అమృత్‌పాల్‌ సింగ్ ఎవరు, భారత్ నుంచి విడిపోవాలనే ఖలిస్తాన్ ఉద్యమానికి మళ్లీ ప్రాణం పోస్తున్నారా?

అమృత్‌పాల్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జోయా మాటీన్, అరవింద్ చాబ్రా
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ రాజు(రామ్) ఇంట్రడక్షన్ సీన్ చూశారా?

వేల మంది బ్రిటిష్ పోలీసు స్టేషన్‌ను చుట్టుముడతారు. దాదాపుగా ఇలాంటి సీనే ఫిబ్రవరి 23న పంజాబ్‌ని అమృత్‌సర్‌లో జరిగింది.

తన సన్నిహితుణ్ని అరెస్టు చేసినందుకు వందల మందితో అజ్నల పోలీసు స్టేషన్‌ను ఒక వ్యక్తి చుట్టుముట్టారు.

ఆ వ్యక్తే అమృత్‌పాల్ సింగ్. వందల మంది రావడంతో పోలీసులు సైతం ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయారు.

కత్తులు, తుపాకులు పట్టుకున్న అమృత్‌పాల్ సింగ్ అనుచరులు బారికేడ్లు తోసుకుంటూ పోలీసు స్టేషన్‌లోకి చొచ్చుకొని పోయేందుకు ప్రయత్నించారు.

సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్‌ను చేతిలో పట్టుకొని ఉండటం వల్ల తాము ఏమీ చేయలేక పోయామని పోలీసులు తెలిపారు.

ఆర్ఆర్ఆర్ సినిమాను తలపించిన ఆ ఘటనతో 30ఏళ్ల అమృత్‌పాల్ సింగ్ దేశవ్యాప్తంగా వార్తల్లోకి వచ్చారు.

ఖలిస్తాన్‌ ఉద్యమానికి మద్దతు తెలిపే అమృత్‌పాల్ సింగ్, సిక్కులకు ప్రత్యేక దేశం ఉండాలని కోరుకుంటున్నారు.

అమృత్‌పాల్ సింగ్‌ను చూస్తుంటే జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే గుర్తుకొస్తున్నారు. ఖలిస్తాన్ పేరిట సిక్కుల కోసం ప్రత్యేక దేశం కావాలంటూ 1980లలో వేర్పాటు వాద ఉద్యమం చేపట్టిన భింద్రన్‌వాలే ఆ తరువాత సాయుధపోరాటానికి దిగారు.

1984లో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్‌‌లో భింద్రన్‌వాలే చనిపోయారు.

సుమారు 10ఏళ్లు సాగిన ఆ తిరుగుబాటుతో వేలమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. సామాన్య ప్రజలు, నేతల మీద తిరుగుబాటుదారులు దాడులు చేశారు.

పోలీసుల నకిలీ ఎన్‌కౌంటర్లలో అనేక మంది సిక్కు యువకులు చనిపోయారు. ఆ గాయాలను పంజాబ్ ఇంకా పూర్తిగా మరచిపోలేదు.

ఫిబ్రవరి 23న తన అనచురులతో కలిసి అమృత్‌పాల్ సింగ్ పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫిబ్రవరి 23న తన అనచురులతో కలిసి అమృత్‌పాల్ సింగ్ పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు.

అమృత్‌పాల్ సింగ్ ఎవరు?

పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలోని జల్లుపుర్ ఖేరాకు చెందిన అమృత్‌పాల్ సింగ్ 2012లో దుబాయికి వెళ్లారు. అక్కడ వారి కుటుంబం ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తోంది.

అమృత్‌పాల్ సింగ్ బాల్యం గురించి పెద్దగా తెలియడం లేదు.

పంజాబ్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చేసినట్లు తన లింక్డిన్ ప్రొఫెల్‌లో అమృత్‌పాల్ సింగ్ రాసుకున్నారు. ఒక కార్గొ కంపెనీలో ఆపరేషనల్ మేనేజర్‌గా పని చేసినట్లు ప్రొఫైల్ ఆధారంగా తెలుస్తోంది.

సిక్కుల ఐక్యత, సిక్కులకు ప్రత్యేక దేశం వంటి వాటి మీద మాట్లాడుతూ తొలుత సోషల్ మీడియాలో అమృత్‌పాల్ సింగ్ పాపులర్ అయ్యారు.

2022 ఆగస్టులో సింగ్ దుబాయి నుంచి భారత్‌కు వచ్చారు. గతంతో పోలిస్తే తన ఆహార్యాన్ని మార్చివేశారు. తలపాగా ధరించడం, గడ్డం పెంచడం వంటి వాటితో ఒక ఆధ్యాత్మిక సిక్కు మాదిరిగా ఆయన కనిపిస్తున్నారు.

భారత్‌కు వచ్చిన నెల తరువాత దీప్ సిద్ధు ప్రారంభించిన ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థకు అమృత్‌పాల్ సింగ్‌ను సారథిగా నియమించారు.

2021లో దిల్లీలో జరిగిన రైతుల నిరసన ప్రదర్శనలో భాగంగా హింసకు పాల్పడ్డారంటూ దీప్ సిద్ధును అరెస్టు చేశారు. ఆయన నటుడు కూడా. 2022లో జరిగిన కారు ప్రమాదంలో దీప్ చనిపోయారు.

జర్నైల్‌ సింగ్ భింద్రన్‌వాలే స్వస్థలమైన రోడ్ గ్రామంలో అమృత్‌పాల్ సింగ్‌కు సారథ్యం అప్పగించే వేడుక జరిగింది. వేల మంది దానికి హాజరయ్యారు.

అమృత్‌పాల్ సింగ్

ఫొటో సోర్స్, Hindustan Times

‘ప్రత్యేక దేశమే ఏకైక పరిష్కారం’

అమృత్‌పాల్ సింగ్ అనుచరులు ఆయనను ఖలిస్తాన్ ఉద్యమ నేత జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేతో పోలుస్తుంటారు. తనకు స్ఫూర్తి భింద్రన్‌వాలే అంటూ తరచూ అమృత్‌పాల్ సింగ్ చెబుతూ ఉంటారు.

తన ప్రసంగాలతో భింద్రన్‌వాలేను గుర్తుకు తెస్తుంటారు అమృత్‌పాల్ సింగ్. ఆయన బహిరంగంగానే సిక్కులకు ప్రత్యేక దేశం ఉండాలంటూ పిలుపునిస్తుంటారు. డ్రగ్స్, నీటి వివాదాలు, పంజాబ్ సంస్కృతి దిగజారడం వంటి సమస్యలకు ప్రత్యేక దేశమే ‘ఏకైక పరిష్కారం’ అన్నది సింగ్ అభిప్రాయం.

అయితే తనను జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేతో పోల్చడాన్ని అమృత్‌పాల్ సింగ్ అంగీకరించడం లేదు.

‘‘ఆయన కాలికి అంటుకున్న మట్టికి కూడా నేను సమానం కాదు. ఆయన చూపిన దారిలో నేను నడుస్తున్నాను’’ అని 2022లో ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ అన్నారు.

అమృత్‌పాల్ సింగ్ చిన్న వయసులోనే ఈ స్థాయికి ఎదగడం ‘అనుమానాస్పదం’గా ఉందని పంజాబ్ యూనివర్సిటీలో పొలిటికల్ సైంటిస్ట్‌గా ఉన్న ప్రొ.అశుతోష్ అన్నారు.

‘‘దేశంలో పెరుగుతున్న హిందూ జాతీయవాదం సిక్కుల్లో ఆందోళన పెంచుతోంది. హిందూ జాతీయవాదానికి పోటీగా సిక్కులకు ప్రత్యేక దేశం అనే ఆలోచనను అమృత్‌పాల్ సింగ్ ముందుకు తీసుకొస్తున్నారు’’ అని అశుతోష్ తెలిపారు.

వ్యసాయంలో కీలకంగా ఉన్న పంజాబ్‌లో ఇప్పుడు నిరుద్యోగం పెరగడంతోపాటు రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా పంజాబ్ సామాజికంగా ఆర్థికంగా వెనుకడుగువేస్తోంది.

‘‘(దేశంలో) అధికారంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు హిందూ దేశం కావాలంటూ నినదిస్తుంటే, తమకు జరిగిన అన్యాయాన్ని తమ సమస్యలను గట్టిగా వినిపించగల ఒక లీడర్ కావాలని కొందరు సిక్కులు భావిస్తున్నారు’’ అని ప్రొఫెసర్ అశుతోష్ అన్నారు.

అమృత్‌పాల్ సింగ్ ఎదుగుదలలో సోషల్ మీడియా చాలా కీలక పాత్ర పోషించిదని పంజాబ్ యూనిర్సిటీలో పని చేస్తున్న మరొక ప్రొఫెసర్ ఖలీద్ మొహ్మద్ అన్నారు.

2022 నవంబరులో సిక్కులకు మత దీక్ష (అమృత్ వేడుక) ఇచ్చే కార్యక్రమాన్ని నెల రోజుల పాటు సింగ్ నిర్వహించారు.

డ్రగ్స్‌ వ్యసనానికి ప్రజలను దూరం చేయడంతోపాటు కట్నం, కులవివక్షలను నిర్మూలించేందుకు దీక్ష ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

గురు గ్రంథ్ సాహిబ్ ముందు ఎవరైనా కిందనే కూర్చోవాలని అమృత్‌పాల్ సింగ్ పిలుపునిచ్చారు. ఆ తరువాత ఒక గురుద్వారాలో ఉన్న కుర్చీలను ఆయన అనుచరులు ధ్వంసం చేశారు.

పంజాబ్‌లో యువత ఎదుర్కొంటున్న సమస్యలకు, వారిలో గూడు కట్టుకున్న ఆవేశం నుంచి అమృత్‌పాల్ సింగ్ ఎదిగాడని ప్రొఫెసర్ పర్మిందర్ సింగ్ అన్నారు.

‘‘మంచి చదువులు, ఉపాధి దొరకని అనేక మంది యువత పంజాబ్‌లో ఉన్నారు. వారిలో చాలా మంది విదేశాలకు వెళ్లలేని స్థితిలో ఉన్నారు. అందువల్ల వారిలో చాలా మంది ఇలా మతతత్వం వైపుకు మళ్లుతున్నారు’’ అని పర్మిందర్ సింగ్ తెలిపారు.

రైతుల ఉద్యమం

ఫొటో సోర్స్, Getty Images

ఎందుకు ఆందోళన?

‘‘ఖలిస్తాన్ డిమాండ్ ముమ్మాటికి సరైనదే’’ అంటూ తన ప్రసంగాల్లో అమృత్‌పాల్ సింగ్ చెబుతూ ఉంటారు. సింగ్ ఎదుగుదల పంజాబ్‌లో చోటు చేసుకున్న గత హింసాత్మక సంఘటనలను గుర్తు చేస్తోంది.

కొన్ని దశాబ్దాల పాటు సాగిన హింస నుంచి దాదాపుగా కోలుకున్న పంజాబ్, ఇప్పుడు మళ్లీ సమస్యలను చూడాల్సి వస్తుందా? అనే ఆందోళనలు కనిపిస్తున్నాయి.

‘‘గతంలో పోలీసు స్టేషన్ మీద దాడులు జరగడాన్ని అనేక సార్లు చూశాను. కానీ పోలీసులు కూడా నిస్సహాయులుగా మారిపోవడాన్ని చూడటం ఇదే తొలిసారి’’ అని పంజాబ్ మాజీ సీనియర్ పోలీసు అధికారి బీబీసీతో అన్నారు.

‘‘కొద్ది నెలలుగా తుపాకులు, కత్తులు పట్టుకొని అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌లో తిరుగుతున్నా ఇంత వరకు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. దీన్ని అనుమతించకూడదు. లేదంటే పంజాబ్ మరొక తీవ్రమైన సంక్షోభాన్ని చూడాల్సి వస్తుంది’’ అని ప్రొఫెసర్ పర్మిందర్ సింగ్ అన్నారు.

‘‘పంజాబ్‌లో జరుగుతున్న చూస్తుంటే ఒకనాటి మిలిటెన్సీ చీకటి రోజుల్లోకి మనం మళ్లుతున్నామా అనిపిస్తోంది. పరిస్థితులు చూస్తే ఆ భయం నిజం అయ్యేలా కనిపిస్తోంది’’ అని పంజాబ్ మాజీ డీజీపీ శశి కాంత్ అన్నారు.

‘‘1990లలో సిక్కుల వేర్పాటువాదానికి ఆదరణ తగ్గిపోయినా ఆ డిమాండ్ మాత్రం పూర్తిగా అంతరించి పోలేదు. హింసను ప్రోత్సహించే అమృత్‌పాల్ సింగ్ వంటి వారిని పంజాబ్‌లో అందరూ ఇష్టపడరు. కొద్ది మంది మాత్రమే అతన్ని అనుసరిస్తున్నారు’’ అని ప్రొఫెసర్ పర్మిందర్ సింగ్ అన్నారు.

‘‘ఓ వెయ్యిమంది ప్రజలు పంజాబ్‌కు ప్రతీక కాదు’’ అని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)