కూనో అభయారణ్యం: గిర్ సింహాల కోసం సిద్ధం చేసిన ఆవాసంలో ఆఫ్రికా చీతాల నివాసం.. నిర్వాసితులైన ఆదివాసీ జనం

- రచయిత, సల్మాన్ రావీ
- హోదా, బీబీసీ ప్రతినిధి, కునో నుంచి
కొన్ని కచ్చా ఇళ్లు, కొన్ని పక్కా ఇళ్లు ఉన్న ఈ బస్తీకి రావడానికి సిమెంట్ రోడ్డు వేశారు. కానీ, ఆ రోడ్డు పొడవు సుమారు 100 మీటర్లకు అటూఇటుగా ఉంటుంది.
ఆ 100 మీటర్లు దాటిన తర్వాత చూస్తే గతుకుల రోడ్డుపై మురుగునీరు నిలిచి ఉండటం కనిపిస్తుంది.
బస్తీలో ఉన్న 105 ఇళ్లలో చాలావరకు మహిళలు వరి కోత కోసం దూరంగా ఉండే ఇతర గ్రామాలకు వెళ్లారు. దుమ్ము, ధూళితో నిండిన పిల్లలు ఆడుకుంటుండగా, కొంతమంది పురుషుల బృందం పాతీ సహరియా అనే వ్యక్తికి చెందిన ఒక దుకాణం మంది కూర్చొని ఉన్నారు.
పాతీ సహరియా ఒక గిరిజనుడు. 20 ఏళ్ల క్రితం, కూనో అభయారణ్యం అడవుల్లో నివసించిన వందలాది మంది గిరిజనుల్లో ఆయన ఒకరు. అప్పుడు ఆయన నివసించిన గ్రామం, ఈ అడవిలోనే ఉండేది.
అప్పుడే ఒక ప్రాజెక్టును రూపొందించారు. గుజరాత్ గిర్ అడవుల్లోని కొన్ని ఆసియా సింహాలను అంటే బబ్బర్ సింహాలను కూనో అడవుల్లోకి తరలించి వాటికి అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేయాలనేది ఈ ప్రాజెక్టు ఉద్దేశం.
ఈ సింహాలకు కూనో అభయారణ్యంలో ఆవాసం కల్పించడం కోసం, అక్కడ నివసిచే సహరియా గిరిజనులను మరో చోటుకు తరలించాలని ప్రతిపాదించారు.

దిగ్విజయ్ సింగ్, నరేంద్ర మోదీ పాత్ర
మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్న సమయంలో ఈ ప్రతిపాదన వచ్చింది.
మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి కావడానికి కొద్ది కాలం ముందు, 1999లో ఈ ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి.
పనులు మొదలు కాగానే అక్కడి 28 గ్రామాల్లోని సహరియా తెగతో పాటు ఇతర తెగలకు చెందిన గిరిజనులు నిర్వాసితులయ్యారు. ఈ ప్రక్రియ 2003 వరకు కొనసాగింది.
అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కూడా కూనో అడవుల నుంచి తరలి వెళ్లేందుకు నిర్వాసిత గ్రామ ప్రజలను ఒప్పించింది.
మధ్యప్రదేశ్ అటవీ శాఖ అధికారి జస్వీర్ సింగ్ చౌహాన్, బీబీసీతో మాట్లాడుతూ, ‘‘స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పునరావాస ప్యాకేజ్‌ను రూపొందించారని’’ అని చెప్పారు.
పునరావాస ప్యాకేజీలో నగదు ఇవ్వడం లేదా భూమికి భూమి ఇవ్వడం అనే రెండు నిబంధనలను పెట్టారని ఆయన వివరించారు.
నగదు ఎంపిక చేసుకున్న ప్రతీ కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున అందజేయాలని అందులో పేర్కొన్నారు.
ఒకవేళ భూమికి బదులుగా భూమి కావాలని కోరిన ప్రతీ కుటుంబానికి రెండు హెక్టార్ల భూమి ఇచ్చినట్లు ఆయన చెప్పారు.

కూనో అభయారణ్యం నుంచి నిర్వాసితులైన సహరియా, బీల్ తెగ గిరిజనులతో పాటు ఇతర తెగల వారికి కూడా ఈ ప్యాకేజీ కిందే పరిహారాన్ని అందించారు.
గిరిజనులు పునరావాసం పొందిన చోట విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు, రహదారులు, వైద్యం, సాగు కోసం నీటి ఏర్పాట్లు చేసినట్లు చౌహాన్ చెప్పారు.
నిర్వాసితులు స్థిరపడేందుకు ఆగ్రా, పౌరీ, కర్హల్, సెసైపురి, చెటీఖోడా, విజయ్‌పుర్ ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు.
ఇదంతా జరిగిన 20 ఏళ్ల తర్వాత, ఇప్పటికీ కూనో అడవిలో ఒకే ఒక గ్రామం మిగిలి ఉంది. ఆ గ్రామం పేరు బాగ్చా. ఈ గ్రామ ప్రజలను వేరే చోటుకు తరలించే ప్రక్రియ అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. కానీ, వారిని తరలించడం కోసం ప్రత్యామ్నాయ స్థలం లభించకపోవడంతో వారు ఇంకా అక్కడే ఉన్నారు.

గిరిజనులను తరలించారు.. కానీ, సింహాల జాడ లేదు
గిరిజనులను తరలించే ప్రక్రియ పూర్తయి ఇరవై ఏళ్లు దాటింది. కానీ, గిర్ అడవుల నుంచి సింహాలు ఇప్పటికీ కూనోకు రాలేదు. గుజరాత్‌లోని అప్పటి నరేంద్ర మోదీ ప్రభుత్వం వాటిని కూనోకు పంపడానికి నిరాకరించింది.
'ఆసియా సింహాలు' గుజరాత్‌లోని గిర్ అడవుల్లో మాత్రమే ఉన్నాయని భారత వన్యప్రాణి సంస్థ, ప్రభుత్వానికి తెలిపింది.
వాటిలో ఏదైనా వ్యాధి వ్యాపించినా లేదా వాటి జనాభా తగ్గినా అవి త్వరగా అంతరించిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సింహాలలో కొన్నింటికి వేరే అటవీ ప్రాంతంలో పునరావాసం కల్పించి రక్షించాలని అనుకున్నారు.
మధ్యప్రదేశ్‌లోని కూనో అడవులు, అక్కడి వాతావరణం ఈ సింహాలకు అనుకూలమైనదని వన్యప్రాణి సంస్థ గుర్తించింది.

గిర్ అడవుల నుంచి సింహాలను తీసుకొచ్చే ప్రాజెక్టును మూడు దశల్లో అమలు చేయాలని నిర్ణయించారు.
2000 సంవత్సరం నాటికి సన్నాహాలు, 2005 నాటికి కూనో అడవులకు సింహాల బదిలీ, 2015 నాటికి వాటి సంఖ్యను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కానీ, గుజరాత్ ప్రభుత్వం ఈ సింహాలను మధ్యప్రదేశ్‌కు పంపడానికి నిరాకరించింది.
1985 వరకు గిర్ అడవుల్లో ఈ సింహాల సంఖ్య 191గా ఉందని, 2000 నాటికి వాటి సంఖ్య 400కి పెరిగిందని, కాబట్టి వాటిని గిర్‌లోనే ఉండనివ్వాలని గుజరాత్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ గొడవ సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. దాదాపు పదేళ్లు ఇందులోనే గడిచిపోయాయి
2022 నాటికి అడవులలో స్థిరపడిన ప్రజలను వేరేచోటుకి తరలించారు. ఈ జనాభాలో 90 శాతం గిరిజనులు, 10 శాతం ఇతర వెనుకబడిన తరగతుల వారు ఉన్నారు.
చాలా మంది గిరిజనులు, తిరిగి అడవిలోకి వెళ్లిపోయారు. కానీ, వారిని మళ్లీ అడవిని ఖాళీ చేయించారు.

కొత్త ప్రాంతాల్లో గిరిజనుల ఇబ్బందులు
కూనో అభయారణ్యం విస్తీర్ణం 345 చదరపు కిలోమీటర్లు ఉన్న సమయంలో గిర్ అడవుల్లోని సింహాలను ఇక్కడికి తీసుకురావడంపై చర్చ జరిగిందని మధ్యప్రదేశ్ చీఫ్ ఫారెస్ట్ అధికారి జస్వీర్ సింగ్ అన్నారు.
"ఈ అభయారణ్యం లోపల 24 గ్రామాలు ఉండేవి. అందులోని ప్రజలందరినీ తరలించారు. ఈ ప్రాంతాన్ని సింహాల కోసం సిద్ధం చేయడం ప్రారంభించారు. 2018లో దీన్ని జాతీయ పార్కుగా అప్‌గ్రేడ్ చేశారు. ఇప్పుడు ఇది 750 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ వైశాల్యంలో విస్తరించి ఉంది’’ అని ఆయన వివరించారు.
పునరావాస ప్యాకేజీతో గిరిజనులను తప్పుదోవ పట్టించడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించిందని పాల్పూర్‌లోని జరోడా గ్రామానికి చెందిన బైస్రామ్ సహరియా అన్నారు.
‘‘ఒక్కొక్కటిగా మా గ్రామాలను ఖాళీ చేయించారు. 9.5 బిగాల భూమి ఇచ్చారు. లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి రూ. 36,000 నగదు ఇచ్చారు. విద్యుత్, రహదారులు, కలప తోటల ప్లాంటేషన్ కోసం మాకు ఇవ్వాల్సిన డబ్బు నుంచి కట్ చేశారు.
సాగు కోసం త్రీఫేజ్ కరెంట్ ఇవ్వాలి. దానికి కూడా మా నష్టపరిహారం సొమ్ములోనే కోత విధించారు. వారు ఇచ్చిన 36 వేల నష్టపరిహారంతో ఒక మరుగుదొడ్డిని కూడా కట్టలేం. ఇల్లు ఎలా కట్టుకోగలం?’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గిరిజనులు నిర్వాసితులుగా మారి 22 ఏళ్లు గడుస్తున్నప్పటికీ నష్టపరిహారంగా ఎవరికి భూమి ఇచ్చారో ఇప్పటికీ తనకు తెలియదని బైస్రామ్ అన్నారు.
రూ. 36,000 నగదు పరిహారాన్ని కూడా ఏకమొత్తంగా ఇవ్వలేదని నిర్వాసిత గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఒకసారి 5000, మరోసారి 2000, ఇలా విడతల వారీగా పరిహారం ఇచ్చారని, అది ఎలా ఖర్చయిందో కూడా తెలియదని బైస్రామ్ అన్నారు.

పౌరా పాల్‌పూర్‌కు చెందిన రామ్ చరణ్ సహారియాకు అడవిలోని తన గ్రామంలో నివసించినప్పుడు 40 బిగాల భూమితో పాటు పది ఆవులు, ఇతర పశువులు ఉండేవి. అడవి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు తనకు ఏమీ మిగల్లేదని ఆయన వాపోతున్నారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ, ‘‘నేను పశువులను మేపుకుంటూ నా పిల్లలను పోషించేవాడిని. అప్పుడు నా జీవితం బాగుండేది. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి, సాగుకు పనికిరాని రాళ్ల నేలను అంటగట్టారు. ఇప్పుడు మా పిల్లలు మాకు వాటా ఇవ్వండి అని అడుగుతున్నారు. 9 బిగాల భూమిలో నేను బతకాలా? వారికి వాటాలు ఇవ్వాలా? నా జీవితం గందరగోళంగా తయారైంది. మాది పెద్ద కుటుంబం. ఈ తొమ్మిది బిగాల భూమిలో నేనేం చేయగలను. రాళ్ల పొలంలో నాగలి కూడా దిగట్లేదు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏది ఏమైనప్పటికీ, నిర్వాసితులైన గిరిజనులంతా సంతోషంగా ఉన్నారని, గత 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్వీర్ సింగ్ చౌహాన్ ఈ వాదనలు చేశారు.

వన్యప్రాణుల రక్షణ కోసం పనిచేసే కార్యకర్త అజయ్ దూబే మాట్లాడుతూ, ‘‘సింహాల కోసం ఆవాసాన్ని సిద్ధం చేశారు. కానీ, ఇందులో ఇప్పుడు చీతాలు ఆనందిస్తాయి’’ అని అన్నారు.
దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి తీసుకొచ్చిన 20 చీతాల కోసం కూనోకు ఆనుకొని ఉన్న ఇతర గ్రామాలను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఫొటో సోర్స్, @narendramodi
ఇవి కూడా చదవండి:
- ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకుంటే ఏమవుతుంది?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














