1 రూపాయి 30 రోజుల్లో రూ.53 కోట్లు ఎలా అవుతుంది...చక్రవడ్డీ మిమ్మల్ని ఎట్లా ధనవంతుల్ని చేస్తుంది?

విమానం వద్ద యువతి

ఫొటో సోర్స్, Getty Images

అనగనగా ఒక అడవి...

ఆ అడవిలో ఇద్దరు స్నేహితులు నడుచుకుంటూ పోతున్నారు.

ఒక చోట రెండు దారులు కనిపించాయి.

అక్కడ ఉన్న బోర్డు మీద ఇలా రాసి ఉంది...

1. కోటి రూపాయలు కావాలంటే ఎడమ వైపు దారిలో వెళ్లండి.

2.30 రోజుల పాటు ప్రతి రోజూ రెట్టింపు అయ్యే ఒక రూపాయి కావాలంటే కుడి వైపు దారిలో ముందుకు సాగండి.

ఆ ఇద్దరిలో A, కోటి రూపాయల కోసం ఎడమ వైపు దారిలో వెళ్లిపోయాడు. మరొక మిత్రుడు B, ఒక రూపాయి కోసం కుడి వైపుకు పోయాడు.

వీళ్లలో ఎవరు తెలివైన వారని మీరు అనుకుంటున్నారు?

A అని ఎవరైనా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే నెల రోజుల్లో B పొందే సంపద ఎంతో తెలుసా రూ.53.7 కోట్లు.

చక్రవడ్డీ

ఫొటో సోర్స్, Getty Images

నమ్మలేకపోతున్నారా..?

కావాలంటే పేపర్, పెన్ తీసుకొని లెక్కిద్దాం... ముందు చెప్పిన ప్రకారం రూపాయి రోజూ రెట్టింపు అవుతూ ఉంటుంది.

1వ రోజు: 1(x2)

2వ రోజు: 2(x2)

3వ రోజు: 4(x2)

4వ రోజు: 16(x2)

5వ రోజు: 32(x2)

ఇలా లెక్కించుకుంటూ పోతే...

25వ రోజు: 16,777,216(x2)

26వ రోజు: 33,554,432(x2)

27వ రోజు: 67,108,864(x2)

28వ రోజు: 134,217,728(x2)

29వ రోజు: 268,435,456(x2)

30వ రోజు: 536,870,912

మొత్తం మీద 30 రోజులు ముగిసే నాటికి B వద్ద సుమారు 53.7 కోట్ల రూపాయలు ఉంటాయి.

ఈపాటికే ఆ ఇద్దరి మిత్రుల్లో ఎవరు తెలివైన వాళ్లో మీకు అర్థమై పోయి ఉంటుంది.

ఒక్క రూపాయి నెల రోజుల్లో రూ.53.7 కోట్లు కావడం వెనుక ఉన్న మ్యాజిక్‌నే చక్రవడ్డీ(కాంపౌండ్ ఇంట్రెస్ట్) అంటారు.

చక్రవడ్డీ అనేది మనకు బాగా తెలిసిందే. రోజూ చూసేదే.

సేవింగ్ అకౌంట్స్

క్రెడిట్ కార్డులు

బ్యాంకు రుణాలు... ఇలా చాలా సందర్భాల్లో మనకు చక్రవడ్డీ తారసపడుతూ ఉంటుంది.

ప్రస్తుతం ఫోర్బ్స్ ప్రపంచకుబేరుల జాబితాలో 5వ స్థానంలో ఉన్న వారెన్ బఫెట్ తరచూ ఒక మాట చెబుతూ ఉంటారు.

‘మై లైఫ్ హాజ్ బీన్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్...’

అంటే తన అపార సంపదకు కారణం చక్రవడ్డీనే అని వారెన్ బఫెట్ చెబుతున్నారు. వివిధ కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీగా డబ్బును సంపాదించారు బఫెట్.

అందుకే ఆర్థిక ప్రపంచం ఆయనను ముద్దుగా ‘ఇన్వెస్ట్‌మెంట్ గురు’ అని పిలుస్తుంది.

బఫెట్ మాదిరిగా చక్రవడ్డీ ద్వారా కుబేరులైన వారు ఈ ప్రపంచంలో చాలా మందే ఉన్నారు.

రాకెట్

ఫొటో సోర్స్, Getty Images

డబ్బే డబ్బును ఎలా సంపాదిస్తుంది?

ఇంతకు ముందు చెప్పినట్లు ఒక రూపాయి 30 రోజుల్లో రూ.53.7 కోట్లు కావడమనేది... అంత రిటర్న్ ఇచ్చే పెట్టుబడి సాధనాలు ఉంటే తప్ప ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు.

ఉదాహరణకు X అనే కంపెనీ షేరు ధర రూ.1 అనుకుందాం. ఆ షేరు ధర ప్రతిరోజూ డబుల్ అవుతూ ఉండాలి. అలా 30 రోజుల పాటు వరుసగా జరగాలి. అలాంటి షేరులో పెట్టుబడి పెడితే పైన చెప్పిన రూ.53.7 కోట్లు వస్తాయి. కానీ ఇది వాస్తవ జీవితంలో సాధ్యం కాదు.

కానీ చక్రవడ్డీ చేసే మ్యాజిక్‌లో మాత్రం తేడా ఉండదు. చక్రవడ్డీలో వడ్డీ మీద వడ్డీ వస్తుంది. అంటే డబ్బు డబ్బును సంపాదిస్తుంది. ఈ విషయాన్ని కాస్త వివరంగా చూద్దాం.

ఉదాహరణకు మీరు 100 రూపాయలను పొదుపు చేశారు. ఏడాదికి వడ్డీ 10శాతం అనుకుందాం.

తొలి ఏడాది: 100 రూపాయల మీద 10 రూపాయలు వడ్డీ వస్తుంది.

మొత్తం=అసలు+వడ్డీ

మొత్తం=100+10= రూ.110

ఇంతవరకు బాగానే ఉంది. కానీ రెండో సంవత్సరం నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మ్యాజిక్ మొదలవుతుంది.

రెండో ఏడాది: 110 రూపాయల మీద వడ్డీని లెక్కిస్తారు. అంటే తొలి ఏడాదిలో వచ్చిన వడ్డీని అసలుకు కలుపుతారు. ఇక్కడ 110 రూపాయలు అసలు అవుతుంది.

మొత్తం=110(అసలు)+11(వడ్డీ)= రూ.121

మూడో ఏడాది: మొత్తం=121(అసలు)+12.10= రూ.133.10

ఇలా వడ్డీ మీద వడ్డీ వస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని చక్రవడ్డీ అంటారు.

చక్రవడ్డీలో సమయం అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎంత ఎక్కువ కాలం మీరు పొదుపు చేస్తూ పోతే ప్రతిఫలం అంత ఎక్కువగా ఉంటుంది.

అందుకే సాధ్యమైనంత త్వరగా పొదుపును ప్రారంభించాలని చెబుతారు.

పిగ్గీ బ్యాంక్

ఫొటో సోర్స్, Getty Images

తక్కువ తెచ్చే ఎక్కువ లాభం

మనం ఇప్పుడు రెండు కేసులను చూద్దాం.

కేస్-1: ఇక్కడ ఒక వ్యక్తి 25ఏళ్ల వయసు నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో పొదుపు చేయడం ప్రారంభించారు.

నెలకు 10,000 రూపాయలను 30ఏళ్ల పాటు పొదుపు చేస్తూ పోయారు.

ఏడాదికి 10శాతం రిటర్న్ అనుకుందాం.

ఆ వ్యక్తికి 55ఏళ్లు వచ్చే నాటికి రూ.2,27,93,253 లేదా సుమారు రూ.2.28 కోట్లు చేతికి వస్తాయి.

కేస్-2: ఇక్కడ ఒక వ్యక్తి 35ఏళ్ల వయసులో మ్యూచువల్ ఫండ్స్‌లో పొదుపు చేయడం ప్రారంభించారు.

నెలకు 10,000 రూపాయలను 20ఏళ్ల పాటు పొదుపు చేస్తూ పోయారు.

ఏడాదికి 10శాతం రిటర్న్ అనుకుందాం.

ఇక్కడ ఆ వ్యక్తికి 55ఏళ్లు వచ్చే నాటికి రూ.76,56,969 లేదా సుమారు రూ.76.57 లక్షలు వస్తాయి.

అంటే 10ఏళ్లు ఆలస్యంగా పొదుపు ప్రారంభించడం ద్వారా సుమారు రూ.1.51 కోట్లు కోల్పోతున్నాం.

రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.

భారత కరెన్సీ

ఫొటో సోర్స్, Getty Images

రెండు వైపులా పదునున్న కత్తి

చక్రవడ్డీ అనేది పొదుపు చేసేటప్పుడు బాగానే అనిపిస్తుంది.

కానీ లోన్లు తీసుకున్నప్పుడు మాత్రం చాలా భారంగా ఉంటుంది.

C అనే వ్యక్తి రూ.100000 లోను తీసుకున్నారని అనుకుందాం.

వడ్డీ ఏడాదికి 10శాతం అనుకుంటే...

1వ సంవత్సరం: 10,000 రూపాయలు వడ్డీ వస్తుంది.

మొత్తం=1,00,000(అసలు)+10,000(వడ్డీ) =110,000

2వ సంవత్సరం: వడ్డీ 11,000 రూపాయలకు పెరుగుతుంది.

మొత్తం=110,000(అసలు)+11,000(వడ్డీ) =1,21,000

3వ సంవత్సరం: వడ్డీ 12,100 రూపాయలు అవుతుంది.

మొత్తం=1,21,000(అసలు)+12,100(వడ్డీ) =1,33,100

అంటే ఇక్కడ ఎంత త్వరగా లోను తిరిగి చెల్లిస్తే అంత మంచిది. వాయిదాలు పెంచుకుంటూ పోయే కొద్దీ వడ్డీ భారం పెరుగుతూ పోతుంది.

గమనిక: ఈ కథనం అవగాహన కోసం మాత్రమే. మీరు ఎంచుకునే పెట్టుబడి సాధనాలు, అవి ఇచ్చే రిటర్న్‌ ఆధారంగా చివరకు వచ్చే మొత్తం మారుతూ ఉంటుంది.

కొన్ని సందర్భాల్లో పన్నులు, ఇతర చార్జీలు వంటివి మినహాయించిన తరువాతే చేతికి డబ్బు వస్తుందనే విషయాన్ని మరచిపోకూడదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)