్థానంలో అంతరాలు ఉన్నాయని, సీనియర్లలో బాసిజంలాంటి ధోరణులు ఉన్నట్లు పోలీసుల అంతర్గత విచారణలో తేలింది.
‘‘పైకి జూనియర్ స్టూడెంట్ ను గైడ్ చేస్తున్నట్టుగా చెబుతున్నా, సైఫ్ ఉద్దేశ్యాలు వేరే విధంగా ఉన్నాయని అతని చాట్స్ ద్వారా తెలిసింది. ఈ అమ్మాయి ఎక్కువ చేస్తోంది, ఆమెకు సహకరించొద్దని కాలేజీ గ్రూపుల్లో సైఫ్ చాట్ చేశాడు’’ అని సీపీ రంగనాథ్ అన్నారు.
ఈ కేసులో ఎవరి నిర్లక్ష్యం బయటపడ్డా చర్యలు తీసుకోవడానికి వెనకాడే ప్రసక్తి లేదని రంగనాథ్ స్పష్టం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
లవ్ జిహాద్ కేసు-ఆరోపణలు, ప్రత్యారోపణలు
ప్రీతి కేసుపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్‌లో మాట్లాడారు. ఇది వందశాతం లవ్ జిహాద్ కేసని ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
తెలంగాణలో హిందూ అమ్మాయిలను వేధిస్తూ, ట్రాప్ చేస్తున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే మతతత్వం అంటున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఈ కేసుపై స్పందించాలని డిమాండ్ చేశారు.
ఈ కేసుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎవరికో బంధువని ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
అయితే, లవ్ జిహాద్ ఆరోపణలను రాష్ట్రమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. బీజేపీ నేతలు రాజకీయాలు చేసే ప్రయత్నాలు మానుకోవాలని, ప్రజల మధ్య గొడవలు పెట్టడం వారికి అలవాటుగా మారిందని, ఈ కేసులో లవ్ జిహాద్‌లాంటివేమీ లేవని మంత్రి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి








