అదానీ గ్రూపు సంస్థల్లో సంక్షోభం.. నరేంద్ర మోదీ గ్రీన్ ఎనర్జీ కలలను దెబ్బతీస్తుందా?

గౌతమ్ అదానీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆసియాలోని అత్యంత సంపన్నుల్లో అదానీ ఒకరు
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్‌ను గ్రీన్ ఎనర్జీ పవర్‌హౌజ్‌గా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్ల క్రితం భారీ ప్రణాళికలను ప్రకటించారు.

ఉద్గారాలను నెట్ జీరో స్థాయికి తగ్గిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. 2070 నాటికి కార్బన్ తటస్థ దేశంగా అంటే వాతావరణంలోకి గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల విడుదలను సున్నాకు దగ్గరగా తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు.

దేశంలో వినియోగించే ఎనర్జీలో సగ భాగాన్ని 2030 నాటికి పునరుత్పాదక వనరుల ద్వారానే పొందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించుకుంటామని చెప్పారు.

మోదీ రచించిన గ్రీన్ ఎనర్జీ ప్లాన్‌లకు వ్యాపారవేత్త అదానీ కీలకం. ఆసియాలోని అత్యంత సంపన్నులలో అదానీ ఒకరు. ‘అదానీ గ్రీన్ ఎనర్జీ’ అనే ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థతో పాటు ఏడు పబ్లిక్ ట్రేడింగ్ కంపెనీలతో కలిసి అనేక వ్యాపారాలను నిర్వహిస్తున్నారు.

గ్రీన్ ఎనర్జీలో 70 బిలియన్ డాలర్లు (రూ. 5,79,698 కోట్లు) ఖర్చు చేసి, 2030 నాటికి గ్లోబల్ రెన్యువబుల్ ప్లేయర్‌గా మారాలని అదానీ యోచిస్తున్నారు.

హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, పవన శక్తిని ఉపయోగించి సోలార్ ప్యానళ్లు, బ్యాటరీలు తయారు చేయడం, గ్రీన్ హైడ్రోజన్ తయారీలో ఈ డబ్బును ఖర్చు చేయాలని ఆయన భావిస్తున్నారు.

కానీ, అదానీ ఇటీవల ఎదుర్కొంటున్న ఇబ్బందులు, భారత గ్రీన్ ఎనర్జీ ఆశయాలకు ఆటంకాలుగా మారుతాయనే ఆందోళనలు పెరిగాయి.

అదానీ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఆర్థిక అవకతవకలపై వచ్చిన ఆరోపణలను అదానీ గ్రూపు కొట్టిపారేసింది

అదానీ గ్రూప్ దశాబ్దాలుగా స్టాక్ మ్యానిపులేషన్‌తో పాటు అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ హిండెన్‌బర్గ్ ఇటీవల నివేదిక వెలువరించింది. ఈ నివేదిక వచ్చిన తర్వాత అదానీ గ్రూపులోని లిస్టెడ్ కంపెనీలు తమ మార్కెట్ విలువలో దాదాపు 120 బిలియన్ డాలర్లు (రూ. 9,93,768 కోట్లు) నష్టపోయాయి.

హిండెన్ బర్గ్ నివేదికను ‘భారత్‌పై దాడి’ అని అభివర్ణించిన అదానీ గ్రూపు, తమపై వచ్చిన ఆరోపణలు దురుద్దేశపూర్వకమని, అవాస్తవాలని కొట్టి పారేసింది.

ఈ పరిణామాలతో పెట్టుబడిదారులు అయోమయానికి లోనవుతున్నారు. దీనికి నిదర్శనంగా ఫ్రాన్స్‌కు చెందిన ‘టోటల్ ఎనర్జీస్’ అనే ‘ఆయిల్ అండ్ గ్యాస్’ సంస్థ, పరిస్థితులపై మరింత స్పష్టత వచ్చేవరకు అదానీ గ్రూపుతో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు కోసం చేసుకున్న 4 బిలియన్ డాలర్ల (రూ. 33,129 కోట్లు) ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.

ఇప్పటికే ఎనర్జీ ప్రాజెక్టుల కోసం వారు, అదానీ గ్రూపులో 3 బిలియన్ డాలర్ల (రూ. 24,847 కోట్లు) కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టారు.

పెట్టుబడిదారులను శాంతింపచేయడానికి, తమ గ్రూపు ఎలాంటి మెటీరియల్ రీఫైనాన్సింగ్ రిస్క్ లేదా లిక్విడిటీ సమస్యలను ఎదుర్కోలేదని అదానీ గ్రూపు చెప్పింది.

‘‘అదానీ పోర్ట్‌ఫోలియో ఎనర్జీ ట్రాన్సిషన్ ప్లాన్లలో మార్పులు వస్తాయని మేం అనుకోవడం లేదు’’ అని బీబీసీతో అదానీ గ్రూపు అధికార ప్రతినిధి అన్నారు.

అదానీ పవర్

ఫొటో సోర్స్, Reuters

భారత వాతావరణ ప్రణాళికలపై తాజా పరిణామాల ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయడం తొందరపాటు అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.

‘‘గ్రీన్ ఎనర్జీ రంగంలో అదానీ గ్రూపు చాలా ప్రాముఖ్యమైనది. తాజా పరిణామాల దృష్ట్యా కొన్ని కొత్త పెట్టుబడుల విషయంలో ఆలస్యం జరగొచ్చు. ఒకవేళ వారు మరిన్ని ఆర్థిక వనరులను సేకరించలేకపోతే, ముందుగా అనుకున్న గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులపై కాస్త ప్రభావం పడుతుంది. కానీ పునరుత్పాదక ఇంధనంలో పురోగతి కొనసాగుతుంది’’ అని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ అనాలిసిస్‌కు చెందిన విభూతి గార్గ్ అన్నారు.

రాబోయే దశాబ్దాలలో ప్రపంచంలోనే అధికంగా ఇంధన పరివర్తన భారత్‌లో జరుగుతుంది. 140 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో ప్రతీ ఏడాది పట్టణ జనాభా పెరుగుతూనే ఉంది. ప్రతీ ఏడాది లండన్ నగరం పరిమాణంలో భారత పట్టణ జనాభా వృద్ధి చెందుతోంది. పారిశ్రామిక కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయి. హీట్‌వేవ్స్ వంటి తీవ్రమైన వాతావరణ మార్పులు ఉంటాయి. ఎలక్ట్రిక్ వాహనాల రాకతో విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతుంది.

వచ్చే అయిదేళ్లలో విద్యుత్ డిమాండ్ రెండింతలు అవుతుందని విద్యుత్ నియంత్రణ సంస్థలు అంచనా వేయడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.

గ్రీన్ హౌస్ ఉద్గారాలు

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు, వినియోగదారు కూడా. భారత్‌లో మూడు వంతుల విద్యుత్, బొగ్గు నుంచి తయారు అవుతుంది. భారత్ ఇంకా థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్మిస్తోంది.

2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల స్థాయికి చేరుకోవాలంటే ఇప్పటి నుంచి, 2030 వరకు భారత్ ప్రతీ ఏడాది 160 బిలియన్ డాలర్లు (రూ. 13,25,088 కోట్లు) వెచ్చించాల్సి ఉంటుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) తెలిపింది. ప్రస్తుత పెట్టుబడులకు ఇది మూడు రెట్లు ఎక్కువ.

అదానీ గ్రూప్‌ కాకుండా, గ్రీన్ ఎనర్జీ రంగంలో ఉన్న మరో పెద్ద సంస్థ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ భారత దేశంలోనే అతి పెద్ద కంపెనీ అనే విషయం అందరికీ తెలిసిందే.

గుజరాత్‌లో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల కోసం ముకేశ్ అంబానీ $80 బిలియన్లు( సుమారు రూ.6,62,464 కోట్లు) పెట్టుబడిగా పెట్టాలని భావిస్తున్నారు. మరో ఇంధన రంగ దిగ్గజం టాటా గ్రూప్ కూడా తన క్లీన్ ఎనర్జీ ప్రణాళికలను పునరుద్ధరిస్తోంది. అయినా భారతదేశ ఇంధన డిమాండ్‌కు ఇవి సరిపోవవి, ఇంకా అనేక ప్రైవేటు సంస్థలు రావాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.

వీడియో క్యాప్షన్, గౌతమ్ అదానీ: ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? - వీక్లీ షో విత్ జీఎస్

"మన ఇంధన డిమాండ్‌ను తీర్చుకోవాలంటే, మరిన్ని ప్రైవేటు సంస్థలు అవసరం. కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి అయినా పర్వాలేదు’’ అని దిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ ‘సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌’లో పని చేస్తున్న అశ్విని కె. స్వైన్ అన్నారు. దేశీయంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిదారుల సంఖ్య పెరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘మన ఇంధన డిమాండ్లు అపరిమితంగా ఉన్నాయి. అర డజను సంస్థలతో డిమాండ్‌ను తీర్చుకోవడం కష్టం" అని ఆయన అన్నారు.

అందుకే అదానీ గ్రూప్ కష్టాలు ఇతర పునరుత్పాదక ఇంధన సంస్థలకు అవకాశంగా మారవచ్చని ఆస్ట్రేలియాకు చెందిన క్లైమేట్ ఎనర్జీ ఫైనాన్స్‌కి చెందిన టిమ్ బక్లీ అంటున్నారు. ‘‘దేశీయ సంస్థలు భారత పునరుత్పాదక రంగంలో అడుగు పెట్టడం ద్వారా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంతోపాటు, అంతర్జాతీయంగా విస్తరణకు అవకాశాలు కనిపిస్తున్నాయి’’ అని టిమ్ బక్లీ అన్నారు.

క్లీన్ అండ్ డర్టీ ఎనర్జీలో భారతదేశపు ఉత్పత్తి సామర్థ్యం 400 గిగావాట్లు. 2030 నాటికి 500 గిగావాట్ల క్లీన్ ఎనర్జీని తయారు చేయాలని దేశం భావిస్తోంది. వాస్తవానికి ఇది చాలా కష్టపడితేనే చేరుకోదగిన లక్ష్యం. ఇంధన అవసరాలను తీర్చడానికి ఇప్పటి వరకు బొగ్గు, చమురుపై ఆధారపడిన దేశంలో, దాన్ని ఈ స్థాయికి మార్చుకోవడం అంత సులభం కాదు.

భారతదేశం బొగ్గుతో తయారయ్యే ఇంధనాన్ని నిలిపివేయడం, దాని స్థానంలో క్లీన్ ఎనర్జీ ద్వారా తన అవసరాలను తీర్చుకోవడం మంచిదని స్వైన్ అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు, భారతదేశ విద్యుత్ డిమాండ్‌లో ఐదవ వంతును వ్యవసాయం కోసం వినియోగిస్తోంది. అలాంటి సమయంలో సౌరశక్తితో పగటిపూట పంటలకు విద్యుత్ అందించడం వల్ల ప్రతి ఒక్కరికీ ప్రయోజనం ఉంటుంది.

"పునరుత్పాదక శక్తి విషయంలో భారతదేశపు పురోగతి అద్భుతంగా ఉంది. కొన్నిచోట్ల ఆలస్యం జరుగుతూ ఉండొచ్చు. కానీ, అవి పునరుత్పాదక ఇంధన వృద్ధికి ఆటంకం కలిగించకూడదు" అని గార్గ్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)