హోం లోన్: కిరాయి ఇంటికి కడుతున్న అద్దె డబ్బులను ఈఎంఐ‌గా కట్టి ఇల్లు కొనుక్కోవచ్చా?

ఇల్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఐవీబీ కార్తికేయ
    • హోదా, బీబీసీ కోసం

మనలో చాలా మంది ఫలానా వాళ్ళకు మూడు ఇళ్ళు ఉన్నాయి, ఫలానా వాళ్లు భూములు కొని చాలా లాభపడ్డారు.. అనే మాటలు తరుచుగా వింటూ ఉంటాం.

అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేట్లు పెంచిన ప్రతి సారీ గృహ రుణాల ఈఎంఐలు పెరిగిపోతాయనే వార్తలు కూడా పత్రికలలో వస్తుంటాయి.

సొంత ఇల్లు అనేది చాలా మందికి భావోద్వేగాలకు సంబంధించిన విషయం. నా ఇంట్లో నేను ప్రశాంతంగా ఉంటాను అనే భావన కూడా చాలామంది వ్యక్తపరుస్తుంటారు.

వీటికి తోడు శని-ఆదివారం పత్రికలలో వచ్చే ‘ఈఎంఐ ద్వారా ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పుడు అద్దె ఎందుకు కట్టాలి’ అనే ప్రకటనలు కూడా సొంత ఇల్లు లేకపోతే ఏదో కోల్పోతున్నాం అనే భావనను పెంపొందిస్తాయి.

అపార్ట్‌మెంట్స్

ఫొటో సోర్స్, Reuters

ఎమోషన్‌కు చోటు లేదు

కానీ పర్సనల్ ఫైనాన్స్ సూత్రాల ప్రకారం డబ్బుకు సంబంధించిన ఏ విషయంలో అయినా ఎలాంటి భావోద్వేగాలకు చోటు లేదు. ఇలా పరస్పర విరుద్ధంగా కనిపించే ఎన్నో అంశాలు సొంత ఇంటి విషయంలో ఉన్నాయి. ఈ గందరగోళంతో ఇబ్బంది పడే సగటు మధ్య తరగతి ప్రజలు పర్సనల్ ఫైనాన్స్ సూత్రాల ప్రకారం ఎలా నడుచుకోవాలో చూద్దాం.

పైన చెప్పినట్టు పర్సనల్ ఫైనాన్స్ సూత్రాల ప్రకారం ఏ ఆర్థిక లక్ష్యానికి కూడా భావోద్వేగాలను ఆపాదించకూడదు. అన్ని ఆర్థిక లక్ష్యాలకు సమానమైన ప్రాముఖ్యత ఇవ్వాలి. సొంత ఇల్లు అనే ఆర్థిక లక్ష్యం కోసం మరో ఆర్థిక లక్ష్యాన్ని అశ్రద్ధ చేస్తున్నామా అని విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి.

ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే సొంత ఇంటి నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలి లేదా తక్కువ మొత్తంలో ఇల్లు కొనే అవకాశం ఉందేమో పరిశీలించాలి.

ఇల్లు ఒక మదుపు మార్గం లాగా వాడుకోవడం కోసం కొనేవారు ఇంటి అద్దె సదరు ప్రాంతాలలో ఎలా పెరుగుతుందో గమనించాలి. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా కొన్నేళ్ళ తర్వాత అద్దె ఎక్కువగా పెరగదు.

వార్షిక వృద్ధి, ద్రవ్యోల్బణం కంటే తక్కువ ఉంటే అది మంచి మదుపు మార్గం కాదు. ఎందుకంటే ఆ ఇంటి గృహరుణం వడ్డీ, ద్రవ్యోల్బణం కంటే కచ్చితంగా ఎక్కువే ఉంటుంది.

ఇంటి నిర్మాణం

ఫొటో సోర్స్, Getty Images

అద్దెను ఈఎంఐ మాదిరిగా కట్టొచ్చా?

అద్దె కట్టే మొత్తాన్ని ఈఎంఐ లాగా కట్టి ఇంటిని సొంతం చేసుకోవచ్చు అనేది కేవలం మార్కెటింగ్ అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అద్దె కంటే ఇంటి ఈఎంఐ కచ్చితంగా ఎక్కువగా ఉంటుంది.

ప్రస్తుతం కట్టే అద్దె మోతాదులో మాత్రమే ఈఎంఐ ఉండాలి అంటే శివారు ప్రాంతాలలో సదుపాయాలు అంతగా లేని ప్రాంతాలలో దొరకచ్చు లేదా ఇంటి ధరలో కనీసం 50% ముందే చెల్లించాల్సి రావచ్చు.

అన్ని మదుపు మార్గాలు లేదా ఖర్చుల లాగే సొంత ఇల్లు కూడా ఎంత త్వరగా కొంటే అంత డబ్బు ఆదా అవుతుంది. ఈఎంఐ భారం లేని జీవితం ఆర్థిక స్వావలంబనకు మొదటి మెట్టు అని గుర్తుంచుకోవాలి.

కొన్నాళ్ళ పాటూ (ఉదాహరణకు ఐదేళ్ళు) ఈక్విటీ మదుపు మార్గాలలో మదుపు చేసి ఆ తర్వాత ఇల్లు కొనడం ద్వారా ఈఎంఐ భారం తగ్గించుకోవచ్చు అనే వాదన ఇటీవలి కాలంలో వినిపిస్తోంది. కానీ ఈ వాదనలో అనిశ్చితి ఎక్కువ తద్వారా రాబడి రిస్క్ ఎక్కువ. అటు ఈక్విటీ మార్గంలో వచ్చే లాభం, ఇటు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా మారతాయో చెప్పలేం.

మరోవైపు సొంత ఇల్లు కాకుండా ఎప్పటికీ అద్దె ఇంట్లోనే ఉండటం మేలు అనుకునేవారు రిటైర్మెంట్ కోసం చేసే మదుపు విషయంలో ఇంటి అద్దె కూడా కలుపుకుని రిటైర్మెంట్ సమయానికి కావలసిన మొత్తాన్ని లెక్కించాలి.

ఇల్లు కొనాలనుకునే ఉద్యోగులు ఇంటి ధరలో అధిక భాగం గృహరుణం తీసుకుని తర్వాత ఈఎంఐ రూపం బ్యాంకులో జమ చేస్తారు. సొంత ఇల్లు అనే నిర్ణయం మంచిదా కాదా అని బేరీజు వేయడానికి గృహరుణం ఎలాంటిది అనే విషయం చాలా అవసరం. ఇప్పుడు గృహరుణం తీసుకునే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి చూద్దాం.

చాలా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు గృహరుణాలు అందిస్తాయి. ప్రస్తుతం గృహరుణాల మీద ఏడాదికి వడ్డీ 8.5% అటు ఇటుగా ఉంది. రెపో రేటు మీద ఇది ఆధారపడి ఉంటుంది. తక్కువ రెపో రేటు ఉన్న సమయంలో లోను తీసుకోవడం ద్వారా మనం బ్యాంకులో జమ చేయాల్సిన వడ్డీ తగ్గించుకోవచ్చు.

గత ఏడాదిగా రెపోరేటు పెరుగుతూ ఉండటం వల్ల గృహరుణల మీద వడ్డీ కూడా పెరుగుతూ పోతోంది. 2022 జూన్‌లో 5.4% ఉన్న రెపో రేటు ఇప్పుడు 6.5 శాతంగా ఉంది. దాంతో 2022లో 8 శాతం ఉన్న ఎస్‌బీఐ హోం లోన్ వడ్డీ రేటు, ఇప్పుడు 9.4 శాతం వరకు పెరిగింది. కస్టమర్ల సిబిల్ స్కోర్ అనుగుణంగా ఈ వడ్డీ రేట్లలో కొంత మార్పులు ఉండచ్చు.

అపార్ట్‌మెంట్స్ వద్ద నీళ్లు తీసుకెళ్తున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ప్రీ పేమెంట్

వడ్డీ మాత్రమే కాక బ్యాంకులు అనేక నిబంధనలు విధిస్తాయి. అవన్నీ జాగ్రత్తగా పరిశీలించి అన్ని విధాలా లాభదాయకంగా ఉండే సంస్థలో లోను తీసుకోవాలి.

వడ్డీ రేట్లతో పాటు గమనించాల్సిన మరొక ముఖ్య విషయం ప్రీ పేమెంట్. అంటే గృహరుణం కాలపరిమితి దాటకముందే సేవింగ్స్ ఇతర మార్గాల ద్వారా ఆ రుణాన్ని పుర్తిగా జమ చేయడం. చాలా బ్యాంకులు మొదటి ఐదు లేదా ఏడేళ్ళల్లో గృహరుణం తీరుస్తామంటే ఎంతో కొంత పెనాల్టీ విధిస్తారు. ఇది కొంత ఇబ్బందికర పరిణామం కానీ వడ్డీ రేటు తక్కువగా ఉంటే ఇలాంటి బ్యాంక్ అయినా పరిగణించవచ్చు.

కొన్ని బ్యాంకులు గృహరుణం తీసుకున్న వారి పేరు మీద ఒక సేవింగ్స్ అకౌంట్ సృష్టించి అందులో ఉండే మొత్తాన్ని గృహరుణం మొత్తంలో మినహాయించుకుని వడ్డీ లెక్క వేస్తారు. ఇది చాలా మంచి సదుపాయం ఎందుకంటే మనం తీసుకున్న గృహరుణానికి పూర్తి మొత్తం ఎప్పుడూ వడ్డీ కట్టే పరిస్థితి ఉండదు.

గృహరుణంతో పాటూ బ్యాంకులు కస్టమర్లకు ఆ ఇంటికి బీమా పాలసీని కూడా అమ్మే ప్రయత్నం చేస్తాయి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గృహరుణానికి తోడుగా బీమా తీసుకోవాలనే నియమం ఐఆర్‌డీఏ లేదా ఆర్‌బీఐ నిబంధనల్లో లేదు.

కానీ చాలా బ్యాంకులు ఈ విషయంలో కస్టమర్లకు బీమా ఉంటే రక్షణ ఉంటుందని చెప్పి పాలసీ అమ్ముతుంటారు. నిజానికి ఇవి కస్టమర్లకు అంత లాభసాటి కాదు. ఎందుకంటే వ్యక్తిగత టర్మ్ పాలసీ కోసం కట్టే ప్రీమియం ఈ గృహరుణం మీద తీసుకునే బీమా పాలసీతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ సొంత ఇల్లు తీసుకోవడం వల్ల కుటుంబం మీద భారం పడుతుంది అనుకుంటే అప్పుడు ప్రస్తుతం ఉన్న టర్మ్ పాలసీ మీద టాపప్ తీసుకోవడం మంచిది.

గమనిక: ఈ కథనం పాఠకుల్లో అవగాహన కల్పించడానికే మాత్రమే. నిర్ణయాలు తీసుకునే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)