రామ్ రహీమ్ సింగ్: రేప్, మర్డర్ కేసులలో శిక్ష అనుభవిస్తున్న బాబాకు పదేపదే పెరోల్ ఎలా లభిస్తోంది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీత పాండే
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
అత్యాచారం, హత్య ఆరోపణలతో జైలు శిక్ష పడిన మత గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు సంబంధించిన వీడియో ఒకటి గత వారం వైరల్‌గా మారింది.
పెరోల్‌పై బయటకు వచ్చిన డేరా సచ్చా సౌదాకు చెందిన రామ్ రహీమ్ సింగ్ తన దత్త పుత్రికగా చెప్పే హనీప్రీత్ ఇన్సాన్‌తో కలిసి కేక్ కోయడం ఆ వీడియోలో కనిపించింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో హనీప్రీత్ ఫాలోవర్ల సంఖ్య 10 లక్షలకు చేరిన సందర్భంలో ఈ కేక్ కోశారు.
అంతకు కొద్దిరోజుల ముందు రామ్ రహీం సింగ్ కేక్ కోస్తున్న మరో వీడియో కూడా వైరల్ అయింది. అందులో ఆయన కేక్ పెద్ద కత్తితో కట్ చేసినట్లుగా ఉంది.
ఈ వీడియోలు చూసినవారు రామ్ రహీం సింగ్‌కు అధికారులు అన్నిసార్లు పెరోల్ ఎలా ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
రామ్ రహీం తన ఇద్దరు మహిళా భక్తులను రేప్ చేశారన్న కేసులో 20 ఏళ్ల జైలు శిక్షకు గురయ్యారు. 2017 ఆగస్ట్ నుంచి ఆయన హరియాణాలోని సునారియా జైలులో ఉన్నారు.
ఓ జర్నలిస్టును హత్య చేశారన్న కేసులో 2019లో ఆయనకు యావజ్జీవ జైలు శిక్ష పడింది. అనంతరం తన ఉద్యోగిని చంపిన కేసులో 2022లో మరో యావజ్జీవ శిక్ష పడింది.
ఇన్ని తీవ్రమైన నేరాలలో శిక్షలు పడినప్పటికీ గత 13 నెలలో రామ్ రహీం సింగ్‌కు మొత్తం 131 రోజుల పాటు పెరోల్ లభించింది. 2022 ఫిబ్రవరిలో ఆయన 21 రోజుల ఫర్లా లభించింది. అదే ఏడాది జూన్‌లో 30 రోజుల పెరోల్, అక్టోబరులో మరో 40 రోజుల పెరోల్ లభించింది. అనంతరం 2023 జనవరి 21 నుంచి 40 రోజుల పెరోల్ మళ్లీ లభించింది.

ఫొటో సోర్స్, Getty Images
కాగా రామ్ రహీమ్ సింగ్‌కు పదేపదే పెరోల్ దొరకడంపై ఆయనకు చెందిన డేరా సచ్చా సౌదా అధికారి ఒకరు ‘బీబీసీ’తో మాట్లాడుతూ.. ‘పెరోల్ పొందే హక్కు ప్రతి ఖైదీకి ఉంటుంది. అది మానవ హక్కుల్లో భాగం’ అని చెప్పారు.
‘ఆయన ఆధ్యాత్మిక రంగంలో పనిచేస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఆయన కష్టపడి పనిచేస్తున్నారు. వ్యసనాల నుంచి విముక్తి కలిగించే కార్యక్రమంలో ఆయన పనిచేస్తున్నారు’ అని ఆయన చెప్పారు. రామ్ రహీమ్ కృషి ఫలితంగా రోజుకు లక్ష మంది మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడుతున్నారని ఆయన చెప్పారు.
అయితే, రామ్ రహీమ్ సింగ్‌ను బయటకు వదలడంపై సోషల్ మీడియాలో విమర్శలొస్తున్నాయి. రేప్, హత్యానేరాల్లో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీని పదేపదే ఎలా బయటకు వదులుతారని ప్రశ్నిస్తున్నారు.
రామ్ రహీమ్ సింగ్‌కు పెరోల్ ఇచ్చి బయటకు వదలడం సమాజానికి తప్పుడు సందేశం ఇస్తుందంటూ, రామ్ రహీమ్ సింగ్‌కు పెరోల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ‘శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ’(ఎస్‌పీజీసీ) కోర్టులో పిటిషన్ వేసింది. ఆయన్ను బయటకు వదిలిపెట్టడం సమాజానికి మంచిది కాదని ఎస్‌జీపీసీ ప్రధాన కార్యదర్శి గురుచరణ్ సింగ్ గ్రేవాల్ అన్నారు.
2017లో దోషిగా తేలినంత వరకు రామ్ రహీమ్ సింగ్ దేశంలోని అత్యంత ప్రభావవంతమైన మత గురువుల్లో ఒకరు.
హరియాణాలోని సిర్సా కేంద్రంగా నిర్వహించిన ఆశ్రమానికి ఏటా లక్షలాది మంది ఫాలోవర్లు వచ్చేవారు. జీవనశైలి కారణంగా ఆయనకు ‘రాక్‌స్టార్ బాబా’ అని పేరుండేది. తానే స్వయంగా నిర్మించిన కొన్ని సినిమాల్లోనూ ఆయన నటించారు. దేశంలో పెద్దపెద్ద వ్యక్తులతో ఆయన కనిపించేవారు.
చాలాకాలం పాటు ఆయన కేంద్రంలోని ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు రెండింటింతోనూ సన్నిహితంగా ఉండేవారు. తాను సూచించిన పార్టీలుకు, నేతలకు ఓట్లేయమని కోట్ల సంఖ్యలో ఉన్న తన ఫాలోవర్లకు ఆయన సూచించేవారు.
జైలు శిక్ష పడడానికి ముందు కూడా ఆయన హరియాణా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్‌లాల్ ఖట్టర్‌తో అనేకసార్లు కనిపించారు.

ఫొటో సోర్స్, Getty Images
నేరాలలో దోషిగా తేలి జైలు శిక్ష పడినా ఆయన ప్రభావం తగ్గడం లేదు.
పెరోల్‌పై బయటకు వచ్చిన తరువాత ప్రస్తుతం ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని భాగ్‌పట్ జిల్లా బర్నావాలోని తన ఆశ్రమంలో ఉన్నారని.. అక్కడి నుంచే భక్తులతో వర్చువల్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు.
కాగా రామ్ రహీమ్ సింగ్ నిర్వహించిన కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు కనిపించడంతో బీజేపీ అండదండలతోనే ఆయనకు పెరోల్ వచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
రామ్ రహీమ్‌కు పెరోల్ రావడానికి బీజేపీ ప్రభుత్వం కానీ, పార్టీ కానీ కారణం కాదని హరియాణాలో ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ శర్మ అన్నారు.
‘ఆయన నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొన్నవారు ఆయనపై నమ్మకంతో వెళ్లి ఉంటారు. ఆయన పట్ల మాకు ఎలాంటి సాఫ్ట్ కార్నర్ లేదు. చట్టం తన పని తాను చేసుకుంటుంది’ అన్నారు సంజయ్ శర్మ. జైలు అధికారులు, జిల్లా అధికారులు పెరోల్‌పై నిర్ణయం తీసుకుంటారు. అంతా చట్ట ప్రకారమే జరుగుతుంది అన్నారు ఆయన.
రామ్ రహీమ్ సింగ్ ఉన్న జైలు రోహ్‌తక్ జిల్లాలో ఉంది. ఆ జిల్లా డివిజనల్ కమిషనర్ సంజీవ్ వర్మను బీబీసీ సంప్రదించగా పెరోల్ విషయంపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. ఇది కోర్టు పరిధిలోని విషయం కాబట్టి తానేమీ మాట్లాడబోనని అన్నారు.
జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ అకీల్ కూడా దీనిపై స్పందించేందుకు నిరాకరించారు. రామ్ రహీమ్‌కు పెరోల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ గతంలో దాఖలైన రెండు పిటిషన్లను కోర్టులు తోసిపుచ్చాయని ఆయన చెప్పారు.
పెరోల్ అంత సులభంగా దొరకదని, రామ్ రహీమ్‌కు మాత్రం పదేపదే పెరోల్ ఎలా దొరుకుతోందో అని సుప్రీంకోర్టు న్యాయవాది అక్షత్ బాజ్‌పాయి అన్నారు.
‘రామ్ రహీమ్ ఏమీ విచారణ ఖైదీ కాదు. రేప్, హత్య వంటి తీవ్రమైన నేరాలలో శిక్ష పడింది ఆయనకు. అయినా మూణ్నాలుగు నెలలకోసారి ఆయనకు పెరోల్ దొరుకుతోంది. కుటుంబసభ్యులెవరైనా చనిపోయినప్పుడు, పిల్లల పెళ్లిళ్లు, తోడబుట్టినవారి వివాహాలు వంటి కారణాలుంటేనే పెరోల్ దొరుకుతుంది. కానీ, అవేమీ లేకుండానే ఈయనకు పెరోల్ లభిస్తోంది’ అన్నారు అక్షత్.
అంతేకాదు.. పెరోల్‌పై వచ్చిన తరువాత ఆయన పెద్ద కత్తితో కేక్ కోయడం కూడా ఆశ్చర్యానికి గురిచేసిందని, ఆయుధాల చట్టం ప్రకారం అది నేరమని అక్షత్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2022: ముగిసిన ఓటింగ్, మార్చి 5న విజేత ప్రకటన
- మాతృభాషా దినోత్సవం: తెలుగు భాషకు ప్రాచీన హోదా వల్ల ఏదైనా మేలు జరిగిందా... ప్రాచీన భాషా అధ్యయన కేంద్రం నిధుల మాటేమిటి?
- అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం: తెలుగు, సంస్కృతం, హిందీ, తమిళం.. ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- E sanjeevani: పైసా ఖర్చు లేకుండా ఆన్లైన్లో టెలిఫోన్ ద్వారా లేదా వీడియో కన్సల్టేషన్ పొందడం ఎలా?
- బీబీసీ ఎలా పని చేస్తుంది, నిధులు ఎక్కడి నుంచి వస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














