డబ్బులు మదుపు చేస్తున్నారు సరే... తగిన రాబడి వస్తోందా లేదా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఐవీబీ కార్తికేయ
- హోదా, బీబీసీ కోసం
ఆర్థికస్వావలంబన అనే విషయానికి అనేక అర్థాలు ఉన్నాయి.
వాటిలో ఒకటి ఆర్థిక లక్ష్యాలకు తగిన సమయంలో అవసరానికి సరిపడినంత నగదు అందుబాటులో ఉండటం.
మదుపరులు చేసే ప్రతీ మదుపుకు అనుబంధంగా ఒక ఆర్థిక లక్ష్యం ఉండాలి. పెట్టిన మదుపు పనితీరు అంచనా వేయడానికి ప్రధానమైన కొలమానం.. మదుపుపై వస్తున్న రాబడి, మన ఆర్థిక లక్ష్యాలకు సరిపోతుందా లేదా అనేది మాత్రమే.
ఒక థియరీగా ఈ విషయం చాలాసరళంగా సూటిగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ దీనిలో కూడా ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి. అవి అర్థం చేసుకుని తగిన ప్రణాళిక ప్రకారం మదుపు చేయాలి.
ఈ విషయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఒక ఉదాహరణ చూద్దాం.
ఒక మదుపు లక్ష్యం 2030 సంవత్సరంలో వచ్చే ఒక పది లక్షల ఖర్చు అనుకుందాం. ఆ ఆర్థిక లక్ష్యం కోసం 12% వడ్డీ ఇచ్చే మదుపు మార్గంలో ప్రతీ నెలా ఎనిమిది వేల రూపాయలు మదుపు చేస్తున్నారు. మీ లెక్కల ప్రకారం, ఈ మదుపు వల్ల 2030లో పది లక్షలకు పైగా మొత్తం అందుబాటులోకి రావాలి.
కానీ, కొన్ని పరిస్థితుల్లో కొన్ని అడ్డంకులు ఎదురై రావాల్సిన మొత్తం తగ్గే అవకాశం ఉంది. అలాంటి అడ్డంకులు ఎందుకు వస్తాయి, వాటిని ఎలా అధిగమించాలి అనే అవగాహన కీలకం.
ఈ నేపథ్యంలో, మూడు విషయాలు మన రాబడి మీద ప్రభావం చూపుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
1. మార్కెట్ రిస్క్, మదుపులో ఉండే రిస్క్
రిస్క్ లేని మదుపు అంటూ లేదు. కాబట్టి మనం చేసే ప్రతీ మదుపు మీదా ఎంతో కొంత రిస్క్ ఉంటుందని గుర్తుంచుకోవాలి.
పైన చెప్పిన ఉదాహరణలో 12% వడ్డీ అనే ఊహతో మదుపు ప్రణాళిక రూపొందించాం. కానీ, నిజానికి అంత వడ్డీ వస్తుందా లేదా అనేది ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి.
వడ్డీ రేట్లలో తరచుగా మార్పులు జరుగుతుంటాయి. ఉదాహరణకు ఎల్‌ఐసీ పాలసీలలో గతంలో వచ్చిన రాబడి ప్రస్తుతం రావడం లేదు.
మనం మదుపు చేసే మార్గంలో ఒడిదొడుకులు ఎక్కువగా ఉన్నాయేమో అర్థం చేసుకోవాలి. అధిక రాబడి ఇచ్చే మదుపు మార్గాలు సహజంగా అధిక రిస్క్ కలిగి ఉంటాయి.
స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అధిక రాబడిని ఇస్తాయి కానీ, అధిక రిస్క్ కూడా ఉంటుంది. ఈ రిస్క్ వల్ల మనకు అవసరం అయిన సమయానికి తగినంత మొత్తం అందకపోతే మన ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోలేం.
ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మన ఆర్థిక లక్ష్యం దగ్గరయ్యే కొద్ది అధిక రిస్క్ ఉన్నమదుపు మార్గం నుంచీ తక్కువ రిస్క్ ఉన్న మార్గానికి మారాలి.
పైన చెప్పిన ఉదాహరణలో 2030 సంవత్సరానికి కావలసిన మొత్తం కోసం 2028 దాకా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మదుపు చేసి, ఆ తర్వాత మల్టి క్యాప్ లాంటి తక్కువ రిస్క్ ఉన్న మదుపు మార్గాల్లోకి వెళ్లడం మేలు.
ఇలా చేయడం వలన 2028-2030 మధ్యలో మార్కెట్ డౌన్ అయినా మనకు అవసరం అయిన సమయానికి మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంటుంది.
కొందరు ఫైనాన్షియల్ ప్లానర్స్ ప్రకారం, మన ఆర్థిక లక్ష్యానికి మూడేళ్ళ ముందు నుంచీ ఈక్విటీ సంబంధిత మార్గాలలో మదుపు చేయకుండా, డెబిట్ ఫండ్ లాంటి తక్కువ రిస్క్ ఉన్న మార్గాల్లో మదుపుచేయాలి.
ఈ సూచనకు అర్థం ఏంటంటే, ఈక్విటీలో ఉన్న మదుపు నుంచి బయటకు రావాలని కాదు. అలా చేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్, ఆదాయ పన్ను రెండూ చెల్లించాల్సి వస్తుంది.
మనకు అవసరం అయిన సమయానికి కంటే ఆరు నుంచి ముడు నెలల ముందే కావలసినంత పైకం సమకూరితే వెంటనే మన మదుపు వెనక్కుతీసుకోవాలి.
ఎందుకంటే సాధారణంగా స్టాక్ మర్కెట్ డౌన్ అయ్యాక మళ్ళీ పుంజుకోవడానికి ఆరు నెలల సమయం పడుతుంది.
2020 కోవిడ్ సంక్షోభం సమయంలో ఆరు నెలల్లో స్టాక్ మార్కెట్ కోలుకుంది. 2008 రిసెషన్ సమయంలో పదకొండు నెలల తర్వాత మార్కెట్ కోలుకుంది.
మరోవైపు మనకు అవసరం అయిన సమయం కంటే ముందే వెనక్కు తీసుకుంటే మనబ్యాంక్ ఖాతాలో ఉన్న మొత్తానికి మన ఆదాయపు పన్ను స్లాబుల ప్రకారం పన్ను చెల్లించాలి.
అంటే 2030లో మనకు కావలసిన మొత్తం 2028లో వెనక్కు తీసుకుని బ్యాంక్ ఖాతాలో పెట్టుకుంటే ఆ మొత్తం మీద మన ఆదాయపు పన్ను స్లాబు ప్రకారం అంటే కొంత మొత్తానికి 30% ఆదాయపు పన్ను రెండేళ్ళ పాటూ చెల్లించాలి.
అటు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ ఇటు ఆదాయపు పన్ను ఈ రెండూ మరీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఈ రెండు టాక్స్ మార్గాలలో మనకు ఏది తక్కువ అయితే ఆ రకంగా ముందువెళ్ళాలి.
ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం 10% కంటే తక్కువలో ఉంటే అప్పుడు బుల్ మార్కెట్ ఉన్నప్పుడు మదుపు వెనక్కు తీసుకుని అకౌంట్లో ఉంచడం మేలు.
కానీ 30% ఆదాయపు పన్ను స్లాబులో ఉన్నవాళ్ళు వీలైనంత తక్కువ సమయం మదుపు ద్వారా వచ్చిన మొత్తం మన బ్యాంక్ అకౌంట్లో ఉండేలా చూసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
2. ద్రవ్యోల్బణం
చాపకింద నీరులా మన రాబడి మీద ప్రభావం చూపే అతి పెద్ద అంశం ఇది. ఆర్థిక లక్ష్యాన్నినిర్దేశించుకునే సమయంలోనే గరిష్టంగా ఎంత ద్రవ్యోల్బణం ఉండచ్చో చూసుకోవాలి.
ఉదాహరణకు ప్రస్తుతం 6% ఉన్న ద్రవ్యోల్బణం 8% దాటితే మనం ప్రస్తుతం చేసే మదుపు సరిపోదు. కాబట్టి వీలైనంత త్వరగా మదుపుచేయడం మొదలు పెట్టాలి లేదా మదుపు మొత్తాన్నిపెంచే అవకాశం ఉండేలా చూడాలి.
పైన చెప్పిన ఉదాహరణలోద్రవ్యోల్బణం పెరిగితే మనకు కావలసిన మొత్తం 10 లక్షల నుంచి పద మూడు లక్షల దాకా చేరుకుంటుంది. అలాంటప్పుడు ప్రతి నెలా ఎనిమిది వేలకు బదులు పదివేలు మదుపు చేయాసిన అవసరం వస్తుంది.
3. ప్రభుత్వానికి కట్టే పన్ను
స్టాక్ మార్కెట్లో చేసే మదుపు మీద ప్రస్తుతం 10% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ ఉంది.
పైన చెప్పిన ఉదాహరణలో ఎనిమిది వేల రూపాయల మదుపు ఏడేళ్ళ పాటూ చేస్తే ఆరులక్షల డెబ్బై రెండు వేలు అసలు... దానిమీద వచ్చే వడ్డీ మూడు లక్షల ఎనభైవేలు.
ఈ వడ్డీ మొత్తంలో లక్ష రూపాయలు తీసేసి మిగిలిన మొత్తం మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ కట్టాలి. అంటే ఈ మదుపు మీద దాదాపు ఇరవై ఎనిమిది వేలరూపాయలు టాక్స్ కట్టాలి.
ఈ టాక్స్ మొత్తాన్నిమినహాయించుకున్నాక కూడా మనకు అందే మొత్తం పది లక్షలు ఉంటే అప్పుడే మన ఆర్థిక లక్ష్యాన్నిఅందుకున్నట్టు లెక్క.
ఇవి కూడా చదవండి:
- సంక్రాంతి సంబరాలకు భీమవరం కేరాఫ్ అడ్రస్ అని ఎందుకు అంటారు?
- అఫ్గానిస్తాన్: 'సూపర్ కార్' తయారుచేసిన అఫ్గాన్ టెకీ, తాలిబాన్ పాలనలో ఇదెలా సాధ్యమైంది?
- స్మార్ట్ఫోన్ తయారీలో చైనా ఆధిపత్యానికి భారత్ బ్రేక్ వేయగలదా?
- గంగా విలాస్ క్రూయిజ్: డిజైన్ చేసింది తెలుగు మహిళ.. మోదీ ప్రారంభించిన ఈ షిప్ ప్రత్యేకతలేమిటి? విమర్శలు ఎందుకు?
- యుక్రెయిన్: యుద్ధ క్షేత్రంలో కొడుకు మృతదేహాన్ని ఈ తల్లి ఎలా కనిపెట్టారు?















