భారత్‌లోని బీబీసీ కార్యాలయాల్లో ముగిసిన ఆదాయ పన్ను శాఖ అధికారుల ‘సర్వే’

ఫొటో సోర్స్, Reuters
భారత్‌లోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన 'సర్వే' ముగిసింది.
దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో మంగళవారం నాడు ఐటీ అధికారుల 'సర్వే' మొదలైంది. మూడు రోజుల పాటు వారు బీబీసీ కార్యాలయాల్లోనే ఉన్నారు.
ఫిబ్రవరి 16 గురువారం నాడు రాత్రి 10 గంటల ప్రాంతంలో సర్వే ముగిసింది. ఐటీ అధికారులు బీబీసీ కార్యాలయాల నుంచి వెళ్లిపోయారు. దీనిపై బీబీసీ అధికార ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు.
'దిల్లీ, ముంబయిలోని మా కార్యాలయాల నుంచి ఆదాయ పన్ను శాఖ అధికారులు వెళ్లిపోయారు. అధికారులకు మేం పూర్తిగా సహకరిస్తూనే ఉంటాం. ఈ అంశం త్వరలోనే పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం.
మా సిబ్బందికి అండగా ఉంటున్నాం. కొందరిని చాలా సేపు ప్రశ్నించారు. మరికొందరు రాత్రిళ్లు కూడా కార్యాలయంలో ఉండాల్సి వచ్చింది. మా సిబ్బంది సంక్షేమం మాకు అత్యంత ముఖ్యం. మా కార్యకలాపాలు మళ్లీ యథావిధిగా జరుగుతున్నాయి. భారతదేశంలోని, బయట ఉన్న మా ప్రేక్షకులు, పాఠకులకు వార్తలు అందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం.
బీబీసీ విశ్వసనీయమైన స్వతంత్ర మీడియా సంస్థ. ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా వార్తలు రిపోర్ట్ చేసే మా జర్నలిస్టులు, సహోద్యోగులకు మేం ఎప్పుడూ అండగా నిలబడతాం' అని బీబీసీ ప్రతినిధి తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
'సర్వేలో భాగంగా కీలక స్థానాల్లో ఉన్న ఉద్యోగులతోపాటు కంటెంట్ డెవలప్‌మెంట్, ఆర్థికవ్యవహారాలకు సంబంధించిన సిబ్బంది నుంచి స్టేట్‌మెంట్స్ తీసుకున్నాం.
ఎటువంటి డిజిటల్ డివైసెస్‌ను స్వాధీనం చేసుకోలేదు. కీలక స్థానాల్లో లేని బీబీసీ ఎడిటోరియల్ సిబ్బందిని తమ రోజూవారీ పని చేసుకునేందుకు అనుమతించాం.
రాత్రి పూట అడిగినప్పుడు బీబీసీ సిబ్బందిని ఇంటికి వెళ్లేందుకు కూడా అనుమతిచ్చాం.
కీలకం అని భావించిన డివైసెస్ నుంచి డేటాను క్లోనింగ్ చేసి, వాటిని తిరిగి ఇచ్చేశాం. ప్రొసీడింగ్స్ అయిపోయిన తరువాత రెండు ప్రదేశాల నుంచి అధికారులు వెళ్లిపోయారు' అని ఐటీ శాఖ ప్రతినిధి తెలిపినట్లు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.
తొలి రోజు ఇలా...
మంగళవారం అంటే ఫిబ్రవరి 14న ఐటీ అధికారులు దిల్లీ, ముంబయిలోని బీబీసీ ఆఫీసులకు వచ్చి 'సర్వే' చేపట్టారు. వారికి బీబీసీ సిబ్బంది పూర్తిగా సహకరించారు.
'దిల్లీ, ముంబయిలలోని బీబీసీ కార్యాలయాలలో ఆదాయపన్ను శాఖ అధికారులు ఉన్నారు. బీబీసీ సిబ్బందిలో చాలామంది ఆఫీసుల నుంచి వెళ్లిపోయినప్పటికీ తనిఖీల విషయంలో సహకరించేందుకు గాను ఆదాయ పన్ను శాఖ అధికారులు కోరడంతో కొందరు సిబ్బంది మాత్రం ఆఫీసులలోనే ఉన్నారు.
ప్రస్తుత ఈ సమయంలో మా సిబ్బందికి అండగా ఉంటున్నాం. పరిస్థితులు వీలైనంత త్వరగా చక్కబడతాయని ఆశిస్తున్నాం. ఎప్పటిలాగే మా పాత్రికేయ సేవలు కొనసాగుతాయి, భారత్‌లోని మా పాఠకులు, వీక్షకులకు సేవలందించేందుకు కట్టుబడి ఉన్నాం' అని బీబీసీ ప్రెస్ ఆఫీస్ తొలిరోజు ఒక ప్రకటనలో పేర్కొంది.
ఆ తరువాత బీబీసీ కార్యాలయాల్లోనే ఉన్న ఐటీ అధికారులు బుధవారం, గురువారాల్లో కూడా 'సర్వే' నిర్వహించారు. కొందరు బీబీసీ సిబ్బంది ఆఫీసులోనే ఉండి అధికారులకు సహకరించారు. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో సర్వే ముగిసింది. అధికారులు బీబీసీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ 'సర్వే'పై ఎవరేమన్నారంటే..?
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ 'సర్వే'ను భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సమర్థించింది. ఏ సంస్థ కూడా చట్టానికి అతీతం కాదని ఆ పార్టీ పేర్కొంది.
'చట్టానికి లోబడే 'సర్వే' జరుగుతోంది. అయితే వాటిని చేపట్టిన టైంతో ప్రభుత్వానికి సంబంధం లేదు' అని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మంగళవారం అన్నారు. బీబీసీని ''ప్రపంచంలో అత్యంత భ్రష్టమైన సంస్థ''గా ఆయన అభివర్ణించారు.
'ఎవరూ చట్టానికి అతీతులు కారు. బీబీసీ దిల్లీ, ముంబయి ఆఫీసుల్లోని 'సర్వే'ల గురించి పూర్తి వివరాలను ఐటీ శాఖ ఇస్తుంది' అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ప్రతిపక్షాల విమర్శలు
పాత్రికేయ సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, పలు రాజకీయ పార్టీల నాయకులు ఆదాయ పన్ను విభాగం అధికారులు చేపట్టిన 'సర్వే'ను ఖండించారు. ఇది పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకమని అన్నారు.
'అదానీ కేసులో జేపీసీ ఏర్పాటు చేయాలని మేం అడుగుతుంటే ప్రభుత్వం బీబీసీ వెంట పడుతోంది. వినాశకాలే విపరీత బుద్ధి' అంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సర్వేను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. అది పాత్రికేయ స్వేచ్ఛను 'హరించడమే' అని ఆమె అన్నారు.
తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు కూడా ఐటీశాఖ 'సర్వే'ను విమర్శించారు.
'గుజరాత్ అల్లర్ల మీద తీసిన బీబీసీ డాక్యుమెంటరీ అంటే మోదీ ఎందుకు భయపడుతున్నారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే స్వతంత్ర మీడియా అవసరం ఉంది' అని ఆయన అన్నారు.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి మానవ హక్కుల సంస్థలు కూడా బీబీసీ కార్యాలయాల్లో ఐటీ 'సర్వే'ను ఖండించాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ఖండించిన పాత్రికేయ సంఘాలు
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ అధికారులు 'సర్వే' చేపట్టడం మీద ఎడిటర్స్ గిల్డ్ ఆందోళన వ్యక్తం చేసింది.
తెలుగు పాత్రికేయ సంఘాలు కూడా దీన్ని ఖండించాయి. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ హైదరాబాద్‌లో పాత్రికేయులు నిరసన తెలిపారు.
సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద జరిగిన నిరసనలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్-టీడబ్ల్యూజేఎఫ్, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్-హెచ్‌యూజే నాయకులు పాల్గొన్నారు.
'ఇది మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దాడి. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే సంస్థలను తమ దారికి తెచ్చుకునే కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తమ ఏజెన్సీలను ఉసిగొల్పుతోంది. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలనుకోవడం తగదు" అని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య వ్యాఖ్యానించారు.

బ్రిటన్, అమెరికా ఏమన్నాయి..?
గత నెలలో బీబీసీ డాక్యుమెంటరీ గురించి బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్‌ను ఆ దేశ పార్లమెంటులో అడిగారు.
''ఎక్కడైనా మత వివక్షతో కూడిన హింసను మేం సహించం'' అని ఆయన చెప్పారు. అయితే.. ''మోదీని చూపించిన తీరుతో తాను ఏకీభవించటం లేదు'' అని ఆయన పేర్కొన్నారు.
అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్‌ను పాత్రికేయులు ఐటీ 'సర్వే' గురించి ప్రశ్నించారు. అయితే దాని గురించి భారత ప్రభుత్వాన్ని అడగాలని ఆయన అన్నారు.
'ప్రత్యేకించి ఆ విచారణ గురించి కాకుండా ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛకు మేం అండగా ఉంటాం' అని నెడ్ ప్రైస్ అన్నారు.
దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన సర్వేకు సంబంధించిన వార్తలను న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్, ద గార్డియన్ సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రతిష్టాత్మక వార్తాపత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
బీబీసీ డాక్యుమెంటరీ తరువాత...
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శనాత్మకంగా ఉన్న ఒక డాక్యుమెంటరీని బీబీసీ బ్రిటన్‌లో ప్రసారం చేసిన కొన్ని వారాల తర్వాత బీబీసీకి చెందిన దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఈ 'సర్వే' జరిగింది.
నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, 2002లో ఆ రాష్ట్రంలో జరిగిన మత ఘర్షణలపై ఆ డాక్యుమెంటరీని బీబీసీ రూపొందించింది.
బీబీసీ డాక్యుమెంటరీ 'ఇండియా: ది మోదీ క్వశ్చన్' కేవలం బ్రిటన్‌లో మాత్రమే ప్రసారం అయినప్పటికీ, ఆ డాక్యుమెంటరీ ''వలసవాద మనస్తత్వం''తో కూడిన ''శత్రుపూరిత దుష్ప్రచారం, భారత వ్యతిరేక చెత్త'' అని భారత ప్రభుత్వం అభివర్ణించింది. ఈ డాక్యుమెంటరీని ప్రజలు ఆన్‌లైన్‌లో షేర్ చేయకుండా అడ్డుకోవటానికి ప్రభుత్వం ప్రయత్నించింది.
తనపై వచ్చిన ఆరోపణలను మోదీ మొదటి నుంచి తిరస్కరిస్తూ వచ్చారు. ఆయన మీద న్యాయ విచారణకు తగినన్ని ఆధారాలు లేవని 2013లో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ పేర్కొంది.
ఆ డాక్యుమెంటరీపై స్పందన తెలియజేయాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని సంప్రదించామని, కానీ ప్రభుత్వం స్పందించటానికి తిరస్కరించిందని బీబీసీ గత నెలలో చెప్పింది.
ఆ డాక్యుమెంటరీ కోసం ''లోతైన పరిశోధన చేశాం. విస్తృతమైన గళాలు, ప్రత్యక్ష సాక్షులు, నిపుణులను కలిశాం. బీజేపీకి చెందిన వ్యక్తులు సహా అనేక అభిప్రాయాలను పొందుపరిచాం'' అని బీబీసీ వివరించింది.
గత నెలలో ఈ డాక్యుమెంటరీని వీక్షించటానికి గుమిగూడిన విద్యార్థులను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశవ్యాప్తంగా ఆ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు ప్రయత్నం చేసిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడం, అదుపులోకి తీసుకోవడం వంటి ఘటనలు జరిగాయి.

గతంలోనూ..
భారతదేశంలో ప్రభుత్వాన్ని విమర్శించే సంస్థలను లక్ష్యం చేసుకోవటం అసాధారణమేమీ కాదు.
2020 సంవత్సరంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారతదేశంలో తన కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. మానవ హక్కుల సంస్థలపై ప్రభుత్వం ''కక్ష సాధింపు''కు పాల్పడుతోందని ఆ సంస్థ ఆరోపించింది.
గత ఏడాది ఆక్స్‌ఫామ్ సహా పలు ఇతర ప్రభుత్వేతర సంస్థల్లో కూడా సోదాలు జరిగాయి.
ఇవి కూడా చదవండి:
- కేరళ: బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌జెండర్ జంట
- అకస్మాత్తుగా కుప్పకూలటం, ఐసీయూలో చేరటం పెరుగుతోంది, ఎందుకిలా జరుగుతోంది?
- క్యాన్సర్ రోగులకు రూ.15 లక్షలు సాయం చేసే ఈ పథకం గురించి తెలుసా?
- ‘పది రోజుల పసిగుడ్డుతో సహా శిథిలాల కింద సమాధై.. నాలుగు రోజుల పాటు ఎలా బతికానంటే..’
- భారత్ పురాతన స్మార్ట్‌ఫుడ్ ఎలా సూపర్‌ఫుడ్‌గా మారుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








