పాకిస్తాన్ అమ్మాయి, ఇండియా అబ్బాయి - లూడో గేమ్‌లో పరిచయం, ప్రేమ, పెళ్లి.. చివరకు ఏమైందంటే...

ఫొటో సోర్స్, JEET LAL YADAV
- రచయిత, అనంత్ ఝణాణె, ఇమ్రాన్ ఖురేశీ
- హోదా, బీబీసీ ప్రతినిధి, బీబీసీ కోసం
పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌కు చెందిన 19 ఏళ్ల ఇక్రా జివానీ, ఇండియాలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌కు చెందిన 21 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ ఆన్‌లైన్ లూడో ఆడుతూ లవ్‌లో పడ్డారు. 2020లో మొదలైన ఈ కథ అనేక మలుపులు తిరుగుతూ ములాయంను జైలుపాలు చేసింది.
ఆన్‌లైన్ లూడో ఆడుతున్నప్పుడు పరిచయమైన ములాయం కోసం ఇక్రా పాకిస్తాన్ నుంచి నేపాల్ మీదుగా అక్రమంగా భారత్ చేరుకుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుని బెంగళూరులో కాపురం పెట్టారు.
అయితే, బెంగళూరులోని ఇక్రా ఫోన్ నుంచి పాకిస్తాన్‌కు వాట్సాప్ కాల్స్ వెళ్తుండడంతో పోలీసులకు అనుమానం వచ్చి దర్యాప్తు చేయగా ఈ కథంతా బయటపడింది.
విచారణ అనంతరం పోలీసులు, అధికారులు ఇక్రాను పాకిస్తాన్ పంపించేశారు. ములాయంను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
అయితే, ములాయం నుంచి జైలు నుంచి విడుదల చేయాలని, భార్యను ఆయనకు అప్పగించాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
అక్రమంగా భారత్‌లో ప్రవేశించిన ఇక్రాను ఫిబ్రవరి 19న వాఘా సరిహద్దు మీదుగా పాకిస్తాన్ పంపించారు భారతదేశ అధికారులు.

ఫొటో సోర్స్, BENGALURU POLICE
లాక్‌డౌన్‌లో లూడో ఆడి..
బెంగళూరు పోలీసుల కథనం ప్రకారం.. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ములాయం సింగ్ యాదవ్ బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో గార్డుగా పనిచేసేవారు. లాక్‌డౌన్‌లో ఆయన సమీర్ అన్సారీ పేరుతో ఆన్‌లైన్‌లో లూడో ఆడుతుండేవారు. అలా పాకిస్తాన్‌కు చెందిన ఇక్రాతో ఆడారు. అప్పటికి ఇక్రా వయసు 19 కాగా ములాయం వయసు 21.
ఆన్‌లైన్‌లో లూడో ఆడుతున్నప్పుడు ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. అదే సమయంలో ఇక్రాకు పెళ్లి చేయాలని ఆమె కుటుంబసభ్యులు అనుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ములాయంతో చెప్పగా భారత్ రావాలని సూచించాడు. దీంతో ఇక్రా పాకిస్తాన్ నుంచి దుబయి మీదుగా తొలుత నేపాల్ చేరుకున్నారు. అక్కడ ములాయం ఆమెను కలుసుకున్నారు.
ఇద్దరూ 2022 సెప్టెంబరులో నేపాల్‌లోని ఓ ఆలయంలో వివాహం చేసుకుని పట్నా మీదుగా బెంగళూరు వచ్చారు. బెంగళూరులోని బెల్లందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వారు నివాసం ప్రారంభించారు.
ములాయం ఉద్యోగం చేస్తుండగా ఇక్రా ఇంట్లోనే ఉండేవారు. రియా యాదవ్ పేరుతో ఇక్రాకు ఆధార్ కార్డ్ కూడా సంపాదించారు ములాయం.

ఫొటో సోర్స్, MANVENDRA SINGH
కొన్నాళ్ల తరువాత ఇక్రా పాకిస్తాన్‌లోని తన తల్లితో వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడడం ప్రారంభించారు. అయితే, బెంగళూరులో నిర్వహించాల్సిన జీ20 సన్నాహక సమావేశాలు, ఏరో షో నేపథ్యంలో అక్కడి పోలీసులు నిఘా పెంచారు. బెంగళూరు నుంచి పాకిస్తాన్‌కు వాట్సాప్ కాల్స్ వెళ్తున్నట్లు గుర్తించారు. ఆ కాల్స్ ఎక్కడి నుంచి వెళ్తున్నాయో గుర్తించి ఇక్రాను పట్టుకున్నారు.
ఇక్రాను విచారించి ప్రేమ కోసం ఆమె అక్రమంగా భారత్ వచ్చినట్లు గుర్తించి ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్(ఎఫ్ఆర్ఆర్ఓ)కు అప్పగించారు.
దీనిపై బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ డీసీపీ గిరీశ్ బీబీసీతో మాట్లాడారు. ‘చట్టవిరుద్ధంగా భారత్‌లో ప్రవేశించిన నేరం ఆమెపై ఉంది. అయితే, దర్యాప్తు కొనసాగుతోంది’ అన్నారాయన.
మరోవైపు ములాయం సింగ్ యాదవ్‌ను అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించడానికి సహకరించడం, ఫోర్జరీ, ఐపీసీలోని మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోర్టు ఆయన్ను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించగా ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్నాడు.

ఫొటో సోర్స్, MANVENDRA SINGH
ప్రయాగ్‌రాజ్‌లోని మక్‌సుదనా గ్రామంలో ములాయం తల్లి శాంతిదేవి ఉంటున్నారు. ఆమె బీబీసీతో మాట్లాడారు. ‘మా అబ్బాయిని, ఆ అమ్మాయిని మాకు అప్పగించండి. ఆమెను కోడలిగా చేసుకుంటాం. బాగా చూసుకుంటాం. ఆమె పాకిస్తాన్‌కు చెందిన అమ్మాయి అయినప్పటికీ, ముస్లిం అయినప్పటికీ ఇద్దరికీ పెళ్లయింది. వారిని కలిసి బతకనివ్వండి’ అని కోరారు.
అంతేకాదు... ఇక్రా, ములాయంలకు పెళ్లయిపోయిందని, ఇద్దరూ కలిసే బతికే అవకాశం కల్పించాలని పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా ఆమె విజ్ఞప్తి చేశారు.

ఫొటో సోర్స్, JEETLAL YADAV
ములాయం సోదరుడు జీత్‌లాల్ యాదవ్ బీబీసీతో మాట్లాడుతూ.. జనవరి 19న పోలీసులు ఇక్రాను పట్టుకున్న వరకు ఈ విషయం తమకు తెలియదని, తన సోదరుడు ములాయం బెంగళూరులో వేరే స్నేహితుడితో కలిసి ఉంటున్నారనే అనుకున్నామని చెప్పారు.
ఇక్రాను భారత్ నుంచి పాకిస్తాన్ తిరిగి పంపించేశారని మీడియాలో చూసి తెలుసుకున్న జీత్‌లాల్ నిరాశ వ్యక్తం చేశారు.
‘మేం ఆమెను మా ఇంటి కోడలిగానే ఉంచాలనుకుంటున్నాం. పాకిస్తాన్, భారత్ మధ్య ఎలాంటి పరిస్థితులున్నాయో నాకు తెలుసు. కానీ, ములాయం, ఇక్రాల మధ్య ప్రేమ ఉంది. వారి మనసుల్లో తప్పుడు ఉద్దేశం లేదు. అంతేకాదు.. జైలులో ఉన్న నా సోదరుడికి ఇక్రాను పాకిస్తాన్ పంపించేశారని తెలిస్తే ఏమైపోతాడో ఆలోచించండి’ అన్నారు జీత్‌లాల్.
జీత్‌లాల్ న్యాయవాది సాయంతో ములాయం బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.
‘విచారణ చేసి ఇక్రాను పాకిస్తాన్ పంపించేశారు, ఇంకా నా సోదరుడిని జైలులో ఎందుకు ఉంచారో చెప్పండి’ అని జీత్ లాల్ ప్రశ్నిస్తున్నారు.
‘ఆమె మా ఇంటి కోడలైంది కాబట్టి ఇండియాకు కూడా కోడలే’ అన్నారు జీత్‌లాల్.
పాకిస్తాన్‌లోని ఇక్రా కుటుంబ సభ్యులతో మాట్లాడుందుకు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు.
ఇవి కూడా చదవండి:
- ఆంగ్లో ఇండియన్స్ అంటే ఎవరు, ఎందుకు తమ మూలాలు వెతుక్కుంటున్నారు?
- ఏజ్ ఆఫ్ కన్సెంట్: సెక్స్‌కు సమ్మతి తెలపాలంటే కనీస వయసు ఎంత ఉండాలి?
- అదానీ గ్రూప్ నుంచి భారీ ధరలకు ‘విద్యుత్ కొనుగోలు’ ఒప్పందం... ఇరకాటంలో బంగ్లాదేశ్
- తుర్కియే-సిరియా: భూకంప బాధితులు ఎందుకు సరిహద్దులకు వస్తున్నారు?– బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- రోహిణీ సింధూరి-రూపా మౌద్గిల్: ఈ ఇద్దరు మహిళా ఆఫీసర్ల మధ్య గొడవేంటి, కర్ణాటక ప్రభుత్వం ఏం చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














