బీబీసీ కార్యాలయాలలో ఆదాయ పన్ను శాఖ సర్వే.. ‘‘ఉద్దేశపూర్వకమైన బెదిరింపు చర్య’’ - బ్రిటన్ పార్లమెంటులో ఎంపీలు

బీబీసీ

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌ లోని బీబీసీ కార్యాలయాలలో ఆదాయ పన్ను శాఖ సర్వే ‘ఉద్దేశపూర్వకంగా చేపట్టిన బెదిరింపు చర్య’ అని బ్రిటన్ పార్లమెంటులోని దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యులు అభివర్ణించారు.

మోదీపై రూపొందించిన డాక్యుమెంటరినీ ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ను బీబీసీ ప్రసారం చేసిన తరువాత ఇప్పుడు ఈ సర్వేలు జరుగుతున్నాయని కొందరు పార్లమెంటు సభ్యులు ప్రస్తావించారు.

బీబీసీ దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో మూడు రోజుల పాటు ఆదాయ పన్ను శాఖ సర్వే చేసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం తీరుపై హౌస్ ఆఫ్ కామన్స్‌లో డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ ఎంపీ జిమ్ షానన్ అత్యవసరంగా ప్రశ్న లేవనెత్తారు.

‘దీనిపై మాట్లాడేందుకు భారత హైకమిషన్‌ను పిలిపిస్తున్నారా?’ అని మంత్రులను ఆయన ప్రశ్నించగా.. ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని బ్రిటన్ ప్రభుత్వం చెప్పింది.

డేవిడ్ రూట్లీ

ఫొటో సోర్స్, BRITISH PARLIAMENT TV

సభలో జిమ్ షానన్ మాట్లాడుతూ.. ‘‘భారత దేశ ప్రధానిపై విమర్శనాత్మకంగా రూపొందించిన డాక్యుమెంటరీని ప్రసారం చేసిన తరువాత ఉద్దేశపూర్వకంగా, బెదిరించేలా ఈ సర్వే చేశారని స్పష్టమవుతోంది’’ అన్నారు.

డాక్యుమెంటరీ విడుదలైన తరువాత భారత్‌లో ఎక్కడా ప్రదర్శించకుండా ఆపేందుకు ప్రయత్నాలు చేశారని, ఇదంతా భావప్రకటన స్వేచ్ఛను అణచివేయడమేనని షానన్ అన్నారు.

‘‘ఇండియాలోని యూనివర్సిటీ క్యాంపస్‌లలో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శించడానికి ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొన్ని చోట్ల డాక్యుమెంటరీ ప్రదర్శనను అడ్డుకోవడానికి విద్యుత్ కోతలు, ఇంటర్నెట్ నిలిపివేయడం వంటివి చేశారు’’ అని షానన్ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

‘‘ఇది జర్నలిస్ట్‌లు, మానవహక్కుల కార్యకర్తలు, మతపరమైన మైనారిటీలపై తీవ్ర ప్రభావం చూపించింది. బీబీసీ కార్యాలయాలో ఐటీ సర్వే జరిగినప్పుడు ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ (ఎఫ్‌సీడీవో) నుంచి ఎలాంటి సమాచారం లేదు. ప్రభుత్వం కూడా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు’’ అని షానన్ చెప్పారు.

‘‘ఈ విషయంపై భారత హైకమిషనర్‌ను పిలిపించాలనుకుంటున్నారా లేదా? భారత ప్రభుత్వం వద్ద ఈ విషయం లేవనెత్తాలనుకుంటున్నారా లేదా?’’ అని షానన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

దీనిపై బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డేవిడ్ రూట్లీ సభలో స్పందిస్తూ.. ‘‘భారత్‌తో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, భారత్-బ్రిటన్‌ల భవిష్యత్ కోసం ఉద్దేశించిన 2030 రోడ్ మ్యాప్‌ల మార్గనిర్దేశకత్వంలోని మా విస్తృత, లోతైన సంబంధాల ప్రకారం రెండు దేశాలు అనేక అంశాలపై చర్చించుకునే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈ విషయాన్ని నిశితంగా ఫాలో అప్ చేస్తాం’’ అన్నారు.

బీబీసీ కార్యాలయం

ఫొటో సోర్స్, Reuters

‘‘సంపాదకీయ పరంగా, కార్యకలాపాల పరంగా ప్రభుత్వంతో సంబంధం లేకుండా బీబీసీ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని ఇక్కడ సభలో ఉన్న అందరికీ తెలుసు. భారత ఆదాయ పన్ను శాఖ చేసిన ఆరోపణలపై ఇక్కడ నేను మాట్లాడలేను. కానీ, ఈ విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి భారత్ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నామని, అదేసమయంలో తమ సిబ్బందికి అండగా ఉంటామనీ బీబీసీ చెప్పింది’’ అని సభకు తెలిపారు రూట్లీ.

‘‘చట్టాన్ని గౌరవించడమనేది సమర్థ ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన విషయం. అదేసమయంలో మీడియా స్వాతంత్ర్యం, వాక్ స్వాతంత్ర్యం కూడా ముఖ్యమే. దేశాలను దృఢంగా చేసేవి ఈ లక్షణాలే’’ అన్నారు రూట్లీ.

విపక్షం నుంచి షాడో మినిష్టర్ ఫాబియన్ హామిల్టన్ మాట్లాడుతూ.. ‘‘నిజమైన మీడియా స్వేచ్ఛకు స్థానం ఉన్న ప్రజాస్వామ్యంలో విమర్శలను అనవసరంగా అడ్డుకోరాదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా భావప్రకటన స్వేచ్ఛకు రక్షణ ఉండాలి’’ అన్నారు.

వీడియో క్యాప్షన్, భారత్‌లోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సర్వేపై బ్రిటన్ ఎంపీలు ఏమన్నారంటే..

బీబీసీ కార్యాలయాలలో ఐటీ సర్వే ఎందుకు జరిగిందనే విషయంలో భారత ప్రభుత్వం ఏం చెప్పినా కూడా ఈ సర్వే మాత్రం ఆందోళనకరమని హామిల్టన్ అన్నారు.

‘‘ప్రపంచవ్యాప్తంగా బీబీసీ గౌరవప్రదమైన బ్రాడ్‌కాస్టర్. నాణ్యమైన, విశ్వసనీయమైన రిపోర్టింగ్‌కు ప్రసిద్ది చెందింది బీబీసీ. బెదిరింపులు లేని వాతావరణంలో పనిచేయడానికి బీబీసీకి అవకాశం ఉండాలి’’ అన్నారు.

కన్జర్వేటివ్ పార్టీకి చెందిన సర్ జూలియన్ లూయిస్ ఈ సర్వేను అత్యంత ఆందోళనకర పరిణామంగా పేర్కొన్నారు.

బీబీసీ దిల్లీ, ముంబయి కార్యాలయాలలో ఐటీ శాఖ అధికారులు మూడు రోజుల పాటు సర్వే చేశారు. ఈ సర్వే తరువాత భారతదేశ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. విదేశీ సంస్థలకు చెందిన కొన్నిరకాల చెల్లింపులను ఇండియాలో ఆదాయంగా చూపించలేదనడానికి, వాటిపై పన్ను కట్టలేదనడానికి ఆధారాలు లభించాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, బీబీసీ ఎలా పని చేస్తుంది... నిధులు ఎక్కడి నుంచి వస్తాయి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)