పూర్వీకుల ఇళ్లకు ప్రాణం పోస్తున్న యువతరం

పూర్వీకుల ఇళ్లు

ఫొటో సోర్స్, DEWANJEA FAMILY

ఫొటో క్యాప్షన్, ఇటీవల కూల్చేసిన రోహన్ దేవాంజియాకు చెందిన 120 కాలం నాటి పూర్వీకుల ఇల్లు
    • రచయిత, చెరిలాన్ మోలాన్
    • హోదా, బీబీసీ న్యూస్, ముంబయి

రోహన్ దేవాంజియా చిన్నతనంలో ఏటా వేసవి సెలవుల్లో తన తోబుట్టువులతో కలిసి తమ పూర్వీకుల ఇంట్లో గడిపే సమయంలో.. అందమైన గ్లాస్‌తో రూపొందిన వెనీషియన్ కిటికీల గుండా ఆ ఇంట్లోకి వచ్చే సూర్యకిరణాలను చూసి ఎంతో ఆశ్చర్యపోయేవారు.

వెనీషియన్ కిటికీలను పాత కాలం నాటి ఇళ్లలో చూడొచ్చు. ఈ కిటికీల్లో ఒకటి పెద్దగా ఉండి, మిగతా రెండు చిన్నగా దానికి చెరోవైపు ఉంటాయి.

కోల్‌కతాలోని దేవాంజియా వాళ్ల 120 ఏళ్ల జగత్ నివాస్‌‌ను స్థానిక బిల్డర్‌కు అమ్మేసిన తర్వాత, అస్తవ్యస్థంగా మారిపోయింది.

మూడు అంతస్తుల ఆ భవవాన్ని ఎవరూ చూసుకోవడానికి లేకపోయేసరికి దాన్ని స్థానిక బిల్డర్‌కి అమ్మేయాల్సి వచ్చింది.

అయితే, ఈ ఇంటిని కూల్చడానికి కొన్ని రోజుల ముందు దేవాంజియా, కొందరు కళాకారులు కలిసి ఆ ఇంట్లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక వీడ్కోలు కార్యక్రమాన్ని రెండు రోజుల పాటు నిర్వహించారు.

ఈ అద్భుతమైన ఇంటిలో గడిపిన అనుభూతులను ప్రజలకు అందించేందుకు, దాంతో ఎన్నో మరుపురాని గుర్తులను కల్పించేందుకు ఈ ఈవెంట్‌ను నిర్వహించినట్టు 32 ఏళ్ల ఉమా బెనర్జీ తెలిపారు. మ్యూజియం ఆఫ్ ఎయిర్, డస్ట్ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆమె చెప్పారు.

ఇక ఎప్పటికీ కనిపించకుండా పోయే ఈ ఇంటితో సంతోషకరమైన క్షణాలను ప్రజలు పొందేలా చేయాలని అనుకున్నట్లు తెలిపారు.

వారు మాత్రమే కాదు. చాలా మంది యువత శతాబ్దాల క్రితం నాటి పూర్వీకుల ఇళ్లను కూల్చివేతల నుంచి కాపాడేందుకు వాటితో ఎన్నో మరుపురాని గుర్తులను అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఇళ్ల డాక్యుమెంటరీలను పోస్ట్ చేస్తున్నారు. ఆ ఇళ్లకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను కుటుంబాలు పంచుకుంటున్నాయి.

కొన్ని సార్లు వీటిని కూల్చకుండా మరింత కాలం పాటు సంరక్షించుకునేందుకు క్రౌడ్‌సోర్స్ ఫండ్స్‌ను ఎలా సేకరించాలో తెలియజేస్తున్నారు.

‘‘దేశవ్యాప్తంగా వేలాది పూర్వీకుల గృహాలున్నాయి. కుటుంబ సభ్యులకు ఇవి ఎన్నో మధురాతి మధురమైన జ్ఞాపకాలు. సామాజిక, ఆర్థిక అంశాలకు వీటిని ఒక గుర్తింపుగా భావిస్తారు’’ అని ముంబైకి చెందిన కన్జర్వేషన్ ఆర్కిటెక్ అభా నరైన్ లంబా అన్నారు.

‘‘తాతల కాలం నాటి ఈ ఇళ్లు, శతాబ్దాల కాలం నాటి నిర్మాణ ఆకృతులను తెలియజేస్తున్నాయి. మన గతంలోకి తీసుకెళ్లేందుకు ఇవొక మార్గంగా ఉన్నాయి’’ అని తెలిపారు.

పూర్వీకుల ఇళ్లు

ఫొటో సోర్స్, UMA BANERJEE

బ్రిటీష్ పాలనాకాలంలో భారత్ రాజధాని అయిన కోల్‌కతాలో, భారతీయుల అభిరుచులకు తగ్గట్టు యూరోపియన్ నిర్మాణాకృతితో రూపొందిన ఎన్నో ఇళ్లు ఉన్నాయి.

గోవాలో పోర్చుగీస్ వారితో సంబంధం ఉన్న ఎన్నో పాత కాలం నాటి ఇళ్లు మనకు కనిపిస్తాయి. నాలుగు శతాబ్దాలకుపైగా పోర్చుగీస్ వారు గోవాను పాలించారు.

 దురదృష్టవశాత్తు, ఈ ఇళ్లలో చాలా వరకు ప్రస్తుతం అధ్వాన దశలో ఉన్నాయి. కొన్నింటిని అమ్మేశారు లేదా కూల్చేశారు.

 ‘‘వ్యక్తిగత వారసత్వ ఆస్తులకు భారత్‌లో చాలా తక్కువ ఆదరణ లభిస్తోంది’’ అని లంబా అన్నారు.

ఈ ఇళ్లను ఎప్పటికీ చెక్కు చెదరకుండా చూసుకోవడం, వాటిని తిరిగి పునరుద్ధరించడం కాస్త సవాలుతో కూడుకున్న విషయమేనన్నారు.

ఈ ఇళ్లను నిర్మించడానికి వాడిన బర్మా టేకు చెక్క, పింగాళి టైల్స్ ప్రస్తుతం చాలా ఖరీదైనవిగా మారాయి. అవి మార్కెట్లో దొరకడం కూడా కష్టంగా మారింది.

చాలా భవంతుల నిర్మాణ విధానాలు కూడా ఇప్పుడు వాడుకలో లేవు.

పూర్వీకుల ఇళ్లు

ఫొటో సోర్స్, MAKE IT HAPPEN

ఫొటో క్యాప్షన్, 600 ఏళ్ల నాటి ఫెర్నాండెస్ భవనం

అంతేకాక, ప్రస్తుతం ప్రజలు కోరుకుంటున్న చిన్న కుటుంబాలు కూడా దీనికి సవాలుగా ఉన్నాయి.

చాలా మంది ప్రజలు పని కోసం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.

పూర్వీకుల ఇంటిని చూసుకునేందుకు అక్కడే నివసించే వారు చాలా తక్కువ.

ఇదే అనుభవాన్ని 54 ఏళ్ల రాజ్‌కుమార్ వాసుదేవన్ కూడా పొందారు.

కేరళ రాష్ట్రంలో ఆయనకు 600 ఏళ్ల కాలం నాటి పూర్వీకుల ఇల్లు ఉంది.

 ఒకప్పుడు పెద్ద కుటుంబంతో ఆ ఇల్లు ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది. కానీ, నేడు ఆ ఇంట్లో తాను, తన తల్లి మాత్రమే నివసిస్తున్నారు.

ఈ ఇంటిని కేరళలోని సంప్రదాయ నలుకేటు నిర్మాణ శైలిలో ఏర్పాటు చేశారు.

ఈ నిర్మాణ శైలి ప్రకారం ఇంటి మధ్యలో ఖాళీ స్థలం ఉండి.. నలుదిక్కులా ఇల్లు ఉంటుంది. ఈ ఇల్లు చూడటానికి చాలా ప్రత్యేకమైనవిగా ఉంటాయి.

అయితే, టేకుతో నిర్మించిన ఈ ఇంటిని పదే పదే చోటు చేసుకునే దాడుల నుంచి కాపాడటానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

 ఎవరైనా తన ఇంటిని సంరక్షిస్తారా? అని వెతికినప్పుడు కేరళకు చెందిన ముగ్గురు ఆర్కిటెక్ట్స్ సంప్రదాయ, జీవావరణ శాస్త్ర పరిరక్షణ కోసం నిర్వహించే ట్రస్టు ధరిణి గురించి ఆయనకు తెలిసింది.

పూర్వీకుల ఇళ్లు

ఫొటో సోర్స్, DHARINNI

ఆర్కిటెక్చర్‌ని, బాధ్యతాయుతమైన పర్యాటకంతో అనుసంధానించేలా 2021లో ధరిణి ఒక ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు ద్వారా పర్యాటకులను ఆహ్వానించి, వారిని పూర్వీకుల ఇళ్లలో నివసించేలా చేసేందుకు నిధులను సమీకరిస్తుంది.

పర్యాటకులు పూర్వీకుల ఇళ్లలో నివసించిన తర్వాత.. వారు ఆ ఇంటిని సంరక్షించేందుకు అవసరమైన సలహాలు ఇచ్చేలా, వారి నైపుణ్య ప్రతిభను వాడేలా ఆ ప్రాజెక్టు ప్రోత్సహిస్తుంది.

 ‘‘సివిల్ ఇంజనీర్లను, ఆర్కిటెక్చరల్ విద్యార్థులను ఆ ఇంటికి సంబంధించిన నిర్మాణ చిత్రాలను గీయాలని అడుగుతుంటాం. విద్యావేత్తలు పరిశోధనల్లో సాయం చేయొచ్చు. డాక్యుమెంటేషన్‌ కోసం ఫోటోగ్రాఫర్లు సాయపడతారు’’ అని ధరిణి వ్యవస్థాపకురాలు 32 ఏళ్ల జిస్నీ జార్జ్ తెలిపారు.

పూర్వీకుల ఇళ్ల పునరుద్ధరణకు తమ సభ్యులు ఉచితంగా సలహాలను, సూచనలను ఇస్తారని చెప్పారు.

 గోవాలో 37 ఏళ్ల మురళి శంకరన్, తన భార్య 38 ఏళ్ల మారియా విక్టోర్ కూడా ‘మేక్ ఇట్ హ్యాపెన్’ అనే పర్యాటక కార్యక్రమం ద్వారా పూర్వీకుల ఇళ్లను సంరక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

 పూర్వీకుల ఇళ్లలో గడిపేందుకు వారు ప్రజల్ని ఆహ్వానిస్తున్నారు.

ఇంటి యజమానులను కలిసి, వారి మాటలను వినాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా టిక్కెట్ రూపంలో సేకరించిన మొత్తాన్ని ఆ ఇంటి సంరక్షణకే వాడుతున్నారు.

వీరి కార్యక్రమంలో ఒకటిగా 600 ఏళ్ల కాలం నాటి ఫెర్నాండెస్ నిర్మాణ సౌధం కూడా ఉంది.

ఇది చందోర్ వారసత్వ సంపదలో ఒకటి. 10వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు గోవాను పాలించి హిందూ రాయల్ ఫ్యామిలీ కదంబ హయాంలో చందోర్ రాజధాని.

చందోర్ కోట గోడలలో ఒకటిగా ఈ భవంతి ఉండేదని పురావస్తు సర్వేలో గుర్తించారు.

పూర్వీకుల ఇళ్లు

ఫొటో సోర్స్, MAKE IT HAPPEN

ఫొటో క్యాప్షన్, మేక్ ఇట్ హ్యాపెన్ వ్యవస్థాపకులు మురళి శంకరన్, మారియా విక్టోర్

కదంబాల పోరాట కాలంలో యుద్ధంలో కుటుంబాల పాత్ర ఎలా ఉండేదన్నే దానిపై పర్యాటకులు అక్కడ కథల రూపంలో వినొచ్చు.

స్థానిక కమ్యూనిటీలో క్రిస్టియానిటీ, దాని పాత్ర గురించి తెలుసుకోవచ్చు. బేస్‌మెంట్లలో గన్‌లను చూడొచ్చు. మధ్యయుగాల నాటి యుద్ధపు కత్తులు, తప్పించుకునేందుకు వారు వాడిన సొరంగ మార్గాలు ఇలా ఎన్నో అక్కడ చూడొచ్చు.

చరిత్రను కాపాడేందుకు కథల రూపంలో దాన్ని ప్రజలకు తెలియజేయడం ఎంతో ఉత్తమమైన సాధనమని శంకరన్ చెప్పారు.

 గోవా చరిత్రను కళ్లకు కట్టేలా చూపించేందుకు ఈ ఇళ్లు, కుటుంబాలే ఉత్తమమైన సాధనాలు.

ఈ ఇళ్లను సురక్షితమైన వాటికి ఉంచేందుకు ఎన్నో వాణిజ్యపరమైన విధానాలున్నాయి.

కొందరు వారి పూర్వీకుల ఇళ్లను లగ్జరీ వసతులుగా లేదా బొటిక్ హోటల్స్‌గా మార్చారని జార్జ్ తెలిపారు.

అయితే, ప్రాపర్టీని లాభదాయకమైన విధానంలో నడిపేందుకు వ్యాపారంపై ఆసక్తి కూడా ఉండాలని ఆమె చెప్పారు.

ఎవరైతే తమ ఇళ్లను హోటల్స్‌గా మార్చేందుకు ఇష్టపడరో వారికి ప్రాజెక్టు ధరిణి సాయం చేస్తుంది.

పెద్ద ఎత్తున ప్రజలకు పర్యాటక ప్రదేశంగా మార్చడటం కంటే ఈ ఇళ్లలో భాగమైన చిన్న చిన్న జ్ఞాపకాలను, సంస్కృతులను ఎల్లపుడూ సజీవంగా ఉంచేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది’’ అని జార్జ్ తెలిపారు.

పూర్వీకుల ఇళ్లు

ఫొటో సోర్స్, MAKE IT HAPPEN

కోల్‌కతాలోని దేవాంజియా వాళ్ల పూర్వీకుల ఇంటిని ప్రస్తుతం పూర్తిగా కూల్చేశారు.

కానీ, ఈ ఇంటి కూల్చివేతకు ముందు చేపట్టిన వీడ్కోలు కార్యక్రమం ఎంతో మంది హృదయాల్లో ఎన్నో ఏళ్ల పాటు సజీవంగా ఉండనుంది.

నవంబర్‌లో రెండు రోజుల పాటు బెనర్జీ, ఇతర కళాకారులందరూ కలిసి జగత్ నివాస్ గురించి, వారి విధానాల గురించి ప్రజలకు ప్రదర్శనల రూపంలో కథలు కథలుగా వినిపించారు.

జపనీస్ విధానంలో ఉన్న ఇంక్, బ్రష్ పెయిటింగ్స్ ద్వారా దేవాంజియా వాళ్ల తాత మయన్మార్ ప్రాంతానికి చెందిన వారిగా తెలుస్తుంది.

ఆ ఇంట్లో కనిపించిన చీరతో కట్టిన ఊయలు ఎంతో మంది పుట్టుకలకు ప్రతిరూపంగా ఉంది.

ఇంటిని కూల్చడమంటే, ఒక వ్యక్తి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేయడమని చెబుతూ బాడీ మెసేజ్ అనే ప్రదర్శనను వారు ఇచ్చారు.

ఎన్నో దశాబ్దాల పాటు చెక్కు చెదరకుండా ఉన్న తమ ఇంటిని చూసిన తమ కుటుంబానికి, స్నేహితులకు చిరకాలం గుర్తుండిపోయే అనుభవాలను ఇది అందించిందని దేవాంజియా అన్నారు.

తమ ఇంటి పక్క వారికి, ఇదొక మార్గ సూచికగా ఉండేదని, వాళ్ల ఇళ్లకు చేరుకునేందుకు తమ ఇంటి గుండా మార్గాన్ని చెప్పేవారు.

తన చిన్న నాటి స్నేహితులకు మార్బుల్ ఫ్లోర్స్‌తో ఉన్న ఇదొక అద్భుతమైన కట్టడమని, జంతువుల దంతాలతో చేసిన శిల్పాలు, పై అంతస్తుల్లో దెయ్యాలను వెతకడం వంటి ఎన్నో అనుభూతులను అందించిందన్నారు.

దీన్ని కూల్చడానికి కొన్నేళ్ల ముందే జగత్ నివాస్ నుంచి దేవాంజియా కుటుంబం బయటికి వచ్చేసింది.

కుటుంబ ఆస్తులను పంచుకుని, సొంతంగా నిర్మించుకున్న ఇళ్లకు వెళ్లిపోయారు.

‘‘మేము వేరే ఇళ్లకు వెళ్లాం. కానీ, జగత్ నివాస్‌లో నివసిస్తున్న దెయ్యాలకు ఏమయ్యాయోనని నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నాను’’ అని దేవాంజియా అన్నారు.

అవెక్కడి వెళ్లుంటాయి? అని చమత్కరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)