ఆస్ట్రేలియాలో హిందువులు, సిక్కుల మధ్య కొట్లాటలు.. ‘ఖలిస్తాన్’ కారణమా?

సింబాలిక్ ఇమేజ్

ఫొటో సోర్స్, LISA MAREE WILLIAMS/GETTY

    • రచయిత, రుచిక తల్వార్
    • హోదా, మెల్‌బోర్న్ నుంచి బీబీసీ కోసం

ఈ ఏడాది జనవరి నుంచి మెల్‌బోర్న్‌ భారతీయ సమాజంలో ఉద్రిక్తతలు పెరిగాయి.

మూడు హిందూ ఆలయాల ధ్వంసం తరువాత హిందువులు, సిక్కుల మధ్య కొట్లాటలు జరిగాయి. జర్నయిల్ సింగ్ బింద్రన్‌వాలే చిత్రాన్ని కొందరు హిందూ యాక్టివిస్ట్‌లు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలూ ఉన్నాయి.

ఖలిస్తాన్ ఉద్యమకారులకు మద్దతిచ్చేవారు నిర్వహించే దుకాణాలను బహిష్కరించాలని మెల్‌బోర్న్‌లో పిలుపునిస్తున్నారు.

ఆస్ట్రేలియాలోని ఆగ్నేయ రాష్ట్రం విక్టోరియా రాజధాని మెల్‌బోర్న్‌లో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఆస్ట్రేలియాలో భారతీయుల జనాభా ఎక్కువగా ఉన్న రెండో నగరం మెల్‌బోర్న్. సిక్కులు, పంజాబ్ నుంచి వచ్చిన ఇతరులు మెల్‌బోర్న్‌లో పెద్దసంఖ్యలో ఉన్నారు.

మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ వరుస సంఘటనలు ఖలిస్తాన్ ఉద్యమంతో సంబంధంలేని అనేకమంది సిక్కులకు ఆగ్రహం తెప్పించాయి. దీనిపై కొందరు బీబీసీతో మాట్లాడారు.

మెల్‌బోర్న్‌లోని ఆలయాల గోడలపై రాతలు

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

'మేం భద్రత విషయంలో భయపడుతున్నాం కాబట్టి ఆన్ రికార్డ్ మాట్లడలేం' అని ఓ సిక్కు ఐటీ ఉద్యోగిని చెప్పారు. ‘‘వారు (ఖలిస్తాన్ ఉద్యమకారులు) భారతదేశం వెళ్లి అక్కడ ఉద్యమం చేసుకోవచ్చు కదా. ఇక్కడ మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? భారత్ పొరుగున ఖలిస్తాన్ ఉద్యమం ఎలా మనగలుగుతుంది? పాకిస్తాన్ పరిస్థితేమిటో వారు చూడడం లేదా?’’ అని ఆమె ఆగ్రహంగా ప్రశ్నించారు.

'ఖలిస్తాన్ రిఫరెండం పూర్తిగా అర్థరహితం. ఆస్ట్రేలియాలోనే కాదు భారత్ సహా ప్రపంచంలో ఎక్కడ కూడా మెజారిటీ సిక్కులు ఈ ఉద్యమాన్ని పట్టించుకోవడం లేదు. మా ఉద్యోగాలు, మా వ్యాపారాలు, మా కుటుంబాలతో మేం బిజీగా ఉన్నాం. విలువైన మా సమాయాన్ని, శక్తిని, డబ్బును విధ్వంసకర ఆలోచనల కోసం ఖర్చు చేయలేం' అన్నారు మెల్‌బోర్న్‌లో నివసిస్తున్న పంజాబీ ఒకరు. ఆయన అక్కడ వ్యాపారం చేస్తుంటారు.

1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల వల్ల కలిగిన తీవ్ర వేదనను అనుభవిస్తున్న తనలాంటి వారు మళ్లీ అలాంటివి కోరుకోరని ఆయన 'బీబీసీ'తో అన్నారు.

'మంచి జీవితం, భవిష్యత్తు కోసం మేం ఆస్ట్రేలియా వచ్చాం. ఖలిస్తాన్ లాబీ ఇక్కడ పెరుగుతుండడం విపత్కరమే. మత అతివాదమనేది ఏ దేశానికైనా మంచిది కాదు' అన్నారాయన.

సిక్కు మతస్థులు

ఫొటో సోర్స్, Getty Images

ఇదంతా ఎలా మొదలైంది?

జనవరి 12న మిల్‌పార్క్‌లోని స్వామి నారాయణ్ ఆలయాన్ని కొందరు స్వల్పంగా పాడుచేశారు. గోడలపై ఖలిస్తాన్ అనుకూల రాతలు, బొమ్మలు గీశారు. అక్కడికి నాలుగు రోజుల్లో జనవరి 16న కారమ్ డౌన్స్‌లో శివ విష్ణు ఆలయంలోనూ ఇలాగే చేశారు. జనవరి 23న ఆల్బర్ట్ పార్క్ ఇస్కాన్ టెంపుల్‌పై దాడి జరిగింది.

ఇదంతా అక్కడి హిందూ సమాజంలో చర్చనీయమవడంతో పాటు భారతీయ మీడియాలోనూ వచ్చింది.

విక్టోరియా రాష్ట్ర పోలీసులు ఈ ఘటనలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు వారు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

అయితే, అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తాన్ అనుకూల గ్రూప్ 'సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎప్‌జే)' దీనికి కారణమన్న అనామానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గ్రూప్‌పై భారతదేశంలో నిషేధం ఉంది. జనవరి 29న మెల్‌బోర్న్‌లో ఎస్ఎఫ్‌జే ఆధ్వర్యంలో రెఫరెండం నిర్వహించారు.

కానీ ఎస్ఎఫ్‌జే మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది.

'మాకు ఏ మతంతోనూ వివాదం లేదు. సిక్కులను బానిసలుగా మార్చిన సమాజంపైనే మా పోరాటం. దీనంతటి వెనుక మోదీ భక్తులున్నారు. కానీ, నిందలు మాత్రం మాపై వేస్తున్నారు' అని ఎస్ఎఫ్‌జే అధ్యక్షుడు అవతార్ సింగ్ పన్ను బీబీసీతో చెప్పారు.

అమెరికాలో నివసించే అవతార్ సింగ్ రిఫరెండం కోసం రెండు నెలలుగా ఆస్ట్రేలియాలో ఉంటూ క్యాంపెయిన్ చేశారు. ఏప్రిల్‌లో క్యాడ్ సదస్సుకు భారత ప్రధాని మోదీ ఆస్ట్రేలియా వస్తారని... ఆ సమయంలో బ్రిస్బేన్, సిడ్నీలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న ఉద్దేశంతో మరో రెండు నెలలు ఆస్ట్రేలియాలో ఉండాలని అవతార్ సింగ్ భావిస్తున్నారు.

'ప్రతి సిక్కు మతస్థుడూ స్వతాహాగా ఖలిస్థానీ అని, సిక్కు కుటుంబంలో మీరు జన్మించినట్లయితే మీరు ఖలిస్తాన్‌కు మద్దతుదారని మోదీ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది' అని అవతార్ సింగ్ చెప్పారు.

అయితే, ఆస్ట్రేలియాలో తాము అనేకమంది సిక్కులతో మాట్లాడినప్పుడు తమతో వారు ఏకీభవించలేదని అవతార్ సింగ్ చెప్పారు.

ఖలిస్థాన్ జెండాలు

ఫొటో సోర్స్, DON EMMERT

ఆస్ట్రేలియా సిక్కులు, ఖలిస్థాన్ ఉద్యమం

విక్టోరియా రాష్ట్రంలోని గురుద్వారాల వ్యవహారాలు చూపే 'ది విక్టోరియన్ సిక్ గురుద్వారా కౌన్సిల్(వీఎస్‌జీసీ)' ఈ విషయంపై స్పందిస్తూ అవతార్ సింగ్ అభిప్రాయాలనుల తాము స్వీకరించడం లేదని చెప్పింది.

'ఇది ఎస్‌ఎఫ్‌జే అభిప్రాయం. నేను దానిపై వ్యాఖ్యానించదలచుకోలేదు. వాస్తవానికి ప్రతి సిక్కు ఒక 'గురు దా సిక్కు'. సిక్కు మతానికి చెందిన ప్రతి ఒక్కరూ గురునానక్, గురు గోవింద్ సింగ్, గురు గ్రంథ్ సాహెబ్‌లకు శిష్యులే. అయితే, ఎస్‌ఎఫ్‌జేకు ఏవైనా డిమాండ్లు ఉంటే వాటిని శాంతియుతంగా సాధించుకునే హక్కు ఆ సంస్థకు ఉంది' అని వీఎస్‌జీసీ ప్రతినిధి, సిక్ ఇంటర్‌ఫెయిత్ కౌన్సిల్ విక్టోరియా చైర్‌పర్సన్ జస్బీర్ సింగ్ అన్నారు.

'సిక్కుల్లో ఎవరి అభిప్రాయం వారికి ఉంది. రిఫరెండంలో పాల్గొన్నవారికీ సొంత అభిప్రాయాలున్నాయి. కానీ, కొందరు మాత్రం ఈ వ్యవహారాలన్నిటితో ఆస్ట్రేలియాలోని సాధారణ సిక్కులకు ముడిపెడుతున్నారు. ఇది మమ్మల్ని అప్రతిష్టపాల్జేయడానికే' అన్నారు మెల్‌బోర్న్‌లో వ్యాపారం చేస్తున్న ఓ సిక్కు మతస్థుడు.

'ఖలిస్తాన్ మరో కశ్మీర్ అవుతుంది. పాకిస్తాన్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతుంది' అన్నారాయన.

'అవతార్ సింగ్ పన్ను వంటి వారు ఆస్ట్రేలియా సిక్కులను తప్పుదారి పట్టిస్తున్నారు. చాలామంది సిక్కులు చిన్న వయసులోనే అంతర్జాతీయ విద్యార్థులుగా ఇక్కడికి వస్తున్నారు. ఆస్ట్రేలియాలో కానీ కెనడాలో కానీ శాశ్వత నివాసం పొందడంలో ఎస్‌ఎఫ్‌జే వారికి సహకారం అందిస్తూ వారిని ఉద్యమం వైపు ప్రేరేపిస్తోంది అని నేను విన్నాను' అన్నారాయన.

అయితే, ఖలిస్థాన్‌కు గట్టి మద్దతుదారు అయిన మెల్‌బోర్న్‌కు చెందిన సిక్కు కుల్‌దీప్ సింగ్ బస్సీ మాత్రం పాకిస్తాన్ అండదండలున్నాయన్న వాదనను తిరస్కరించారు.

'పాకిస్తాన్ ఇప్పుడు మనుగడ కోసం పోరాడుతోంది. వారు ఖలిస్థాన్‌కు ఎలా మద్దతిస్తారు? ప్రపంచంలోని 98 శాతం మంది సిక్కులు భారత్ నుంచి వేరుపడి ఖలిస్థాన్ దేశంగా ఏర్పడాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం మేం భారత దేశానికి బానిసలుగా జీవిస్తున్నాం' అన్నారు బస్సీ. కాగా బస్సీ కుటుంబం 122 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో జీవిస్తోంది.

మరి, ఖలిస్థాన్ నిజంగానే ఏర్పడితే బస్సీ తన కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్తారా? అన్న ప్రశ్నకు బస్సీ సమాధానమిస్తూ వెళ్లబోనని చెప్పారు. 'భారతదేశం బయట కుటుంబాలు, వ్యాపారం అన్నీ ఉన్నాయి. ఇవన్నీ వదిలి వెళ్లడం సాధ్యం కాదు. కానీ, అప్పుడప్పుడు వెళ్తుంటాం' అన్నారు బస్సీ.

ఖలిస్థాన్ ఉద్యమకారులు

ఫొటో సోర్స్, DREW ANGERER

ఆస్ట్రేలియాలో హిందువులు, సిక్కుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి?

తాజా ఘటనలు ఆస్ట్రేలియాలో నివసించే హిందువులు, సిక్కుల మధ్య సంబంధాలపై ప్రభావం చూపాయా అంటే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

స్వామి నారాయణ్ ఆలయంలో కమ్యూనిటీ, మీడియా అవుట్‌రీచ్ ఇంచార్జి పార్థ్ పాండ్యా దీనిపై మాట్లాడుతూ ఈ విషయంపై లోతుల్లోకి వెళ్లదలచుకోలేదని అన్నారు.

'శాంతిసామరస్యం కోసం విజ్ఞప్తి చేయాలని, వివాదాన్ని పోలీసులకు వదిలేయాలని మా గురువు సలహా ఇచ్చారు. 2002లో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న మా అక్షర్‌ధామ్ ఆలయంపై టెర్రరిస్టులు దాడులు చేసినప్పుడు కూడా మేమేమీ వ్యాఖ్యానించలేదు. మా గురువు మార్గదర్శనమే అన్నిటినీ అధిగమించేలా చేస్తుంది' అని బీబీసీతో చెప్పారు.

ఆస్ట్రేలియాలో హిందువులు, సిక్కుల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలు లేవని వీఎస్‌జీసీకి చెందిన జస్బీర్ సింగ్ చెప్పారు.

'మెల్‌బోర్న్ నుంచి షెపర్టన్ వరకు 200 కిలోమీటర్ల దూరం మేర ఉన్న అన్ని గురుద్వారాలను సంప్రదించాం. ఇప్పటికీ హిందువులు గురుద్వారాలకు వస్తున్నారని చెప్తున్నారు. ఎలాంటి శత్రుత్వం పెంచుకోవద్దని హిందువుల, సిక్కులు ఇద్దరినీ వీఎస్‌జీసీ కోరుతోంది' అన్నారు జస్బీర్ సింగ్.

కానీ, ఈ ఘటనల తరువాత రెండు మతాలకు చెందివారి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని మెల్‌బోర్న్‌కు చెందిన సిక్కు వ్యాపారి చెప్పారు.

'మా హిందూ మిత్రులలో చాలామంది ఇప్పుడు సిక్కులంతా ఖలిస్థానీయులని భావిస్తున్నారు' అన్నారాయన.

అయితే, ఎస్‌ఎఫ్‌జే నేత అవతార్ సింగ్ మాత్రం ఖలిస్థాన్ డిమాండ్‌కు హిందువులు, వారి ఆలయాలతో సంబంధం లేదని చెప్పారు.

మరోవైపు బస్సీ కూడా హిందువులతో తమకు ఎలాంటి శత్రుత్వం లేదని, స్థానిక దుర్గాదేవి ఆలయానికి తాను విరాళాలు ఇస్తుంటానని.. అక్కడివారితో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పారు.

ఆస్ట్రేలియాలోని భారత హైకమిషనర్ మన్‌ప్రీత్ వోహ్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జనవరి 29న జరిగిన ప్రజాభిప్రాయ సేకరణను ఖండించారు.

మెల్‌బోర్న్‌లో శివవిష్ణు ఆలయాన్ని ఆయన సందర్శించి ఆ తరువాత ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

మరోవైపు ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి టిమ్ వాట్స్ కూడా మెల్‌బోర్న్‌లోని దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి అక్కడి కమిటీ సభ్యులతో మాట్లాడి ఇటీవలి ఘటనలపై వివరాలు తెలుసుకున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మెల్‌బోర్న్‌లో పదేళ్లుగా నివసిస్తున్న ఆర్.కుమార్ స్థానిక ఆలయాన్ని ప్రతి రోజూ దర్శిస్తారు.

'మెల్‌బోర్న్‌లో హిందువులు, సిక్కుల మధ్య సంబంధాలు మారలేదు. మేం ఇప్పటికీ స్నేహితులుగానే ఉన్నాం. గురుద్వారాలను సందర్శిస్తున్నాం. అయితే, ఎవరు సిక్కులు ఎవరు ఖలిస్థానీలనే విషయంలలో కాస్త జాగ్రత్తగా ఉంటున్నాం. భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న ఎవరైనా మాకు స్నేహితులు కారు' అన్నారు కుమార్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)