బీబీసీ ఎలా పని చేస్తుంది, నిధులు ఎక్కడి నుంచి వస్తాయి?

బీబీసీ ప్రస్థానం

ఫొటో సోర్స్, SOPA IMAGES

1922 అక్టోబర్ 18న బీబీసీ సంస్థ ఏర్పాటైంది. అప్పట్లో మార్కోనీ కంపెనీ (రేడియో సృష్టికర్త మార్కోనీ నిర్మించిన సంస్థ) లాంటి టాప్ వైర్‌లెస్ కంపెనీల సహకారంతో బీబీసీ ప్రసారాలు మొదలయ్యాయి.

మొదట్లో దీని పేరు బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ. బీబీసీ రెగ్యులర్ ప్రసారాలు 1922, నవంబర్14 నుంచి మార్కోని లండన్‌ స్టూడియో నుంచి ప్రారంభమయ్యాయి.

33 ఏళ్ల స్కాటిష్ ఇంజనీర్ జాన్ రీత్ బీబీసీ జనరల్ మేనేజర్‌గా నియమితులయ్యారు.

నేటి బీబీసీ అంటే బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పోరేషన్ 1927లో రాయల్ చార్టర్ కింద ఏర్పడింది.

అంటే ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకుండా, క్వీన్ ఆర్డర్ ప్రకారం పని చేస్తుంది. ఇప్పటికీ ఇదే సంప్రదాయం కొనసాగుతోంది.

బీబీసీ ప్రస్థానం

పార్లమెంటుకు జవాబుదారీ అయినప్పటికీ, బీబీసీపై ప్రభుత్వ నియంత్రణ ఉండదు. పూర్తిగా స్వయంప్రతిపత్తి కలిగిన బీబీసీ, తన స్వయంప్రతిపత్తిని కొనసాగించడానికి అనేక నిబంధనలు, ప్రమాణాలను రూపొందించుకుంది.

బీబీసీ తొలి డైరక్టర్ జనరల్‌గా సర్ జాన్ రీత్ నియమితులయ్యారు.

బీబీసీ లక్ష్యాలు, హక్కులు, బాధ్యతలు రాయల్ చార్టర్‌లో ఉంటాయి. వీటిని అమలు చేయడం డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ సిబ్బంది ప్రధానమైన విధి.

బీబీసీ ప్రస్థానం

ఫొటో సోర్స్, SOPA IMAGES

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ

అత్యంత ప్రజాదరణ పొందిన అతిపెద్ద పబ్లిక్ సర్వీస్ ఇంటర్నేషనల్ బ్రాడ్‌కాస్టర్ బీబీసీ.

యునైటెడ్ కింగ్‌డమ్‌తోపాటు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు నిష్పాక్షికమైన సమాచారాన్ని అందించడం, వారిని ఎడ్యుకేట్ చేయడం, వినోదాన్ని అందించడం బీబీసీ లక్ష్యం.

ఇందుకోసం వరల్డ్ క్లాస్ ప్రోగ్రామ్‌లను, కంటెంట్‌ను బీబీసీ రూపొందిస్తుంది.

టీవీ, రేడియోలతోపాటు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా బీబీసీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. బ్రిటన్‌లో ఎక్కువమంది చూసే ‘బీబీసీ వన్’ ఇందులో ఒకటి. ఇది నేషనల్ బ్రాడ్‌కాస్టర్.

ఇంగ్లండ్‌తోపాటు, నార్త్ ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్‌లలో కూడా బీబీసీ టెలీవిజన్ చానెళ్లను నడుపుతోంది. ఇవి కాకుండా, బ్రిటన్‌లో బీబీసీకి అనేక రేడియో స్టేషన్ల నెట్‌వర్క్ ఉంది.

పిల్లల కోసం సీబీబీ, పెద్దల కోసం సీబీబీసీ, టీనేజర్ల కోసం చానెల్ 3లను కూడా బీబీసీ నడుపుతోంది.

బీబీసీకి లైసెన్స్ ఫీజు చెల్లిస్తున్నందున, యూకే ప్రజలు బీబీసీ ప్రసారాలను పూర్తిగా యాడ్స్ లేకుండా చూడగలుగుతారు.

బీబీసీ వరల్డ్ సర్వీస్ ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా భాషలలో టెలీవిజన్, రేడియో, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను నడుపుతోంది.

బీబీసీ ప్రస్థానం

రాయల్ చార్టర్ నిబంధనల ప్రకారం, బీబీసీ లైసెన్స్ ఫీజు రూపంలో నిధులను అందుకుంటుంది. ఈ నిధుల ద్వారానే అన్ని కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తుంది.

బీబీసీ ప్రతి సంవత్సరం తన ఆర్ధిక నివేదికలను రాయల్ చార్టర్ నిబంధనల ప్రకారం పబ్లిక్‌లో ఉంచుతుంది. లైసెన్స్ ఫీజును చెల్లించే ప్రతి ఒక్కరూ బీబీసీ పనితీరును నిశితంగా పరిశీలిస్తారు.

యునైటెడ్ కింగ్‌డమ్‌లో టెలీవిజన్ ఉన్న ప్రతి ఇల్లూ లైసెన్స్ ఫీజు రూపంలో బీబీసీకి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజు చెల్లించకపోవడాన్ని ఇక్కడ నేరంగా పరిగణిస్తారు.

అయితే, ఈ విధానాన్ని మార్చాలని ప్రస్తుతం డిమాండ్లు వినిపిస్తున్నాయి.

అన్నిరకాల కార్యక్రమాల నిర్వహణకు బాధ్యత వహించేందుకు బీబీసీ వరల్డ్ సర్వీస్‌కు ఒక బోర్డు ఉంది.

ఈ బోర్డు గ్లోబల్ న్యూస్ డైరెక్షన్ గ్రూప్‌కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

బీబీసీ ప్రస్థానం

ఫొటో సోర్స్, PETER MACDIARMID

బీబీసీ వరల్డ్ సర్వీస్

ప్రస్తుతం వరల్డ్ సర్వీసుగా పిలుస్తున్న ఈ సర్వీసులను బీబీసీ 1932 డిసెంబర్ 19న ప్రారంభించింది. అప్పట్లో దీన్ని ఎంపైర్ సర్వీస్ అని పిలిచేవారు.

అప్పట్లో కొత్తగా వచ్చిన షార్ట్ వెబ్ టెక్నాలజీ బీబీసీ ప్రసారాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి సహాయంగా నిలిచింది.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఎంపైర్ సర్వీస్ సేవలు మరింత విస్తృతంగా మారాయి. తరువాత దానికి ఓవర్సీస్ సర్వీస్‌గా పేరు మార్చారు.

రెండో ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి ఈ ఓవర్సీస్ సర్వీస్ 40 భాషలకు విస్తరించింది.

1965లో బీబీసీ ఓవర్సీస్ సర్వీసును బీబీసీ వరల్డ్ సర్వీస్‌గా మార్చారు.

కోల్డ్‌వార్ సమయంలో బీబీసీ అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అనేక దేశాలలో బీబీసీ సర్వీసులను నిలిపివేశారు. బీబీసీ జర్నలిస్టులపై వ్యక్తిగత దాడులు కూడా జరిగాయి.

బీబీసీ బల్గేరియన్ కరస్పాండెంట్ జార్జి మార్కోవ్‌ను 1978లో లండన్‌లో విషప్రయోగం ద్వారా చంపారు.

ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తరువాత రాజకీయ కారణాలతో అనేక యూరోపియన్ భాషా సర్వీసులను నిలిపేయాల్సి వచ్చింది. అలాగే, బీబీసీ వరల్డ్ సర్వీస్ తన ప్రాధాన్యతలలో మార్పులు చేసుకుంది.

ఆ క్రమంలోనే 2008 సంవత్సరంలో అరబిక్, 2009లో పార్సీ భాషలలో టీవీ ప్రసారాలు ప్రారంభమయ్యాయి.

1991లో బీబీసీ వరల్డ్ సర్వీస్ తన సొంత టీవీ న్యూస్ చానెల్‌ను ప్రారంభించింది. ఇది యూరప్‌లో పుట్టి, ఆ తర్వాత ఆసియా, మిడిల్‌ ఈస్ట్ వరకు విస్తరించింది.

బీబీసీ వరల్డ్ సర్వీస్ టీవీ న్యూస్ అనేది బీబీసీకి అనుబంధంగా ఏర్పడింది. దీనికి నిధులు సబ్‌స్క్రిప్షన్లు, యాడ్స్ ద్వారా అందుతాయి.

వరల్డ్ సర్వీస్ టెలివిజన్ న్యూస్‌కు మొదట బీబీసీ వరల్డ్ అని పేరు పెట్టారు. 1998 లో దీనికి బీబీసీ వరల్డ్ న్యూస్‌గా పేరు మార్చారు.

బీబీసీ వరల్డ్ న్యూస్ ప్రస్తుతం 200కి పైగా దేశాలలో అందుబాటులో ఉంది. వారానికి 7.6 కోట్లమంది దీనిని వీక్షిస్తారు.

లండన్‌లోని బుష్ హౌస్ 1941 నుంచి బీబీసీ వరల్డ్ సర్వీస్ ప్రధాన కార్యాలయంగా ఉంటూ వచ్చింది. 2012లో ఆ భవనాన్ని ఖాళీ చేసి బ్రాడ్‌కాస్టింగ్ హౌస్‌కు మారింది. ఇక్కడి నుంచే బీబీసీ జర్నలిస్టులు పని చేస్తుంటారు.

బీబీసీ వరల్డ్ సర్వీస్ వీక్లీ ప్రేక్షకులలో మూడవ వంతు 15 నుంచి 24 మధ్య వయసువారే.

బీబీసీ వరల్డ్ సర్వీస్‌లో మరో విభాగం బీబీసీ లెర్నింగ్ ఇంగ్లీష్. అంతర్జాతీయ ప్రేక్షకులకు ఇంగ్లీష్ నేర్పించడం బీబీసీ లెర్నింగ్ ఇంగ్లీష్ విధి.

ఇందుకోసం ప్రేక్షకులకు ఉచితంగా ఆడియో, వీడియో, టెక్ట్స్ రూపంలో మెటీరియల్‌ను అందిస్తుంది.

1940ల తర్వాత ఇటీవలి సంవత్సరాలలో బీబీసీ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విస్తరించింది.

బీబీసీ వరల్డ్ సర్వీస్ ఇప్పుడు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో 40కి పైగా భాషల్లో అందుబాటులో ఉంది. కైయిరో, సోల్ మొదలుకుని బెల్‌గ్రేడ్, బ్యాంకాక్ వరకు సేవలను అందిస్తోంది.

యూకే తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద కార్యకలాపాలు దిల్లీ, నైరోబీలలో కొనసాగుతున్నాయి.

బీబీసీ వరల్డ్ సర్వీస్ డిజిటల్ రీచ్ -14.8 కోట్లు (వారానికి)

బీబీసీ వరల్డ్ సర్వీస్ టెలివిజన్ రీచ్-13 కోట్లు (వారానికి)

బీబీసీ వరల్డ్ సర్వీస్ రేడియో రీచ్ -15.9 కోట్లు (వారానికి)

బీబీసీ ప్రస్థానం

ఫొటో సోర్స్, PA Media

నిధులు ఎలా వస్తాయి?

బీబీసీ వరల్డ్ సర్వీస్‌కు యూకేలో లైసెన్స్ ఫీజు ద్వారా నిధులు అందుతాయి.

దీనితో పాటు, 'ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్' (ఎఫ్‌సీడీఓ) నుండి కొన్ని నిధులు వస్తాయి.

బ్రిటన్‌లో టీవీ ఉన్న ప్రతి ఇల్లు టీవీ లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ప్రస్తుతం వార్షిక లైసెన్స్ ఫీజు 159 పౌండ్లు అంటే సుమారు రూ.15వేలు.

అంతకుముందు, బ్రిటిష్ ప్రభుత్వం పార్లమెంటు ద్వారా బీబీసీ వరల్డ్ సర్వీస్‌కు గ్రాంట్లు మంజూరు చేసేది. పార్లమెంటు నుంచి వచ్చిన నిధుల నుంచి ఫారిన్ అండ్ కామన్వెల్త్ ఆఫీస్(ఎఫ్‌సీఓ)కూడా కొన్ని నిధులను అందించేది.

2014-15 సంవత్సరం నుండి బీబీసీ వరల్డ్ సర్వీస్‌కు లైసెన్స్ ఫీజు నుంచి మాత్రమే నిధులు ఇవ్వాలని 2010లో ప్రభుత్వం నిర్ణయించింది.

గత ఏడాది యూకే ప్రభుత్వం రాబోయే రెండేళ్లకు లైసెన్స్ ఫీజును ఫ్రీజ్ చేసింది. అంటే ఆ నిధులలో ఎలాంటి పెరుగుదల ఉండదు.

గత ఏడాది రివ్యూ తర్వాత యూకే ప్రభుత్వం మూడు సంవత్సరాలకు 28.3 కోట్ల పౌండ్ల( సుమారు రూ.2815 కోట్లు) నిధిని ప్రకటించింది. అంటే ప్రతియేటా సుమారు రూ.930 కోట్లు అన్నమాట.

బీబీసీ ప్రస్థానం

లైసెన్స్ ఫీజు కాకుండా, బీబీసీ తన కమర్షియల్ కంపెనీల ద్వారా కూడా నిధులు సమకూర్చుకుంటుంది. వీటిలో బీబీసీ స్టూడియోస్, బీబీసీ స్టూడియో వర్క్స్ ఉన్నాయి.

ప్రస్తుతం బీబీసీ వరల్డ్ సర్వీసులను 200కి పైగా దేశాలలో చూడవచ్చు. న్యూస్, బిజినెస్, స్పోర్ట్స్‌తోపాటు కరెంట్ ఎఫైర్స్, లైఫ్‌స్టైల్‌ మీద కూడా ఈ సర్వీసులు డాక్యుమెంటరీలను ప్రసారం చేస్తాయి.

బీబీసీ.కామ్ అనేది బీబీసీ కమర్షియల్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం న్యూస్, ఫీచర్స్‌ను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)