దళితుడినన్న కారణంతో తన నుంచి ఫుడ్ తీసుకోలేదని కస్టమర్‌పై ఆరోపణలు చేసిన జొమాటో డెలివరీ బాయ్-ఎఫ్ఐఆర్ లో ఏముంది?

జొమాటో డెలివెరీ బాయ్

ఫొటో సోర్స్, SOPA Images

ఫొటో క్యాప్షన్, జొమాటో డెలివెరీ బాయ్
    • రచయిత, అనంత్ ఝణాణే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లఖ్‌నవూలో జొమాటో ఫుడ్ డెలివరీ యాప్‌లో ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకునేందుకు ఒక కస్టమర్ నిరాకరించారని, ఇందుకు తాను దళితుడిని కావడమే కారణమని డెలివరీ బాయ్ ఆరోపించారు. ఫుడ్ తీసుకునేందుకు నిరాకరించడం మాత్రమే కాకుండా తనను దూషించి, ముఖంపై నములుతున్న పొగాకును ఉమ్మారని, తన పై చేయి కూడా చేసుకున్నారని ఆ డెలివరీ బాయ్ అన్నారు.

ఎఫ్‌ఐఆర్ లో ఏముంది?

ఈ సంఘటన జూన్ 18న జరిగింది. ఈ కేసులో నమోదైన వివరాల ప్రకారం:

జొమాటో డెలివరీ బాయ్ వినీత్ కుమార్ రావత్ లఖ్‌నవూలోని ఆషియానా ప్రాంతంలో జొమాటో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నారు. ఆయన శనివారం సాయంత్రం ఆషియానాలోని సెక్టార్ హెచ్ లో నివాసముంటున్న అజయ్ సింగ్ ఇంటికి డెలివరీ ఇచ్చేందుకు వెళ్లారు.

ఆర్డర్ ను అందించేందుకు అజయ్ సింగ్ ఇంటికి వెళ్లి బెల్ కొట్టగానే, ఒక వ్యక్తి బయటకు వచ్చి డెలివరీ బాయ్‌ని పేరు అడిగినట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. డెలివరీ బాయ్ వినీత్ తన పూర్తి పేరును చెప్పారు. పేరు చెప్పగానే, నిందిస్తూ, దళితులు తెచ్చిన ఆహారాన్ని ఎలా తీసుకుంటామని తిడుతూ మాట్లాడారని ఈ కేసు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

"మీకు కావాలంటే ఫుడ్ తీసుకోండి, లేదా క్యాన్సిల్ చేయండి" అని తాను చెప్పినట్లు వినీత్ వెల్లడించారు.

"అలా అనగానే, అవతలి వ్యక్తి నా ముఖం పై పొగాకు ఉమ్మాడు. ఏం చేస్తున్నారని అడగగానే, నన్ను దూషించడం మొదలుపెట్టారు. నేను ఎదురు తిరగ్గానే, లోపల నుంచి 10-12 మంది గుర్తు తెలియని వ్యక్తులు బయటకు వచ్చి కర్రలతో కొట్టారు" అని వినీత్ చెప్పారు.

అక్కడ నుంచి ఎలాగో ఒకలా తప్పించుకుని ప్రాణాలు కాపాకాడుకున్నానని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులే వెళ్లి తన వాహనాన్ని వెనక్కి తీసుకొచ్చినట్లు వినీత్ వెల్లడించారు.

ఈ కేసు ఎఫ్ఐఆర్ లో ఇద్దరు వ్యక్తులపైనా, 12 మంది గుర్తు తెలియని వ్యక్తులను కూడా పేర్కొన్నారు.

ఆషియానా

ఫొటో సోర్స్, ramesh verma/bbc

ఫొటో క్యాప్షన్, ఆషియానా

"నాకు అజయ్ సింగ్ అనే వ్యక్తి నుంచి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ డెలివరీ చేయడానికి అడ్రస్ కోసం కాల్ చేస్తే, ఆయన పని అబ్బాయిని పంపిస్తానని చెప్పారు. పని అబ్బాయి కంటే ముందు అజయ్ సోదరుడు బయటకు వచ్చారు. ఆయన తన పేరు అభయ్ సింగ్ అని చెప్పారు. మత్తులో ఉన్న ఆయన నా ముఖం పై ఉమ్మారు. ఎందుకు ఉమ్మారని ప్రశ్నించగానే, మిగిలిన వారు కర్రలతో లోపలి నుంచి వచ్చారు" అని వినీత్ బీబీసీకి చెప్పారు.

"నా పేరును అడిగినప్పుడు పూర్తి పేరు చెప్పాను. ఎక్కడ ఉంటానని అడిగినప్పుడు, పాసీ కోట దగ్గర ఉంటానని చెప్పాను. దళితులు పట్టుకున్న ఆహారాన్ని ఎలా తినమంటామని అంటూ నా తల పై కొట్టారు. నేనప్పుడు హెల్మెట్ ధరించి ఉన్నాను" అని వినీత్ చెప్పారు.

జరిగిన విషయాన్ని తన న్యాయవాదికి చెప్పి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. "చాలా ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం వెళ్లాను. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగుపెట్టాను. లేదంటే, నన్ను చంపేసి ఉండేవారు" అని వినీత్ అన్నారు.

ఈ ఘటన పై పోలీసులు మొత్తం 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రత్యక్షంగా ఈ ఘటనతో సంబంధం ఉన్న వారిపై ఎస్.సి/ఎస్.టి చట్టంలోని సెక్షన్ 3 (2) (వి) కింద కేసు నమోదు చేశారు.

ఈ ఘటన పై విచారణ కొనసాగుతున్నట్లు లఖ్‌నవూ ఈస్ట్ డీసీపీ అమిత్ కుమార్ ఆనంద్ తెలిపారు.

విచారణలో వెలుగు చూసిన నిజాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని డీసీపీ అన్నారు. తాను షెడ్యూల్డ్ కులానికి చెందినవాడిని కావడంతో, విచారణను ఆ కోణం నుంచి చేయాలని ఫిర్యాదుదారుడు కోరుతున్నట్లు డీసీపీ వెల్లడించారు. అయితే, తమ ఇంట్లో దళిత యువతి పని చేస్తోందని, తాము వివక్ష చూపేవాళ్లంకాదని నిందితులు చెప్పినట్లు డీసీపీ వెల్లడించారు.

వీడియో క్యాప్షన్, చాయ్ తాగడం తగ్గిస్తే ఆర్థికవ్యవస్థ మెరుగుపడొచ్చన్న పాకిస్తాన్ మంత్రి

ఆరోపణలు ఎదుర్కొంటున్న అజయ్ సింగ్ ఏం చెబుతున్నారు?

"నా పూర్తి పేరు అజయ్ సింగ్ గంగ్‌వార్ . నేను ఓబీసీ వర్గానికి చెందినవాడిని. మా ఇంట్లో కూడా ఒక ఎస్‌సి అమ్మాయి పని చేస్తోంది. ఆమె మా పిల్లలను చూసుకుంటుంది. వారికి అన్నం తినిపిస్తుంది. వంట చేస్తుంది. ఆమె కూడా వినీత్ కులానికి చెందిన అమ్మాయే. మా పై కుల వివక్ష చూపించినట్లు ఆరోపణలు చేయడం ఆధారరహితం" అని అజయ్ సింగ్ అన్నారు.

"మేము విద్యావంతులం. స్విగ్గీ, జొమాటో నుంచి ఎవరైనా కులాన్ని అడిగి పార్సిల్ తీసుకుంటారా? వాళ్ళు డెలివరీ ఇస్తున్నారు. కానీ, ఆ వంట చేస్తున్నదెవరో మాకు తెలుసా?" అని ప్రశ్నించారు. "గత రెండున్నరేళ్లుగా నా జొమాటో, స్విగ్గీ రికార్డు చూడండి. ఫుడ్ డెలివెరీ కోసం ఎంత మంది వచ్చి ఉంటారు? మా మీద ఎప్పుడైనా ఫిర్యాదు ఉందా?" అని ఆయన ప్రశ్నించారు.

తన వాదనను సమర్ధించుకునేందుకు ఆ ఇంట్లో ఎవరూ కుల వివక్షను ఎన్నడూ చూపించలేదంటూ, అజయ్ సింగ్ తమ ఇంట్లో పని చేసే అమ్మాయి మాట్లాడుతున్న వీడియోను చూపించారు. "మా మధ్య గొడవ జరిగింది. కానీ, డెలివరీ అబ్బాయి అనకూడని మాట అనడంతో గొడవ మొదలయింది. దీంతో నేను కాలర్ పట్టుకున్నాను. ఆయన మమ్మల్ని వెనక్కి తోశారు. మేము కూడా ఆయనను వెనక్కి తోసాం. దాంతో ఆయన ఒక కట్టెల మోపు పై పడ్డారు. ఆయన వెనక్కి రాగానే, తిరిగి గొడవ మొదలయింది" అన్నారు అజయ్ సింగ్.

"ఆ తర్వాత పోలీసులు నేరుగా రాలేదు. ముందు 112 సిబ్బంది వచ్చారు. మేమేదైనా చేసుంటే వాళ్లు పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వెళ్లేవారు. మరి వారెందుకు వదిలిపెట్టారు. ఈ దారిలో వెళ్లేవారిని నా సంబంధీకులని చెప్పారు. నా కుటుంబం చాలా చిన్నది. మా ఇంట్లో కేవలం నలుగురుమే ఉంటాం’’ అన్నారాయన.

"మేము ఫుడ్ ఆర్డర్ చేశాం. ఆ ఆర్డర్ తీసుకునేందుకు నేను ఇంట్లో లేను. మా తమ్ముడు కార్ పార్క్ చేసేందుకు వచ్చినప్పుడు ఆయన నోటిలో పొగాకు ఉంది. పొగాకు ఉమ్ముతుండగా ఆ ఉమ్ము డెలివెరీ బాయ్ పై కూడా పడింది. దాంతో, "నువ్వు గుడ్డివాడివా, నీకు కళ్లు కనిపించటం లేదా" అని డెలివరీ బాయ్ అడిగారు’’ అని అజయ్ సింగ్ అన్నారు.

"వాళ్లు ముఖం పై ఉమ్మినట్లు ఆరోపిస్తున్నారు. కానీ, అలా ఉమ్మితే, షర్టు పై మరకలు ఉండవా ? 112కు ఫిర్యాదు చేసేటప్పటికి ఆయన అదే షర్ట్ ధరించి ఉన్నారు. మా తమ్ముడు ముఖం పై ఉమ్మినట్లయితే, వారి షర్టు పై కూడా మరకలుండాలి కదా అని నేను 112 సిబ్బందిని అడిగాను. వారు ఆ మరకను చూపించలేకపోయారు. ఆ తర్వాత 112 సిబ్బంది వెళ్లిపోయారు" అని అజయ్ సింగ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)