గర్భ్ సంస్కార్: కడుపులోని బిడ్డ రామాయణ, మహాభారతాలను అర్థం చేసుకోగలదా...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సుశీలా సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాష్ట్ర సేవికా సమితికి సంబంధించిన సంవర్ధిని న్యాస్ అనే సంస్థ గర్భిణీ స్త్రీల కోసం 'గర్భ్ సంస్కార్' ప్రచారాన్ని ప్రారంభించింది.
రాష్ట్ర సేవికా సమితి అనేది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు చెందిన మహిళా సంస్థ.
"గర్భిణీ స్త్రీల కోసం గర్భ్ సంస్కార్ ప్రచారాన్ని ప్రారంభించాం. దీని ద్వారా బిడ్డకు కడుపులోనే సంస్కారం, విలువలు నేర్పించవచ్చు" అని సంవర్ధిని న్యాస్ జాతీయ నిర్వహణ కార్యదర్శి మాధురి మరాఠే చెప్పారని పీటీఐ తెలిపింది.
"గైనకాలజిస్టులు, ఆయుర్వేద వైద్యులు, యోగా శిక్షకుల సహాయంతో న్యాస్ ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తోంది. పుట్టబోయే బిడ్డకు కడుపులోనే సంస్కారం, విలువలు నేర్పించేందుకు భగవద్గీత, రామాయణ పఠనం, గర్భవతుల చేత యోగా చేయించడం మొదలైనవన్నీ అందులో ఉంటాయి" అని ఆమె చెప్పారు.
రాజధాని దిల్లీలోని జవహర్ లాల్ యూనివర్సిటీలో రాష్ట్ర సేవికా సమితి తరపున ఒక వర్క్‌షాప్ నిర్వహించారని, అందులో 12 రాష్ట్రాల నుంచి 80 మంది గైనకాలజిస్టులు పాల్గొన్నారని మాధురి తెలిపారు.
"గర్భం దాల్చిన దగ్గర నుంచి, పుట్టిన బిడ్డకు రెండేళ్లు వచ్చే వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఇందులో గీతలో శ్లోకాలు, రామాయణంలోని పద్యాల పఠనం ఉంటుంది. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు 500 పదాల వరకు నేర్చుకోగలదు" అని ఆమె పీటీఐకి చెప్పారు.
కడుపులో బిడ్డ నిజంగానే కొన్ని పదాలు లేదా భాష నేర్చుకోగలదా?
దీనిపై భిన్నాభిప్రాయాలు వినబడుతున్నాయి. మనమేం చెప్పినా కడుపులో బిడ్డకు ఏమీ అర్థం కాదని కొందరు నిపుణులు అభిప్రాయపడితే, బిడ్డకు అన్నీ తెలుస్తాయని మరికొందరు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భిన్నాభిప్రాయాలు
ముంబైకి చెందిన మహిళా కార్యకర్త, గైనకాలజిస్ట్ డాక్టర్ సుచిత్రా డెల్వి మాట్లాడుతూ, కడుపులో బిడ్డ శబ్దాలు వినగలదు కానీ, ఏ భాషనూ అర్థం చేసుకోలేదని చెప్పారు.
"కడుపులో బిడ్డ అవయవాలు క్రమంగా అభివృద్ధి చెందుతాయి. చెవులు అభివృద్ధి చెందుతున్నప్పుడు ధ్వని తరంగాలు బిడ్డకు చేరుతాయి. కానీ, వాటి అర్థం బిడ్డ తెలుసుకోలేదు. తల్లి సంస్కృతం శ్లోకాలు చదివినా బిడ్డకు ఏమీ అర్థం కాదు" అని ఆమె చెప్పారు.
కడుపులో బిడ్దకు అన్నీ నేర్పవచ్చు అనుకోవడం అపోహ అని, దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని ఆమె అన్నారు.
ఇలాంటి వాటి మీద ఖర్చు పెట్టే బదులు, ఈ లోకంలోకి వచ్చి తిండి, చదువుకు దూరమవుతున్న పిల్లల గురించి ఆలోచించడం, వారి కోసం ఏదైనా చేయడం మంచిదని ఆమె అభిప్రాయపడ్డారు. పుట్టిన తరువాత పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఏం చేయాలన్న దానిపై చర్చ జరగాలని ఆమె అన్నారు.
మరోవైపు, కడుపులో పెరుగుతున్న పిండం కలలు కనగలదని, అనుభూతి చెందగలదని పరిశోధనలలో తేలినట్లు గైనకాలజిస్ట్ ఎస్ఎస్ బసు చెబుతున్నారు.
అమెరికన్ వెబ్‌సైట్ 'సైకాలజీ టుడే'లో ప్రచురించిన 'ఫీటల్ సైకాలజీ' గురించి ఆమె ప్రస్తావించారు.
"పిండం తొమ్మిది వారాల వయసులో ఉన్నప్పుడు ఎక్కిళ్లు వస్తాయని, పెద్ద పెద్ద శబ్దాలకు ప్రతిస్పందిస్తుందని ఈ పరిశోధనలో తెలిపారు. 13వ వారానికి బిడ్డ శబ్దాలు వినగలదు. తల్లి గొంతుకు, ఇతరుల గొంతుకు ఉన్న తేడాను పోల్చగలదు.
కడుపులో బిడ్డకు ఒకే కథను మళ్లీ మళ్లీ చెబితే, దానికి రియాక్ట్ అవుతుంది. కడుపులో బిడ్డకు అనుభూతి చెందడంతో పాటు వినడం, చూడడం, నేర్చుకోవడం, గుర్తుంచుకోగల సామర్థ్యాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఈ పరిశోధనలో తేలింది.
ఇవి మౌలికమైన ఆటోమాటిక్ జీవరసాయన ప్రక్రియకు సంబంధించినవి కావచ్చు. బిడ్ద మొదటిసారి పెద్ద శబ్దాలు విన్నప్పుడు ఆశ్చర్యపోయినట్టు స్పందించవచ్చు. కానీ, క్రమంగా వాటికి అలవాటు పడి స్పందించడం ఆగిపోవచ్చు. కడుపులో బిడ్డ క్రమంగా పెరుగుతూ ఉంటుంది. తల్లి సానుకూలమైన పనులు చేస్తే, ఆ ప్రభావం బిడ్డపై ఉంటుంది" అంటున్నారు డాక్టర్ బసు.

ఫొటో సోర్స్, SCIENCE PHOTO LIBRARY - SCIEPRO
బిడ్డపై హార్మోన్ల ప్రభావం
గర్భిణీ స్త్రీ ఒత్తిడికి లోనవుతూ ఉంటే రామయణం లేదా గీత శ్లోకాలు వినడం లేదా ఏవైనా పాటలు వినడం ద్వారా ఆమెకు శాంతి లభిస్తే అది మంచిదేనని, దాని ద్వారా తల్లి శరీరంలో ఉత్పత్తి అయే హార్మోన్లు బిడ్డపై సానుకూల ప్రభావం చూపుతాయని డాక్టర్ సుచిత్ర డెల్వి అన్నారు.
"తల్లికి మనశ్శాంతి కలిగినప్పుడు విడుదల అయే హార్మోన్లు లేదా రసాయన సమతుల్యం ప్రభావం తల్లి ద్వారా బిడ్డకు చేరుతుంది. స్ట్రెస్ హార్మోన్ లేదా హ్యాపీ హార్మోన్ బిడ్డపై ప్రభావం చూపుతుందన్నదానికి శాస్త్రీయ ఆధారలు ఉన్నాయి" అని ఆమె చెప్పారు.
అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి కార్యకర్త ముక్తా దభోల్కర్ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు.
"ఒక గర్భవతికి పౌష్టికాహారం, మంచి ఆలోచనలు, మనశ్శాంతి ఉండాలి. గర్భ సంస్కారం కార్యక్రమం ద్వారా అవి ఆమెకు అందిస్తే మంచిదే. కానీ, కడుపులో బిడ్డకు భాష అర్థం కాదు. అలాంటప్పుడు తల్లి మంత్రాలు చదివినా, పద్యాలు పాడినా బిడ్డకు ఏం తెలుస్తుంది? ఇదంతా బూటకం" అని ఆమె అన్నారు.
"తల్లి సంతోషంగా ఉండటం చాలా ముఖ్యం. ఆమెను సంతోషంగా ఉంచడం కుటుంబం బాధ్యత. ఆమె ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి" అన్నారు ముక్త.

ఫొటో సోర్స్, RSS
‘‘భావజాలాన్ని వ్యాప్తి చేసే ఉద్దేశం... ’’
ఉత్తరప్రదేశ్‌లోని బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ)లో ఒక అధ్యయనం చేస్తున్నారు. కడుపులో బిడ్డపై శబ్దాలు లేదా సంగీతం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో పరిశోధిస్తున్నారు.
"గర్భ సంస్కారం థెరపీ పేరుతో ఈ పరిశోధన ఇటీవలే ప్రారంభమైంది. ఫలితాలు తెలుసుకునేందుకు కొంత సమయం పడుతుంది. తల్లి ఒత్తిడికి లోనవున్నప్పుడు, ఇలాంటి థెరపీ (గర్భ్ సంస్కార్ లాంటివి)లు ఇవ్వడం ద్వారా బిడ్డపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న దానిపై కూడా పరిశోధన జరుగుతోంది" అని బీహెచ్‌యూలోని ఆయుర్వేద వైద్యంలో ప్రసూతి, గైనకాలజీ విభాగం అధ్యాపకురాలు డాక్టర్ సునీత సుమన్ చెప్పారు.
అయితే, ఇదంతా తమ సిద్ధాంతాన్ని, భావజాలాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నమని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
"హిందుత్వ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఇలాంటివి చేస్తున్నారు, ఇటువంటి వాటికి ఎలాంటి తార్కిక ప్రాతిపదిక లేదు. దేశంలో ఇప్పటికే మూఢ నమ్మకాలు పెచ్చుమీరి ఉన్నాయి. పంచాగాలు, వాస్తు లాంటివి నమ్ముతున్నారు. ఇప్పుడు కొత్తగా గర్భ సంస్కారం లాంటి థెరపీలు వారి రాజకీయ, సాంస్కృతిక పునాదులను బలపరుస్తాయి" అని విశ్లేషకుడు రాజేష్ సిన్హా అంటున్నారు.
ఇంతకుముందు కూడా ఆర్‌ఎస్‌ఎస్ ఆరోగ్య విభాగం ఆరోగ్య భారతి ద్వారా గర్భ విజ్ఞాన సంస్కారం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వార్తలు వచ్చాయి.
దీన్ని గుజరాత్ నుంచి ప్రారంభించి 2015లో జాతీయ స్థాయికి తీసుకెళ్లారని, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ విద్యాభారతి శాఖ సహకారంతో ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్తున్నారని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
- కేరళ: పెళ్లయిన 29 ఏళ్ల తరువాత ఈ దంపతులు మళ్లీ ఎందుకు వివాహం చేసుకుంటున్నారు?
- నంద్యాల అటవీ అధికారుల హెచ్చరిక: ‘పిల్లలకు దూరమైన తల్లి పులి ఆగ్రహంగా ఉంటుంది.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’
- ‘‘బైరి నరేశ్‌ను బట్టలూడదీసి కొట్టమని నేనే చెప్పినా...’’ బండి సంజయ్ పబ్లిక్‌గా వెల్లడి... పోలీసుల రియాక్షన్ ఏంటి?
- కె-డ్రామా: కొరియన్ సీరియళ్లు బాలీవుడ్ సినిమాలను మరపిస్తున్నాయా, ఎందుకీ క్రేజ్?
- ఆంధ్రప్రదేశ్: ‘‘ఖర్చులు భరించలేక నాటుమందు తీసుకుంటున్న’’ ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














