ఆంధ్రప్రదేశ్-అమ్మఒడి: ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు సీట్లు కేటాయించడంపై వివాదం ఏమిటి?

అమ్మఒడి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లో పేద విద్యార్థులకు కార్పోరేట్, ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది. దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వ విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

అయితే కేటగిరీల వారీగా పట్టణ, గ్రామీణ, గిరిజన ప్రాంతాలంటూ విడివిడిగా ఫీజులు నిర్ణయించింది. వాటిని కూడా అమ్మ ఒడి పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న సహాయం ద్వారా చెల్లించాలని చెబుతోంది.

విద్యాహక్కు చట్టం -2009 ప్రకారం ప్రైవేటు విద్యాసంస్థల్లో పేదలకు ఉచితంగా 25 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంది.

అనేక కారణాలతో ఈ చట్టం సక్రమంగా అమలు కావడం లేదు. 2022-23 విద్యా సంవత్సరంలో ఏపీలో కొందరికి అవకాశం కల్పించారు.

కానీ ఈసారి దానిని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు పూనుకోవడం, అందుకు ఫీజులు కూడా నిర్ణయించడం చర్చనీయాంశం అవుతోంది.

అమ్మఒడి

ఫొటో సోర్స్, iStock

చట్టం ఏం చెబుతోంది..

విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతీ ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలలోనూ 25 శాతం సీట్లు అంటే నాలుగో వంతు సీట్లు పేద కుటుంబాలకు ఇవ్వాలి. ఆ మేరకు చట్టంలోని సెక్షన్ 12 (3) (1) లో నిబంధన పొందు పరిచారు. ఆ సీట్లకు అయ్యే ఖర్చు గవర్నమెంటు భరిస్తుందని చట్టంలో ఉంది.

ఏపీలో దాదాపు 16 వేల పాఠశాలలు ప్రైవేటు రంగంలో ఉన్నాయి. అందులో రాష్ట్రమంతా విస్తరించిన కార్పోరేట్ స్కూళ్లు కూడా ఉన్నాయి. ఒక్కోసంస్థ 250 వరకూ బ్రాంచీలు నడుపుతున్నాయి. మొత్తంగా 30 లక్షల మంది వరకూ విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు.

విద్యాహక్కు చట్టం ప్రకారం వాటిలో సుమారుగా 7 లక్షల మందికి ప్రైవేటు, కార్పోరేట్ స్కూళ్లలో ఉచితంగా సీట్లు కేటాయించాలి.

ఈ చట్టం అనేక కారణాలతో అమలుకి నోచుకోలేదు. ఒంగోలుకు చెందిన తాండవ యోగేశ్ అనే న్యాయవాది 2017లో దీనిపై ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. 2021 జనవరి 3న దానిపై హైకోర్టు తీర్పు ఇచ్చింది.

అమ్మఒడి

ఫొటో సోర్స్, FAMILY ALBUM

2022-23 విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రైవేటు స్కూళ్లలోనూ 25 శాతం పేదలకు సీట్లు కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది. కానీ అది అమలులోకి రాకపోవడంతో 2022 మే 5న మళ్లీ పిటీషనర్ కోర్టుని ఆశ్రయించారు.

దానికి ముందుగానే 2022 ఫిబ్రవరి 7వ తేదీన పాఠశాల విద్యా శాఖ ఒక రాష్ట్ర స్థాయి కమిటీని నియమించింది. ఒక విద్యార్థికి సగటున ఎంత ఫీజు చెల్లించవలసి వస్తుందన్న నివేదిక కోసం ఈ కమిటీని నియమించింది. అంతేకాదు 25 శాతంలో ఉప కోటా కూడా నిర్ధారించింది.

అనాథలు, వికలాంగులు, హెచ్ఐవీ బాధిత పిల్లలకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, ఆర్థికంగా వెనుకబడ్డ ఓసీ, మైనార్టీలకు 6 శాతంగా కోటాను విభజించింది ఏపీ ప్రభుత్వం.

ఏడాదికి పల్లెల్లో రూ. 1.20 లక్షలు, పట్టణాల్లో రూ. 1.44 లక్షల లోపు ఆదాయం ఉన్న వారిని వెనుకబడిన వర్గాలుగా పరిగణిస్తారు.

కోటాకి అనుగుణంగా విద్యార్థులు లేకపోతే వాటిని ఇతరులకు కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో తొలుత ఎస్టీలకు ప్రాధాన్యత ఉంటుంది.

ఈ కోటాలో సీటు సాధించడానికి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1 లక్షా 20 వేలు, పట్టణ ప్రాంతాల్లో 1 లక్షా 40 వేల కంటే తక్కువ ఉండాలని సూచించింది.

అమ్మఒడి

ఫొటో సోర్స్, FACEBOOK/YS JAGAN MOHAN REDDY

అమ్మ ఒడితో పరిష్కారమయ్యేనా

న్యాయపరమైన చిక్కులతో పాటుగా అనేక విధానపరమై కారణాలతో ఈ చట్టం అమలుకి నోచుకోలేదు. ముఖ్యంగా ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా ఫీజుల చెల్లింపు విషయంపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఫీజుల నిర్ధారణకు నియమించిన కమిటీ సిఫార్సుల విషయంలో ప్రైవేటు విద్యాసంస్థల నుంచి అభ్యంతరాలున్నాయి.

ఫీజు రీయంబర్స్‌మెంట్ తరహాలో ఫీజులు రీయంబర్స్ చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పటికే కాలేజీలలో ఫీజు రియంబర్స్‌మెంట్ సజావుగా సాగడం లేదనే కారణంతో స్కూల్ యాజమాన్యాలు దీన్ని వ్యతిరేకించాయి.

చివరకు తాజా నోటిఫికేషన్ ప్రకారం పట్టణాల్లో రూ. 8వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 6.5వేలు, గిరిజన ప్రాంతాల్లో రూ. 5.1వేలు చొప్పున ఫీజులుగా నిర్ణయించారు.

అయితే ఈ ఫీజులను చట్టంలో పేర్కొన్న విధంగా ప్రభుత్వం చెల్లించడం కాకుండా అమ్మ ఒడి పథకంలో ప్రభుత్వం అందిస్తున్న సహాయన్ని స్కూల్ ఫీజులుగా పరిగణించాలని ప్రభుత్వం పేర్కొంది.

"నిబంధనల ప్రకారం ప్రభుత్వమే ఆ పావు వంతు సీట్లు దక్కించుకున్న విద్యార్థులకు ఫీజులు చెల్లించాలి. తొలుత ఫీజు రీయంబెర్స్‌మెంట్ ప్రతిపాదనలకు స్కూల్ యాజమాన్యాలు ఒప్పుకోలేదు. దానికి ఇప్పుడు అమ్మ ఒడిని ముడిపెట్టారు. పిల్లలని స్కూల్‌కు పంపిస్తున్నందుకు తల్లులకు ప్రోత్సాహం అంటూ అమ్మ ఒడి ప్రవేశపెట్టారు. ఇప్పుడు ప్రైవేటు స్కూళ్లలో చేర్పించినందుకు ఫీజులకు గానూ ఇస్తున్నట్టు చెబుతున్నారు. ఇది సరైన విధానం కాదు" అంటూ విద్యావేత్త పి.రమేశ్ బాబు అన్నారు.

ప్రభుత్వం తాను చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరించడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

అమ్మఒడి

ఫొటో సోర్స్, Getty Images

అప్పుడు ఫ్రీ అని చెప్పి.. ఇప్పుడిలా..

తాజా ఉత్తర్వుల ప్రకారం మార్చి 6 నుంచి 10వరకూ ఈ పథకం అమలు కోసం ప్రైవేటు స్కూళ్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.

మార్చి 18 నుంచి ఏప్రిల్ 7 వరకూ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇంటి నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఆ తర్వాత మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి అవకాశం కల్పిస్తారు.

లాటరీ ద్వారా ఏప్రిల్ 13న మొదటి విడత ప్రవేశాలకు సీట్లు కేటాయిస్తారు. రెండో విడత కేటాయింపు ఏప్రిల్ 25న చేస్తారు. ఆ నెలాఖరులోగా ప్రవేశానికి ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం అమ్మ ఒడితో ముడిపెట్టిన నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలకు సీట్లు కేటాయించడం అనుమానమేననే అభిప్రాయం వినిపిస్తోంది.

వీడియో క్యాప్షన్, పుట్టుకతోనే ఒక చెయ్యి ఎదగకపోయినా... ఏమాత్రం అధైర్య పడకుండా ఐఏఎస్ కావాలని అనుకుంటోంది.

అమ్మ ఒడి పథకంలో ఒక్కో విద్యార్థి తల్లికి రూ. 15వేలు అందిస్తున్నట్టు చెబుతూ అందులో రూ. 2వేలు మినహాయిస్తున్నారు. పాఠశాల నిర్వహణ ఖర్చుల కోసం అని చెబుతున్నారు.

ఇప్పుడు ఒక్కో తల్లి ఖాతాలో వేస్తున్న రూ. 13వేల నుంచి విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు, కార్పోరేట్ స్కూల్లో సీటు లభించిన విద్యార్థికి ఆయా ప్రాంతాన్ని బట్టి ఫీజు చెల్లించాలి.

గత ఏడాది ప్రవేశం పొందిన వారు సైతం ఇప్పటికే దక్కిన అమ్మ ఒడి నుంచి ఫీజు కట్టాల్సి ఉంటుంది.

"మా పిల్లలిద్దరికీ ప్రైవేటు స్కూల్లో అడ్మిషన్ ఇచ్చారు. మా అబ్బాయి 3, మా అమ్మాయి 6వ తరగతిలో చేరారు. అమ్మ ఒడి కింద మాకు రూ. 13వేలు ఇచ్చారు. అవి అప్పట్లోనే ఖర్చు అయ్యాయి. ఇప్పుడు ఫీజు మేమే కట్టాలని స్కూల్ వాళ్లు చెబుతున్నారు. చెరో రూ. 8వేలు చొప్పున అంటే మేము ఇప్పుడు రూ. 16వేలు కట్టాలి. అప్పట్లో మాకు రూ. 13వేలు ఇచ్చి, ఇప్పుడు రూ. 16వేల ఫీజు కట్టమంటే ఎలా.. అప్పట్లో ఫ్రీ అని చెప్పారు. చాలా సంతోషించాం. కానీ ఇప్పుడు ఫీజులు కట్టాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి" అంటూ శ్రీకాకుళం నగరానికి చెందిన బి.చిరంజీవి ప్రశ్నించారు.

‘‘నేను ఆటో నడుపుతాను, నా భార్య మిషన్ కుడుతుంది. ఇప్పుడు ఫీజుల భారం వేస్తే మాకు చాలా కష్టం’’అని ఆయన బీబీసీతో అన్నారు.

గతంలో ప్రభుత్వ బడుల్లో చదివించి, ఇప్పుడు అంతా ఫ్రీ అనడంతో ప్రైవేటు స్కూల్‌కి పంపించామని ఆయన తెలిపారు. ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

వీడియో క్యాప్షన్, ఈ ఊరి పిల్లలు.. పెద్దల వ్యసనాలను మాన్పించారు

‘‘సీట్లు ఇస్తారనే గ్యారంటీ కూడా ఉండదు..’’

అమ్మ ఒడి పథకంతో విద్యా హక్కు చట్టం ముడిపెట్టడం భావ్యం కాదని ప్రైవేటు విద్యా సంస్థల నిర్వాహకుడు వి.సత్యానందరెడ్డి అన్నారు.

"ప్రభుత్వం విద్యారంగంలో చేస్తున్న కృషి పట్ల సానుకూలత ఉంది. కరోనా వంటి సమయాల్లో బడ్జెట్ స్కూళ్లు చాలా సమస్యలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు విద్యాహక్కు చట్టం ప్రకారం మా స్కూల్లో వంద సీట్లు కేటాయించాలి. దానికి ఫీజులు నేరుగా చెల్లించకుండా విద్యార్థుల తల్లుల ఖాతాలో వేసిన అమ్మ ఒడి నుంచి మినహాయింపు అనడం సమంజసం కాదు. ప్రభుత్వ సహాయాన్ని వారు ఇతర ఖర్చులకు వినియోగించి ఉంటారు. ఇప్పుడు ఫీజులు చెల్లించాలంటే పిల్లల భవితవ్యం గందరగోళం అవుతుంది. సామాన్య విద్యాసంస్థల నిర్వాహకులకు ఇక్కట్లు తప్పవు" అంటూ ఆయన బీబీసీతో అన్నారు.

ప్రభుత్వం ఉదారంగా ఆలోచించి, నేరుగా స్కూల్ యాజమాన్యాలకు చెల్లించేలా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. లేదంటే చాలా మంది పిల్లలకు సీట్లు కేటాయించే అవకాశాలు తగ్గిపోతాయని అంచనా వేశారు.

వీడియో క్యాప్షన్, ఝార్ఖండ్: పరీక్షల్లో ఫెయిల్ చేశారంటూ.. టీచర్లను చెట్టుకు కట్టేసి కొట్టిన విద్యార్థులు

‘‘విద్యాభివృద్ధి కోసమే..’’

విద్యాహక్కు చట్టం ప్రస్తుత విద్యాసంవత్సరంలో కూడా అమలు చేశామని ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కే సురేశ్ కుమార్ తెలిపారు.

"ఈ సంవత్సరం 2196 మందికి సీట్లు కేటాయించాము. వారిలో 1934 మంది చేరారు. విద్యాహక్కు చట్టం ద్వారా అందరికీ మేలు చేసేందుకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. అమ్మ ఒడి వంటి పథకాలు కూడా పిల్లలను చదవుల్లో రాణించేందుకు తోడ్పడ్డవే. నామమాత్రపు ఫీజులతో ప్రైవేటు స్కూల్ సీట్లు కేటాయించేందుకు అవకాశం ఉన్నప్పుడు ఎక్కువ మంది వినియోగించుకుంటారని భావిస్తున్నాం" అంటూ ఆయన బీబీసీకి తెలిపారు.

ప్రభుత్వం అనేక ప్రతిపాదనలు తీసుకుని, నిపుణుల అభిప్రాయాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

మరోవైపు ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందని రిటైర్డ్ టీచర్ కె.సత్తిరాజు అన్నారు.

"ప్రభుత్వం పాఠశాల విద్యలో తీసుకొస్తున్న మార్పులతో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గిపోయాయి. ఇప్పుడు తక్కువ ఫీజులకే సీటు లభించడం వల్ల వేలాది మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు వైపు మళ్లితే ప్రభుత్వ విద్యారంగం మరింత దెబ్బ తింటుంది. ఏపీలో ఇప్పటికే డీఎస్సీ నియామకాలు లేవు. పాఠశాలల విలీనం వంటి చర్యలతో ద్వారా స్కూళ్లు తగ్గిపోతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో పాఠశాల విద్యలో ప్రైవేటు పాత్ర మరింత పెరగడం ఖాయం" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)