‘బ్రిటిష్ పాలన’ విడదీసిన కుటుంబాలను ఆయన ఎలా కలుపుతున్నారంటే...

శాంశు దీన్

ఫొటో సోర్స్, Shamshu Deen

ఫొటో క్యాప్షన్, 20ల వయసులో శాంశు దీన్
    • రచయిత, స్వామినాథన్ నటరాజన్
    • హోదా, బీబీసీ న్యూస్

‘‘ఓ కుటుంబాన్ని కలిపినప్పుడు నేను చాలా భావోద్వేగానికి గురవుతుంటాను. చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఏదో సాధించాననే భావన నాలో కలుగుతుంది’’అని శాంశు దీన్ బీబీసీతో చెప్పారు.

ట్రినిడాడ్ అండ్ టొబేగోకు చెందిన శాంశు ఒకప్పుడు జాగ్రఫీ టీచర్. కానీ, నేడు ఆయన జియోలజిస్టుగా మారి కరీబియన్ వాసులను భారత్‌లో వారి కుటుంబ సభ్యులతో కలుపుతున్నారు.

300కుపైగా కుటుంబాలను ఆయన ఇలా కలిపారు. ఇద్దరు మాజీ ప్రధాన మంత్రులతోపాటు తన సొంత కుటుంబంలోని పూర్వీకులను ఇలానే ఆయన కనుక్కోగలిగారు.

‘‘మనకు అసలు తెలియని మన కుటుంబంలోని ఓ వ్యక్తి వేరేచోట జీవిస్తున్నారని తెలిస్తే, చాలా కొత్తగా అనిపిస్తుంది. మనం వారితో ప్రేమలో పడిపోతాం’’అని శాంశు అన్నారు.

బ్రిటిష్ పాలన

వలస కూలీలుగా

బ్రిటిష్ పాలనలో భారత్ ఉండేటప్పుడు, ఇక్కడ బానిసత్వాన్ని రద్దుచేశారు. కానీ, కూలీలతో ఒప్పందాలు చేసుకొని ఇక్కడి వారిని బ్రిటిష్ పాలన కొనసాగే మిగతా ప్రాంతాలకు తీసుకెళ్లేవారు.

అక్కడ కూలీల కొరతను తక్కువ ధరకే దేశాలు దాటి వచ్చే ఇలాంటి వారితో భర్తీ చేసేవారు.

ఇలానే, భారత్‌కు చెందిన చాలా మంది కరీబియన్, దక్షిణాఫ్రికా, మారిషస్, ఫిజీ లాంటి ప్రాంతాలకు 1838 నుంచి 1917 మధ్య వలస వెళ్లారు. అక్కడ చెరకు తోటల్లో వీరు పని చేసేవారు.

ఇప్పటికీ ఆయా దేశాలు, ప్రాంతాల్లో భారత్ సంతతికి చెందిన ప్రజలు కనిపిస్తుంటారు.

చాలామంది కూలీలు ఇష్టపూర్వకంగానే ఆయా ప్రాంతాలకు వెళ్లేవారు. అయితే, వీరిలో ఎక్కువమందికి అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కొంతమంది నిరక్షరాస్యులు. ఆ ఒప్పందాల్లో ఏం రాసారో వీరికి తెలిసేది కాదు. కొంతమందిని బలవంతంగా అక్కడకు తీసుకేళ్లేవారు కూడా.

చాలా మందికి తమను తీసుకెళ్తున్న దేశం లేదా ప్రాంతం కూడా తెలిసేది కాదు. ఇలాంటి వలస కూలీల వ్యవస్థను ‘‘కొత్త బానిసల వాణిజ్యం’’గా కొందరు చరిత్రకారులు చెబుతుంటారు.

అలా నాడు కరీబియన్ దీవులకు వచ్చిన కొందరు భారతీయుల మునిమనవళ్లు వారి పూర్వీకులను వెతుక్కుంటూ భారత్‌కు వెళ్తున్నారు.

తమ కుటుంబాల్లో అసలు ఉన్నారని కూడా తెలియని కొత్త బంధువులను వీరు కలుసుకుంటున్నారు. వీరికి శాంశు దీన్ సాయం చేస్తున్నారు.

ట్రినిడాడ్‌లో భారత కూలీలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రినిడాడ్‌లో భారత కూలీలు

సొంత కుటుంబం కథతో..

పూర్వీకులకు వెతికి పట్టుకోవడంలో ఇతరులకు సాయం చేయాలనే ఆలోచన తన కుటుంబ కథ నుంచే శాంశుకు తట్టింది. తన చిన్నప్పుడు స్కూలుకు వెళ్లే వయసులో ఒకసారి అనుకోకుండా ఒక డాక్యుమెంట్‌లో ఒక పేరును చూశారు.

‘‘మూన్‌రదీన్ కొనుగోలుచేసిన స్థలంలో మా ఇల్లు కట్టారు. మూన్‌నదీన్ మా తాతయ్య తండ్రి. ఆయన గురించి మా కుటుంబంలో ఎవరికీ పెద్దగా ఏమీ తెలియదు’’అని శాంశు చెప్పారు.

డిగ్రీ పూర్తయ్యాక శాంశు కెనడాలో ఉద్యోగం సంపాదించారు. ఆ తర్వాత 1972లో తొలిసారి మళ్లీ ట్రినిడాడ్ వచ్చినప్పుడు ‘‘రెడ్ హౌస్’’కు వెళ్లారు. ఇది ప్రస్తుతం ట్రినినాడ్ లీగల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ కార్యాలయంగా కొనసాగుతోంది.

ఆయనతోపాటు ఆయన భార్య, సోదరుడు, మరదలు కూడా ఉన్నారు. అక్కడ కుప్పలుతెప్పలుగా పడివున్న పత్రాల్లో మూన్‌రదీన్ వివరాల వీరంతా కలిసి వెతిరారు. దాదాపు నాలుగు గంటల తర్వాత, వీరు ఆ వివరాలు కనిపెట్టారు.

‘‘అది నాకు యురేకా మూమెంట్ లాంటిది. పురుగులు తినేసిన ఒక పుస్తకం చివరి పేజీలో మూన్‌రదీన్ పేరు కనిపించింది’’అని నవ్వుతూ శాంశు చెప్పారు.

‘‘1858 జనవరి 5న ఆయన కోల్‌కత్తా నుంచి బయల్దేరారు. ఏప్రిల్ 10న ఆయన ఇక్కడకు వచ్చారు’’అని శాంశు చెప్పారు. ‘‘ఆయన చదువుకున్నారు, కాస్త ఇంగ్లీష్ కూడా వచ్చు. చెరకు తోటల్లో పనిచేయడంతోపాటు అనువాదకుడిగా కూడా వ్యవహరించేవారు. తన ఒప్పందం పూర్తయిన తర్వాత, ఆయన టీచర్‌గా మారారు. ఆ తర్వాత ఇక్కడ రెండు దుకాణాలు తెరిచారు. ఆయనకు ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉండేవారు. ఆయన కట్టించిన ఇంట్లోనే ఆయన పిల్లలు ఉండేవారు. అయితే, ఒక అగ్ని ప్రమాదం వల్ల ఆ ఇల్లు కాలిపోయింది’’అని శాంశు వివరించారు.

భోంగీ

ఫొటో సోర్స్, Shamshu Deen

ఫొటో క్యాప్షన్, భోంగీ

బంధువులను కలిసినప్పుడు..

మూన్‌రదీన్ లాంటి చాలా మంది కూలీలు ఇక్కడ తమ కంటూ సొంత కుటుంబాలు ఏర్పరుచుకున్నారు. చివరగా తమ సొంత దేశానికి వేల కి.మీ. దూరంలో వారు ప్రాణాలు కోల్పోయారు. అయితే, తన ముత్తాత కుటుంబ సభ్యులను శాంశు కనిపెట్టగలిగారు.

‘‘మా నాన్న అమ్మమ్మ తండ్రి మహమ్మద్ మూక్తీ కూడా 1852లో కోల్‌కత్తా నుంచి ఇక్కడకు వచ్చారు’’అని ఆయన చెప్పారు.

వీరి కుటుంబంలో ఇక్కడకు వచ్చిన అత్యంత పూర్వీకులు మూక్తీనే. ఇక్కడకు వచ్చేసరికి మూన్‌రదీన్ వయసు 23 ఏళ్లు. 1859 తర్వాత వచ్చిన వారు ఏ గ్రామం నుంచి వచ్చారో ఆ పత్రాల్లో రాసున్నాయి. అంటే మూన్‌రదీన్ ఏ ఊరి నుంచి వచ్చారో వాటిలో రాసిలేదు.

అప్పుడు ఆయన తల్లి పూర్వీకుల గురించి శాంశు ఆరాతీశారు. అప్పుడే 1865, 1868, 1870, 1875లలో కొందరు ఆ కుటుంబం నుంచి ఇక్కడకు వచ్చినట్లు గుర్తించారు. అంటే ఇప్పుడు వీరంతా ఏ గ్రామం నుంచి వచ్చారో తెలిసింది.

‘‘మా అమ్మ తండ్రికి అమ్మమ్మ జోసీమియా 1870 ఆగస్టు 25 నుంచి నవంబరు 26 మధ్య ప్రయాణంచేసి ఇక్కడకు వచ్చారు. ఆమె సోదరుడు సుమాన్ జొలాహా వారసులను నేను ఉత్తర్ ప్రదేశ్‌లో గుర్తించాను’’అని శాంశు వివరించారు.

శాంశు దీన్

ఫొటో సోర్స్, Shamshu Deen

ఫొటో క్యాప్షన్, శాంశు దీన్

అయితే, భారత్‌లోని భూములకు సంబంధించిన పత్రాల్లో జోసీమియా పేరు శాంశుకు కనిపించలేదు. అయితే, డెత్ రిజిస్టర్‌తోపాటు తనకు లభించిన మరికొన్ని పత్రాల ఆధారంగా భారత్‌లోని ఆమె మిగతా కుటుంబ సభ్యులను శాంశు గుర్తించారు.

ఆ తర్వాత వారిని వెతుక్కుంటూ శాంశు వెళ్లారు. అలా 1872లో చివరగా భారత్ నుంచి కరీబియన్‌కు వచ్చిన ఇదే కుటుంబానికి చెందిన భోంగీని ఆయన కలిశారు. కేవలం ఏడేళ్ల వయసులో భోంగీ తల్లిదండ్రులతో కలిసి ట్రినిడాడ్ వచ్చారు. ఆమెకు ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. కరీబియన్‌తోపాటు భారత్‌లోని తన ‘‘కొత్త కుటుంబం’’ను కలవడం, వారితో మాట్లాడటాన్ని శాంశు ఆస్వాదించేవారు.

‘‘1949లో భోంగీ మరణించారు. ఆమె మనవళ్లు, మునిమనవళ్లు, వారి పిల్లలను కూడా చూశారు’’అని శాంశు చెప్పారు.

ఇదే కెరియర్‌గా..

మొదట్లో జాగ్రఫీ టీచర్‌గా శాంశు పనిచేసేవారు. కానీ, ఆయన దృష్టి మొత్తం కుటుంబ సభ్యులను వెతికి పట్టుకోవడంపైనే ఉండేది. ఇలా పదిమంది హిందు, మరో పద మంది ముస్లిం కుటుంబాలను కలిపేందుకు ట్రినిడాడ్‌లోని భారత హైకమిషన్ ఆయనకు స్కాలర్‌షిప్‌కు కూడా అందించింది.

అలా 300 మందికిపైగా కుటుంబాలకు ఆయన సాయం చేశారు. దీన్నే ఆయన కెరియర్‌గానూ మార్చుకున్నారు.

ఆయన కోసం ట్రినిడాడ్, భారత్‌లోని కొన్ని రీసెర్చ్ టీమ్‌లు కూడా పనిచేస్తున్నాయి.

ఇలానే ట్రినిడాడ్‌కు ప్రధాన మంత్రులుగా పనిచేసిన బస్దేవ్ పాండే, కమల ప్రసాద్ బిసెస్సర్‌ల పూర్వీకులను కూడా ఆయన కనిపెట్టారు.

నేడు పూర్వీకులను వెతికిపట్టుకోవడం కాస్త తెలికే. అయితే, ఆయన కెరియర్ మొదట్లో చాలా సవాళ్లు ఎదుర్కొనేవారు. అయినప్పటికీ 80 శాతం సక్సెస్ రేట్ ఉండేదని ఆయన చెప్పారు.

‘‘అన్ని కేసుల్లోనూ పూర్వీకులను కనిపెట్టలేం. కొన్నిసార్లు పత్రాల్లో తప్పుడు సమాచారం కూడా ఇస్తుంటారు’’అని ఆయన వివరించారు.

పూర్వీకులు కట్టించిన స్కూలుకు వచ్చిన బల్లీ, లీలా మహరాజ్

ఫొటో సోర్స్, Shamshu Deen

ఫొటో క్యాప్షన్, పూర్వీకులు కట్టించిన స్కూలుకు వచ్చిన బల్లీ, లీలా మహరాజ్

జీవితాల్లో మలుపులు..

కొన్నిసార్లు ఒప్పంద కూలీలు భారత్ నుంచి ట్రినిడాడ్‌కు వచ్చే మార్గ మధ్యంలోనే చనిపోయేవారు. మరికొంత మంది ఇక్కడకు వచ్చిన తర్వాత కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చేది. అయితే, ఇక్కడ కొన్ని విజయగాథలు కూడా ఉన్నాయి.

ఒప్పందాలు పూర్తయిన తర్వాత కూడా చాలా మంది ఇక్కడే ఉండటానికి ఇష్టపడేవారని శాంశు వివరించారు.

ట్రినిడాడ్‌కు చెందిన బల్లీ, లీలా మహరాజ్ కథలను ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. వీరి తండ్రి, ఒప్పంద కూలీ పాల్తు ప్రసాద్ ఇక్కడి నుంచి మళ్లీ భారత్‌లోని సొంత ఊరికి వెళ్లి అక్కడ భూములు కొని, ఒక స్కూలు కూడా కట్టించారు. ఆ స్కూలును బల్లీ, లీలా చూసేందుకు శాంశు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఇలా కుటుంబాలను కలిపినప్పుడు తాను చాలా భావోద్వాగానికి గురవుతుంటానని శాంశు చెప్పారు. ఇలానే డేవిడ్ లఖన్, తన కుటుంబాన్ని కలిసినప్పుడు తనకు చాలా సంతోషంగా అనిపించిందని వివరించారు.

‘‘నేను స్కూలులో ఉన్నప్పటి నుంచే మా తాతయ్య ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలని ఉండేది’’అని ట్రినిడాడ్‌లో జీవించే 65 ఏళ్ల డేవిడ్ చెప్పారు.

‘‘1888లో 22 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన ఇక్కడకు వచ్చారు.ఆయన డాక్యుమెంట్‌లలో లఖన్‌ అని పేరు మాత్రమే ఇచ్చారు. అయితే, ఆయన ఎందుకు ఇంత దూరం ప్రయాణించి వచ్చారు? ఆయన కథేమిటి? లాంటి అంశాలు నేను తెలుసుకోవాలని అనుకున్నాను’’అని డేవిడ్ చెప్పారు.

ఇమ్మిగ్రేషన్ డాక్యుమెంట్ల ఆధారంగా లఖన్‌ సోదరుడు, తండ్రి, అతడి కులం, గ్రామం పేర్లను శాంశు తెలుసుకోగలిగారు. భారత్‌లోని తన పరిశోధక బృందం సాయంతో మొత్తానికి లఖన్ బంధువులను ఆయన కనుక్కోగలిగారు.

2020లో ఆ కుటుంబం భారత్‌లోని తమ బంధువులను కలుసుకునేందుకు వెళ్లింది. 132 ఏళ్ల తర్వాత ఈ రెండు కుటుంబాలు కలుసుకున్నాయి.

లఖన్ కుటుంబం

ఫొటో సోర్స్, Geeta Lakhan

ఫొటో క్యాప్షన్, లఖన్ కుటుంబం

భావోద్వేగాలతో..

‘‘కల నిజమైనట్లు అనిపించింది. నాకు ఏడుపొక్కటే రాలేదు. అది నిజంగా గొప్ప అనుభూతి. మన కుటుంబంలోని వ్యక్తుల గురించి తెలుసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది’’అని డేవిడ్ లఖన్ చెప్పారు.

డేవిడ్ కుటుంబ సభ్యులు మొదట వారణాసిలో కలుసుకున్నారు. అక్కడి నుంచి ఆయన్ను తమ సొంత గ్రామానికి తీసుకెళ్లారు.

‘‘ఆ మొత్తం గ్రామం మా కోసం ఎదురుచూస్తుందని, మమ్మల్ని పలకరించడానికి వస్తుందని అనుకోలేదు. మా మెడలో వారు పూల మాలలు వేశారు’’అని డేవిడ్ భార్య గీతా లఖన్ వివరించారు.

‘‘మనం వారి గురించి తెలుసుకోవడానికి ఎంత ఆరాట పడుతున్నామో.. వారు కూడా మన కోసం అంతే ఎదురుచూస్తున్నారని తెలుసుకోవడం చాలా కొత్తగా అనిపిస్తుంది’’అని డేవిడ్ చెప్పారు.

ఘాజీపుర్‌లో జీవించే లఖన్‌ సోదరుడు పోథీ మునిమనవళ్లను కూడా డేవిడ్ కుటుంబం కలిసింది. అక్కడ ఉండే ఒక ఇంట్లోనే లఖన్ తన సోదరుడితో కలిసి జీవించేవారు. ఇప్పుడు ఆ ఇంటిని పునర్నిర్మించారు.

నేరుగా కలిసే ముందే, ఈ కుటుంబాలు వీడియో కాల్స్‌లో మాట్లాడుకున్నాయి. ఇప్పుడు తరచూ వీరు మాట్లాడుకుంటున్నారు. భాషా పరమైన సవాళ్లను ట్రాన్స్‌లేషన్ టూల్స్ సాయంతో అధిగమిస్తున్నారు.

భారత్‌లోని తమ పూర్వీకులతో తమకు చాలా పోలికలు ఉన్నాయని గీత చెప్పారు. ఎందుకంటే ఒప్పంద కూలీలుగా వచ్చిన వారు తమ సంస్కృతీ, సంప్రదాయాలను ఇక్కడి భవిష్యత్ తరాలకు కూడా అందించారని ఆమె వివరించారు.

‘‘భారత్‌లోని నేను రుచి చూసిన వంటలు మా అమ్మ వండిన వంటలను గుర్తుచేశాయి. మా రెండు కుటుంబాలూ ఒకే లాంటి సంగీతం వింటుంటాయి. మా తల్లిదండ్రులు హిందీలో మాట్లాడుకునేవారు. మేం హిందీలో మాట్లాడుకోం. కానీ, దేవుడికి ప్రార్థనలు మాత్రం హిందీలో చేస్తాం’’అని ఆమె చెప్పారు.

తమ భారత్ పర్యటన ఎంత బాగా జరిగిందో తమ ఏడేళ్ల మనవడికి గీతా, డేవిడ్ వివరిస్తున్నారు. అతడు కూడా అక్కడికి వెళ్లాలని, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవాలని వీరు భావిస్తున్నారు.

పదవీ విరమణ తర్వాత కూడా కొత్త కుటుంబాలను శాంశు వెతుకుతూనే ఉన్నారు. 1996లో ఆయన భారత్‌లో ఆరు నెలలు గడిపారు. అప్పుడే మరో 14 కుటుంబాలను ఆయన కలిపారు.

భారత్‌లోని బంధువులతో శాంశు (టోపీ పెట్టుకున్న వ్యక్తి), ఆయన భార్య

ఫొటో సోర్స్, Shamshu Deen

ఫొటో క్యాప్షన్, భారత్‌లోని బంధువులతో శాంశు (టోపీ పెట్టుకున్న వ్యక్తి), ఆయన భార్య

ఇప్పుడు శాంశుకు 76 ఏళ్లు. కుటుంబాలను కలపడంతో తనకు చాలా సంతోషం వస్తోందని, ఇదే తనను ఆరోగ్యంగా ఉంచుతోందని ఆయన చెబుతున్నారు.

‘‘ప్రతి కేసూ పజిల్ లాంటిదే. ఏ రెండూ ఒకలా ఉండవు. నాకు శక్తి ఉన్నంతవరకు ఇలా కుటుంబాలను వెతుకుతూనే ఉంటాను. ఇదే నన్ను బతికిస్తోంది’’అని ఆయన చెప్పారు.

తన కుటుంబ చరిత్రను తెలుసుకున్న తర్వాత శాంశు జీవితం ఎలా మారింది?

‘‘ట్రినిడాడ్ టొబాగో నాకు ఇల్లు లాంటిది. మా పిల్లలు, మనవళ్లు కెనడాలో జీవిస్తారు. వారికి ట్రినిడాడ్‌తోపాటు భారత్‌తోనూ సాంస్కృతిక సంబంధాలున్నాయి. మేమంతా వలసదారులం. ఆఫ్రికా నుంచి భారత్, అక్కడి నుంచి ట్రినిడాడ్, అక్కడి నుంచి కెనడా, ఆ తర్వాత ఏమిటి? ఇలా వెళ్తూనే ఉంటుంది. కానీ, మా నరనరాల్లో భారత సంస్కృతి జీర్ణించుకుపోయింది’’అని ఆయన చెప్పారు.

(ఎడిట్: లోర్నా హాంకిన్)

వీడియో క్యాప్షన్, చరిత్రలో చోటు దక్కని స్వాతంత్ర్య సమరయోధులు

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)