అమెరికా: కులవివక్షను నిషేధించిన తొలి నగరంగా సియాటిల్

ఫొటో సోర్స్, TWITTER/KSHAMA SAWANT
అమెరికాలోని సియాటెల్ నగరంలో కుల వివక్షను నిషేధించారు. ఈ మేరకు సియాటెల్ నగర కౌన్సిల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
దీంతో సియాటెల్ కులవివక్షను నిషేధించిన తొలి అమెరికా నగరంగా నిలిచిందని 'అసోసియేటెడ్ ప్రెస్' వార్తాసంస్థ వెల్లడించింది.
కుల వివక్షను చట్ట విరుద్ధం చేయాలన్న డిమాండ్ అమెరికాలోని దక్షిణాసియా ప్రజల్లో పెరిగింది. అయితే, ఇలాంటి చట్టాలు చేయడమంటే ఆయా నిర్దిష్ట సమాజాలను కించపరచడమేనని కొందరు హిందూ అమెరికన్లు వాదిస్తున్నారు.
కుల వివక్షను నిషేధించాలన్న ప్రతిపాదనపై సియాటెల్ నగర కౌన్సిల్‌లో మంగళవారం ఓటింగ్ జరగ్గా 6-1 తేడాతో ఆమోదం పొందింది.
ఇండియన్ అమెరికన్ క్షమా సావంత్ కౌన్సిల్‌లో ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. మంగళవారం జరిగిన నగర కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై మాట్లాడేందుకు 100 మందికిపైగా గత వారం ప్రారంభంలోనే నమోదు చేసుకున్నారు.
ఈ ఆర్డినెన్స్‌కు మద్దతుగా సియాటెల్‌లో, ఇతర ప్రాంతాలలో దళితులు ర్యాలీలు తీశారని కాలిఫోర్నియాకు చెందిన ఈక్వాలిటీ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు తేన్‌మొళి సౌందరరాజన్ చెప్పారు.

ఫొటో సోర్స్, @UAW4121
ప్రవాస భారతీయులు ఎక్కువగా ఉండే దేశాల్లో అమెరికా కూడా ఒకటి. అమెరికాలో 1980 నాటికి 2,06,000 మంది భారతీయులు ఉండగా 2021 నాటికి ఆ సంఖ్య 27 లక్షలకు పెరిగిందని మైగ్రేషన్ పాలసీ ఇనిస్టిట్యూట్ గణాంకాలు చెప్తున్నాయి.
కాగా గత మూడేళ్ల కాలంలో అమెరికాలోని అనేక కాలేజీలు, యూనివర్సిటీలు కుల వివక్షను నిషేధించడానికి ముందుకొచ్చాయి. 2019 డిసెంబర్‌లో బోస్టన్ సమీపంలోని బ్రాండీస్ యూనివర్సిటీ తమ వివక్ష రహిత విధానంలో కులాన్ని చేర్చింది. అలా కులవివక్షను నిషేధించిన తొలి అమెరికా యూనివర్సిటీగా అది గుర్తింపు పొందింది.అనంతరం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, కాల్బీ కాలేజ్, బ్రౌన్ యూనివర్సిటీ వంటివీ అదే మార్గంలో నడిచాయి. హార్వర్డ్ యూనివర్సిటీ కూడా 2021లో ఈ తరహా విధానం తీసుకొచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
కాగా సియాటెల్ నగర కౌన్సిల్ తీసుకొచ్చిన ప్రస్తుత బిల్‌కు దళిత యాక్టివిస్ట్‌ల నేతృత్వంలోని ఈక్వాలిటీ ల్యాబ్స్ వంటివి మద్దతు పలుకుతున్నాయి. అమెరికాలోని భారతీయ సమాజంలోనూ కుల వివక్ష ప్రబలంగా ఉందని.. దక్షిణాసియా ప్రజలు కీలకంగా ఉన్న టెక్నాలజీ రంగంలోనూ వివక్ష కనిపిస్తోందని ఈ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు.
అయితే, హిందూ అమెరికన్ ఫౌండేషన్, కొయిలేషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా వంటి గ్రూపులు ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తున్నాయి.
'విద్వేషపూరిత సమూహాలు ఇచ్చిన తప్పులతడక డాటా, వారు చేస్తున్న నిరాధారమైన ఆరోపణల కారణంగా అల్పసంఖ్యాకులైన ఓ వర్గం ప్రజలను వేరుచేస్తున్నారు' అని కొయిలేషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా సంస్థకు చెందిన పుష్పిత ప్రసాద్ అన్నారు.
సియాటెల్ కులవివక్ష ఆర్డినెన్స్‌కే కాదు అమెరికా వ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా పుష్పిత క్యాంపెయిన్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, TWITTER/KSHAMA SAWANT
ఈ ఆర్డినెన్స్ అమలులోకి వస్తే అమెరికాలో నివసించే దక్షిణాసియా ప్రజలు, ముఖ్యంగా హిందువులు కుల వివక్షకు కారకులుగా మిగతావారు భావిస్తారని కొయిలేషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా హెడ్ నికుంజ్ త్రివేది అన్నారు. ఇలాంటి ఆర్డినెన్స్ కానీ చట్టం కానీ పూర్తిగా తప్పని, అమెరికా సంస్కృతికి ఇది విరుద్ధమని నికుంజ్ అన్నారు.
మరోవైపు, ఈ ప్రతిపాదన ప్రవేశపెట్టిన క్షమా సావంత్ కూడా భారతదేశంలోని పైస్థాయి కులానికి చెందినవారు.
భారతదేశంలో 1948లో కులవివక్షను నిషేధించారు. 1950లో కుల వివక్ష వ్యతిరేక విధానాన్ని రాజ్యాంగంలోనూ చేర్చారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








