ఉత్తర కొరియా- కిమ్ జోంగ్ ఉన్: మిలిటరీ గొప్పలు, ప్రచార యావ ప్రజలను ఆకలి చావులవైపు నడిపిస్తున్నాయా?

కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, KCNA

    • రచయిత, కెల్లీ ఎన్జీ
    • హోదా, బీబీసీ న్యూస్

ఉత్తర కొరియా తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని నిపుణులు అంటున్నారు.

దీర్ఘకాలిక ఆహారకొరత ఆ దేశానికి కొత్తేమీ కాదు. కానీ, ఇటీవలి సంవత్సరాల్లో విధించిన సరిహద్దు నియంత్రణలు, దుర్భర వాతావరణ పరిస్థితులు, ఆంక్షలు అక్కడి పరిస్థితిని మరింత దిగజార్చాయి.

వ్యవసాయ విధానంలో చేయాల్సిన ఆవశ్యక మార్పుల గురించి చర్చించడం కోసం ఫిబ్రవరి నెలాఖరులో ఉన్నత అధికారులు సమావేశం కానున్నారని అక్కడి అధికారిక మీడియా తెలిపింది.

ఉత్తర కొరియా రైతులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియాకు దీర్ఘకాలిక ఆహార కొరత కొత్తేమీ కాదు

వ్యవసాయ సమస్యలను ఎత్తి చూపడానికి ఇది అత్యంత కీలకమైన, అత్యంత అవసరమైన సమావేశం అని వార్తా సంస్థ కేసీఎన్‌ఏ పేర్కొంది.

ప్యాంగ్‌యాంగ్ తన మిలిటరీ బల ప్రదర్శనను కొనసాగిస్తున్న తరుణంలో అక్కడి వ్యవసాయం, ఆహార సంక్షోభానికి సంబంధించిన వార్తలు వచ్చాయి.

ఒక అధికారిక వార్తా పత్రిక, విదేశీ సహాయాన్ని విషం కలిపిన క్యాండీగా పోల్చింది. అందుతున్న సహాయాన్ని సామ్రాజ్యవాదులు దేశాన్ని దోచుకోవడానికి, అణిచివేయడానికి ఉపయోగించారని రాండాంగ్ సిన్మన్ బుధవారం రాశారు.

వార్షిక నాటు కార్యక్రమం

ఫొటో సోర్స్, KIM WON JIN

ఫొటో క్యాప్షన్, 2019 నాంఫో సిటీలో జరిగిన వరి నాటు కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు

ఆహార కొరతపై హెచ్చరికలు జారీ చేసిన దక్షిణ కొరియా యూనిఫికేషన్ మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) నుంచి సహాయాన్ని కోరింది.

2021 కంటే 2022లో ఉత్తర కొరియా 1,80,000 టన్నుల ఆహారాన్ని తక్కువగా ఉత్పత్తి చేసిందని దక్షిణ కొరియా అధికారుల వద్ద ఉన్న ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి.

కరవు, వరదలు వంటి తీవ్రమైన దుర్భర వాతావరణ పరిస్థితుల కారణంగా చలికాలం, వసంతకాలంలో పంటల దిగుబడి తక్కువగా ఉంటుందని జూన్‌లోనే డబ్ల్యూఎఫ్‌పీ ఆందోళన వ్యక్తం చేసింది.

దేశం రికార్డు స్థాయిలో రెండో అత్యంత దారుణమైన కరవు పరిస్థితులను ఎదుర్కొంటుందని గత ఏడాది చివర్లోనే అధికారిక మీడియాలో కథనాలు వచ్చాయి.

‘‘అంచనా వేసినట్లుగా ఈ ఏడాది ఆహార ధరలు అమాంతం పెరిగాయి. ప్రజలు చవకైన ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు’’ అని 38నార్త్.ఆర్గ్ అనే పబ్లికేషన్ సంస్థలో పనిచేసే బెంజమిన్ కజెఫ్ సిల్బర్‌స్టెన్ అన్నారు.

ఉత్తర కొరియా మిలిటరీ ప్రదర్శన

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మిలిటరీపైనే ఉత్తర కొరియా ఎక్కువగా ఖర్చు చేస్తుంది

2023 ప్రారంభంలో మొక్కజొన్న ధరలు 20 శాతం పెరిగాయని జపాన్‌లోని ఉత్తర కొరియా మ్యాగజీన్ రింజిన్ గాంగ్ పేర్కొంది.

‘‘ప్రజలు ఎక్కువగా మొక్కజొన్నను కొనుగోలు చేస్తున్నారంటే, బియ్యం వంటి ప్రధాన ఆహార దినుసుల ధరలు బాగా పెరిగినట్లు అర్థం’’ అని బెంజమిన్ చెప్పారు.

ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఉత్తర కొరియా కూడా ఒకటి. 2015లో ఉత్తర కొరియా స్థూల దేశీయోత్పత్తి సుమారు 1700 డాలర్లుగా సీఐఏ వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ అంచనా వేసింది. కానీ, ఇటీవల ఇది మరింత తక్కువ అయినట్లు అంచనా.

పారదర్శకత లేని ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థను బట్టి చూస్తే వాస్తవ పరిస్థితులు మరింత అస్పష్టంగా ఉన్నాయని పేర్కొంది.

‘‘ఉత్తర కొరియా అమలు చేసిన కఠినమైన కోవిడ్ సరిహద్దు ఆంక్షల కారణంగా, దేశంలో అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయో తనిఖీ చేసే అవకాశం బయటి వ్యక్తులు ఎవరికీ లభించలేదు’’ అని ఎన్‌కే న్యూస్ విశ్లేషకుడు జేమ్స్ ఫ్రెట్‌వెల్ అన్నారు.

ఈ చర్యలు, ఉత్తర కొరియా వెలుపల ఉన్న సంస్థలు సంక్షోభ సమయాల్లో సహాయం పంపడాన్ని కష్టతరం చేశాయని జేమ్స్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఉత్తర కొరియా: కరోనా లాక్‌డౌన్ నియమాలతో అక్కడి ప్రజలకు తిండి దొరకడం లేదు

2019 మే 12న నాంఫో సిటీలో జరిగిన వార్షిక వరి నాటే కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొన్నారు.

2020 జనవరి నుంచి సరిహద్దు వాణిజ్యం, ట్రాఫిక్‌పై ఉత్తర కొరియా కఠిన ఆంక్షలు విధించింది.

మహమ్మారి సమయంలో ఉత్తర కొరియా పాలకులు తీసుకున్న చర్యలు ‘విపరీతమైనవి, మతిలేనివి’ అని ఉత్తర కొరియాలోని లింక్ అనే స్వచ్ఛంద సంస్థ దక్షిణ కొరియా డైరెక్టర్ సొకీల్ పార్క్ అన్నారు.

ఉత్తర అమెరికా శరణార్థులకు అమెరికాలో లేదా దక్షిణ కొరియాలో పునరావాసం కల్పించడంలో పార్క్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ పనిచేస్తుంది.

మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి ఉత్తర అమెరికాలో ప్రాథమిక అవసరాలైన వస్తువుల సరఫరా తగ్గిపోయిందని పార్క్ అన్నారు.

ఆకలి చావులకు సంబంధించిన అనేక విశ్వసనీయమైన కథనాలు తమ సంస్థ దృష్టికి వచ్చినట్లు పార్క్ చెప్పారు.

ఉత్తర కొరియాకు అంతర్జాతీయ సమాజం నుంచి లభించే మానవతా సహాయం కూడా గణనీయంగా తగ్గింది.

‘‘గత ఏడాది ఉత్తర కొరియా ఇతర ఏజెన్సీలు, అంతర్జాతీయ సంస్థల నుంచి 2.3 మిలియన్ డాలర్ల మానవతా సహాయాన్ని అందుకుంది. 2021 కంటే ఇది 14 మిలియన్ డాలర్లు తక్కువ’’ అని ఐక్యరాజ్యసమితికి చెందిన హ్యుమానిటేరియన్ అఫైర్స్ కార్యాలయం వెల్లడించింది.

సుదీర్ఘ కాలం సరిహద్దులను మూసివేయడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు. రెచ్చగొట్టేలా ఉన్న ఉత్తర కొరియా సైనిక చర్యలకు ప్రతిస్పందనగా అంతర్జాతీయ ఆంక్షలు కఠినతరం అయ్యాయి. మానవతా సామగ్రి పంపిణీకి దీనివల్ల కూడా ఆటంకం కలిగిందని కొంతమంది రిలీఫ్ వర్కర్లు, బీబీసీకి చెప్పారు.

సరిహద్దు ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ ప్రారంభం అవుతున్నట్లు కొన్ని సంకేతాలు ఉన్నాయి. ఉత్తర కొరియా వాణిజ్యంలో 90 శాతానిపైగా ట్రక్కుల ద్వారానే జరుగుతుంది. ట్రక్కుల రవాణాను పునరుద్ధరించారని గత వారం నిక్కీ ఆసియా సంస్థ నివేదించింది.

దీంతో ఇక ఉత్తర కొరియాలోని సాధారణ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అనుకోలేం.

వీడియో క్యాప్షన్, ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ కన్నా ఆయన సోదరి 'కిమ్ యో జోంగ్' మరీ డేంజరా?

ఉత్తర కొరియా ఎక్కువ భాగం మిలిటరీ కోసం ఖర్చు చేస్తుంది. ఫిబ్రవరి నెల ప్రారంభంలో తాజా క్షిపణి లాంచర్లను ఉత్తర కొరియా ప్రదర్శించింది.

మిలిటరీ పరాక్రమాన్ని ప్రదర్శించడం, ప్రచారం కోసమే ఉత్తర కొరియా తన వనరులు అన్నింటినీ వినియోగిస్తుందని పార్క్ అన్నారు.

గత ఏడాది ఉత్తర కొరియా రికార్డు స్థాయిలో 70కి పైగా క్షిపణులను ప్రయోగించింది. వీటిలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, అమెరికా భూభూగాన్ని చేరుకోగల సామర్థ్యం ఉన్న ఐసీబీఎంలు ఉన్నాయి.

ఈ నెల ప్రారంభంలో జరిగిన మిలిటరీ పరేడ్‌లో భారీ స్థాయిలో ఐసీబీఎంలను ప్రదర్శించింది.

‘‘ఉత్తర కొరియాలో సాధారణ పౌరులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని అక్కడి పాలన యంత్రాంగం అంగీకరించింది. కానీ, కిమ్ కుటుంబం కోసం ప్రచారం, క్షిపణి ప్రయోగాలు, జనాలపై కఠిన ఆంక్షలు వంటి అంశాలకే ప్రాధాన్యత ఇస్తోంది’’ అని పార్క్ అన్నారు.

క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరింత దిగజారుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

1990లలో దేశం ఎదుర్కొన్నటువంటి వినాశకరమైన కరవు దిశగా మరోసారి దేశం ప్రయాణిస్తుందని వారు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

‘‘మేం, 1990ల్లో సంభవించిన కరవు పరిస్థితులకు దగ్గరగా ఉన్నట్లు కనిపించడం లేదు. కానీ, పరిస్థితులు ఎప్పుడైనా అదుపు తప్పొచ్చు. ఆహార సరఫరా కొద్దిగా తగ్గినా కూడా భయంకరమైన పరిణామాలు తలెత్తవచ్చు’’ అని బెంజమిన్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)