512 కిలోల ఉల్లిగడ్డలు అమ్మితే.. 2 రూపాయల చెక్ చేతిలో పెట్టారు - ఆ రైతు వ్యథ ఎలా ఉందంటే...

రాజేంద్ర చవాన్‌కు ఇచ్చిన చెక్
ఫొటో క్యాప్షన్, రాజేంద్ర చవాన్‌కు ఇచ్చిన చెక్
    • రచయిత, సర్ఫరాజ్ సనదీ, ప్రవీణ్ ఠాక్రే
    • హోదా, బీబీసీ కోసం

మహారాష్ట్రతో పాటు దేశం అంతటా సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా షోలాపూర్‌కు చెందిన రాజేంద్ర చవాన్ అనే రైతు గురించి చర్చ జరుగుతోంది.

మార్కెట్‌లో 512 కిలోల ఉల్లిగడ్డలను అమ్మితే ఆయన చేతిలో 2 రూపాయల చెక్కును పెట్టారు. దేశవ్యాప్తంగా ఆయనపై చర్చ జరగడానికి ఇదే కారణం.

ఈ చెక్కును నగదు రూపంలోకి మార్చడానికి కొన్ని రోజుల తర్వాత ఆయన మళ్లీ మార్కెట్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

మహారాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రతిపక్ష నేత అజిత్ పవార్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు.

రాజేంద్ర చవాన్‌కు రెండు రూపాయల చెక్‌ను ఇచ్చిన ‘సూర్య ట్రేడర్స్’ లైసెన్స్‌ను రద్దు చేసినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.

రాజేంద్ర చవాన్
ఫొటో క్యాప్షన్, రాజేంద్ర చవాన్

‘‘రాజేంద్ర చవాన్‌, 512 కిలోల ఉల్లిపాయలను అమ్మారు. ధరల్లో హెచ్చుతగ్గులు జరుగుతుంటాయి. కానీ, అంత సరుకు అమ్మితే ఆయనకు రెండు రూపాయలే చేతికి వచ్చాయి. రవాణా ఖర్చును కూడా తీసుకున్నారు. ఇలా జరగాల్సింది కాదు. సూర్య ట్రేడర్స్‌ లైసెన్స్‌ను రద్దు చేశాం’’ అని బడ్జెట్ సమావేశాల సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.

నిజానికి, ఈ రోజుల్లో మహారాష్ట్ర హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో ఉల్లిగడ్డల ధర ఆరు లేదా ఏడు రూపాయలుగా ఉండగా, రిటేల్ మార్కెట్‌లో రూ. 20 నుంచి రూ. 30 వరకు పలుకుతోంది.

రుతుపవన కాలంలో సాగు చేసిన ఉల్లిగడ్డలు, ఫిబ్రవరి చివరలో రైతుల చేతికి వస్తాయి. తేమ కారణంగా ఈ ఉల్లిపాయలను నిల్వ చేయలేరు. ఇంట్లో వాడుకోవడానికి, నిల్వ చేయడానికి తేమలేని, పొడిగా ఉండే ఉల్లిపాయలు అవసరం. ఈ కారణంగా రుతుపవన కాలంలో పండించిన ఉల్లి ధరలు భారీగా పతనం అయ్యాయి. వీటికి రాజేంద్ర చవాన్ బాధితుడిగా మారారు.

ఉల్లిపాయలు

ఫొటో సోర్స్, Hindustan Times

షోలాపూర్ జిల్లా బర్షీ తాలూకా బోర్గావ్ గ్రామానికి చెందిన రాజేంద్ర తుకారాం చవాన్, పది బస్తాల ఉల్లిపాయలను మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మగా.. రవాణా ఖర్చులు, తూకం చార్జీలను తీసుకొని రెండు రూపాయల చెక్కును ఆయనకు ఇచ్చారు.

రెండెకరాల పొలంలో చవాన్ ఉల్లి పంట వేశారు. ఫిబ్రవరి 17వ తేదీన, 10 బస్తాల ఉల్లిని విక్రయించడం కోసం షోలాపూర్‌లోని సూర్య ట్రేడర్స్‌కు తీసుకెళ్లారు.

పది బస్తాల్లో 512 కేజీల ఉల్లిపాయలు ఉన్నట్లు తూకంలో తెలిసింది. కానీ, రుతుపవన కాలంలో పండించిన ఉల్లిపాయల ధరలు భారీగా పడిపోవడంతో ఆయన, కిలో ఉల్లిగడ్డలను రూపాయికే అమ్మాల్సి వచ్చింది. వాహన చార్జీలు, హమాలీ కూలీ, తూకం చార్జీలను తీసివేసి ఆయనకు రెండు రూపాయల చెక్కును ఇచ్చారు.

వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీకి చెందిన సూర్య ట్రేడర్స్, రాజేంద్రకు రెండు రూపాయల చెక్కును అందించింది. ఈ చెక్‌పై తేదీ, 2023 మార్చి 8గా ఉంది. దీంతో ఈ రెండు రూపాయల చెక్‌ను ఎన్‌క్యాష్ చేసుకోవడం కోసం వారు మరోసారి ఈ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.

ఉల్లిగడ్డలు

ఫొటో సోర్స్, NURPHOTO

ఎకరాకు రూ. 60-70 వేల ఖర్చు

వ్యాపారి నుంచి రాజేంద్ర చవాన్, రెండు రూపాయల చెక్కును అందుకోవడానికి సంబంధించిన వార్తలు, ఫొటోలు దేశవ్యాప్తంగా వైరల్‌గా మారాయి.

దీని గురించి మరింత తెలుసుకోవడం కోసం రాజేంద్ర చవాన్‌ను బీబీసీ సంప్రదించింది.

ఈ విషయం గురించి రాజేంద్ర చవాన్, బీబీసీతో మాట్లాడుతూ, ‘‘నేను నాణ్యమైన ఉల్లిని మార్కెట్‌కు పంపించాను. కిలోకు రూ. 8 -10 రూపాయల మధ్య అమ్ముడు అవుతుందని ఊహించాను. కానీ, నిజానికి నాకు కిలో ఉల్లిగడ్డకు కేవలం ఒక రూపాయి మాత్రమే వచ్చింది. ఆ సొమ్ముతో నా ఖర్చులు కూడా వెళ్లదీయలేను. చాలా బాధగా ఉంది’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాజేంద్ర చవాన్ కుటుంబం మొత్తం వ్యవసాయమే చేస్తుంది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు, కోడలు, మనుమలు, మనుమరాళ్లు ఉన్నారు. ఈ ఘటనతో తన కుటుంబం మొత్తం చాలా బాధలో ఉందని చవాన్ అన్నారు.

ఉల్లిగడ్డలు

ఫొటో సోర్స్, PRAVIN THAKARE/BBC

ఉల్లి సాగు ఖర్చు గురించి చవాన్ వివరించారు. ‘‘నాణ్యమైన ఉల్లి విత్తనాలు కిలోకు రూ.1800లకు లభిస్తాయి. ఒక ఎకరానికి రెండున్నర కిలోల విత్తనాలు కావాలి. అంటే ఎకరానికి అయ్యే విత్తనాల ఖరీదు రూ. 4,500. ఆ తర్వాత విత్తడం, కలుపు తీయడం, పంట కోత, ఎరువులు, కూలీల ఖర్చులు అన్నీ కలుపుకొని మొత్తం రూ. 60-70 వేల రూపాయల ఖర్చు వస్తుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తవ్వడానికి దాదాపు నాలుగు నెలల సమయం పడుతుంది’’ అని ఆయన వివరించారు.

పంట కోసిన తర్వాత దాన్ని మార్కెట్ కమిటీకి పంపేందుకు కూడా ఖర్చు అవుతుంది. "ఎకరానికి 132 బస్తాల దిగుబడి వస్తుంది. సాధారణంగా ఒక సంచిలో 50 కిలోల ఉల్లిపాయలు ఉంటాయి. ఒక బస్తా ఉల్లిపాయలను రూ. 350 చొప్పున విక్రయిస్తారు. సరుకును ట్రక్కులో లోడ్ చేయడానికి ఒక బస్తాకు పది రూపాయలు చొప్పున, రవాణా ఖర్చు పేరుతో ఒక సంచికి 40 రూపాయల చొప్పున తీసుకుంటారు’’ అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఈ రైతు 5 క్వింటాల ఉల్లి అమ్మితే రూ.2 మిగిలాయి

వ్యాపారుల వద్దకు తీసుకెళ్లిన తర్వాత సరుకును తూకం వేస్తారు. తూకం ఖర్చులు, రవాణా ఖర్చులు కూడా ఉంటాయి. సంబంధిత ఖర్చులన్నీ తీసేసి మిగిలిన డబ్బును రైతుకు చెల్లిస్తారు.

"మేం ఇంతకుముందు కిలో ఉల్లిపాయలను 6-7 రూపాయలకు విక్రయించాం. నాణ్యమైన ఉల్లి కాబట్టి మంచి ధర వస్తుందని మేం భావించాం. అందుకే ఒక వాహనంలో వీటిని మార్కెట్‌కు చేర్చాం.

ఈ ధర వస్తుందని ముందే తెలిసి ఉంటే పొలంలోనే పంటను అలాగే వదిలేసేవాళ్లం. ఇప్పుడు మాకు భారీ నష్టం వచ్చింది’’ అని రాజేంద్ర చవాన్ చెప్పారు.

ఇలాంటి పరిస్థితుల్లో సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవాలని రాజేంద్ర చవాన్ డిమాండ్ చేస్తున్నారు.

ఉత్పాదక ఖర్చులే కాకుండా రవాణా, తూకం ఖర్చులన్నీ పరిగణలోకి తీసుకున్న మరో రైతు తాను పండించిన ఉల్లి పంటను పొలంలోనే వదిలేశారు.

నైతాలేకు చెందిన రతన్ బోర్గుడే, రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. ఆ పంటను విక్రయానికి తీసుకెళ్లకుండా పొలంలోనే విడిచిపెట్టారు.

ఈ ప్రాంతానికి చెందిన అనేక మంది రైతులు, ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

వీడియో క్యాప్షన్, కిలో ఉల్లి రూ.600, మిర్చి రూ.710.. ఎక్కడ? ఎందుకు?

రైతుల కళ్లలో కన్నీళ్లు

‘‘స్వాభిమాని షెట్కర్ సంఘటన్’’ అనే రైతు సంఘం అధ్యక్షుడు రాజు శెట్టి మాట్లాడుతూ, ‘‘షోలాపూర్ మార్కెట్‌లో 10 బస్తాల ఉల్లిగడ్డలు అమ్మితే రాజేంద్ర చవాన్‌కు ఎన్ని డబ్బులు వచ్చాయో చూడండి.

సిగ్గులేని వ్యాపారి. చవాన్‌కు రెండు రూపాయల చెక్ ఇచ్చినప్పుడు ఆ వ్యాపారికి సిగ్గుగా ఎందుకు అనిపించలేదు? ప్రభుత్వాలకు కూడా సిగ్గు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎలా బతుకుతారో చెప్పండి?’’ అని ఆయన ఆక్రోశం వెళ్లగక్కారు.

మార్కెట్‌లో ఉల్లి ధరలు తగ్గడంతో సామాన్య వినియోగదారులకు కచ్చితంగా మేలు జరుగుతోంది. కానీ, రైతుల కళ్లలో నుంచి నీళ్లు వస్తున్నాయి.

వీడియో క్యాప్షన్, మహారాష్ట్ర: ఉల్లిగడ్డల దండలు, బుట్టలతో అసెంబ్లీకి వచ్చిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)