కేరళ: పెళ్లయిన 29 ఏళ్ల తరువాత ఈ దంపతులు మళ్లీ ఎందుకు వివాహం చేసుకుంటున్నారు?

ఫొటో సోర్స్, C. SHUKKUR
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ హిందీ కోసం
ప్రపంచమంతా మహిళా దినోత్సవం జరుపుకొంటున్న మార్చి 8న కేరళకు చెందిన ఓ వ్యక్తి తన భార్యను 29 ఏళ్ల తరువాత మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు.
అలా చేయడం వల్ల తమ ముగ్గురు కుమార్తెలకు భారత్‌లోని తన ఆస్తిలో వాటా వస్తుందంటున్నారాయన.
కేరళలో న్యాయవాదిగా పనిచేస్తున్న సి.షుకుర్, ఆయన భార్య డాక్టర్ షీనా మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు.
షీనా గతంలో మహాత్మగాంధీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు.
భారత్‌లో ముస్లిం చట్టాల ప్రకారం తమ కుమార్తెలకు వారసత్వ ఆస్తిలో పూర్తి వాటా ఇచ్చేందుకు వీలులేకపోవడం వారు తమ పిల్లలకు ఆస్తిలో పూర్తి వాటాలు దక్కేందుకు వీలుగా మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు.
‘‘మహ్మదీయ చట్టాల నియమాలలో జెండర్ ఆధారిత వివక్ష ఉంది. పితృస్వామ్య భావజాలంతో రూపొందించిన పితృస్వామ్య చట్టాలివి. ఖురాన్, సున్నాలకు ఈ నియమాలు పూర్తి విరుద్ధం’’ అని షుకుర్ అంటున్నారు.
‘‘అల్లా ముందు పురుషులు, మహిళలు అందరూ సమానమే. కానీ మహమ్మదీయ చట్టాల నియమాలకు 1906లో డీహెచ్ ముల్లా భాష్యం చెప్పినప్పుడు మహిళల కంటే పురుషులు బలవంతులు కాబట్టి మహిళలను పురుషులు నియంత్రిస్తారని చెప్పారు. ఈ భావజాల ప్రాతిపదికనే మహమ్మదీయ చట్లాలలో కూతుళ్లకు ఆస్తి వాటా తక్కువగా ఉంది’’ అన్నరాయన.

ఫొటో సోర్స్, Getty Images
షుకుర్, షీనాలు కూడా ఈ చట్టాల ప్రకారం తమ ఆస్తిలో పూర్తి వాటాను కూతుళ్లకు ఇవ్వలేరు. ఈ జంటకు ముగ్గురు కూతుళ్లు. కొడుకులు లేరు. ఇప్పుడున్న మహమ్మదీయ చట్టాల ప్రకారం షుకుర్ ఆస్తిలో మూడింట రెండొంతుల వాటా ఈ ముగ్గురు కూతుళ్లకు వస్తుంది. మిగతా ఒక వాటా షుకుర్ అన్నదమ్ములకు దక్కుతుంది. షుకుర్ సోదరుడికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. వారికి షుకుర్ ఆస్తిలో ఒక వంతు వాటా వెళ్తుంది.
షుకుర్ సోదరుడి ఆస్తి ఆయన కొడుకులు, కూతుళ్లకు పూర్తి వాటా వెళ్తుంది. దాంతో పాటు అదనంగా షుకుర్ ఆస్తిలో మూడింట ఒక వంతు వాటా వారికి చెందుతుంది.
‘ఈ వివక్షను అధిగమించడానికి స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్‌లో సెక్షన్ 16 ప్రకారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు షుకుర్ చెప్పారు.
తాము 1994లో షరియా చట్టం ప్రకారం వివాహం చేసుకున్నామని షుకుర్ చెప్పారు.
సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది కాళీశ్వరం రాజ్ దీనిపై బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ముస్లిం పర్సనల్ లా వర్తించడం వల్ల వారసత్వ ఆస్తి బదిలీ విషయంలో ఎదురయ్యే సమస్యలను నివారించడానికి ఈ జంట సెక్యులర్ మేరేజ్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే, ఈ నిర్ణయం వల్ల కూడా న్యాయపరమైన సమస్యలు రావొచ్చు. దీనిపై ఎవరైనా కేసు వేస్తే జ్యుడిషయల్ రిజల్యూషన్ అవసరం ఉంటుంది’’ అన్నారు కాళీశ్వర్ రాజ్.

ఫొటో సోర్స్, Getty Images
కాళీశ్వర్ రాజ్ ఇలాంటిదే ఒక కేసు సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు. ఆ కేసులో పిటిషనర్ కూడా షుకుర్‌లాగే ప్రభావితమయ్యారు.
ఆ పిటిషన్‌లో ఏముందంటే..
‘‘మగ సంతానం లేని ముస్లిం వ్యక్తి(పురుషుడైనా మహిళైనా) ఎవరైనా వీలునామా రాయకుండా చనిపోతే ఆయన/ఆమె ఆస్తిలో కొంత వాటా ఆయన/ఆమె తోబుట్టువులకు చెందుతుంది. ఎంత వాటా అలా తోబుట్టువులకు చెందుతుంది అనేది ఆయన/ఆమెకు ఎంతమంది కూతుళ్లు ఉన్నారనేదానిపై ఆధారపడి ఉంటుంది.
ఒకే ఒక కుమార్తె ఉంటే ఆస్తిలో సగం వాటా ఆమెకు.. మిగతా సగం తండ్రి/తల్లి తోబుట్టువులకు చెందుతుంది. ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కూతుళ్లు ఉంటే ఆస్తిలో మూడింట రెండొంతులు వారికి చెందుతుంది. మిగతా ఒక వంతు తండ్రి/తల్లి తోబుట్టువులకు చెందుతుంది. ప్రస్తుతం వర్తిస్తున్న ఈ చట్టం కుమార్తెలకు నేరుగా నష్టం కలిగించేలా ఉంది’’ అని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ అంశంపై దాఖలైన రిట్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు కేరళ హైకోర్టు దాన్ని కొట్టివేసింది. దీంతో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఫొటో సోర్స్, C. SHUKKUR
అయితే, గత వారం ఇలాంటి కేసుల్లోని బాధిత మహిళలతో ‘సెంటర్ ఫర్ ఇన్‌క్లూజివ్ ఇస్లామ్ అండ్ హ్యూమనిజం(సీఐఐహెచ్)’ ఒక సమావేశం ఏర్పాటుచేయడంతో ఈ అంశం చర్చనీయమవుతోంది.
సీఐఐహెచ్ సమావేశంగానీ,..తాము ఏర్పాటు చేసిన ‘ఫోరం ఫర్ ముస్లిం ఉమెన్ జెండర్ జస్టిస్’గానీ మతానికివ్యతిరేకం కాదని చెప్పడమే తమ ఉద్దేశమని ఈ ఫోరానికి చెందిన డాక్టర్ కదీజా ముంతాజ్ బీబీసీతో చెప్పారు.
సీఐఐహెచ్ ప్రెసిడెంట్ సీహెచ్ ముస్తాఫా మౌలావీ బీబీసీ హిందీతో మాట్లాడుతూ.. ‘‘షరియత్ చట్ట రూపంలో వాడుకలో ఉన్న మహమ్మదీయ చట్టాలు కొన్ని పవిత్ర ఖురాన్‌లో పేర్కొన్న అంశాలకు విరుద్ధంగా ఉన్నాయి. స్త్రీపురుషుల మధ్య సమానత్వం, న్యాయం ఉండాలే కానీ వివక్ష ఉండరాదని ఖురాన్ బోధిస్తోంది’’ అన్నారు.
న్యాయవాది కాళీశ్వర్ రాజ్ దీనిపై మాట్లాడుతూ.. ‘‘దేశంలోని చిన్నకుటుంబాల వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మహమ్మదీయ చట్టాలు ఉండేలా ప్రయత్నించడమే దీనికి పరిష్కారం. స్త్రీపురుష సమానత్వానికి సంబంధించిన రాజ్యాంగ నియమాలను అనుసరించి ఈ చట్టాలు ఉండాలి’’ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- బైరి నరేశ్ మీద పోలీస్ జీపులో ఉండగానే దాడి... దీనిపై పోలీసులు బీబీసీతో ఏమన్నారు?
- ఆంధ్రప్రదేశ్-అమ్మఒడి: ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు సీట్లు కేటాయించడంపై వివాదం ఏమిటి?
- బంగ్లాదేశ్ నుంచి ఈ 500 మంది భారత్‌కు ఎందుకు వచ్చారు? వాళ్లు ఏం కోరుతున్నారు?
- ప్రీతి: ‘కరోనాను ఎదిరించి గెలిచింది కానీ... వేధింపులను తట్టుకుని నిలబడలేక పోయింది’
- ఎండలు బాబోయి ఎండలు... ఫిబ్రవరిలో ఇలా ఉంటే ఇక ముందు ఎలా ఉంటుందో?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














