ఈ కొత్త దంపతులు అప్పగింతలు కాగానే ఎందుకు రోడ్డు మీద నిరసన చేపట్టారు?

ఫొటో సోర్స్, YASIR BURIRO
- రచయిత, రియాజ్ సొహైల్
- హోదా, బీబీసీ ఉర్దూ ప్రతినిధి
డాక్టర్ సహరిశ్ పీర్‌జాదా పెళ్లి అనంతరం తల్లిదండ్రులకు వీడ్కోలు పలికారు. అయితే, ఆమె నేరుగా అత్తింటికి వెళ్లకుండా, పెళ్లి బట్టల్లోనే వరుడితో కలిసి రోడ్డుపై నిరసన చేపట్టారు.
పాకిస్తాన్ సింధ్‌లోని నవబాషా పట్టణంలో ఈ ఘటన జరిగింది.
తాజాగా ప్రభుత్వం తమ రెవెన్యూను పెంచుకునేందుకు జీఎస్టీని 17 నుంచి 18 శాతానికి పెంచింది. మరోవైపు లగ్జరీ వస్తువులపై ఈ పన్నును 17 నుంచి 25 శాతానికి పెంచింది.
మరోవైపు పెళ్లిళ్లు, ఇతర వేడుకలపై కూడా ఇక్కడ పది శాతం పన్ను విధిస్తున్నారు.
దీంతో ఈ పన్నులు, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సహరీశ్, తన భర్త యాసిర్ బర్డూతో కలిసి నిరసనకు దిగారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఫొటో సోర్స్, YASIR BURIRO
‘‘అన్నీ ధరలు పెంచేశారు..’’
‘‘గోదుమ పిండి ధర పెంచారు.. గ్యాస్ ధర పెంచారు.. పంచదార ధర పెంచారు.. విద్యుత్ ధర పెంచారు.. ఇలా అన్నీ ధరలు పెంచేశారు”అని పెళ్లికి వచ్చినవారు నినాదాలు చేశారు.
ఈ విషయంపై బీబీసీతో సహరిశ్ మాట్లాడారు. ‘‘అప్పగింతలు అయ్యాక, మనం ధరల పెరుగుదలపై నిరసన చేపడదామని నా భర్త అన్నారు. నేను కూడా దీనికి సరేనని చెప్పాను’’అని ఆమె వివరించారు.
‘‘బారాత్‌లో రెండు వ్యాన్లు, మూడు కార్లు పాల్గొన్నాయి. వీటిలో కొంతమంది బంధువులు వచ్చారు. అంతా కలిసి నిరసన తెలియజేశాం. నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. అందుకే నేను నినాదాలు చేయలేదు. కానీ, ఈ నిరసనను నేను ఎప్పటికీ మరచిపోలేను’’అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES VIA RIZWAN TABASSUM
ప్రత్యేక నిరసన..
ఫిబ్రవరి 25న సాయంత్రం ఈ దంపతులు బారాత్‌కు వచ్చిన వారితో కలిసి నినాదాలు చేసుకుంటూ ప్రెస్‌క్లబ్‌కు వెళ్లారు.
వీరిని చూసేందుకు సమీపంలోని ప్రజలు కూడా భారీగా వచ్చారు.
‘‘మొదట్లో మేం డ్రామా చేస్తున్నామని అనుకున్నారు. ఇదంతా పెళ్లి షూటింగ్‌లో భాగమని భావించారు. కానీ, ఇది నిజమైన నిరసన అని అక్కడ కాసేపు గడిపిన తర్వాత వారికి అర్థమైంది’’అని సహరిశ్ చెప్పారు.
యాసిర్ బార్డూ ఒక రాజకీయ కార్యకర్త. ప్రభుత్వ స్కూలులో టీచర్‌గానూ ఆయన పనిచేస్తున్నారు.
‘‘ఇలా నిరసన చేపట్టాలని ముందుగా మేం అనుకోలేదు. కానీ, పెళ్లి కార్యక్రమాలు మొదలైన తర్వాత, ప్రతి ఒక్కరూ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుకోవడం మేం చూశాం. వెంటనే పెళ్లి తర్వాత నిరసన తెలియజేద్దామని నా స్నేహితులకు చెప్పాను. వారు కూడా సరేనని అన్నారు’’అని ఆయన తెలిపారు.
అప్పగింతల తర్వాత ఈ విషయాన్ని తన భార్యకు కూడా చెప్పానని, ఆమె కూడా సరేనని అన్నారని వివరించారు.
ధరల పెరుగుదల అతిపెద్ద సమస్య..
సింధ్‌లో ధరల పెరుగుదలపై జరుగుతున్న నిరసనలకు మద్దతుగా తాము కూడా నిరసన తెలియజేయాలని భావించినట్లు యాసిర్ బర్డూ చెప్పారు.
సింధ్ యునైటెడ్ పార్టీ (ఎస్‌యూపీ) ప్రెసిడెంట్ సయ్యద్ జలాల్ మెహమూద్ షా మనవడు జైన్ షా నేతృత్వంలో షఖర్ నుంచి కరాచీ వరకు తాజాగా నిరసన ప్రదర్శన చేపట్టారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, వరద బాధితులకు సాయం లాంటి డిమాండ్లతో వీరు నిరసన తెలియజేశారు.
మరోవైపు నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో రాజకీయ పార్టీలతోపాటు కొన్ని మత సంస్థలు కూడా నిరసనలు చేపడుతున్నాయి.
ఇదివరకు ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ)తోపాటు తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ నాయకులు కూడా నిరసనలు చేపట్టారు. దీంతో కరాచీతోపాటు చాలా నగరాల్లో జనజీవనం స్తంభించింది.
ఇవి కూడా చదవండి:
- బైరి నరేశ్ మీద పోలీస్ జీపులో ఉండగానే దాడి... దీనిపై పోలీసులు బీబీసీతో ఏమన్నారు?
- ఆంధ్రప్రదేశ్-అమ్మఒడి: ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు సీట్లు కేటాయించడంపై వివాదం ఏమిటి?
- బంగ్లాదేశ్ నుంచి ఈ 500 మంది భారత్‌కు ఎందుకు వచ్చారు? వాళ్లు ఏం కోరుతున్నారు?
- ప్రీతి: ‘కరోనాను ఎదిరించి గెలిచింది కానీ... వేధింపులను తట్టుకుని నిలబడలేక పోయింది’
- ఎండలు బాబోయి ఎండలు... ఫిబ్రవరిలో ఇలా ఉంటే ఇక ముందు ఎలా ఉంటుందో?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















