కులవివక్షను నిషేధిస్తూ సియాటెల్ చేసిన చట్టం దక్షిణాసియా దేశాలను వేలెత్తి చూపిస్తోందా?

సియాటెల్ క్షమ

ఫొటో సోర్స్, SCREENGRAB/SEATTLE CHANNEL

ఫొటో క్యాప్షన్, క్షమ
    • రచయిత, సవిత పటేల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికాలోని సియాటెల్ నగరం కుల వివక్షను అధికారికంగా నిషేధించింది. మంగళవారం స్థానిక కౌన్సిల్‌లో జరిగిన ఓటింగ్ అనంతరం కుల వివక్షను నిషేధించిన మొదటి అమెరికా నగరంగా సియాటెల్ నిలిచింది.

ఓటింగ్‌కు ముందు పలువురు దక్షిణాసియా వాసులు తమ అనుభవాలను కౌన్సిల్ సభ్యులతో పంచుకునేందుకు గంటల వ్యవధి క్యూలో నిల్చున్నారు.

వారిలో విద్యావేత్త ప్రేమ్ పరియార్ కూడా ఒకరు. 2015లో అఘాయిత్యాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు తన కుటుంబంపై అగ్రవర్ణాల వ్యక్తులు దాడి చేయడంతో తాను నేపాల్ నుంచి అమెరికాకు పారిపోయి వచ్చానని గుర్తుచేసుకున్నారు.

కులం కారణంగా ఎదుర్కొన్న వివక్ష అక్కడితో ఆగిపోలేదన్నారు పరియార్. ఒకసారి కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ఉన్న స్నేహితుడు ఇంటికి భోజనానికి ఆహ్వానించారని పరియార్ చెప్పారు.

"భోజనానికి కూర్చునే ప్రదేశం కూడా కులం ఆధారంగా ఉంటుందని నేను వెళ్లడానికి సంకోచించాను. కానీ, మానవ హక్కులకు విలువ ఇచ్చే దేశంలో ప్రజలు చదువుకున్నవారు కావడం వల్ల ఇక్కడ భిన్నంగా ఉంటుందనుకున్నా.

వారు భోజనం వడ్డించే సమయంలో దేనినీ ముట్టుకోవద్దని కోరారని, మరొకరు ఒక ప్లేట్ ఆహారాన్ని వడ్డించారు " అని పరియార్ గుర్తుచేసుకున్నారు.

పరియార్

ఫొటో సోర్స్, PREM PARIYAR

కుల వివక్షపై వేళ్లన్నీ దక్షిణాసియాపైనే

భారత్, నేపాల్‌ సహా దక్షిణాసియా దేశాలలో మనుగడలో ఉన్న పురాతన సామాజిక వివక్ష రూపాలలో కుల వ్యవస్థ ఒకటి.

భారతదేశంలో దళితులు (గతంలో అంటరానివారని పిలిచేవారు), ఇతర నిమ్న కులాలను చరిత్రాత్మకంగా వెనుకబడిన వర్గాలుగా పరిగణించారు. వారికి కోటాలు, వివక్ష వ్యతిరేక చట్టాల రూపంలో రాజ్యాంగపరమైన రక్షణలను అందించాయి.

దళిత ఉద్యమకారులు, విద్యావేత్తలు పాశ్చాత్య దేశాలలో, ముఖ్యంగా అమెరికాలో కూడా ఇటువంటి గుర్తింపు అవసరమని భావించారు. వారిలో చాలామంది కులం, దాని సంక్లిష్టతలపై అవగాహన కల్పించడానికి ఏళ్లుగా కృషి చేస్తున్నారు.

అందుకే సియాటెల్ తన వివక్ష వ్యతిరేక చట్టాలకు కులాన్ని జోడించడం ఒక మైలురాయిగా వారు అంటున్నారు.

పరియార్ తన స్నేహితుడి ఇంట్లో జరిగిన సంఘటన నేపాల్‌లో తన చిన్ననాటి సంఘటన గుర్తుకు తెచ్చిందని చెప్పారు. పరియార్ తక్కువ కులానికి చెందినవాడని తెలుసుకున్న ఆయన టీచర్ తాగుతున్న నీటిని ఉమ్మివేశారని తెలిపారు.

అమెరికాలో విద్యార్థిగా, అతిపెద్ద ప్రభుత్వ విశ్వవిద్యాలయ వ్యవస్థ అయిన కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ (కాల్ స్టేట్) నుంచి కుల వివక్షకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పరియార్ కీలక పాత్ర పోషించారు.

గత ఏడాది ఈ విశ్వవిద్యాలయం కులాన్ని రక్షిత కేటగిరీగా చేర్చడాన్ని ఆమోదించింది.

సియాటెల్

ఫొటో సోర్స్, PREM PARIYAR

'కులం అనేది హిందువుల సమస్యే కాదు'

షహీరా బంగర్ (పేరు మార్చాం) సియాటెల్‌లో కుల వివక్షను నిషేధించే ప్రచారానికి ప్రజలను సమీకరించడంలో సహాయపడ్డారు.

ఆమె అభిప్రాయం ప్రకారం కులం అనేది కేవలం "హిందూ" సమస్య మాత్రమే కాదు. చాలా దక్షిణాసియా మతాలను ఇది ప్రభావితం చేస్తుంది. ఆమె తల్లిదండ్రులు ఇండియాలోని పంజాబ్ నుంచి వలస వచ్చిన సిక్కులు. కాలిఫోర్నియాలో ఉంటున్నారు.

బంగర్ తండ్రి ఆయన ఆఫీసులో తన ఇంటిపేరును "దళితునిగా బహిష్కరించడం మానుకోండి" అని రాసుకున్నారు. అగ్రవర్ణ సిక్కులు హాజరయ్యే పెద్ద గురుద్వారాలో "భిన్నంగా" వ్యవహరించడంతో, బంగర్ కుటుంబం కూడా దళితులు నిర్వహించే ఆలయానికి వెళ్లడం ప్రారంభించింది. బంగర్ కాలిఫోర్నియాలోని ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడు వివక్ష అనుభవం ఎదురైందని చెప్పారు.

"నేను అప్పటి నా బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లాను. నా గురించి ఆమె తల్లి 'ఆమె కుటుంబం చామర్స్' అని పలికారు. అది కూడా భయంకరమైన రీతిలో" అని ఆమె గుర్తుచేసుకున్నారు.

చామర్ అనేది జంతువుల తోలుతో పనులు చేసే దళితులను వర్ణించడానికి ఉపయోగించే కుల పదం.

పేరు విని ఇల్లు అద్దెకు ఇవ్వలేదు

శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా నివాసి భీమ్ నారాయణ్ బిశ్వకర్మ తన అనుభవాన్ని పంచుకుంటూ ''దక్షిణాసియా యజమాని తన పూర్తి పేరు విన్న తర్వాత గదిని అద్దెకు ఇవ్వడానికి సందేహించారు'' అన్నారు.

ఇంటిపేర్లు తరచుగా కులానికి సూచికలు. "ఆయన అసౌకర్యంగా ఉన్నట్లు, నాకు ఆయన కళ్లల్లో కనిపించింది" అని బిశ్వకర్మ వివరించారు.

గది అద్దె ఒప్పందం రద్దు చేసుకోవడానికి సాకులు వెతుకుతూ, దళిత వ్యక్తిని ఉండటానికి అనుమతిస్తే బయటకు వెళతామని ఇతర అద్దెదారులు బెదిరించినట్లు చెప్పారు.

కనిష్క ఎలుపుల హార్వర్డ్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ కోసం కులం, తరగతిపై పరిశోధన చేస్తున్నారు. ఈ సందర్భంగా తన దక్షిణాసియా సహచరులు తనను ఉన్నత కులానికి చెందిన వ్యక్తినని అనుకున్నారని, దళిత వ్యక్తి హార్వర్డ్‌లో ఉంటారనుకోలేదని కనిష్క గుర్తుచేసుకున్నారు.

వాళ్లు కులాలను పట్టించుకోమని అనుకుంటారని, అయితే, ఏళ్లుగా తమ అధికారాల కోసం ఒక విధమైన వివక్షను పాటిస్తారని ఆరోపించారు.

ఈక్వాలిటీ ల్యాబ్స్. అమెరికాలో కుల వివక్షపై విస్తృతంగా పోరాడుతున్న పౌర హక్కుల సంస్థ. సీయాటెల్ చట్టానికి మద్దతునిచ్చిన అనేక దళిత, పౌర హక్కుల గ్రూపులలో ఇదొకటి.

కుల వివక్షపై సియాటెల్ ఓటింగ్ అనంతరం ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తేన్మొళి సౌందరరాజన్ తన సందేశంలో "మొదట సియాటెల్, ఇప్పుడు దేశం!" అని తెలిపారు. అయితే, అందరూ చట్టానికి మద్దతు ఇవ్వలేదు.

సియాటెల్

ఫొటో సోర్స్, Getty Images

సియాటెల్ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

అనేక భారతీయ-అమెరికన్ గ్రూపులు ఆర్డినెన్స్ చట్టంగా మారడానికి ముందు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రత్యేకమైన న్యాయ పరిశీలన ద్వారా భారతీయ, దక్షిణాసియా సంఘాలను లక్ష్యంగా చేసుకున్నాయని వాదించాయి.

హిందూ అమెరికన్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుహాగ్ శుక్లా మాట్లాడుతూ కుల వివక్ష తప్పని, ప్రధాన హిందూ సూత్రాలను ఇది ఉల్లంఘిస్తుందని వ్యాఖ్యానించారు.

కానీ, కొత్త చట్టం ఒక సందేశాన్ని పంపిందని, జనాభాలో 2 శాతం కంటే తక్కువ ఉన్న తమ కమ్యూనిటీని పోలీసు చట్టంలో ప్రత్యేకంగా గుర్తించడం ద్వారా అది ప్రతికూలత చూపుతుందని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. వారి పురోగతికి అది వెనుకడుగుగా భావించారు.

ఈ గ్రూప్ చట్టపరంగా ఇతర మార్గాలను అన్వేషించాలనుకుంటోంది. వారు ప్రస్తుతం కాలిఫోర్నియా స్టేట్‌ వర్సిటీపై ఫెడరల్ కోర్టులో దావా వేస్తున్నారు.

'వివక్ష రహిత విధానం'లో కులాన్ని వర్సిటీ చేర్చడంపై సవాలు చేయడంలో సాయం చేస్తున్నారు. ఈ నిర్ణయం ఆ వర్గాన్ని వేరు చేస్తుందని, దాన్ని లక్ష్యంగా చేసుకుంటారని వాదిస్తోంది.

దాదాపు 100 సంస్థలు, పలు వ్యాపార సంస్థలు కూడా ఈ వారం సియాటెల్ సిటీ కౌన్సిల్‌కి లేఖలు రాశాయి. ఈ చట్టం దక్షిణాసియా సమాజం పౌర హక్కులను ఉల్లంఘిస్తుందని వాదిస్తూ కుల శాసనాన్ని వ్యతిరేకించాలని కోరింది.

ఇది దక్షిణాసియావాసులను ఉద్యోగాల కోసం పరిగణించే అవకాశాలు తగ్గిస్తాయని కొందరు అనుమానం వ్యక్తం చేశారు.

ఆర్డినెన్స్‌ను ప్రతిపాదించిన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన భారతీయ-అమెరికన్, నగర కౌన్సిల్ సభ్యులు క్షమా సావంత్ ఓటు వేయడానికి ముందు తమ పని ఇప్పుడే ప్రారంభమైందని చెప్పారు.

"ఇది నిజంగా సంచలనాత్మక చట్టం, ఇది దేశవ్యాప్తంగా కౌన్సిల్‌లు, కమ్యూనిటీలకు దారిచూపుతుంది" అని క్షమ ఆశాభావం వ్యక్తంచేశారు.

సౌందరరాజన్ ఇప్పుడు తమ సంస్థలో చేరాలనుకునే వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్‌లో మునిగిపోయానని అంటున్నారు.

"సాంస్కృతిక యుద్ధం"లో దళితులు విజయం సాధించారు. ఈ పరిస్థితి గురించి బహిరంగంగా మాట్లాడటానికి అధిక సంఖ్యలో దక్షిణాసియా వాసులు ముందుకు వచ్చారు.

మేం తిరిగి వెనక్కి వెళ్లాలనుకోవడం లేదు'' అని క్షమ స్పష్టంచేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)