బీబీసీపై ఐటీ ‘సర్వే’ విషయంలో జాతీయ, అంతర్జాతీయ మీడియా కథనాలు ఏం చెప్పాయి?

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీకి చెందిన దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో మంగళవారం ఉదయం ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన సర్వేకు సంబంధించిన వార్తలను ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రతిష్టాత్మక వార్తాపత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.
బీబీసీ ప్రెస్ ఆఫీస్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ, ''మేం మా సిబ్బందికి అండగా ఉంటున్నాం. వీలైనంత త్వరగా పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నాం'' అని ప్రకటన జారీ చేసింది.
''ఎప్పటిలాగే మా అవుట్‌పుట్, పాత్రికేయ సేవలు కొనసాగుతాయి. మా పాఠకులకు, వీక్షకులకు సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం'' అని వ్యాఖ్యానించింది.
ఈ వార్త రాసే సమయానికి కూడా దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు ఉన్నారు.
న్యూయార్క్ టైమ్స్
అమెరికాలోని ప్రతిష్టాత్మక వార్తా పత్రిక 'న్యూయార్క్ టైమ్స్' ఈ వ్యవహారానికి సంబంధించి వివరణాత్మక వార్తను ప్రచురించింది. వివిధ వర్గాలకు చెందిన వాదనలను ఈ కథనంలో జోడించింది.
''భారత్‌లోని మైనారిటీ వర్గమైన ముస్లిం సమాజంపై, ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిని విమర్శించే డాక్యుమెంటరీని భారత్‌లో ప్రదర్శించడాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇది జరిగిన కొన్ని వారాల తర్వాత మోదీ సర్కారులోని ఐటీ శాఖ అధికారులు మంగళవారం, బీబీసీ దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో దాడి చేశారు.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ ఏజెన్సీలు తరచుగా స్వతంత్ర మీడియా సంస్థలు, మానవహక్కుల సంస్థలపై దాడులు చేస్తున్నాయి. విమర్శనాత్మక గొంతులను నొక్కేందుకు ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నంగా సామాజిక కార్యకర్తలు దీన్ని చూస్తున్నారు'' అని వార్తలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Reuters
వాషింగ్టన్ పోస్ట్
అమెరికాకు చెందిన మరో వార్తా పత్రిక 'వాషింగ్టన్ పోస్ట్' కూడా ఈ ఘటనపై విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించింది. ఇందులో భారత్‌లో పత్రిక స్వేచ్ఛ గురించి చర్చించింది.
ఈ విశ్లేషణలో వాషింగ్టన్ పోస్ట్ ఇలా రాసింది. ''ఆదాయపు పన్ను శాఖ అధికారులు, బీబీసీకి చెందిన దిల్లీ, ముంబయి కార్యాలయాలకు చేరుకోగానే ప్రపంచం దృష్టి మొత్తం భారత్‌లో దుర్భర స్థితిలో ఉన్న పత్రికా స్వేచ్ఛపై పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ దాడులను 'సర్వే'గా పిలుస్తోంది. అంటే 'టాక్స్ రైడ్'కు ఇది మారుపేరు. ఈ దాడులు జరిగిన సమయం పట్ల కూడా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
మూడు వారాల క్రితం బీబీసీ, లండన్‌లో ఒక డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. 2002 గుజరాత్ మత అల్లర్లలో ప్రధాని మోదీ పాత్రపై ఈ డాక్యుమెంటరీ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ వ్యవహారంలో మోదీ చాలా సున్నితంగా వ్యవహరించారు. ఆయన ప్రభుత్వం, డాక్యుమెంటరీని బ్లాక్ చేసింది. సోషల్ మీడియా నుంచి విశ్వవిద్యాలయాల వరకు దీనికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించడాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది'' అని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో వివరించింది.
వాల్ స్ట్రీట్ జనరల్
అమెరికా వార్తాపత్రిక వాల్ స్ట్రీట్ జనరల్ కూడా ఈ దాడులు జరిగిన సమయానికి సంబంధించి వార్తను ప్రచురించింది.
''బీబీసీ దిల్లీ కార్యాలయంలో పనిచేసే ఒక ఉద్యోగి, వాల్ స్ట్రీట్ జనరల్‌తో మాట్లాడారు. ఐటీ అధికారులు తమను మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దని చెప్పారని ఆయన తెలిపారు. అదే సమయంలో ట్యాక్స్‌కు సంబంధించిన పత్రాలను వెరిఫై చేసుకోవడం కోసం బీబీసీలో సర్వేను నిర్వహిస్తున్నట్లు ఐటీ శాఖ అధికారి ఒకరు చెప్పారు. ఇంతకుమించి ఆయన ఎలాంటి అదనపు వివరాలు ఇవ్వలేదు'' అని వాల్ స్ట్రీట్ జనరల్ వార్తలో పేర్కొంది.
ఈ వార్తలో మరో అంశాన్ని కూడా వాల్ స్ట్రీట్ జనరల్ హైలైట్ చేసింది.
'ఇండియా: ద మోదీ క్వశ్చన్' అనే పేరుతో వచ్చిన బీబీసీ డాక్యుమెంటరీని, అందులోని భాగాలపై నిషేధం విధించడం కోసం అత్యవసర చట్టాలను అమల్లోకి తెచ్చిన కొద్ది రోజులకే మోదీ సర్కారు ఈ చర్యకు పాల్పడిన విషయాన్ని వార్తలో హైలైట్‌గా పేర్కొన్నారు.
ఈ డాక్యుమెంటరీని విశ్వవిద్యాలయాల్లో సామూహికంగా చూడటానికి ప్రయత్నించిన విద్యార్థులను కూడా ప్రభుత్వ ఏజెన్సీలు అదుపులోకి తీసుకున్నాయని వార్తలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
జర్మన్ బ్రాడ్‌కాస్టర్ డీడబ్ల్యూ
జర్మనీకి చెందిన వార్తా సంస్థ డీడబ్ల్యూ ఈ వ్యవహారానికి సంబంధించిన వార్తను రాస్తూ... 'ఇండియా: ద మోదీ క్వశ్చన్' పేరుతో రెండు భాగాలుగా రూపొందించిన ఒక డాక్యుమెంటరీని జనవరి నెలలో బీబీసీ విడుదల చేసిందని పేర్కొంది.
''గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉండగా జరిగిన 2002 మత కల్లోలాల విషయంలో చూసీచూడనట్లుగా వ్యవహరించాలని పోలీసులను మోదీ ఆదేశించినట్లుగా ఈ డాక్యుమెంటరీలో ఆరోపించారు. ఈ అల్లర్లలో వెయ్యి కంటే ఎక్కువ మంది ప్రజలు మరణించారు. వీరిలో ఎక్కువమంది ముస్లింలు ఉన్నారు.
సమాచార సాంకేతికత చట్టం (ఐటీ యాక్ట్)లోని అత్యవసర అధికారాలను ఉపయోగించి ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్వీట్లు, వీడియో లింకులను భారత ప్రభుత్వం బ్లాక్ చేసింది'' అని డీడబ్ల్యూ పేర్కొంది.
ద గార్డియన్
బ్రిటిష్ సర్కారు ఈ వ్యవహారంపై ఇంకా స్పందించలేదని బ్రిటన్ వార్తా సంస్థ 'ద గార్డియన్' తన వార్తలో తెలిపింది.
గార్డియన్ ప్రచురించిన వార్త ప్రకారం, ''బ్రిటిష్ ప్రభుత్వం ఈ దాడి గురించి వ్యాఖ్యానించడానికి తిరస్కరించింది. అయితే, ఈ వ్యవహారం గురించి బీబీసీతో మాట్లాడినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక అధికారి చెప్పారు. గతంలో కూడా ఇలాంటి వ్యవహారాల్లో రాజకీయ మద్దతును బీబీసీ కోరుకోలేదు. ఎందుకంటే బ్రిటన్ అధికార సంస్థగా కాకుండా తానొక స్వతంత్ర సంస్థగా బీబీసీ భావిస్తుంది.''
భారతీయ మీడియాలో ఏం ప్రచురించింది?
భారతీయ మీడియాలోని ప్రతిష్టాత్మక సంస్థలు ఈ వ్యవహరంపై నిరంతరం వార్తలను ప్రచురిస్తూనే ఉన్నాయి.
''టీడీఎస్, విదేశీ పన్నులతో సహా అనేక వ్యవహారాలతో ఈ సర్వే ముడిపడి ఉండొచ్చు. ఐటీ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది'' అని ఆదాయపు పన్ను శాఖకు చెందిన సోర్సులను ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తను ప్రచురించింది.
చట్టానికి ఎవరూ అతీతులు కాదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.
సర్వే పూర్తయిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ దీనికి సంబంధించిన సమాచారాన్ని అందజేస్తుందని ఆయన చెప్పారు.
ఇంగ్లిష్ పత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కూడా దీనిపై వార్తను ప్రచురించింది.
పన్ను ప్రయోజనాలను పొందడం కోసం, లాభాల కోసం అవకతవకలను పాల్పడ్డారా? లేదా? అనే దానిపై దర్యాప్తు చేయడమే ఈ సర్వే ఉద్దేశమని ప్రభుత్వ అధికారులు చెప్పినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసింది.
''ట్రాన్స్‌ఫర్ ప్రైజింగ్ రూల్స్ విషయంలో బీబీసీ అవకతవకలకు పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి. బీబీసీ ఉద్దేశపూర్వకంగా ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు అధికారులు వ్యాఖ్యానించారు'' అని కథనంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.
ఈ వ్యవహారంపై ‘ద హిందూ’ పత్రిక ప్రచురించిన వార్తలో అమెరికా ప్రభుత్వ స్పందనను కూడా ప్రస్తావించింది.
బీబీసీ దిల్లీ ఆఫీసులో ఐటీ శాఖ దాడి గురించి తమకు తెలుసని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడా ప్రైస్ అన్నారు. ''ఈ విషయంలో మరింత సమాచారం కోసం భారత అధికారులను సంప్రదించాలని మీకు చెప్పాలనుకుంటున్నా.
ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమా? కాదా? అనే విషయాన్ని నేను చెప్పలేను. ఈ సెర్చ్ ఆపరేషన్‌కు సంబంధించిన వాస్తవాలు మాకు తెలుసు. కానీ, ఈ విషయంపై వ్యాఖ్యానించే పరిస్థితిలో నేను లేను'' అని ఆయన అన్నట్లు హిందూ పత్రిక కథనంలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- కొత్తవీధి, గుంటి: గిరిజనులు సాగుచేసే ఈ గ్రామాలు రికార్డుల్లో ఎలా మాయం అయ్యాయి?
- బీబీసీ ఇండియా కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలు
- బెలూన్లు, డ్రోన్లు, శాటిలైట్లు... పరాయి దేశాల మీద గూఢచర్యం కోసం వీటిని ఎలా వాడతారు?
- వీర్యంలో శుక్రకణాలు ఈతకొట్టకుండా ఆపే ఈ టాబ్లెట్ ప్రత్యేకత ఏంటి ?
- డియోడరెంట్ పీల్చటం ప్రాణాలకు ముప్పు తెస్తుందా? జాగ్రత్తగా వాడటం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












