BBC She: మహిళలు ఎలాంటి వార్తలను ఇష్టపడతారు?

పేపర్ చదువుతున్న మహిళలు

ఫొటో సోర్స్, Alamy

    • రచయిత, దివ్య ఆర్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మీరొక విషయం గమనించారా? ఉదయం టీ తాగుతూ పేపర్ చదివే సమయంలో లేదా రాత్రి పడుకునేముందు ట్విటర్‌లో వార్తలు స్క్రోల్ చేస్తున్నప్పుడు... మహిళలు, పురుషులు వేర్వేరు కేటగిరీల వార్తలు చదవడంపై ఆసక్తి కనబరుస్తున్నట్లు మీకెప్పుడైనా అనిపించిందా?

సాధారణంగా ముఖ్యమైన అంశాలుగా పరిగణించే రాజకీయాలు, ఆర్థిక అంశాలు, ఎన్నికలు , అంతర్జాతీయ దౌత్యానికి సంబంధించిన వార్తల్ని పురుషులు ఎక్కువగా చదువుతారని, అంతగా సీరియస్‌నెస్ లేని అంశాలుగా పరిగణించే వినోదం, విద్య, ఆరోగ్యానికి సంబంధించిన వార్తలకు మహిళలు ప్రాధాన్యం ఇస్తారనే భావన ఉంది.

ఇలా అనుకోవడం వెనుక అనాదిగా వస్తోన్న సంప్రదాయ ఆలోచనలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తాయి.

సాధారణంగా పురుషులు బయటకు వెళ్లి డబ్బు సంపాదిస్తారు. కాబట్టి వారి ఆలోచనా పరిధి విస్తృతంగా ఉంటుంది, వారు అన్ని అంశాలపై ఉత్సుకత ప్రదర్శిస్తారని అనుకుంటారు.

మహిళల విషయానికొస్తే, చాలామంది మహిళలు ఇంటికే పరిమితం అవుతారు. కాబట్టి వారి ప్రపంచం ఇంటి వరకే పరిమితం అవుతుంది. వారికి ఆందోళన కలిగించే అంశాలు కూడా గృహ అవసరాలకు సంబంధించినవే అయ్యుంటాయని అనుకుంటారు.

పైగా చదువుకున్న మహిళల కంటే పురుషుల సంఖ్య ఎక్కువ. అలాగే ఇంటర్నెట్, ఫోన్లు మహిళల కంటే పురుషులకు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి పురుషుల కోసమే వార్తలు ఉత్పత్తి చేస్తున్నారు. వార్తల్ని తయారు చేసేది కూడా ఎక్కువగా పురుషులే.

టీవీ చూస్తోన్న మహిళ

ఫొటో సోర్స్, triloks

వార్తల్ని ఎంపిక చేసి రాసేవారికి ఉండే పరిమిత అవగాహన, అనుభవం వల్ల తమ పరిధిలోకి రాని పాఠకుల (మహిళలు) గురించి పెద్దగా ఆలోచించలేరు.

మహిళలు రెండో తరగతివారిగా మిగిలిపోకుండా వారికి సంబంధించిన కఠినమైన సబ్జెక్టులను సులభంగా ఎలా చేయడమనేదే మా జర్నలిజం.

వార్తల ఎంపిక, వాటిని ప్రదర్శించే విధానంలో ఈ 'జెండర్ లెన్స్' తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది.

ప్రపంచం మారుతోంది. పాత్రికేయ రంగంలో మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారు. పాత పద్ధతులను ప్రశ్నిస్తున్నారు.

‘‘బీబీసీ షీ’’ రెండో ఎడిషన్‌లో భాగంగా, సంప్రదాయ వార్తల చట్రంలో ఇరుక్కుపోకుండా మహిళల సమస్యలను ప్రతిబింబిస్తోన్న ఇతర మీడియా సంస్థలతో కలిసి బీబీసీ పనిచేస్తోంది.

వార్తల్లో మహిళలు

ఫొటో సోర్స్, LWA/Dann Tardif

‘‘బీబీసీ షీ’’ అంటే ఏంటి?

‘‘బీబీసీ షీ’’ కార్యక్రమంలో భాగంగా, జర్నలిజంలో జెండర్ లెన్స్‌పై అభిప్రాయాలను తెలుసుకోవడానికి మేం దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ భాషల్లో పనిచేస్తున్న మీడియా సంస్థలను సంప్రదించాం.

పరస్పర చర్చల అనంతరం పురుషులకు, స్త్రీలకు, ప్రజలందరికీ ఒకేలా వార్తను అందించేలా ఏదైనా అంశంపై పనిచేయాలనే నిర్ణయానికి వచ్చాం.

మేం కలిసి పనిచేసిన ఆరు మీడియా సంస్థలివే.

బైమానుస్: బైమానుస్ అంటే మహిళ అని అర్థం. ఔరంగాబాద్ నుంచి నడిచే మరాఠీ వెబ్‌సైట్ ఇది. సంప్రదాయక జర్నలిజం నమూనాను దాటి సాధారణ మహిళలను, వారి జీవితాలకు సంబంధించిన సమస్యలను వెలుగులోకి తీసుకురావడం ఈ వెబ్‌సైట్ ఉద్దేశం. ప్రధాన స్రవంతి మీడియాలో తక్కువగా కనిపించే దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు సంబంధించిన సమస్యలను, ఆందోళనలను హైలైట్ చేయడానికి ఈ వెబ్‌సైట్ ప్రయత్నిస్తుంది.

ఫెమినిజం ఇన్ ఇండియా (హిందీ): ఇంగ్లిష్, హిందీ భాషల్లో నడిచే ఈ వెబ్‌సైట్ లక్ష్యం ఏంటంటే ఫెమినిజంపై అవగాహన పెంపొందించడం. పరిశోధనలు చేయడంతో పాటు సమకాలీన సమస్యలపై వార్తలు, కథనాలను ప్రచురిస్తుంది. మహిళలను, అట్టడుగు వర్గాల వారిని సమాజంలోని ప్రధాన స్రవంతికి అనుసంధానం చేసి వారి స్వరాన్ని ఎలుగెత్తి చాటడం ఈ వెబ్‌సైట్ ప్రధాన లక్ష్యం.

ద బ్రిడ్జ్ : క్రీడా వార్తలను ప్రచురించే లక్ష్యంతో ప్రారంభమైన ఈ వెబ్‌సైట్ క్రికెట్ మాత్రమే కాకుండా ఇతర క్రీడలు, క్రీడాకారులపై కూడా వార్తల్ని అందిస్తుంది. చాలా మీడియా సంస్థలు ముఖ్యంగా ఒలింపిక్స్, ఇతర ప్రధాన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లను కవర్ చేస్తాయి. కానీ, ఈ వెబ్‌సైట్ ఏడాదంతా అన్ని క్రీడల, క్రీడాకారుల పోరాటాలను ప్రచురిస్తుంది.

గుర్గావ్ కి ఆవాజ్: దిల్లీతో పాటు దిల్లీ చుట్టుపక్కలా నివిసంచే ప్రజలు నడుపుతున్న రేడియో స్టేషన్ ఇది. దీని శ్రోతల్లో కేవలం గుర్గావ్‌కు చెందినవారు మాత్రమే కాకుండా వలస కార్మికులు కూడా ఉన్నారు. విద్య, ఆరోగ్యం, రాజకీయాలకు సంబంధించిన చాలా అంశాలను వారు ప్రస్తావిస్తారు.

వార్తల్లో మహిళలు

ఫొటో సోర్స్, VikramRaghuvanshi

ద న్యూస్ మినట్: దేశవ్యాప్తంగా సమస్యలను కవర్ చేసే ఈ మీడియా సంస్థ, ప్రత్యేకంగా అయిదు దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేస్తుంది. అక్కడే వారికి ఎక్కువ మంది రిపోర్టర్లు ఉన్నారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఇంగ్లిష్‌లో వార్తల్ని ప్రచురిస్తుంది. తమిళ భాషలో వీడియోలను కూడా ప్రసారం చేస్తుంది.

ఉమెన్స్ వెబ్: సంప్రదాయ మీడియా ఆలోచనకు వ్యతిరేకంగా మహిళలు అన్ని రకాల వార్తలపై ఆసక్తి చూపుతారు అనేది ఈ సంస్థ ప్రధాన మోటో. ఈ వెబ్‌సైట్ ఇంగ్లిష్‌లో వార్తల్ని ప్రచురిస్తుంది. మహిళలు తమ నిజ జీవిత అనుభవాలను పంచుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. వర్క్‌షాపులు, సెమినార్లను నిర్వహిస్తుంది.

ఈ మీడియా సంస్థలన్నింటిని సంప్రదించిన తర్వాత మహిళల జీవితాలు, ఆందోళనలను మెరుగ్గా ఎలా ప్రజలకు చేరవేయాలనే విధానాలను మేం కనుగొన్నాం.

ఈ మీడియా సంస్థల ఉమ్మడి సహకారంతో దర్యాప్తు చేసి రూపొందించిన కథనాలు, వీడియోలను మీరు, బీబీసీ ఇండియన్ లాంగ్వేజ్ (తెలుగు, హిందీ, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, తమిళ్) వెబ్‌సైట్లు, సోషల్ మీడియా పేజీల్లో రాబోయే రోజుల్లో చూడొచ్చు.

‘జెండర్ లెన్స్’ పై అవగాహనను మెరుగుపరుచుకోవడం, మహిళల సమస్యలను మెరుగ్గా ప్రజల ముందుకు తీసుకురావడం మా ఉద్దేశం. మేం చేస్తున్న ఈ ప్రయత్నం కొనసాగుతుంది.

‘‘బీబీసీ షీ’’ తొలి ఎడిషన్‌లో భాగంగా అయిదేళ్ల క్రితం మేం భారత్‌లోని వివిధ గ్రామాలు, పట్టణాలకు వెళ్లాం. బీబీసీలో మీరు ఎలాంటి వార్తలు వినాలనుకుంటారు? చదవాలనుకుంటారు? చూడాలనుకుంటారు? అని మేం అక్కడి మహిళలను అడిగాం. వారిచ్చిన సలహాలు, సూచనల ప్రకారం మేం నడుచుకున్నాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)