ఒకటో తరగతికి ఆరేళ్లకు పైగా వయసు తప్పనిసరి..ఈ నిర్ణయంపై నిపుణులు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒకటో తరగతిలో పిల్లలను చేర్పించేందుకు కనీస వయసు ఆరేళ్లకు పైబడి ఉండాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.
ఇది అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కువ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని విద్యా వేత్తలు అంటున్నారు.
ఏపీ, తెలంగాణలలో చాలా మంది తల్లిదండ్రులు ఐదేళ్ల వయసులోనే పిల్లలను ఒకటో తరగతిలో చేర్పిస్తుంటారు.
రెండు, రెండున్నరేళ్ల వయసులో నర్సరీతో ప్రీస్కూలింగ్ చదువు మొదలవుతోంది. తర్వాత అయిదేళ్ల వయసులోనే ఒకటో తరగతిలో చేర్పిస్తున్నారు.
ఇది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదని, గత కొన్నేళ్లుగా మన సమాజంలో భాగమైపోయిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పిల్లలను ఒక సంవత్సరం ముందుగా స్కూల్స్‌లో చేర్పిస్తే వాళ్ల ఉన్నత చదువులు ఏడాది ముందుగానే పూర్తవుతాయి.
కాబట్టి, పోటీ పరీక్షలకు ఉండే వయసు పరిమితి విషయంలో వారికి ఏడాది కలిసి వస్తుంది. త్వరగా ఉద్యోగాలు కూడా వస్తాయి అన్న ఆలోచన తల్లిదండ్రులలో ఉందని ఉపాధ్యాయులంటున్నారు.
ఈ విషయంపై హైదరాబాద్ కు చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వి.పద్మప్రియ బీబీసీతో మాట్లాడారు.
‘‘మన సమాజంలో పిల్లలను ఎంత త్వరగా బడికి పంపిస్తే అంత ఎక్కువ నేర్చుకుంటారనే భావన ఉంది. రెండేళ్లకే అంగన్‌వాడీ, ప్రీ ప్రైమరీలో చేర్పిస్తుంటాం. కానీ, చిన్నతనంలో పిల్లలు తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్‌తో గడిపితే బంధాలు గట్టిపడతాయని గ్రహించాలి. ఫిన్‌లాండ్ వంటి దేశాలలో ఏడేళ్ల వయసులో ప్రాథమిక విద్యలో చేర్పిస్తుంటారు. అక్కడ విద్యా వ్యవస్థ సక్సెస్ కూడా అయ్యింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వయసు నిబంధన తీసుకువచ్చినా, మన సమాజంలో పరిస్థితుల దృష్ట్యా తల్లిదండ్రులు ఎంత వరకు అంగీకారంతో ఉంటారనేది చూడాలి.’’ అని పద్మప్రియ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏపీ తెలంగాణాల్లో ఏం జరుగుతోంది..?
తెలుగు రాష్ట్రాలలో విద్య పేరుతో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోందని విద్యా రంగ నిపుణులు చెబుతున్నారు. అందుకే వయసును పట్టించుకోకుండా ప్రీస్కూలింగ్ దశలోనే పిల్లలను చేర్పించుకుంటున్నారని అన్నారు.
రెండేళ్ల వయసులోనే ప్లే గ్రూప్, నర్సరీ వంటి సెక్షన్లు తీసుకువచ్చి వీలైనంత ఎక్కువ సంఖ్యలో పిల్లలను చేర్పించుకుంటున్నారు.
ఒకటో తరగతికి ఐదేళ్ల వయసులోనే చేరుతున్నారు. పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంటే అదనపు సెక్షన్లు పెట్టి చేర్చుకుంటున్నారు.
2021-22 యూనిఫైడ్ డిస్ర్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్(యూడైస్) లెక్కల ప్రకారం ఏపీలో అన్ని మేనేజ్‌మెంట్లలో కలిపి 61,948 స్కూళ్లు ఉన్నాయి. తెలంగాణలో 43,083 స్కూళ్లు ఉన్నాయి.
ఇవికాకుండా ఏపీ, తెలంగాణలో కలిపి వేల సంఖ్యలో ప్రీప్రైమరీ స్కూళ్లు నడుస్తున్నాయి.
ప్రస్తుతం కొన్ని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో వయసు నిబంధన అమలు చేస్తున్నారు. ఆన్ లైన్లో దరఖాస్తు చేసే సమయంలోనే కిండర్ గార్టెన్‌లో చేరేందుకు నాలుగేళ్లుగా నిర్ణయించి దరఖాస్తు తీసుకుంటున్నారు. దీని ప్రకారం ఒకటో తరగతిలోకి వచ్చేసరికి ఆరేళ్లు ఉండాలనే నిబంధన అమలు చేస్తున్నారు.
వయసు విషయంలో కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలేవీ లేకపోవడంతో ప్రభుత్వ, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో అయిదేళ్లకే చేర్చుకుంటున్నారని విద్యా రంగ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మరీ నష్టమేమీ ఉండదని కూడా అంటున్నారు.
ఈ వ్యవహారం విద్యారంగ నిపుణుడు, ఏపీ శాసనమండలి సభ్యుడు వి.బాల సుబ్రహ్మణ్యం బీబీసీతో మాట్లాడారు.
‘‘ఆరేళ్ల వయసు ఉండాలనే నిబంధన అనేది ఇప్పటికే కర్ణాటక వంటి రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏ వయసులో ప్రారంభిస్తే మంచిదనే లోతైన చర్చ జరగాలి. ఆరేళ్లు దాటితేనే బాగుంటుంది. దానివల్ల పిల్లల్లో మెచ్యురిటీ స్థాయిలు పెరుగుతాయి. ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం చేసిన ఆరేళ్ల వయసు సూచన తప్పనిసరిగా అమలు చేయాలనేమీ రాష్ట్రాలకు ఉండదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టంపై ఆధారపడి ఉంటాయి. ఈ విషయంలో ముందుగానే రాష్ట్రాలతో చర్చిస్తే బాగుండేది.’’ అని బాల సుబ్రహ్మణ్యం చెప్పారు. జాతీయ విద్యా విధానంలోనూ ఆరేళ్ల వయసు ప్రస్తావన ఉందని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
జాతీయ విద్యా విధానం ఏం చెబుతోంది..?
ప్రస్తుతం మన దేశంలో 10-2 విద్యా విధానం అమలవుతోంది. 2020లో తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానంలో ప్రాథమిక, ఉన్నత విద్యలో 5-3-3-4 విధానం ప్రతిపాదించింది.
ఇందులో మూడేళ్ల ప్రీ స్కూలింగ్ విద్య, రెండేళ్ల ప్రాథమిక విద్య తరగతులు ఉన్నాయి.
పిల్లలు ఒకటో తరగతిలో చేరే వయసు ఆరేళ్లుగా ఉండాలని జాతీయ విద్యా విధానం ప్రతిపాదించింది. ఇది అమల్లోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచిపోయాయి. నేటికీ చాలా రాష్ట్రాలు అమలు చేయడం లేదు.
ముఖ్యంగా తెలంగాణ, ఏపీలో కొన్ని విద్యా సంస్థలలో మినహా మెజార్టీ విద్యా సంస్థలలో పాటించడం లేదు. దీనికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపించకపోవడమే కారణమని నిపుణులు చెబుతున్నారు.
అయితే.. ఆరేళ్ల వయసు అన్న రూల్‌ని గతంలో సుప్రీంకోర్టు సైతం సమర్థించింది. గతేడాది కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఆరేళ్ల వయసు ఉండాలని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
దీనిపై దిల్లీకి చెందిన కొందరు తల్లిదండ్రులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. దిల్లీ హైకోర్టు చెప్పినట్లుగా ఒకటో తరగతికి ఆరేళ్ల వయసు ఉండాల్సిందేనని గతేడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ప్రస్తుతం కేంద్ర సూచనను పరిగణనలోకి తీసుకుంటే జాతీయ విద్యా విధానం ప్రకారం స్కూలింగ్ మొదలవుతుంది.
దీనిపై స్లేట్ విద్యా సంస్థల అధినేత వాసిరెడ్డి అమర్ నాథ్ బీబీసీతో మాట్లాడారు. ‘‘పాఠశాలలో చేరిన మొదటి అయిదేళ్లు ఎంతో కీలకమని జాతీయ విద్యా విధానం చెప్పింది. మూడేళ్ల వయసు నుంచి కొత్త భాష నేర్చుకునేందుకు పిల్లల మేధస్సు ఆసక్తి చూపుతుంది. తాజాగా కేంద్రం సూచన ప్రకారం ఒకటో తరగతిలో చేరే సరికే ఫౌండేషన్ కోర్సు పిల్లలు పూర్తి చేసి ఉంటారు. ఏపీ, తెలంగాణలో తప్పనిసరిగా పూర్వ ప్రాథమిక విద్యపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లలోనూ ఈ పూర్వ ప్రాథమిక విద్య తీసుకురావాల్సిన అవసరం ఏర్పడుతుంది.’’ అని అమర్ నాథ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మానసిక భారం తగ్గుతుందా..?
ఆరేళ్ల వయసు నిబంధనను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తే పిల్లలపై పసితనంలోనే పడే హోంవర్కుల భారం తగ్గుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు.
పిల్లల విషయంలో ఏడాది కాలం పెరిగితే.. మెచ్యురిటీ లెవెల్స్ పెరుగుతాయని అంటున్నారు.
పిల్లలకు ఉపశమనం కలిగి.. మానసికంగా భారం తగ్గే అవకాశం ఉందని తెలంగాణ విద్యాశాఖ హైదరాబాద్ ప్రాంతీయ సంచాలకురాలు విజయలక్ష్మి బీబీసీకి చెప్పారు.
‘‘ఆరేళ్ల తర్వాతే పిల్లలను చేర్పించాలనే నిబంధన పిల్లలకు మేలు చేసేదిగానే భావించాలి. పుస్తకాల పరంగా భారం తగ్గే అవకాశం ఉంది. వయసు ప్రకారం విద్యలోనూ ఎదుగుదల కనిపిస్తుంది.’’ అని విజయలక్ష్మి అన్నారు.
ఇదే విషయంపై ప్రముఖ చైల్డ్ సైకాలజిస్టు చల్లా గీత భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘చిన్నతనంలో పిల్లల మేధో ఎదుగుల చాలా వేగంగా జరుగుతుంది. అలాంటి సమయంలో ఏడాదిపాటు ఆలస్యంగా పాఠశాలకు పంపించడం కారణంగా సోషల్ స్కిల్స్ తగ్గుతాయి. స్టిమ్యులేషన్ తగ్గిపోతుంది. ఇంట్లో అందరూ స్టిమ్యులేషన్ ఇవ్వలేరు. అదే పాఠశాలలో మాట్లాడిస్తూ ప్రోత్సహిస్తూ ఉంటారు. స్మార్ట్ నెస్ అనేది ఆలస్యంగా మొదలవుతుందని నా అభిప్రాయం’’ అని చల్లా గీత అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రష్యా, యుక్రెయిన్ యుద్ధంలో పుతిన్ ఫెయిలయ్యారా... అసలు ఆయన టార్గెట్ ఏంటి?
- ఏజ్ ఆఫ్ కన్సెంట్: సెక్స్‌కు సమ్మతి తెలపాలంటే కనీస వయసు ఎంత ఉండాలి?
- అదానీ గ్రూప్ నుంచి భారీ ధరలకు ‘విద్యుత్ కొనుగోలు’ ఒప్పందం... ఇరకాటంలో బంగ్లాదేశ్
- తుర్కియే-సిరియా: భూకంప బాధితులు ఎందుకు సరిహద్దులకు వస్తున్నారు?– బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- రోహిణీ సింధూరి-రూపా మౌద్గిల్: ఈ ఇద్దరు మహిళా ఆఫీసర్ల మధ్య గొడవేంటి, కర్ణాటక ప్రభుత్వం ఏం చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














