బైరి నరేశ్ మీద పోలీస్ జీపులో ఉండగానే దాడి... దీనిపై పోలీసులు బీబీసీతో ఏమన్నారు?

బైరి నరేశ్

ఫొటో సోర్స్, BITCELL/TWITTER

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు సామాన్యులు పరిగెత్తేది పోలీసుల దగ్గరకే. పోలీస్ స్టేషన్‌కి వెళితే దాడుల నుంచి రక్షణ కలుగుతుందని నమ్మకం.

అందుకే ప్రాణాపాయం ఉన్నవారు, దాడి జరుగుతుందనే భయం ఉన్నవారు పోలీసుల దగ్గరకు వెళతారు. కానీ, పోలీసుల భద్రతలో ఉన్న వారి మీదే పోలీసుల సమక్షంలోనే దాడి జరిగితే?

తెలంగాణలో ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. దాంతో, రక్షక్ వాహనంలో కూడా రక్షణ లేకుండాపోయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

బైరి నరేశ్‌పై దాడి

వరంగల్ హనుమకొండ దగ్గర బైరి నరేశ్ అనే వ్యక్తిపై పోలీసు జీపులో ఉండగానే దాడి జరిగింది.

కొందరు వ్యక్తులు పోలీసు జీపును ఆపి, తలుపు తీసి లోపలికి వెళ్లి నరేశ్‌పై పిడి గుద్దులు కురిపించారు. బలంగా గాయపరచారు.

అడ్డుకోబోయిన పోలీసులను కూడా తోసేశారు. ఆ సమయంలో పోలీస్ రక్షక్ వాహనంలో ఒక ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు.

ఇది మొదటిది కాదు. గత నెల వికారాబాద్ దగ్గర యాలాల పోలీస్ స్టేషన్లో ఉన్న ఓ వ్యక్తిని కొందరు శివ మాల వేసుకున్న వారు స్టేషన్ ప్రాంగణంలోనే కొట్టారు.

ఎస్సై, కానిస్టేబుల్ ఆపే ప్రయత్నం చేశారు. కానీ, అంత మంది ముందు పోలీసుల బలం సరిపోలేదు. ఆ ఘటన మరువక ముందే తాజాగా హనుమకొండ ఘటన జరిగింది.

దీనిపై సోషల్ మీడియాలో కూడా విమర్శలు వచ్చాయి. దీన్ని పోలీసుల వైఫల్యంగా పలువురు నెటిజన్లు కామెంట్ చేయగా, మధ్య యుగాల నాటి శాస్త్రవేత్తలపై జరిగిన భౌతిక దాడులుగా పలువురు అభివర్ణించారు.

బైరి నరేశ్

ఫొటో సోర్స్, BITCELL/TWITTER

"ఇలాంటి ఘటన ముందే జరుగుతుందని బైరి నరేశ్ ఊహించాడు, కాబట్టే రక్షణ కోరాడు. పోలీసులు నిర్లక్ష్యం, నిర్లిప్తత వల్లే ఇది జరిగింది. లేకపోతే పోలీసుల సమక్షంలో దాడి ఎలా జరుగుతుంది? పోలీసులకు అధికారం ఇచ్చినా వైఫల్యం చెందారు. పోలీసులు, ప్రభుత్వం కంటే బలంగా ప్రైవేటు వ్యక్తులు ఉంటారా? ప్రభుత్వ బలం కంటే దాడులు చేసే ప్రైవేటు వ్యక్తుల బలం ఎక్కువగా ఉంటుదా?" అని తెలంగాణ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణ రావు ప్రశ్నించారు.

"భౌతిక దాడులకు దిగడం అనాగరికం. ప్రజాస్వామ్యంలో మధ్య యుగాల నాటి చరిత్ర తగదు. ఏదైనా ఉంటే, చట్ట పరంగా వెళ్లాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. ఇది అరాచకానికీ, అలజడికీ, హింసకీ దారి తీస్తుంది. ఒకరు దాడి చేసి, మరొకరు ప్రతిదాడి చేసి.. ఇలా జరగుతూ పోతే సమాజం ముందుకు వెళ్లదు. శాంతి, ప్రజాస్వామ్యం ఉండవు. ఇప్పుడే కాదు. దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వచ్చాక మూక దాడులు పెరిగాయి. ప్రభుత్వాలు వాటిని అరికట్టాలి. కఠినంగా శిక్షించాలి" అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

అయితే ఈ ఘటన విషయంలో పోలీసుల తప్పు లేదు అంటున్నారు సుబేదారీ పోలీసులు.

"నరేశ్ భద్రత కావాలి అని కోరాడు. తను ఒక కార్యక్రమం నుంచి వెళుతూ నగరం దాటే వరకూ భద్రత అడిగాడు. దీంతో ఆయన్ను పోలీసు వాహనంలోనే తరలించాం. ఆయన రెగ్యులర్ పోలీసు భద్రతలో లేకపోయినా, సెక్యూరిటీ అడగ్గానే ఇచ్చాం. భద్రతగా ఒక ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లూ ఉన్నారు. అయితే దారిలో కొందరు వ్యక్తులు బండిని అడ్డగించి, పోలీసులను తోసేసి దాడి చేశారు. నరేశ్‌నుి కాపాడటానికి పోలీసులు శాయశక్తులా ప్రయత్నం చేశారు. దాడి ఊహించని విధంగా జరిగింది. మేం సెక్యూరిటీ ఏర్పాటు చేసినప్పటికీ అనూహ్యంగా జరిగిన దాడి అది. మా సిబ్బంది కూడా ఎక్కడా తగ్గకుండా దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేశారు" అని బీబీసీతో చెప్పారు సుబేదారీ పోలీస్ స్టేషన్ ఇనస్పెక్టర్ షుకూర్.

రాజా సింగ్‌పై పెట్టినట్టుగా నరేశ్‌పై కూడా పీడీ యాక్ట్ పెట్టాలని ఫిర్యాదు చేసిన భక్తులు
ఫొటో క్యాప్షన్, రాజా సింగ్‌పై పెట్టినట్టుగా నరేశ్‌పై కూడా పీడీ యాక్ట్ పెట్టాలని ఫిర్యాదు చేసిన భక్తులు

పోలీసుల జీపును అడ్డగించిన ఘటన జరిగిన ప్రదేశం హనుమకొండ పరిధిలోకి వస్తుంది. దీనిపై హనుమకొండ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. మంగళ వారం తెల్లవారుజామున వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

"పోలీసులు నరేశ్‌ను కాపాడటానికి చాలా ప్రయత్నం చేశారు. అది వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఘటనపై కేసు పెట్టాం. మొత్తం ఆరుగురిని అరెస్టు చేశాం. వారిని కోర్టులో ప్రవేశ పెడతాం" అని హనుమకొండ ఇనస్పెక్టర్ నరేంద్ర బీబీసీతో చెప్పారు.

"ఈ ఘటనపై మేం రివ్యూ నిర్వహించాం. లోతుగా పరిశీలన చేశాం. ఇలాంటి సందర్భాల్లో అవసరమైతే లాఠీలకు పని చెప్పాలని మా సిబ్బందికి చెప్పాం. సీఆర్పీసీ ప్రకారం మాకు లాఠీలు ఉపయోగించే హక్కు ఉంది. అయితే ఈ మధ్య ఫ్రెండ్లీ పోలీసింగులో భాగంగా లాఠీలు పట్టుకోవద్దని చెబుతూ ఉండడంతో సిబ్బంది లాఠీలు లేకుండా ఉన్నారు. తుపాకులు ఎప్పుడో వదిలేశారు. ఈ మధ్య లాఠీలు కూడా పక్కన పెట్టడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే ఇలాంటివి జరిగనప్పుడు స్పందించాల్సిన తీరు, భవిష్యత్తులో వ్యవహరించాల్సిన తీరుపై సిబ్బందికి మార్గనిర్దేశం చేశాం" అని బీబీసీతో చెప్పారు వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాథ్.

ఈ ఘటన వెనుక కారణాలపై కూడా పోలీస్ కమిషనర్ రంగనా‌థ్ మాట్లాడారు.

"నిజానికి ఇలాంటి దాడుల విషయంలో కేసులు బలంగా ఉండడం లేదు. దానికి కారణం మన చట్టాలే అలా ఉన్నాయి. ఈ దాడులన్నీ ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసులు. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో అరెస్టులు వెంటనే చేయలేం. ముందుగా అనుమానితులకు సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసు ఇచ్చిన తరువాతనే అరెస్టు చేయాల్సి వస్తుంది. అరెస్టు చేసినా, వెంటనే బెయిల్ వస్తుంది. ఇలాంటి నేరాలు నాన్ బెయిలబుల్ ఉంటేనే దాడి చేసే వారిలో భయం ఉంటుంది. బలమైన కేసులు పెడతారు. దానికితోడు ఈ ఘటనలను ఎన్నికల నేపథ్యంలో కూడా చూడాలి. హిందూ సంఘాల్లో చురుగ్గా ఉండి ఇలాంటి ఘటనలకు పాల్పడే వారికి, తరువాత ఎన్నికల్లో టికెట్లు వస్తాయి అనే ఆశ కూడా ఉంటుంది. వారి రాజకీయ ప్రయోజనం కోసం, తమ పార్టీలో పేరు కోసం కూడా ఇలా చేస్తున్నారు" అన్నారు రంగనాథ్.

బైరి నరేశ్ హిందూ దేవతలను కించ పరిచారు అంటూ గతంలో ఆయనపై కేసు నమోదు అయింది. ఆ కేసులో భాగంగా 45 రోజుల పాటూ జైల్లో ఉన్న నరేశ్, ఫిబ్రవరి 16వ తేదీన విడుదల అయ్యారు. ఆ తరువాత పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

నరేశ్ అరెస్ట్ కాకముందు కూడా అయ్యప్ప స్వామి భక్తులు ఆయనపై దాడి చేశారు. విడుదల తరువాత వరంగల్ దగ్గర్లో ఒక కాలేజీలో కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

బైరి నరేశ్

ఫొటో సోర్స్, BITCELL/TWITTER

బైరి నరేశ్ ఏం చెప్పారు?

ఈ ఘటన ఎలా జరిగింది, దానికి ముందు ఏం జరిగింది అనే విషయాలను బైరి నరేశ్ వివరించారు.

"నేను జైలు నుంచి విడుదల అయిన తరువాత ఏ సమావేశంలోనూ, కార్యక్రమంలోనూ మాట్లాడలేదు. ఎక్కడా అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. అంతేకాదు, గతంలో నేను చేసిన వ్యాఖ్యలకు అయ్యప్ప స్వాములకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను అని కూడా ప్రకటించాను. నేను గతంలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు. ప్రసంగాన్ని కావాలని ఎడిట్ చేసి కొందరు రెచ్చగొట్టారు. ఆ వివరణలూ, క్షమాపణలూ అన్నీ నేను పలు ఇంటర్వ్యూల్లో సవివరంగా చెప్పాను. జైలు నుంచి వచ్చాక ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆ విషయాన్ని చెప్పాను. నా అనుచరులు, నాతో కలసి పనిచేసే వారిని కూడా సంయమనంతో ఉండమని చెప్పాను. అయినప్పటికీ నాపై కొందరు గూండాలు దాడి చేశారు. వరంగల్‌లో నాపై దాడి చేసిన వారు అయ్యప్పలు కాదు. వారు మాలలో లేరు. వరంగల్‌లో దాడి చేసిన వారు ఎప్పుడూ మాల వేసుకున్న వారు కూడా కాదు. వారిలో చాలా మందిపై కేసులు ఉన్నాయని కూడా తెలిసింది. వాళ్లు అలాంటి వాళ్లు కాబట్టే పోలీసు బండికి బైకులు అడ్డం పెట్టి డ్రైవర్నీ, ఎస్సైనీ లాగి దాడి చేయగలిగారు. నాకు దాడి అనుమానం ఉంది కాబట్టే నాపై జనాల్ని రెచ్చగొడుతున్న వారిని అదుపుచేయమని కమలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాను" అంటూ ఘటనకు ముందు పరిణామాలు వివరించారు నరేశ్.

"ఆరోజు ఉదయం లా కాలేజీ ఫ్రెషర్స్ డే అంబేడ్కర్ భవన్లో జరిగింది. దానికి చాలా మంది పెద్దలు వచ్చారు. నేను లా విద్యార్థిగా ఆ కార్యక్రమానికి వెళ్లాను. కార్యక్రమం జరుగుతుండగా వేదికపై ఎక్కిన ప్రిన్సిపల్ ఒక ప్రకటన చేశారు. బయటి పరిస్థితి బాలేదనీ, కార్యక్రమాలు తొందరగా ముగించమనీ చెప్పారు. నేను విషయం కనుక్కుంటే, కొందరు నాపై దాడి చేయడం కోసం తహశీల్దార్ ఆఫీసు దగ్గర గుమిగూడినట్టు నా సన్నిహితులు చెప్పారు. తెలిసిన లాయర్లు కూడా అదే చెప్పారు. నాపై దాడి గురించి ఇంటిలిజెన్స్ వారికి ముందే సమాచారం ఉందని తెలిసింది. దీంతో నేను పోలీసు ఉన్నతాధికారులకు కాల్ చేసినా, స్పందన రాలేదు. ఈలోపు అక్కడకు కొందరు పోలీసులు వచ్చి నన్ను కలిశారు. నాకు ప్రమాదం పొంచి ఉందనీ, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలనీ చెప్పారు. నేను వెంటనే ఆ కానిస్టేబుళ్లతో మాట్లాడి వారి ఎస్సై దగ్గరకు వెళ్లాను. పోలీసు వాహనంలోనే తనను నగరం దాటించాలని ఎస్సై గారిని కోరాను. దానికి ఆయన ఉన్నతాధికారుల అనుమతి అడిగారు. వారు ఒప్పుకున్న తరువాత బండిలో ఎక్కాం.

హనుమకొండ ఆదర్శ లా కాలేజీనుంచి కాకతీయ యూనివర్సిటీ వెళ్లే దారిలో ఉన్నాం. నా కుడి వైపు కానిస్టేబుల్, ఎడమవైపు మా తమ్ముడు, ఆయన పక్కన మరో కానిస్టేబుల్ కూర్చున్నారు. మా వెనుక ఒక కానిస్టేబుల్, ముందు డ్రైవర్, పక్కన ఎస్సై ఉన్నారు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లు నా సొంత కారులో వెనుక వస్తున్నారు. యూనివర్సిటీ రోడ్డులో ఉండగానే, కొందరు నావైపు వేలు చూపిస్తూ నన్ను దాటి వెళ్లారు. అక్కడ మలుపు తిరిగి మెయిన్ రోడ్డు ఎక్కేలోపు ముగ్గురు రౌడీలు తమ బండ్లను పోలీసు బండికి అడ్డంగా పెట్టారు. 'వీడికి మీరు రక్షణ ఇష్తారా? ఇవ్వగలరా? వీడిని చంపేస్తాం. ఒరే కొడక.., జై శ్రీరామ్ అను' అంటూ నాపై దాడికి దిగారు. పోలీసులను పక్కకు లాగి నాపై పిడిగుద్దులు గుద్దారు.

ఆ సమయంలో బండి అద్దాలు లాక్ చేసి లేవు. దీంతో వెంటనే వాళ్లు పోలీసులను పక్కకు లాగి నాపైకి వచ్చారు. పోలీసుల దగ్గర, తుపాకీ, లాఠీలు లేవు. వాళ్ల చేతికి ఉన్న కడియాలతో నన్ను బలంగా కొట్టారు. నా పక్కన ఉన్న పవర్ బ్యాంకు తీసుకుని కొట్టారు. గొంతుపై, తలపై కొట్టారు. చొక్కా, బనియన్ చింపేశారు. 'మా మతం జోలికీ, బీజేపీ జోలికీ రాకూడదు.. దేవుడే లేడంటావా' అని కొట్టారు. ఈలోపు వెనుక బండిలో మిగతా కానిస్టేబుళ్లు వచ్చారు. అంత మంది మధ్య తోపులాట అయింది. సుమారు పది నిమిషాలపాటూ తలపై, మెడపై కొట్టారు. తలపై, చెవి దగ్గర, భుజాల దగ్గర రక్తం వచ్చింది. వాళ్లు చంపాలనే దాడి చేశారు.

కొన్ని మీడియాలు రాసినట్టు పరిగెత్తించి కొట్టారు అని రాసింది అవాస్తవం. చొక్కా, బనియన్ మాత్రం చింపారు. ఫోన్ పగిలింది. పోలీసులు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అర్థరాత్రి తరువాత మళ్లీ నన్ను పోలీసు వాహనంలో డ్రాప్ చేయమన్నాను. వారు చేయలేదు. చివరకు తెల్లవారుజామున 3 గంటల సమయంలో వేరే బండిలో రహస్య ప్రదేశానికి వెళ్లాను. ఇక్కడ తాము రక్షణ కల్పించలేమనీ, హైదరాబాద్ కానీ, వేరే రాష్ట్రం కానీ వెళ్లాలని పోలీసులు సూచించారు" అని నరేశ్ చెప్పారు.

పోలీసులు వెంటనే బండి ఆపకుండా పక్క నుంచి తీసే ప్రయత్నం చేసినా, బండిని అటు ఇటు తిప్పినా, కనీసం యూటర్న్ తీసుకున్నా, అద్దాలు ఎత్తేసి డోర్ లాక్ చేసినా ఈ దాడి జరిగి ఉండేది కాదని ప్రత్యక్ష సాక్షి ఒకరు బీబీసీతో చెప్పారు.

మరోవైపు బైరి నరేశ్‌కి ప్రాణ హాని ఉన్నందున ఆయనకు గన్ లైసెన్స్ ఇవ్వాలంటూ ఆయన భార్య హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)