దర్శన్ సోలంకి ఆత్మహత్య: ఐఐటీ బాంబేలో సీటు ఆ దళిత యువకుడి కల... అది నిజమైంది, కానీ ప్రాణం పోయింది

దర్శన్ సోలంకి
    • రచయిత, కీర్తి దుబే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఫిబ్రవరి 12న మధ్యాహ్నం 12.20 గంటలకు తండ్రితో వీడియో కాల్‌లో దర్శన్ సోలంకి మాట్లాడాడు. తను చదువుతున్న ఐఐటీ బాంబేలో పరీక్షలు పూర్తయ్యాయని, స్నేహితులతో కలిసి ‘‘గేట్ వే ఆఫ్ ఇండియా’’, జూహూ బీచ్‌లకు స్నేహితులతో కలిసి వెళ్దామని అనుకుంటున్నామని చెప్పాడు.

దర్శన్ తండ్రి రమేశ్‌భాయ్ సోలంకి వృత్తిరీత్తా ప్లంబర్. తన కొడుకు గురించి ఆయన చెబుతూ, ‘‘మొదట్లో తను నేవీలో చేరాలని అనుకున్నాడు. కానీ, ఇంటర్‌లో రసాయన శాస్త్రంపై విపరీతమైన ఇష్టం పెంచుకున్నాడు. ఆ తర్వాత బాగా చదువుకుని ఐఐటీ బాంబేలో సీటు తెచ్చుకున్నాడు. అక్కడ చదువుకోవడం అతడి కల. కానీ, అదే తనను బలి తీసుకుంటుందని మేం ఊహించలేదు’’అని ఆయన వివరించారు.

18 ఏళ్ల దర్శన్‌కు మూడు నెలల ముందు ఐఐటీ బాంబేలో చదవడం అనేది ఒక కల. కానీ, కొన్ని నెలల్లోనే అక్కడే ఆత్మహత్య చేసేకునేలా తన జీవితం మారిపోయింది. దర్శన్ ఎలాంటి లేఖనూ రాయలేదు. కానీ, నెల రోజుల ముందు తన సోదరితో, ‘‘కులం పేరుతో తనను వేధిస్తున్నారు’’అని చెప్పాడు.

దర్శన్‌తోపాటు ఐఐటీ బాంబేలో చదువుతున్న ఒక విద్యార్థి బీబీసీతో మాట్లాడాడు. ‘‘మా ఇంట్లో అందరికీ నేనంటే చాలా ఇష్టం. అందరూ నన్ను బాగా చూసుకునేవారు. కానీ, ఇక్కడ వారికి నేను నచ్చడం లేదు’’అని తనతో దర్శన్ చెప్పాడని తను వివరించాడు.

మరోవైపు దర్శన్‌తో పరిచయమున్న మరో విద్యార్థి, ‘‘దర్శన్‌తోపాటు ఉండేవారే అతడితో మాట్లాడటం మానేశారు. అక్కడి హాస్టల్‌లో కొందరి ప్రవర్తన సరిగా ఉండేది కాదు. ఈ విషయంలో తను చాలా బాధపడేవాడు. ఈ విషయంపై తన మెంటర్‌కు దర్శన్ ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా మారిపోయాయి’’అని వివరించాడు.

దర్శన్ సోలంకి
ఫొటో క్యాప్షన్, రమేశ్‌భాయ్ సోలంకి

ఐఐటీ బాంబే ఏం అంటోంది?

ఫిబ్రవరి 14న ఈ విషయంపై ఐఐటీ బాంబే ఒక ప్రకటన విడుదల చేసింది. దర్శన్ కుల వివక్ష వల్లే చనిపోయాడని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురిస్తున్నాయని, దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఇలాంటి వార్తలు ప్రచురించడం సరికాదని పేర్కొంది. ఆ అబ్బాయి కుల వివక్ష ఎదుర్కొన్నట్లు తమకు ఎలాంటి సంకేతాలూ కనిపించలేదని వివరించింది.

ఆ తర్వాత, ఫిబ్రవరి 18న ఐఐటీ డైరెక్టర్ ఒక ఇంటర్నల్ మెయిల్ పంపించారు. ‘‘ఈ ఆత్మహత్యపై పవాయీ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు మేం కూడా విచారణ కోసం ప్రొఫెసర్ నంద కిశోర్ నేతృత్వంలో మేం కూడా ఒక కమిటీని ఏర్పాటుచేశాం’’అని ఆ మెయిల్‌లో పేర్కొన్నారు.

బీబీసీ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘క్యాంపస్‌లో ఎలాంటి వివక్షనూ మేం సహించం. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మేం చర్యలు తీసుకుంటున్నాం. జేఈఈ ర్యాంకులు ఎవరివీ అడగొద్దని కూడా మేం విద్యార్థులకు స్పష్టంచేశాం’’ అని ఐఐటీ బాంబే పేర్కొంది.

‘‘మొదటి సంవత్సరంలోనే మేం టీచింగ్ అసిస్టెంట్లను కేటాయిస్తాం. కొత్త విద్యార్థులకు క్యాంపస్‌పై మెరుగ్గా అవగాహన కల్పించేందుకు వారు కృషి చేస్తారు. మరోవైపు విద్యాపరమైన సాయం కోసం అకడమిక్ మెంటర్లను కూడా కేటాయిస్తాం. మొదటి ఏడాదిలోనే ఇంగ్లిష్ క్లాసులు కూడా మొదలుపెడతాం. 24 గంటలూ కౌన్సెలింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది’’అని సంస్థ వివరించింది.

అయితే, ఐఐటీ బాంబే ఏర్పాటుచేసిన కమిటీ ఎప్పటిలోగా నివేదిక సమర్పిస్తుందనే ప్రశ్నకు ఎలాంటి సమాధానం రాలేదు.

ఇక్కడి పరిస్థితులపై ఐఐటీ బాంబే పీహెచ్‌డీ విద్యార్థి ఒకరు బీబీసీతో మాట్లాడారు. ‘‘ఇక్కడ విద్యార్థులకు అవసరమైన సాయం అందదు. అన్నిచోట్లా ర్యాంకులు అడుగుతారు. ఒకసారి ర్యాంకు తెలుసుకున్న తర్వాత, వీడికి ఇక్కడ చదువుకునేందుకు అర్హత లేదనట్లుగా చూస్తారు. రిజర్వేషన్ల వల్లే ఇక్కడికి వచ్చాడని అంటారు’’అని చెప్పారు.

‘‘చిన్న వయసులో ఇక్కడికి వచ్చే పిల్లల్లో ఇది ఒకరమైన ఆత్మన్యూనతా భావాన్ని కలగజేస్తుంది. అసలు నన్ను ఎందుకు వీరు తమలో కలుపుకోవడం లేదు? నాకు ఏం తక్కువైంది? లాంటి ప్రశ్నలు వారిలో ఉత్పన్నం అవుతాయి. క్రమంగా వారి గుర్తింపే వారికి భయంగా మారుతుంది’’అని ఆయన వివరించారు.

‘‘మన ఐడెంటిటీని బయటపెడితే, చాలా పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ బోధనా సిబ్బందిలో 96 శాతం మంది అగ్ర కులాల వారే ఉంటారు. ఇదే సంస్థ ప్రవర్తన ఎలా ఉంటుందో చెబుతుంది’’అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, ఐఐటీ బాంబే: ‘IITలోనూ కుల వివక్ష తప్పలేదు’

‘‘ఎస్సీ-ఎస్టీ సెల్ ఒక డొల్ల’’

2017లో ఐఐటీ బాంబేలో ఎస్సీ-ఎస్టీ సెల్‌ను ఏర్పాటుచేశారు. తమకు ఏదైనా వివక్ష ఎదురైతే వెంటనే ఈ సెల్‌కు వచ్చి ఫిర్యాదు చేయొచ్చని తమ వెబ్‌సైట్‌లో విద్యార్థులకు ఐఐటీ బాంబే సూచించింది.

అయితే, ఈ సెల్ ఒక డొల్ల వ్యవస్థ లాంటిదని కొందరు విద్యార్థులు బీబీసీతో చెప్పారు. ‘‘ఆ సెల్‌కు ఎలాంటి అధికారాలు లేవు. అసలు అది ఎలా పనిచేస్తుందో ఎక్కడా మీకు వివరాలు కనిపించవు’’అని వారు వివరించారు.

అంబేడ్కర్ స్టూడెంట్స్ కలెక్టివ్ సంస్థ సభ్యుడు, ఇక్కడ పీహెచ్‌డీ చదువుతున్న స్వప్నిల్ గెదామ్, ‘‘ఇక్కడ ఎస్సీ-ఎస్టీ సెల్‌కు దర్శన్ ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం వార్తా పత్రికల ద్వారా తెలిసింది. అంటే పరిస్థితి ఏమిటో మీరు అర్థం చేసుకోవచ్చు. అసలు అందరికంటే ముందు ఈ సెల్‌కే సమాచారం రావాలి. కానీ, అసలు అలాంటి పరిస్థితే లేదు’’ అని ఆయన చెప్పారు.

మరోవైపు దర్శన్ ఆత్మహత్యను ‘‘ఇన్‌స్టిట్యూషనల్ మర్డర్’’గా ఐఐటీ బాంబేలోని అంబేడ్కర్ పెరియార్ పూలే స్టూడెంట్ సర్కిల్ వ్యాఖ్యానించింది. ఇలాంటి వివక్షపై యాజమాన్యం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ఈ సర్కిల్ ఇదివరకు కూడా ఆరోపణలు చేసింది.

2014 నుంచి 2021 మధ్య దేశంలోని ఐఐటీలు, ఐఐఎంలలో 122 ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించింది. వీటిలో 24 ఎస్సీలు, 41 మంది ఓబీసీలు, ముగ్గురు ఎస్టీల విద్యార్థులు ఉన్నారు. అంటే మొత్తంగా 68 మంది రిజర్వ్ కేటగిరీ విద్యార్థులు ఉన్నారు.

కుల వివక్ష

విదేశాల్లోనూ తప్పని కుల వివక్ష

కులం పేరుతో వివక్ష చూపించడం అనేది విదేశాలకూ పాకుతోంది. న్యూయార్క్‌లో జీవించే యశికా దత్ వృత్తిరీత్యా జర్నలిస్టు. ఆమె ‘‘కమింగ్ అవుట్ యాజ్ ఎ దళిత్’’అనే పేరుతో ఒక పుస్తకం కూడా రాశారు.

‘‘కోటా స్టూడెంట్ అనే పిలుస్తూ ఒక విద్యార్థి ప్రతిభ మొత్తాన్నీ అవమానిస్తారు. కాలేజీ మొదటి రోజే కోటా స్టూడెంట్‌లు ఎవరో చెప్పండని సీనియర్లు అడుగుతుంటారు. ఇలాంటి వివక్ష బహిరంగంగానే కనిపిస్తుంది’’అని ఆమె అన్నారు.

‘‘నేను భంగీ కమ్యూనిటీ నుంచి వచ్చాను. కొంతమంది ఆ పేరును కూడా తిట్టులా పిలుస్తుంటారు. అసలు మన కులమేంటో చెప్పొద్దని మా అమ్మానాన్నలు చెప్పేవారు. మనం కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మన గుర్తింపు కులం పేరుతోనే ముడిపడి ఉంటుంది’’అని ఆమె చెప్పారు.

ఈ వివక్ష అమెరికా వరకూ విస్తరించిందని ఆమె వివరించారు. ‘‘ఇక్కడ భారతీయ-అమెరికన్ కమ్యూనిటీలో కూడా కోటాపై చదువుకుని వచ్చాడని కొందరు అంటుంటారు’’అని యశిక వివరించారు.

యశిక

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యశిక

ఎయిమ్స్‌లో పరిస్థితి ఎలా ఉంది?

దేశంలోని ప్రతిష్ఠాత్మక వైద్య కళాశాల ఎయిమ్స్‌లోనూ కుల వివక్ష కనిపిస్తోందని గత ఏడాది ఒక పార్లమెంటరీ కమిటీ నివేదికలో వెల్లడించింది.

మిగతా వారితో పోల్చినప్పుడు ఎయిమ్స్ పరీక్షల్లో పదేపదే ఫెయిల్ అవుతున్న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని ఆ నివేదికలో పేర్కొన్నారు.

మరోవైపు ఫ్యాకల్టీగా ఉద్యోగాలు పొందే సమయంలోనూ దళిత, గిరిజన వర్గాల విద్యార్థులు వివక్షను ఎదుర్కొంటున్నట్లు బీజేపీ నాయకుడు కిరిట్ సోలంకి నేతృత్వంలోని ఎస్సీ-ఎస్టీ వెల్ఫేర్ కమిటీ నివేదికలో తెలిపింది.

రోహిత్ వేముల

ఫొటో సోర్స్, Getty Images

రోహిత్ వేముల కూడా ఇలానే..

స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తర్వాత, 1948లో అంటరానితనాన్ని నిషేధించారు. అయితే, ఇది కేవలం పత్రాల్లో మాత్రమే మాయమైంది. వాస్తవంలో పరిస్థితులు ఇంకా మారలేనట్లుగా కనిపిస్తోంది.

రోజూ దేశంలోని ఏదో ఒక ప్రాంతం నుంచి కులం పేరుతో వివక్ష చూపినట్లుగా చెబుతున్న ఘటనలు, హింస వెలుగుచూస్తూనే ఉన్నాయి.

2016లో హైదరాబాద్ యూనివర్సిటీకి చెందిన పీహెచ్‌డీ విద్యార్థి కూడా ఇలానే ఆత్మహత్య చేసుకున్నారు. తాను కార్ల్ సేగన్‌ను కావాలని అనుకున్నానని, కానీ, నేడు ఆత్మహత్య లేఖ రాయాల్సిన దుస్థితి వచ్చిందని ఆయన చివరి లేఖలో రాశారు.

దీనికి ఆరేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ 18 ఏళ్ల దర్శన్ ఆత్మహత్య చేసుకున్నాడు.

‘‘మా అబ్బాయి చాలా బాగా చదివేవాడు. చాలా కష్టపడేవాడు. చిన్నప్పటి నుంచీ అన్నీ తన మనసులోనే దాచుకునేవాడు. మా అబ్బాయి ఆత్మహత్య చేసుకునేవరకు పరిస్థితి వచ్చిందంటే తను ఎంత వేదన అనుభవించి ఉంటాడో. మా అబ్బాయి చనిపోయాడు. కానీ, ఇలాంటి వివక్షతో ఏ అబ్బాయి ఇకపై చనిపోకుండా నేను పోరాడతాను’’అని దర్శన్ తండ్రి రమేశ్‌భాయ్ అన్నారు.

‘‘ఇక్కడ ఎలాంటి కుల వివక్ష ఉంటుందంటే.. జనవరి 17న రోహిత్ వేముల వర్ధంతినాడు ఇక్కడ మేం ఒక కార్యక్రమం ఏర్పాటుచేయాలని అనుకున్నాం. దానికి కూడా మాకు అనుమతించలేదు. కానీ, ఇక్కడ సరస్వతీ పూజలు, శివాజీ మహారాజ్ జయంతులు నిర్వహిస్తారు. అప్పుడు సెక్యూరిటీ పరంగా ఎలాంటి అభ్యంతరాలూ ఉండవు’’అని స్వప్నిల్ అన్నారు.

రోహిత్ వేముల, దర్శన్ సోలంకిలకు ఎన్నో కలలు ఉండేవి. అయితే, వీరు ఆ కలలను సాకారం చేసుకోకముందే, జీవితాన్ని ముగించాల్సి వచ్చింది.

వీడియో క్యాప్షన్, కులం పేరుతో బడుల్లో పిల్లలను వేర్వేరుగా కూర్చోబెడుతున్న టీచర్లు..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)