ప్రీతి: ‘కరోనాను ఎదిరించి గెలిచింది కానీ... వేధింపులను తట్టుకుని నిలబడలేక పోయింది’

- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
ఆత్మహత్య చేసుకున్న వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థి డాక్టర్ ధరావత్ ప్రీతి అంత్యక్రియలు సోమవారం ముగిశాయి.
ప్రీతి స్వగ్రామం జనగామ జిలా గిర్నీ తండలో అంత్యక్రియల సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
‘మ్యాథ్స్ కష్టం-సైన్స్ అంటే ఇష్టం’
ప్రీతి తల్లిదండ్రులు కూతుర్ని పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నారు. బంధువులు సైతం ఏడుస్తున్నారు.
మంచి డాక్టరుగా సేవలందించాలనకున్న ప్రీతి కల కలగానే మిగిలిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘తను చాలా ధైర్యవంతురాలు. మ్యాథ్స్ ఇష్టపడకపోయేది. చిన్నప్పుడు మా నాన్న ఏమవుతావని అడిగితే డాక్టర్ అయిపోతాను డాడీ అని చెప్పింది. ఆమె మెంటల్‌గా చాలా స్ట్రాంగ్. ఎంబీబీఎస్ కోసం ఇంటర్ రెండేళ్లు చాలా కష్టపడి చదివింది. లాంగ్ టర్మ్ కోచింగ్ అవసరం లేకుండానే ఎంబీబీఎస్ సీటు సాధించింది.
బయట చాలా ఇండిపెండెంట్‌గా ఉండేది. తన పనులు తాను చేసుకునేది. అయితే ఇంట్లో మాత్రం మాతో పనులు చేయించుకునేది. కాలేజీకి మేమే డ్రాప్ చేసే వారిమి.
సినిమాలకు దూరంగానే ఉండేది. థియేటర్, టీవీ వద్దనేది. ఇంట్లోనే అప్పుడప్పుడు టీవీలో కలిసి సినిమాలు చూసేవారిమి. షాపింగ్‌కు కూడా వచ్చేది కాదు. తన సైజు బట్టలైతే చాలని, సెలక్షన్ అక్క చేస్తే సరిపోతుందనేది. తను ఎప్పుడూ చదువులో మునిగిపోయేది.
తన ఫోన్ ఎప్పుడైనా చూస్తే అన్నీ సైన్స్ , మానవ శరీర నిర్మాణం, అవయవాల నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలు ఉండేవి’’ అని ప్రీతి అక్క ధరావత్ పూజ బీబీసీతో అన్నారు.
ఇంటికి వచ్చే ఇతర విద్యార్థులను కూడా బాగా చదువుకోవాలంటూ ప్రోత్సహించేదని ప్రీతీ సోదరుడు పృథ్వీ స్నేహితుడైన బొమ్మ రాజేశ్ బీబీసీతో చెప్పారు.
‘‘బాగా చదవండి. గోఆన్, మూవ్ ఆన్ అంటూ చెప్పేది. ఫుల్ స్టాప్‌లు లేకుండా ముందుకు పోవాలని అనేది. ప్రైవేట్ జాబులు వద్దని బాగా చదివి గవర్నమెంట్ జాబులు తెచ్చుకోవాలని తమ్ముడితో పాటూ అతని స్నేహితులైన మాకు కూడా చెప్పేది. ఇలా అవుతుందని కలలో కూడా అనుకోలేదు’’ అని రాజేశ్ బాధపడ్డారు.

కరోనా సమయంలో వైద్యురాలిగా
కరోనా సంక్షోభం తలెత్తే సమయానికి ప్రీతి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉన్నారు.
నాడు సికింద్రాబాద్‌లోని రైల్వే ఆసుపత్రిలో కరోనా వార్డులో సేవలు అందించిందని ప్రీతి తండ్రి ధరావత్ నరేందర్ బీబీసీతో చెప్పారు.
‘కోవిడ్ వార్డులో వద్దని వారించినా వినలేదు. చాలా ధైర్యవంతురాలు. కోవిడ్‌ను ధైర్యంగా ఎదుర్కొంది, కానీ ఇక్కడ మాత్రం వేధింపులకు బలైంది’ అని నరేందర్ అన్నారు.
ఇంట్లో ఎవరికి బాగా లేకపోయినా చెక్ చేసి, మందులు ఇచ్చేదని ధరావత్ పూజ గుర్తు చేసుకున్నారు.

‘మాకు అనుమానాలు ఉన్నాయ్’
తన కూతురు మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని నరేందర్ అంటున్నారు.
‘‘నా కూతురిది ఆత్మహత్య కాదు. అది కచ్చితంగా హత్య. కాకతీయ మెడికల్ కాలేజీ అధికారులు సరైన సమయానికి స్పందించి, సీనియర్ డాక్టర్ సైఫ్‌కు కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటే నా కూతురు బతికి ఉండేది.
నిష్పక్షపాతంగా సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపితే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయన్న నమ్మకం నాకు ఉంది.
హత్య అన్న నా అనుమానానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. అనస్తీషియా కోర్సులో ప్రీతి జాయినై 3 నెలలు మాత్రమే అయింది. అలాంటి అమ్మాయికి మత్తు మందులు, వాటిని ఎంత డోసు ఇవ్వాలనే విషయాలు తెలియవు. అలాంటప్పుడు తనకు తానుగా హానికర ఇంజెక్షన్ ఎలా తీసుకుంటుంది?
ఆరోజు ప్రీతి అపస్మారక స్థితిలో ఉందని ఆమె సెల్ ఫోన్ నుంచే నాకు కాల్ వచ్చింది. తన సెల్ ఫోన్ ఎలా అన్‌లాక్ అయింది. అందులోని డేటా ఎలా పోయింది? ఇది కచ్చితంగా హత్యే’’ అని నరేందర్ బీబీసీతో అన్నారు.

‘ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష’
ఫిబ్రవరి 12న ఐఐటీ బాంబేలో దర్శన్ సోలంకీ అనే దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అందుకు కారణంగా కుల వివక్షే అని ఆరోపణలు వచ్చాయి. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల చనిపోయినప్పుడు కూడా ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్ష చర్చల్లోకి వచ్చింది.
ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష, ర్యాగింగ్ వల్ల నిమ్న వర్గాలకు చెందిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తీరు ఆ వర్గాల అభివృద్ధికి ఆటంకంగా మారుతోందని అంటున్నాయి.
‘‘ఎస్టీ కాబట్టే ఈ కాలేజీలో సీటు వచ్చింది అని కాలేజీ వాట్సప్ గ్రూప్‌లో అన్నాడు. తీవ్రంగా అవమానించాడు. డ్యూటీ డాక్టర్ రూమ్‌కు లాక్ వేసి బాత్రూమ్ వాడుకోకుండా చేసేవాడు. ఇతరులు కూడా సాయపడకుండా చూసేవాడని ప్రీతి చెప్పేది’’ ఆమె సోదరి పూజ ఆరోపించారు.
‘‘ఉన్నత వర్గాల పిల్లలకు ఇలాంటిది జరిగినప్పుడు చట్టాన్ని దిక్కరించే నిర్ణయాలు తీసుకుంటారు. మా బిడ్డలకు అన్యాయం జరిగిందంటే చట్టం పరిధిలో కనీసం సిట్టింగ్ జడ్జీతో విచారణ కూడా జరిపించరు.
అణగారిన వర్గాల పిల్లలకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని స్వయంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అన్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో ఉన్న పరిస్థితులకు ఈ మాటలు అద్దం పడతాయి.
చట్టాలు మాకు అనుకూలంగా ఉండవచ్చు కానీ, అమలు చేసే వ్యవస్థ లేకపోవడం వల్ల, అమలు చేసే వ్యక్తులు ఉన్నత వర్గాలు కావడం వల్ల మాకు ఈ దుస్థితి ఉంది’’ అని ఎమ్మార్పీఎస్‌కు నేత మందకృష్ణ మాదిగ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, KTR/Facebook
‘ఎవరినీ వదిలి పెట్టం’
డాక్టర్ ప్రీతి కేసులో ఎంతటి వారినైనా శిక్షిస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు.
‘ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం, పార్టీ తరపున అండగా ఉంటాం. ఆ అమ్మాయికి అన్యాయం చేసింది సైఫ్ అయినా సంజయ్ అయినా వదలిపెట్టం’ అని ఆయన అన్నారు.
అనస్తీషియా విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి ఫిబ్రవరి 22న ఎంజీఎం ఆసుపత్రిలోని ప్రసవాల విభాగంలో రాత్రి విధులు నిర్వహిస్తూ తెల్లవారు జామున అపస్మారక స్థితిలో కనిపించారు.
అక్కడే ఐసీయూలో చికిత్స అందించి ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించారు.
హానికర ఇంజెక్షన్ తీసుకుని ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందనే వార్తలు వచ్చాయి. ఆరోజు తన ఫోన్‌లో ఒక ఇంజెక్షన్‌కు సంబంధించిన వివరాలను ఇంటర్నెట్‌లో ప్రీతి వెతికిందని పోలీసులు తెలిపారు.
సగం వాడిన రెండు ఇంజెక్షన్ వాయిల్స్ దొరికాయని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎ.వి.రంగనాథ్ వెల్లడించారు.
ప్రీతి కేసులో నిందితుడుగా ఉన్న డాక్టర్ సైఫ్ ప్రస్తుతం ఖమ్మం జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- చిన్న దేశం...రష్యాను ఎలా ఎదుర్కొంటోంది?
- విశాఖపట్నం: భక్తులతో మాట్లాడే రోబో సాయిబాబా
- అరుంధతి నక్షత్ర దర్శనం: పెళ్లిలో ఈ సంప్రదాయం వెనుక సైన్స్ ఉందా?
- సోనియా గాంధీ: 'ఇన్నింగ్స్ ముగింపు' అనడంలో అర్థమేంటి... కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా రిటైర్ అయినట్లేనా?
- దర్శన్ సోలంకి ఆత్మహత్య: ఐఐటీ బాంబేలో సీటు ఆ దళిత యువకుడి కల... అది నిజమైంది, కానీ ప్రాణం పోయింది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














